బైపోలార్ డిజార్డర్
‘లెట్ ఈషా హెల్ప్ ఈషా’ అనుకుందామె. 16 ఏళ్ల వయసులో తనకు ‘బైపోలార్ డిజార్డర్’ ఉందని డాక్టర్లు చెప్పాక ఈషా వినోద్ చోప్రా తనకు తనే సాయం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ డిజార్డర్‌తో పోరాటం చేస్తూనే స్త్రీల మానసిక సమస్యల పై చైతన్యం కలిగిస్తోంది. దర్శకుడు విధు వినోద్ చోప్రా కుమార్తె అయిన ఈషా మానసిక సమస్యతో తన పోరాటంపై తాజాగా ‘ఫైండింగ్ ఆర్డర్ ఇన్ డిజార్డర్’ పుస్తకాన్ని వెలువరించింది. అందరూ తెలుసుకోవాల్సిన సంగతులు ఇందులో ఉన్నాయి.
భారతదేశంలో 2023 సంవత్సరంలో జరిగిన అంచనా ప్రకారం 7 కోట్ల మంది మానసిక ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. వీరిలో స్త్రీల శాతం తక్కువ కాదు. మానసిక సమస్యలు 14 ఏళ్ల వయసు నుంచి కనిపిస్తాయి. 25 ఏళ్ల వయసుకు పూర్తిగా వ్యక్తమవుతాయి. కాబట్టి 14 నుంచి 25 ఏళ్ల మధ్య వయసులో పిల్లల్ని పరిశీలిస్తూ వారి సమస్యను తల్లిదండ్రులు గుర్తించగలిగితే చాలా వరకూ ఆ పిల్లలకు తమ సమస్య అర్థమయ్యి దానిని ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది. కాని దురదృష్టవశాత్తు ఈ ఎరుక ఉన్న తల్లిదండ్రులు తక్కువ. స్కూల్ టీచర్లు తక్కువ.
‘అందుకే నేను ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేటర్‌గా నా జీవితాన్ని గడపదలుచుకున్నాను. అందుకు అవసరమైన కోర్సును కెనడాలో పూర్తి చేసే దశలో ఉన్నాను. పిల్లల మానసిక సమస్యలనే కాదు... పిల్లలు నార్మల్‌గా ఉండి తల్లిదండ్రులు మానసిక సమస్యలతో బాధ పడుతున్నా పిల్లల జీవితం పెను ఒత్తిడికి లోనవుతుంది. స్కూల్ టీచర్లు ఇలాంటి సమయంలో పిల్లలకు అండగా ఉండాలి. అయితే స్కూల్ టీచర్లకు అలాంటి ట్రయినింగ్ ఉండటం లేదు’ అంటుంది ఈషా వినోద్ చోప్రా.
సుప్రసిద్ధ దర్శకుడు విధు వినోద్ చో్ప్రా, అతని రెండవ భార్య షబ్నమ్ సుఖదేవ్‌ల సంతానం ఈషా. వారు తర్వాతి కాలంలో విడాకులు తీసుకున్నారు. ‘మా తాతగారు (అమ్మ తండ్రి) ఎస్.సుఖదేవ్ గొప్ప డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్. ఆయనకు మానసిక సమస్యలు ఉండేవని తర్వాత తెలిసింది. నా సమస్యకు మూలం అక్కడే ఉండొచ్చు’ అంటుంది ఈషా.
➡️బైపోలార్ డిజార్డర్
ఉన్నట్టుండి బోలెడంత ఉత్సాహం రావడం, భారీ పనులు సంకల్పించడం, అతిగా మాట్లాడటం, నిద్ర పోలేక పోవడం, అయినప్పటికీ ముఖం తాజాగా ఉండటం... ఇది బైపోలార్ డిజార్డర్‌లో ‘మేనియా’ దశ. మరి కొన్నాళ్లకు హటాత్తుగా దేనిమీదా ఆసక్తి లేకపోవడం, నిర్లిప్తత, నిద్ర లేమి, ఏ పనీ సరిగా చేయలేకపోవడం.. ఇది ‘డిప్రెషన్’ దశ. ఈ రెండు దశల మధ్య ఊగిసలాడుతూ మధ్యలో నార్మల్‌గా ఉంటూ మానసికంగా అవస్థ పడే స్థితే ‘బైపోలార్ డిజార్డర్’. ‘నా పదహారవ ఏట డాక్టర్లు దీనిని గుర్తించారు. దీనిని ఎదుర్కొనడానికి సిద్ధమవమన్నారు’ అని తెలిపింది ఈషా.
➡️నీకు నువ్వే సాయం చేసుకో
‘మానసిక సమస్యలు వచ్చినప్పుడు ఎవరైనా సరే మొదట తమ మీద తాము విశ్వాసం నిలుపుకోవాలి. పెద్ద కొంపలేం మునగలేదు.. నేనూ అందరిలాంటి వ్యక్తినే... ఇది ఉన్నట్టుగానే గుర్తించక నీ పనిలో పడు అని ధైర్యం చెప్పుకోవాలి. ఆ తర్వాత వైద్య చికిత్సను పూర్తిగా విశ్వసించి డాక్టర్లు చెప్పినట్టు వినాలి. ఇవేవి సరిగా చేయకపోయినా ఇబ్బందిలో పడతాం’ అంటుంది ఈషా.
‘నాకు డిజార్డర్ ఉందని తెలిశాక దాన్ని ఆర్డర్‌లో పెట్టడానికి నాలోని సృజనాత్మక శక్తులన్నీ వెలికి తీశాను. కథక్ నేర్చుకున్నాను. పెయింటింగ్ నేర్చుకున్నాను. మానసిక సమస్యలకు సంబంధించిన రీసెర్చ్ చేశాను. మానసిక సమస్యల చైతన్యానికై ప్రచార కర్తగా మారాను. ఈ పనులన్నీ నా సమస్యను అదుపు చేయగలిగాయి. ఒక రకంగా చెప్పాలంటే బైపోలార్ డిజార్డర్ నా జీవితాన్ని ఆర్డర్‌లో పెట్టుకునే శక్తి నాకు ఇచ్చింది. అందుకే నా అనుభవాల గురించి రాసిన పుస్తకానికి ‘ఫైడింగ్ ఆర్డర్ ఇన్ డిజార్డర్’ అనే పేరు పెట్టాను’ అంటోంది ఈషా.
➡️గట్టి బంధాలు
‘హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఒక పరిశోధన ప్రకారం గట్టి మానవ సంబంధాలు ఉన్నవారు ఎక్కువ ఆయుష్షుతో ఉంటున్నారట. మానసిక సమస్యలు ఉన్న పేషెంట్లను చూసుకునే తల్లిదండ్రులు, కేర్‌గివర్లు ఎంత ప్రేమగా ఉంటే పేషంట్లకు అంత ధైర్యం దక్కుతుంది. సాధారణ జీవితంలో కూడా ఆరోగ్యకరమైన మానవ సంబంధాలే మానసిక ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. దురదృష్టవశాత్తు ఇవాళ గట్టి బంధాలు ఉండటం లేదు. ఒక మనిషి ఉన్నాడనే ధైర్యమే నేడు కావలసింది. నేను నా మానసిక సమస్యను దాదాపుగా జయించడంలో నా భర్త, నా తోబుట్టువుల మద్దతు చాలా ఉంది’ అని ముగించింది ఈషా.
Comments
Please login to add a commentAdd a comment