Disorders
-
Ishaa Vinod Chopra: నీకు నువ్వే సాయం చేసుకో
‘లెట్ ఈషా హెల్ప్ ఈషా’ అనుకుందామె. 16 ఏళ్ల వయసులో తనకు ‘బైపోలార్ డిజార్డర్’ ఉందని డాక్టర్లు చెప్పాక ఈషా వినోద్ చోప్రా తనకు తనే సాయం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ డిజార్డర్‌తో పోరాటం చేస్తూనే స్త్రీల మానసిక సమస్యల పై చైతన్యం కలిగిస్తోంది. దర్శకుడు విధు వినోద్ చోప్రా కుమార్తె అయిన ఈషా మానసిక సమస్యతో తన పోరాటంపై తాజాగా ‘ఫైండింగ్ ఆర్డర్ ఇన్ డిజార్డర్’ పుస్తకాన్ని వెలువరించింది. అందరూ తెలుసుకోవాల్సిన సంగతులు ఇందులో ఉన్నాయి.భారతదేశంలో 2023 సంవత్సరంలో జరిగిన అంచనా ప్రకారం 7 కోట్ల మంది మానసిక ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. వీరిలో స్త్రీల శాతం తక్కువ కాదు. మానసిక సమస్యలు 14 ఏళ్ల వయసు నుంచి కనిపిస్తాయి. 25 ఏళ్ల వయసుకు పూర్తిగా వ్యక్తమవుతాయి. కాబట్టి 14 నుంచి 25 ఏళ్ల మధ్య వయసులో పిల్లల్ని పరిశీలిస్తూ వారి సమస్యను తల్లిదండ్రులు గుర్తించగలిగితే చాలా వరకూ ఆ పిల్లలకు తమ సమస్య అర్థమయ్యి దానిని ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది. కాని దురదృష్టవశాత్తు ఈ ఎరుక ఉన్న తల్లిదండ్రులు తక్కువ. స్కూల్ టీచర్లు తక్కువ. ‘అందుకే నేను ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేటర్‌గా నా జీవితాన్ని గడపదలుచుకున్నాను. అందుకు అవసరమైన కోర్సును కెనడాలో పూర్తి చేసే దశలో ఉన్నాను. పిల్లల మానసిక సమస్యలనే కాదు... పిల్లలు నార్మల్‌గా ఉండి తల్లిదండ్రులు మానసిక సమస్యలతో బాధ పడుతున్నా పిల్లల జీవితం పెను ఒత్తిడికి లోనవుతుంది. స్కూల్ టీచర్లు ఇలాంటి సమయంలో పిల్లలకు అండగా ఉండాలి. అయితే స్కూల్ టీచర్లకు అలాంటి ట్రయినింగ్ ఉండటం లేదు’ అంటుంది ఈషా వినోద్ చోప్రా.సుప్రసిద్ధ దర్శకుడు విధు వినోద్ చో్ప్రా, అతని రెండవ భార్య షబ్నమ్ సుఖదేవ్‌ల సంతానం ఈషా. వారు తర్వాతి కాలంలో విడాకులు తీసుకున్నారు. ‘మా తాతగారు (అమ్మ తండ్రి) ఎస్.సుఖదేవ్ గొప్ప డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్. ఆయనకు మానసిక సమస్యలు ఉండేవని తర్వాత తెలిసింది. నా సమస్యకు మూలం అక్కడే ఉండొచ్చు’ అంటుంది ఈషా.➡️బైపోలార్ డిజార్డర్ఉన్నట్టుండి బోలెడంత ఉత్సాహం రావడం, భారీ పనులు సంకల్పించడం, అతిగా మాట్లాడటం, నిద్ర పోలేక పోవడం, అయినప్పటికీ ముఖం తాజాగా ఉండటం... ఇది బైపోలార్ డిజార్డర్‌లో ‘మేనియా’ దశ. మరి కొన్నాళ్లకు హటాత్తుగా దేనిమీదా ఆసక్తి లేకపోవడం, నిర్లిప్తత, నిద్ర లేమి, ఏ పనీ సరిగా చేయలేకపోవడం.. ఇది ‘డిప్రెషన్’ దశ. ఈ రెండు దశల మధ్య ఊగిసలాడుతూ మధ్యలో నార్మల్‌గా ఉంటూ మానసికంగా అవస్థ పడే స్థితే ‘బైపోలార్ డిజార్డర్’. ‘నా పదహారవ ఏట డాక్టర్లు దీనిని గుర్తించారు. దీనిని ఎదుర్కొనడానికి సిద్ధమవమన్నారు’ అని తెలిపింది ఈషా.➡️నీకు నువ్వే సాయం చేసుకో‘మానసిక సమస్యలు వచ్చినప్పుడు ఎవరైనా సరే మొదట తమ మీద తాము విశ్వాసం నిలుపుకోవాలి. పెద్ద కొంపలేం మునగలేదు.. నేనూ అందరిలాంటి వ్యక్తినే... ఇది ఉన్నట్టుగానే గుర్తించక నీ పనిలో పడు అని ధైర్యం చెప్పుకోవాలి. ఆ తర్వాత వైద్య చికిత్సను పూర్తిగా విశ్వసించి డాక్టర్లు చెప్పినట్టు వినాలి. ఇవేవి సరిగా చేయకపోయినా ఇబ్బందిలో పడతాం’ అంటుంది ఈషా. ‘నాకు డిజార్డర్ ఉందని తెలిశాక దాన్ని ఆర్డర్లో పెట్టడానికి నాలోని సృజనాత్మక శక్తులన్నీ వెలికి తీశాను. కథక్ నేర్చుకున్నాను. పెయింటింగ్ నేర్చుకున్నాను. మానసిక సమస్యలకు సంబంధించిన రీసెర్చ్ చేశాను. మానసిక సమస్యల చైతన్యానికై ప్రచార కర్తగా మారాను. ఈ పనులన్నీ నా సమస్యను అదుపు చేయగలిగాయి. ఒక రకంగా చెప్పాలంటే బైపోలార్ డిజార్డర్ నా జీవితాన్ని ఆర్డర్లో పెట్టుకునే శక్తి నాకు ఇచ్చింది. అందుకే నా అనుభవాల గురించి రాసిన పుస్తకానికి ‘ఫైడింగ్ ఆర్డర్ ఇన్ డిజార్డర్’ అనే పేరు పెట్టాను’ అంటోంది ఈషా.➡️గట్టి బంధాలు‘హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఒక పరిశోధన ప్రకారం గట్టి మానవ సంబంధాలు ఉన్నవారు ఎక్కువ ఆయుష్షుతో ఉంటున్నారట. మానసిక సమస్యలు ఉన్న పేషెంట్లను చూసుకునే తల్లిదండ్రులు, కేర్గివర్లు ఎంత ప్రేమగా ఉంటే పేషంట్లకు అంత ధైర్యం దక్కుతుంది. సాధారణ జీవితంలో కూడా ఆరోగ్యకరమైన మానవ సంబంధాలే మానసిక ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. దురదృష్టవశాత్తు ఇవాళ గట్టి బంధాలు ఉండటం లేదు. ఒక మనిషి ఉన్నాడనే ధైర్యమే నేడు కావలసింది. నేను నా మానసిక సమస్యను దాదాపుగా జయించడంలో నా భర్త, నా తోబుట్టువుల మద్దతు చాలా ఉంది’ అని ముగించింది ఈషా. -
సాధారణ నొప్పులు అనుకోవద్దు.. ఆర్థరైటిస్‌పై అవగాహన అవసరం!
ఆర్థరైటిస్ అంటే కీళ్ల సమస్య (జాయింట్స్ ప్రాబ్లమ్) అని అర్థం. ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్, హైబీపీ, క్యాన్సర్‌లాంటి జబ్బుల కంటే ఆర్థరైటిస్ సమస్య తీవ్రతే చాలామందిలో ఉంటుంది. కానీ దీనిపై అవగాహన మాత్రం అంతంత మాత్రమే. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఒక దశలో శరీర వైకల్యాలు రావచ్చు. పైగా ఎంత త్వరగా గుర్తిస్తే అంత తేలిగ్గా చికిత్స చేసి అదుపులో ఉంచగలగడం సాధ్యం. ఈ నెల 12న ఆర్థరైటిస్ డే. ఈ సందర్భంగా ఆర్థరైటిస్‌పై అవగాహన కోసం ఈ కథనం. ఆర్థరైటిస్ అంటే ఎముకలు, వాటి కణజాలాలకు సంబంధించిన సమస్య. ఇందులోనూ దాదాపు 200 రకాల కంటే ఎక్కువ వ్యాధులే ఉంటాయి. మామూలు ప్రజల అవగాహన కోసం వాటన్నింటినీ కలిపి ‘ఆర్థరైటిస్’గా పేర్కొంటారు. సాధారణంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కీళ్ల దగ్గర నొప్పి, వాపు, అవి గట్టిగా (స్టిఫ్‌గా) మారడాన్ని, ఆయా కీళ్లలో కదలికలు తగ్గడాన్ని ‘ఆర్థరైటిస్’గా చెప్పవచ్చు. ఈ సమస్యల తీవ్రత సాధారణంగా ఉదయం పూట ఎక్కువగా ఉంటుంది. ఆర్థరైటిస్‌లో రకాలు ఆర్థరైటిస్‌లో చాలా రకాలు ఉంటాయి. అయితే ఇందులో ఆస్టియోఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకైలోజింగ్ స్పాండైల్ ఆర్థరైటిస్, గౌట్, జువెనైల్ ఇడియోఫథిక్ ఆర్థరైటిస్ (పిల్లల్లో వచ్చే ఆర్థరైటిస్), లూపస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ వంటివి కొన్ని. కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల తర్వాతి పరిణామంగా ఆర్థరైటిస్ కనిపిస్తుంది. పిల్లల్లో పుట్టుకతో వచ్చే ఆరోగ్య సమస్యల కారణంగా కొందరిలో దేహంలోని ఇతర వ్యవస్థలపై కూడా దుష్ప్రభావం పడవచ్చు. అలాగే మరికొందరిలో ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ సమస్యలూ కనిపించవచ్చు. నివారణ/తీవ్రత తగ్గించడానికి సూచనలు అసలు జబ్బే లేనప్పుడు లేదా సమస్య తొలిదశలో ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన జీవనశైలి (లైఫ్‌స్టైల్)తో దీన్ని నివారించడం అవసరం. ఇందుకోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత విశ్రాంతి, కంటినిండా నిద్ర, అన్ని రకాల పోషకాలతో కూడిన సమతులాహారం, ఒత్తిడి లేకుండా ఉండటం వంటి జాగ్రత్తలు అవసరం. పొగతాగడం, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. వ్యాయామం చాలా కీలకం కాబట్టి కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అవేమిటంటే... అసలే కీళ్లనొప్పులు, కీళ్ల దగ్గర కదలికలు చాలా పరిమితంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి వ్యాయామం చేయడం కష్టం కావచ్చు. అయితే అస్సలు వ్యాయామం చేయకుండా ఉంటే కీలు మరింతగా కదలికలు కోల్పోయే అవకాశం ఉంది. అందుకే నొప్పి కలగనంత మేరకు, అలసట కలగనంతవరకు కీళ్లు కదిలిస్తూ క్రమంగా వ్యాయామాన్ని పెంచుకుంటూ పోవడం మేలు. నడక, ఈత, సైక్లింగ్ వంటి వ్యాయామాలు మేలు చేస్తాయి. చికిత్స సాధారణంగా లక్షణాల తీవ్రత తగ్గించేలా, కీలు మరింతగా దెబ్బతినకుండా ఉండేలా, వ్యాధికి ప్రభావితమైన అవయవం దాని పనితీరును కోల్పోకుండా చూసేలా చికిత్స ఉంటుంది. అలాగే మందులు ఇచ్చేప్పుడు డాక్టర్లు అవాంఛనీయమైన నష్టాలు, దుష్ప్రభావాలు లేకుండా ఉండటంతో పాటు సైడ్ఎఫెక్ట్స్ వీలైనంతగా తక్కువగా ఉండేలా చూస్తారు. ఆ మేరకు డాక్టర్లు మందుల మోతాదులను నిర్ణయిస్తారు. ఇందులో భాగంగా డాక్టర్లు నొప్పి నివారణ మందులైన నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేషన్ డ్రగ్స్ (ఎన్ఎస్ఏఐడీ), డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్ (డీఎమ్‌ఏఆర్‌డీ), బయాలజిక్స్ వంటి మందులను వాడుతుంటారు. శస్త్రచికిత్స ఆర్థరైటిస్ సమస్యకు తగిన సమయంలో (సాధారణంగా తొలిదశల్లో) చికిత్స తీసుకోనివారిలో కీళ్లు, ఎముకలు దెబ్బతినడం, ఇతరత్రా మరికొన్ని దుష్ప్రభావాలు కనిపించవచ్చు. అలాంటివారిలో కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించడం వల్ల వ్యాధి ముదరకుండా చూసుకోవడంతో పాటు శస్త్రచికిత్స వంటి ఆర్థిక, సామాజిక, కుటుంబ భారాలను కూడా నివారించే అవకాశాలుంటాయి. లక్షణాలు ఆర్థరైటిస్ లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉండవు. ఇవి కొద్దిపాటి తీవ్రత (మైల్డ్) నుంచి తీవ్రమైన (సివియర్) లక్షణాల వరకు ఉండవచ్చు. ఒకే వ్యక్తిలో సైతం కాలానుగుణంగా మారుతుండవచ్చు. ఏళ్ల తరబడి కనిపించడంతో పాటు కాలం గడిచేకొద్దీ తీవ్రత పెరగవచ్చు. తొలిదశలో ఆకలి తగ్గడం, జ్వరం, బాగా నీరసించిపోవడం, బరువు తగ్గడం వంటివి కనిపిస్తాయి. ఇవన్నీ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక దశలో సాధారణంగానే కనిపించే సమస్యలు కావడం వల్ల వీటిని తొలిదశలో కనుగొనడం కాస్త కష్టమే. ఈ సమస్య కారణంగా ఏ అవయవం ప్రభావితమైతే... ఆ అవయవానికి సంబంధించిన లక్షణాలు వ్యక్తమవుతూ ఉంటాయి. అయితే ఆర్థరైటిస్‌లో ప్రధానంగా కీళ్లు దెబ్బతినడం జరుగుతుంది. దాని తాలూకు లక్షణాలే బయటకు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. కీళ్లు ఎర్రగా కమిలినట్లుగా ఉండి, విపరీతమైన నొప్పిరావచ్చు. ఆర్థరైటిస్ గురించి ఎందుకు అప్రమత్తత అవసరమంటే... ఇది కేవలం దేహంలోని ఒక వ్యవస్థకే పరిమితం కాకుండా చాలా వ్యవస్థలను దెబ్బతీస్తుంది. చికిత్స అందించకపోతే చాలా రకాల దుష్ప్రభావాలు కనిపించే అవకాశముంది. మంచి చికిత్స అందిస్తే చాలావరకు అదుపు లో ఉంటుంది. ఒకవేళ సరైన చికిత్స అందించకపోతే శరీరంలోని ముఖ్యమైన అవయవాల మీద వీటి ప్రభావం పడి, వాటి పనితీరులలో తీవ్రమైన మార్పు రావచ్చు. ఒక్కోసారి ఈ సమస్య కారణంగా కొందరి లో చూపుపోవడం, గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాలు దెబ్బతిని డయాలసిస్‌పై ఆధారపడాల్సిన అవసరం రావడం జరగవచ్చు. ఫలితంగా జీవననాణ్యత (క్వాలిటీ ఆఫ్ లైఫ్) తగ్గిపోతుంది. వ్యాధి నిర్ధారణ ఎక్స్–రే, సీటీ స్కాన్, ఎమ్మారై పరీక్షలతో పాటు కొన్ని రకాల అడ్వాన్స్డ్ రక్తపరీక్షల సహాయంతో వ్యాధినిర్ధారణ జరుగుతుంది. ఆర్థరైటిస్‌కు చికిత్స ఉందా? తొలిదశలోనే ఈ సమస్యను త్వరగా గుర్తిస్తే సమర్థమైన చికిత్స అందించవచ్చు. ఫలితంగా జీవననాణ్యతతో పాటు బాధితుల జీవితకాలాన్ని పెంచవచ్చు. -డాక్టర్ విజయ ప్రసన్న పరిమి సీనియర్ రుమటాలజిస్ట్ -
యాంటీబయాటిక్స్ అతి వాడకంతో.. ముప్పే
బర్మింగ్‌హామ్: కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు చిన్నచిన్న నలతలకు సైతం యాంటీబయాటిక్స్ వాడుతూ పోతే చివరకు పెను ప్రమాదం కొనితెచ్చుకుంటారని సైంటిస్టులు హెచ్చరిస్తునే ఉన్నారు. అతిగా యాంటీబయాటిక్స్ వాడితే రోగనిరోధవ్యవస్థలో లోపాలు ఏర్పడతాయని, దీంతో ప్రమాదకరమైన ఫంగల్ వ్యాధులు సోకే ప్రమాదం పెరుగుతుందని తాజాగా మరో నూతన అధ్యయనం వెల్లడించింది. చిన్నపాటి వ్యాధి నుంచి ప్రమాదకరమైన ఇన్వాసివ్ కాండిడియాసిస్ సోకేందుకు కాండిడా అనే ఫంగస్ కారణం. ఈ ఫంగస్ సోకేందుకు యాంటీ బయాటిక్స్ అతివాడకం కూడా ఒక కారణమని యూనివర్సిటీ ఆఫ్ బిర్మింగ్‌హామ్ పరిశోధకులు గుర్తించారు. యాంటీబయాటిక్స్‌ను ఎక్కువగా వాడితే జీర్ణవాహికలోని ప్రయోజనకరమైన బాక్టీరియా(ప్రొబయాటిక్స్) నశిస్తాయి. దీంతో ఈ బాక్టీరియా స్థానంలో జీర్ణవాహికలో జీవనం సాగించే కాండిడా వంటి ఫంగి చేరతాయని పరిశోధన వెల్లడించింది. ఇదే సమయంలో సదరు వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగినా లేదా కీమోథెరపీ లాంటి చికిత్స తీసుకున్నా జీర్ణవాహిక నుంచి ఈ ఫంగి రక్త ప్రవాహంలోకి ప్రవేశించి కాండిడియాసిస్ను కలిగిస్తుంది. ఐసీయూలో పేషెంట్లకు అతిగా యాంటీబయాటిక్స్ అందిస్తే కేథటర్ నుంచి కూడా ఈ ఫంగస్ రక్తంలోకి సోకే ప్రమాదముందని తేలింది. ప్రయోగ వివరాలు యాంటీబయాటిక్స్ వాడకంతో ఫంగల్ వ్యాధులు సోకే అవకాశాలు పెరగడంపై పరిశోధనలో భాగంగా ముందుగా ఎలుకలకు యాంటీబయాటిక్ మిశ్రమాన్ని ఇచ్చారు. అనంతరం ఈ ఎలుకలకు కాండిడా ఫంగస్ సోకేలా చేశారు. మరో సమూహం ఎలుకలకు యాంటీబయాటిక్స్ ఇవ్వకుండా కేవలం ఫంగస్‌ను సోకేలా చేశారు. అనూహ్యంగా యాంటీబయాటిక్స్ వాడిన ఎలుకల్లో ఫంగస్ ఎక్కువ ఇన్ఫెక్షన్ కలిగించినట్లు కనుగొన్నారు. సాధారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకిన జీవుల్లో మూత్రపిండాలు బలహీనపడతాయి, దీంతో ఆ జీవులు అనారోగ్యం పాలవుతుంటాయి. ఈ ప్రయోగంలో ఎలుకలను మూత్రపిండాల బలహీనత కన్నా యాంటీబయాటిక్స్ మిశ్రమమే ఎక్కువ అనారోగ్యాన్ని కలిగించినట్లు గుర్తించారు. ఎలుకల్లోని సహజసిద్ధ యాంటీ ఫంగల్ ఇమ్యూన్ రెస్పాన్స్‌ను అది దెబ్బతీసిందని విశ్లేషించారు. రక్తంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ను గుర్తించే సైటోకైన్స్ అనే ప్రోటీన్ల ఉత్పత్తిని ఈ యాంటీబయాటిక్స్ తగ్గించాయి. దీంతో ఫంగస్ ఇన్ఫెక్షన్ను ఎదుర్కొనే రోగనిరోధకత ఈ ఎలుకల్లో తగ్గిపోయిందని తెలిసింది. సైటోకైన్స్‌ను విడిగా ఔషధ రూపంలో అందిస్తే యాంటీబయాటిక్ వల్ల ఫంగల్ వ్యాధులు సోకిన వారిలో మెరుగుదల ఉంటుందని నిపుణులు తెలిపారు. వాంకోమైసిన్ వల్ల ఫంగస్ ఇన్ఫెక్షన్ పెరిగే ప్రమాదం అధికమని గుర్తించారు. -
అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్
కరోనా రాకముందే... అలాగే, దాని గురించి తెలిసిన కొత్తలో దాని కారణంగా చాలామందిలో కొన్ని మానసిక సమస్యలు కనిపించడం వైద్యులు గమనించారు. ఉదాహరణకు... యాంగై్జటీ, డిప్రెషన్ వంటివి కొన్ని. అలాగే ఇప్పుడు రెండో వేవ్ కొనసాగుతూ ఉండగా...ఇందులోనూ తమకు సన్నిహితులూ... కొందరైతే తమ సొంత కుటుంబ సభ్యులను కోల్పోవడంతో మరింత తీవ్రమైన మానసిక సమస్యలను చవిచూశారూ...చూస్తున్నారు. అందులో ప్రధానమైనది ‘అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగై్జటీ అండ్ డిప్రెషన్’. దాని గురించి తెలుసుకుందాం. గత ఏడాది మొదటి కరోనా వేవ్ సీజన్లో దాని గురించి పెద్దగా తెలియని పరిస్థితుల్లో చాలామంది తీవ్ర మానసిక ఒత్తిళ్లకు గురయ్యారు. ఇలా ఒత్తిడికి గురైనప్పుడు కొన్ని మానసిక లక్షణాలూ కనిపిస్తాయి. కొందరిలో ఈ లక్షణాలు తొందరగానే తగ్గిపోవచ్చు. అలా వచ్చి తగ్గిపోయిన సమస్యలను ‘అక్యూట్ స్ట్రెస్ రియాక్షన్’ అంటారు. మరికొందరిలో అవి తీవ్రమైన ఒత్తిడి, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, యాంగ్జైటీ డిజార్డర్, పానిక్ డిజార్డర్, ఫోబియా, ఓసీడీ, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలుగా మారే అవకాశమూ ఉండింది. అప్పుడూ ఇప్పుడు కూడా కరోనా విషయమై బాగా టెన్షన్‌గా ఉండటం, తీవ్రమైన ఆందోళన, విపరీతమైన బెంగ... వ్యాధి వస్తుందా, వస్తే తగ్గుతుందా, లేక మరణానికి దారితీస్తుందా లాంటి సందేహాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇప్పటి రెండో సీజన్లోనూ అలా అవుతున్నారు. దాన్ని కరోనా ఫోబియా గా చెప్పవచ్చు. వాళ్లలో కరోనా లేకపోయినా... లేదా వచ్చి తగ్గిన వారిలోనూ మళ్లీ మళ్లీ ఎన్నోసార్లు పరీక్ష చేయించుకుంటూ ఉంటారు. వారిలో ఆ వ్యాధి లేదనీ... ఒకసారి వచ్చి తగ్గినందున మళ్లీ ఆ వెంటనే సాధారణంగా రాదని చెప్పినా భయం పోదు. ఇలా తమకు దూరంగా ఉన్న రక్తసంబంధీకులు, కావాల్సినవారు ఎలా ఉన్నారో అంటూ ఆందోళన పడవచ్చు. ఇలాంటి ఆందోళన తో టెన్షన్ పడటాన్ని ‘జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ (జీఏడీ)’గా చెప్పవచ్చు. టెన్షన్‌తోపాటు విపరీతంగా భయపడటాన్ని ప్యానిక్ డిజార్డర్‌గా చెప్పవచ్చు. అంటే వీళ్లు కరెన్సీనీ, కూరగాయలనూ, తమ ఇంటిలోని సొంత ఆత్మీయులనూ తాకడానికి కూడా తీవ్రమైన భయాందోళనలకు గురవుతూ ప్యానిక్ అవుతుంటారు. దీన్ని ‘ప్యానిక్ డిజార్డర్’ గా చెప్పవచ్చు. ఇక చేతులకు మళ్లీ మళ్లీ శానిటైజర్ పూసుకోవడం, చేతులు అదేపని గా కడుక్కోవడం చేస్తూ ‘అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్‌కూ లోను కావచ్చు. ఒకసారి చేతులు కడుక్కున్నా లేదా శానిటైజర్ పూసుకున్నా దాదాపు గంటపాటు రక్షణ ఉందని తెలిశాక కూడా ప్రతి ఐదు నిమిషాలకూ ఇలా చేస్తుంటే ఓసీడీగా పేర్కొనవచ్చు. అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ అంటే... అంతకు ముందు ఉన్న సాకుకూల స్థితి తొలగిపోయి ఒకేసారి కొత్త పరిస్థితులకు ఎక్స్పోజ్ అయినప్పటుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో, దానికి తగినట్లుగా తమను తాము ఎలా సర్దుబాటు చేసుకోవాలో తెలియని అయోమయంలో వ్యక్తులు తీవ్రమైన వ్యాకులతకూ, కుంగుబాటుకు గురియ్యే అవకాశం ఉంది. దాన్నే ‘‘అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్’’గా పేర్కొనవచ్చు. లక్షణాలు - అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్’’ ఉన్నవారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అయితే అవే లక్షణాలన్నీ అందరిలోనూ కనిపించకపోవచ్చు. బాగా దగ్గరివారు ఆ లక్షణాలను గమనిస్తూ ఉండటం అవసరం. అవి... ఏదో తెలియని భయం/ఆందోళన/గుబులు/గాభరా ∙గుండెవేగంగా కొట్టుకోవడం/గుండెదడ/గుండెల్లో మంట / గుండె బిగబట్టినట్టుగా ఉండటం/ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ - అకస్మాత్తుగా అంతులేని భయానికీ లోనవ్వడం (ప్యానిక్ అటాక్) , విపరీతంగా చెమటలు పట్టడం, ఛాతీ బిగబట్టినట్టుగా అనిపించడం / ఛాతీలో మంట , శ్వాససరిగా అందకపోవడం లేదా బలంగా ఊపిరి తీసుకోవడం / ఆయాస పడటం - నోరు తడారిపోవడం ఒళ్లు జలదరించడం ∙అయోమయం, కడుపులో గాభరా కడుపులో మంట, ఎక్కువసార్లు మూత్రానికి వెళ్తూ ఉండటం. చేతులు, కాళ్లు వణకడం, ఒకచోట నిలకడగా ఉండలేకపోవడం. - నిత్యం అలజడిగా ఉండటం, తీవ్రమైన నిద్రలేమి, నిద్రవేళల్లో మార్పులు, వేళకు నిద్రపట్టకపోవడం (ఇర్రెగ్యులర్ స్లీప్ పాట్రన్స్), అకస్మాత్తుగా నిద్రలోంచి ఉలిక్కిపడి లేవడం ఇక ఆ తర్వాత నిద్రపట్టకపోవడం - ఈ లక్షణాలతో పాటు కొత్త పరిస్థితులకు అడ్జెస్ట్ అయ్యేందుకు పడే ప్రయాసలో డిప్రెషన్‌కు గురైన వారిలో తీవ్రమైన నిరాశ, నిస్పృహ, నెగెటివ్ ఆలోచనలు రావడం, భవిష్యత్తు ఆశాజనకంగా కనిపించకపోవడం వంటి లక్షణాలూ కనిపించడంతో పాటు ఆత్మహత్యకు పాల్పడే లక్షణాలూ (సూసైడల్ టెండెన్సిస్) కూడా కనిపిస్తాయి. ఆత్మహత్యకు చేసుకోవలన్న ఆలోచనలు మాటిమాటికీ వస్తుంటాయి. దీని నుంచి బయటపడటం ఎలా? - మీ ఇతర కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, తెలిసినవారు, మీ శ్రేయోభిలాషులు అనుకున్నవారితో భౌతికంగా కాకపోయినా... వర్చువల్‌గా (అంటే మొబైల్ లేదా ఫేస్‌టైమ్‌తో) వారితో సన్నిహితంగా ఉండండి. వారితో మీ సంతోషదాకయమైన క్షణాలను స్మరిస్తూ... ఆ ఆనందకరమైన సమయాలు మళ్లీ త్వరలోనే వస్తాయనే ఆశాభావంతో కూడిన సంభాషణలు చేయండి. - మీ దగ్గరివారు కూడా కోవిడ్‌ను ఎదుర్కోవడమో, తమకు ఆత్మీయులైనవారిని కోల్పోవడమో చేసి ఉండవచ్చు. వారు ఈ క్రైసిస్‌ను ఎలా ఎదుర్కొన్నారు అనే లాంటి అంశాలను మాట్లాడుతూ... మీరూ ఆ మాటలతో మోటివేట్ అయ్యేలా మీ సంభాషణలు ఉండాలి. వారి నుంచి మీరు స్ఫూర్తి పొందేలాంటి సంభాషణలే వినండి. వారి ధైర్యసాహసాలను మెచ్చుకోండి. వాటిని మీరు మీలోనూ నింపుకోండి. - మీకు ఇష్టమైనవారి ధైర్యసాహసాలను, వారు వారి క్రైసిస్ నుంచి బయటపడ్డ తీరును, వారి మంచి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచండి. దాంతో ఇతరులూ స్ఫూర్తి పొందుతారు. ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఉంచినప్పుడు ఇతరులు వాటిని లైక్ చేస్తే... మీరు వాటిని మళ్లీ మళ్లీ చదువుతున్నప్పుడు మీరూ ఉత్తేజితులవుతారు. ∙ - మీ అనుభవాలను ఉత్తరాలుగా రాసుకోండి. వాటిని మీరు మళ్లీ చదువుకోండి లేదా ఇష్టమైనవారికి పంపండి లేదా మీరే చించివేయండి. - మీకు ఇష్టమైన హాబీలలో నిమగ్నం కావాలి. గతంలో మీరు ప్రదర్శించిన నైపుణ్యాలను మళ్లీ వెలికి తీయాలి. అంటే పెయిటింగ్, డాన్స్ వంటి వాటిలో నిమగ్నమవుతూ... వాటిని ఆస్వాదిస్తూ ఉండాలి. మీరు బాగా ప్రదర్శించిన వాటికి మీకు మీరే బహుమతులు ఇచ్చుకుంటూ మిమ్మల్ని మీరు మోటివేవ్ చేసుకోవడమూ అవసరం. - గతంలో మీరు ప్రదర్శించిన ధైర్యసాహసాలు మాటిమాటికీ తలచుకోవాలి. ‘అప్పుడు వాటిని చేసింది కూడా నేను కదా. మరలాంటప్పుడు నేను ఇప్పుడూ అవే ధైర్యసాహసాలను ప్రదర్శించగలను కదా’ అంటూ ధైర్యం చెప్పుకోవాలి. ∙ఆటలూ, క్రీడలూ వంటివి క్రీడా స్ఫూర్తి పెంచుతూ... ఓటమిని తేలిగ్గా తీసుకునే అడ్జస్ట్మెంట్ బిహేవియర్‌ను వేగవంతం చేయడమే కాకుండా... కొత్త పరిస్థితులకు తేలిగ్గా సర్దుకుపోయే గుణాన్ని పెంపొందిస్తాయి. డిప్రెషన్ నుంచి వేగంగా బయటపడేస్తాయి. - ఇంట్లోనే వ్యాయామం చేయాలి. వ్యాయామం వల్ల మెదడులో ఎండార్ఫిన్స్ వంటి సంతోషకరమైన రసాయనాలు వెలువడుతాయి. అవి ఆనందాన్ని పెంచి డిప్రెషన్‌ను అధిగమించేందుకూ తోడ్పడతాయి. ఇవి కూడా చేయండి: రోజూ అన్ని పోషకాలు ఉండే సమతులాహారం, మంచి పౌష్టికాహారం తీసుకోండి. ∙టీవీలో మీకు విపరీతమైన ఆందోళన కలిగించే వార్తలను చూడకండి, వినకండి. ∙మీకు చాలా ఇష్టమైనవారితోనే సమయం గడపండి. ∙ఆహ్లాదకరమైన సంగీతం/పాటలు వినండి. - ఇంట్లోనే మీకు ఇష్టమైన సినిమాలు చూడండి. ముఖ్యంగా హాస్యచిత్రాలు. - బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయడంతో పాటు... యోగా, ప్రాణాయామ వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ ఫాలో అవ్వండి. - ఈ పరిస్థితేమీ ప్రమాదకరం కాదంటూ మీకు మీరు ధైర్యం చెప్పుకుంటూ ఉండండి. ఒకవేళ అది సాధ్యపడకపోతే... టెలిఫోన్లోనే మీ కుటుంబ డాక్టర్‌తో లేదా సైకియాట్రిస్ట్‌తో మాట్లాడి, ప్రొఫెషనల్స్ సలహా తీసుకోండి. అలాంటివారిలోనూ మీ పట్ల సహానుభూతితో ఉండేవారినే ఎంచుకుని వారిని సంప్రదించండి. సెకండ్‌వేవ్‌లో కనిపిస్తున్న ప్రధాన మానసిక సమస్య... అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగై్జటీ అండ్ డిప్రెషన్ మొదటివేవ్‌తో పోలిస్తే ఈసారి సెకండ్ వేవ్‌లో... కుటుంబ సభ్యులూ, తమకు కావాల్సిన సన్నిహితులు, ఆత్మీయులు మరణించడంతో... చాలామంది ఇప్పుడు ‘‘అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్’’ మానసిక సమస్యతో బాధపడుతుండటాన్ని చాలామంది సైకియాట్రిస్టులు చూస్తున్నారు. ఈ సమస్య తాలూకు కొన్ని కేస్ స్టడీలు కేస్ స్టడీ 1 : డెబ్బయి ఏళ్ల పెద్దవయసు దంపతులు సొంతకూతుర్ని పోగొట్టుకున్నారు. యూఎస్‌లో ఉండే వారి కుమారుడు ఇక్కడికి వచ్చేసి వాళ్లకు చికిత్స అందిస్తున్నాడు. అతడు తన ఉద్యోగం కోసం యూఎస్‌కు వెళ్లే పరిస్థితి లేదు. కేస్ స్టడీ 2 : మంచి ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్న ఓ యువకుడు ఇటీవల కరోనాతో మరణించాడు. దాంతో 58 ఏళ్ల వయసున్న అతడి తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. వీళ్లంతా‘‘అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్’’ గురైనట్లు తేలింది. -
వారిది షేర్డ్ సైకోటిక్ డిజార్డర్ కావచ్చు!
మదనపల్లెలో ఇద్దరు విద్యాధికులైన తల్లిదండ్రులు ఒక ఉన్మాదం లాంటి స్థితిలో తమ ఇద్దరు కూతుళ్లనూ హత్య చేశారు. కలియుగం అంతమైపోయి ఆ మర్నాటి నుంచి సత్యయుగం ప్రారంభమవుతుందని నమ్మారు. తమ కూతుళ్లను ఆ యుగంలోకి పంపేందుకు పూజలు నిర్వహిస్తూ బిడ్డలను హతమార్చారు. పైగా తమ బిడ్డలు మరణించలేదనీ... కొద్దిసేపట్లో జీవించి తిరిగి లేస్తారని చెబుతున్నారు. యుగాంతమైపోతుందన్న నిహిలిస్టిక్ డెల్యూషన్స్‌తో పాటు మరెన్నో భ్రాంతులకు లోనైన ఈ తాజా సంఘటన ఇటీవలే మదనపల్లెలో చోటుచేసుకుంది. సరిగ్గా పైన చెబుతున్న సంఘటనతో పోలికలు కనిపిస్తున్న ఉదంతం దాదాపు రెండేళ్ల కిందట ఢిల్లీ బురారీలో జరిగింది. ఆ సంఘటనలో ఒకే ఇంట్లో పదకొండు మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సంఘటనలో... చాలాకాలం కిందటే ఢిల్లీలోని నారాయణి దేవి అనే ఆవిడ భర్త చనిపోయాడు. ఆయన మరణించాక ఆ కుటుంబం కష్టనష్టాలకు లోనైంది. ఆ తర్వాత కుటుంబ పెద్ద తాలూకు రెండో కొడుకైన లలిత్ భాటియా తీవ్రమైన సైకోటిక్ డిజార్డర్‌కు గురయ్యాడు. దాంతో కొన్ని భ్రాంతులకు లోనయ్యాడు. ఆ భ్రాంతులనే నిజమని నమ్ముతూ... తమ నాన్న తమతో మాట్లాడుతూ, బిజినెస్ సలహాలు ఇస్తున్నాడని భ్రమపడేవాడు. వాటిని పాటిస్తున్నందువల్లనే బిజినెస్ పుంజుకుందనీ, తమ కష్టాలు గట్టెక్కాయని నమ్ముతుండేవాడు. ఈ నమ్మకం ముదిరి, తాంత్రిక పూజల్లోకి దిగి, వటవృక్ష పూజ అనే తంతును నిర్వహిస్తే... కుటుంబ సభ్యులందరికీ మోక్షం తప్పదనీ, వటవృక్షపు ఊడల్లా వేలాడుతూ, తాము ఉరికి పాల్పడితే కొంత సమయం తర్వాత తామంతా తిరిగి బతుకుతామనీ విశ్వసించారు. దాంతో కుటుంబసభ్యులంతా పూజలో భాగంగా ఉరేసుకున్నారు. ఉరివేసుకున్న తర్వాత వారు బతకలేదు సరికదా... కుటుంబంలోని 11 మందీ చనిపోయారు. ఈ రెండు సంఘటనలలో ఇంట్లో ఎవరికో ఒకరికి పూజలూ, ప్రాణాలను అర్పించడాలపై నమ్మకం కలిగింది. కాకపోతే అక్కడ లలిత్భాటియా నమ్మాడు. అలాగే మదనపల్లెలో కుటుంబపెద్ద పురుషోత్తం నాయుడో లేదా అతడి భార్య పద్మజనో నమ్మారనుకుందాం. మరి కూతుళ్ల విచక్షణ ఏమైంది? ఆ పూజలతో తాము తిరిగి బతుకుతామనే నమ్మకానికి ఎందుకు వచ్చారనే ప్రశ్నలు ఉద్భవిస్తాయి. అలా ఒకరి నమ్మకాన్ని... కుటుంబసభ్యులందరూ కలిసి బలంగా విశ్వసించి, అలా తాను నమ్మిన సైకోటిక్ వైఖరిని మిగతావారికీ ‘షేర్’ చేసే వ్యాధి పేరే ‘‘షేర్డ్ సైకోసిస్’’. ఢిల్లీలో కుటుంబపెద్ద విశ్వాసానికి 11 మంది ప్రాణాలు కోల్పోతే... మదనపల్లె సంఘటనలో మంచి భవిష్యత్తు ఉన్న యువతులు తమ జీవితాలను కోల్పోయారు. పైగా ఈ సంఘటనలో పురుషోత్తం నాయుడు భార్య పద్మజ తనను తాను శివుని అంశగానూ, కొన్నిసార్లు, శివుడిగానే కొన్నిసార్లు భ్రమిస్తున్నారు. ఇలా భ్రాంతులకు (డెల్యూషన్స్కు) గురవడాన్ని డెల్యూషనల్ డిజార్డర్‌గా కూడా చెప్పవచ్చు. ఇక్కడ ఆ కుటుంబం రెండు రకాల డెల్యూషన్స్లో ఉంది. ఒకటి షేర్డ్ సైకోసిస్ డిజార్డర్ కాగా ఆమె భ్రాంతులతో కూడిన డెల్యుషన్ డిజార్డర్‌తోనూ బాధపడుతున్నారు. ఇక్కడ ఈ భార్యాభర్తల్లో ఎవరో ఒకరు మరొకర్ని ప్రభావితం చేసి ఉండవచ్చు. దాంతో భార్యాభర్తలలో సైకోసిస్ ‘షేర్’ అయి ఉండవచ్చు. ‘షేర్డ్ సైకోసిస్’ అంటే? ఇది భ్రాంతులు కలిగించే ఒక రుగ్మత. దీన్నే ఇండ్యూస్డ్ డెల్యూజన్ డిజార్డర్ అని కూడా అంటారు. ఈ భ్రాంతి రుగ్మతకు వైద్యపరమైన మరో ఫ్రెంచ్ పేరు కూడా ఉంది. అదే ‘ఫోలీ ఎ డ్యుయో’ అంటే వాస్తవంగా డ్యుయో అంటే రెండు అని అర్థం. మదనపల్లె ఉదంతంలోనూ భార్యాభర్తలు ఇరువురి లో ఒకరు మరొకరిని ప్రభావితం చేసి ఉండవచ్చు. అలాంటప్పుడు ఇది ‘ఫోలీ ఏ డ్యూయో’ అవుతుంది. ఒకవేళ ఇది కుటుంబ సభ్యుల్లో ఇద్దరికంటే ఎక్కువగా చాలామందికి వచ్చిందనుకోండి. అప్పుడు దీన్నే ‘ఫోలీ ఎన్ ఫ్యామిలే’ అంటారు. కానీ కూతుళ్లు ప్రభావితమయ్యారో లేదో అని ముందే అనుకున్నాం. ఒకవేళ అదే కుటుంబాన్ని దాటి ఇంకా చాలామందికి వచ్చిందనుకోండి. అప్పుడు దాన్ని ‘ఫోలీ ఎ ప్లసియర్స్’ అంటారు. ఇక మదనపల్లె దంపతుల్లో వారు యుగాంతం వస్తుందని నమ్మారు. ఇలా నమ్మడాన్ని ‘నిహిలిస్టిక్ డెల్యూషన్స్’ అంటారు. ఇలా ఆ దంపతులు ఈ నిహిలిస్టిక్ డెల్యూజన్స్ అనే మరో భ్రాంతికీ గురయ్యారు. ఢిల్లీలోని బురారీ కుటుంబంలో ఒకరు ప్రేరేపించడం వల్ల అందరూ ఆత్మహత్యలు చేసుకుంటే, మదనపల్లెలో మళ్లీ బతుకుతారంటూ తల్లిదండ్రులే కూతుళ్లను చంపేశారు. పోలీసులు రావడం ఆలస్యమైతే వారూ చనిపోయేరంటూ వస్తున్న వార్తలను బట్టి చూస్తే ఇది కూడా షేర్డ్ సైకోసిస్‌లోని పోలీ ఎన్ ఫ్యామిలే అనేందుకే ఆస్కారం ఎక్కువగా కనిపిస్తోంది. షేర్డ్ సైకోసిస్ అనే ఈ రకమైన సైకియాట్రీ ప్రవర్తనను, రుగ్మతను ఫ్రెంచ్ సైకియాట్రిస్ట్‌లు అయిన చార్లెస్ లేసెగ్, జీన్ పెర్రీ ఫార్లెట్ను 19వ శతాబ్దంలో కనుగొన్నారు. అందుకే దీన్ని లేసెగ్–ఫార్లెట్ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఈ వ్యాధిలోని చిత్రం ఏమిటంటే... కనీసం ఇద్దరు భ్రాంతులకు గురైనప్పుడు కానీ దీన్ని గుర్తించడం సాధ్యం కాదు. గుర్తించడమెలా? తమకు ఎవరెవరో కనిపిస్తున్నారనీ, ఏవేవో వినిపిస్తున్నాయనీ చెప్పే స్కీజోఫ్రీనియా వంటి లక్షణాలు వీరిలోనూ కనిపిస్తాయి. పైగా వీరిలో కొందరు అందరికీ కనిపించే తాను తాను కాదనీ, తాను దైవాన్ననీ చెబుతూ ఉంటారు. యుగాంతం సంభవించబోతుందని అంటారు. రకరకాల భ్రాంతులకు గురవుతూ అవి నిజమని నమ్ముతుంటారు. చికిత్స ఇలాంటి సైకోటిక్ రుగ్మతలు కౌన్సెలింగ్‌తో తగ్గవు. తప్పనిసరిగా మందులతో చికిత్స తీసుకోవాల్సిందే. పేషెంట్స్ మెదడులో జరిగిన మార్పుల కారణంగా ఆ భ్రాంతులు వాళ్లవరకు నిజమే. కానీ ఆరోగ్యవంతులు అది సరికాదంటూ వారితో వాదించకూడదు. అందుకే పేషెంట్స్‌తో వ్యవహరించాల్సిన తీరుపై కుటుంబసభ్యులకు కొంత కౌన్సెలింగ్ అవసరమవుతుంది. కానీ ఈ వ్యాధులు కౌన్సెలింగ్‌తో తగ్గవు. ఈ తరహా రోగులకు యాంటీసైకోటిక్ మందులు, యాంగై్జటీని తగ్గించే మందులు, నిద్రలేమికి ఇవ్వాల్సిన ట్రాంక్విలైజర్లతో చికిత్స చేయాల్సి రావచ్చు. ఏమిటీ డెల్యూషన్ డిజార్డర్లు షేర్డ్ సైకోసిస్’కు వ్యక్తులు ఎందుకు, ఎలా గురవుతారో తెలుసుకునే ముందర... అసలు సైకోసిక్ అనే మానసిక రుగ్మతకు ఎలా గురవుతారోతెలుసుకోవాలి. మన మెదడులో పది పక్కన పన్నెండు సున్నాలు పెట్టినంత పెద్ద సంఖ్యలో నాడీకణాలు ఉంటాయి. మళ్లీ ఒక్కో కణానికీ పక్కనున్న పొరుగు కణాలతో అనేక కనెక్షన్లు ఉంటాయి. ఈ కనెక్షన్ల మధ్య కొన్నిచోట్ల ఖాళీ స్థలం ఉంటుంది. ఆ ఖాళీ స్థలంలో మెదడుకు సంబంధించిన కొన్ని రసాయనాలు ఉంటాయి. మెదడులోని రసాయనాలలో డోపమైన్, సెరిటోనిన్, ఎపీనెఫ్రిన్ వంటివి కొన్ని రసాయనాలు ఉంటాయి. ఈ రసాయనాలు తమ నార్మల్ స్థాయిని దాటి పెరిగినప్పుడు ‘సైకోటిక్ డిజార్డర్స్’ వస్తాయి. అంటే నిజానికి ఏ సంఘటనా జరగకపోయినా, మెదడు లో ఈ రసాయనాల మార్పులు జరిగినప్పుడు... వారికి నిజంగా ఏదో జరిగినట్లు భ్రాంతి కలుగుతుంది. అలా జరగని సంఘటనను జరిగినట్లుగా భావించే అనుభూతినే ఇంగ్లిష్‌లో ‘హేలూసినేషన్స్’ అంటారు. ఈ హేలూసినేషన్స్తో సైకోసిస్‌కు గురైన వారు మళ్లీ... ఇతరులను ప్రభావితంచేస్తే... పక్కవారిలోనూ కనిపించే మానసిక సమస్యనే ‘షేర్డ్ సైకోసిస్’ అంటారు. దాంతోపాటు తల్లిదండ్రులిద్దరూ డెల్యూషన్ డిజార్డర్‌తోనూ బాధపడుతున్నారు. డాక్టర్ శ్రీనివాస్ ఎస్‌ఆర్‌ఆర్‌వై హెచ్ఓడీ అండ్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీ, ఎమ్జీఎమ్ గవర్నమెంట్ హాస్పిటల్, వరంగల్ సూచన: ఎవరైనా విచిత్రంగా, వింతగా వ్యవహరించడం, వాళ్ల ఆలోచనలూ అసాధారణంగా ఉండి, వివరణలకు అందకుండా ఉండటం వంటి లక్షణాలతో మానసిక రుగ్మతలను తేలిగ్గా గుర్తించవచ్చు. ఇలా ఎవరైనా ప్రవర్తిస్తూ ఉంటే వారిని తక్షణం గుర్తించి, వీలైనంత త్వరగా వారిని సైకియాట్రిస్ట్‌ల దగ్గరికి తీసుకెళ్లడం అవసరం. -
సెల్ఫీల్లో అందం కోసం తపనా ఓ రోగమే
బోస్టన్: ఫొటోను అందంగా ఎడిట్ చేసుకుని నిజ జీవితంలోనూ తమకు ఇలాంటి ముఖమే వచ్చేట్లు ప్లాస్టిక్ సర్జరీ చేయాలని వైద్యులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇటీవల ప్లాస్టిక్ సర్జన్లను కలిసిన వారిలో సెల్ఫీల్లో అందంగా వచ్చేలా తమ ముఖాన్ని తీర్చిదిద్దమని కోరిన వారే 55 శాతమట! ఏ లోపం లేకుండా సెలబ్రిటీల్లా సోషల్‌మీడియాలో కనపడాలనే తపనను ‘స్నాప్డైమోఫియా’అనే రుగ్మతగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా స్నాప్‌చాట్, ఫేస్ట్యూన్ యాప్‌ల వంటి సోషల్‌మీడియా ఫొటో ఎడిటింగ్ టెక్నిక్స్ మనుషులపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. బోస్టన్ వర్సిటీ పరిశోధకులు చేపట్టిన ఈ అధ్యయనం వివరాలు జమా ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఎడిటింగ్ టెక్నిక్స్ వల్ల అందంపై దృక్పథం మారిందని, దీంతో ఆత్మగౌరవం దెబ్బ తినడంతో పాటు శారీరక రుగ్మతలకు దారి తీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ‘అందంగా కనపడాలనే తపనతో చర్మవ్యాధులు, ప్లాస్టిక్ సర్జరీ నిపుణులను కలవడం ఒక రుగ్మత, వీరి మనసు నిండా అందం గురించిన ఆలోచనలే ఉంటాయి’ అని పరిశోధనలో పాల్గొన్న నీలమ్ వశీ పేర్కొన్నారు. సర్జరీతో అందం రాదని, సర్జరీ దీనికి ఎంత మాత్రం పరిష్కారం కాదన్నారు. సహజమైన అందాన్ని ప్రేమించగలిగేలా వీరికి మానసిక చికిత్స అవసరమని సూచించారు. -
అదిగో కొండ... ఇదిగో లోయ
వీళ్లు కెరటం అంత స్ట్రాంగ్ అనుకుంటాంగానీ అంతకంటే వీక్ అయిపోతుంటారు. ఉవ్వెత్తున లేస్తారు... ఠప్పున పడిపోతారు. ఇంతలోనే ఉత్సాహం... అంతలోనే ఉత్పాతం. రూపాయి నాణేన్ని టేబుల్ మీద తిప్పితే ఒకసారి బొమ్మ... ఒకసారి బొరుసు కనిపించినట్టే వీళ్లలో సంతోషం... విచారం కొంత వ్యవధిలో తిరుగాడుతూ ఉంటాయి. ఏ ఉద్వేగమూ కొంతకాలం స్థిరంగా ఉండకపోవడంతో చుట్టూ ఉన్నవాళ్లందరిలోనూ అపరిమితమైన ఒత్తిడి. వాళ్లకే కాదు చుట్టూ ఉన్న మనందరికీ కూడా! అందుకే అందరమూ‘బైపోలార్ డిజార్డర్’పై అవగాహన పెంచుకోవడం కోసమే ఈ ప్రత్యేక కథనం. సినిమాల్లోనైనా అందరూ ‘రోలర్ కోస్టర్’ను చూసే ఉంటారు కదా. దాని మీదికెక్కిన వారు అకస్మాత్తుగా పైపైకి వెళ్తుంటారు. అంతలోనే లోయలోకి దూకినట్టుగా కిందికి వేగంగా దిగిపోతుంటారు. ఒక చోట గిరా గిరా గిరా గిరికీలు కొడతారు. ‘బైపోలార్’ వ్యాధిలోనూ అంతే. మెదడులో మన మూడ్స్ కాస్తా రోలర్ కోస్టర్ ఎక్కి... అవి గబగబా మారిపోతే... మనిషి గింగిరాలు తిరుగుతాడు. అలా మూడ్స్ మాటిమాటికీ మారిపోతున్నప్పుడు ఆ మనిషి కాసేపు అపరిమితమైన సంతోషాలూ, అంతులేని ఉత్సాహాలూ కనబరుస్తూ... అవి కాస్తా తగ్గిపోయాక తీవ్రమైన నిరాశలో, నిస్పృహలో, అంతులేని కుంగుబాటులో మునిగిపోయే జబ్బే ఈ బైపోలార్ డిజార్డర్. ఇందులో చాలా ఉత్సాహంగా ఉండే దశను ‘మేనిక్’ ఫేజ్‌గా చెబుతారు. అలాగే తీవ్రంగా కుంగిపోయే దశను ‘డిప్రెసివ్ స్టేట్ లేదా ఎపిసోడ్’ అంటారు. రమేశ్ ఆ రోజు చాలా సంతోషంగా ఉన్నాడు. ఒక ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నాడు. ‘‘ఐఏఎస్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదురా. కావల్సిందల్లా జస్ట్... మంచి కాన్సంట్రేషన్. కాస్త హార్డ్‌వర్క్. ఇవేమీ కొత్తవి కావు. నేను టెన్త్ నుంచి చేస్తున్నవే. కాబట్టి చేసేస్తా. ఒక్క ఏడాది నాది కాదనుకుంటా. చేసేస్తా. నాక్కొన్ని యాంబిషన్స్ ఉన్నాయి. నేను డిఫరెంట్ అని చూపించాలి. ఆ తర్వాత ఒకరోజు ఆఫీస్‌కు సైకిల్ మీద రావాలి. ‘సార్ పెద్ద ఆఫీసర్ అయినా నిరాడంబరుడు. ఆయనకు ఏమాత్రం గర్వం లేద’ని జనమంతా అనుకోవాలి. మరోరోజు మనమెవరో తెలియకుండా సినిమాహాల్కు వెళ్లాలి. ఇంట్రవెల్ సమయంలో మెరుపు తనిఖీలు చేసి అందరినీ అదరగొట్టాలి. అలా మనమేంటో మన తడాఖా ఏమిటో చూపించి జనాలకు మేలు చేయాలి’’ అంటూ అంతులేని ఉత్సాహంతో అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడుతూ పోతున్నాడు. చాలా సంతోషంగా ఉన్నాడు. ఏదైనా సాధించడం తనకు పెద్ద కష్టం కాదని చెబుతున్నాడు. కొన్ని నెలల తర్వాత మళ్లీ రమేశ్‌ను చూస్తే... అతడు మునుపటి రమేశేనా అనుకునేలా ఉన్నాడు. చాలా విచారంగా, చాలా నిరాశగా కనిపించాడు. ‘‘అదేంట్రా మొన్న అంత హుషారుగా ఉన్నావు. ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతానన్నావు?’’ అని అడిగితే... అమ్మో... ఏదో అనుకున్నా గానీ... ఆ సిలబస్ చూశాక బెంబేలెత్తిపోయారా. అయ్యబాబోయ్... అది ఏడాది కాదు కదా... మూడేళ్లైనా పూర్తి కాదేమోరా. కొందరు మూడు అటెంప్ట్స్, నాలుగు అటెంప్ట్స్ చేస్తారంటే అందుకేనేమోరా. నేను కనీసం క్లర్క్ అయినా అవుతానంటావా’’ అంటూ బేలగా మాట్లాడాడు. ‘‘అసలు జీవితంలో దేనికైనా పనికి వస్తానంటావా’’ అంటూ నిరాశపడ్డాడు. మనిషిని చూస్తే తీవ్రమైన డిప్రెషన్లో కనిపించాడు. ఒకరోజు రమేశ్ వాళ్లమ్మను పలకరిస్తే... ‘‘ఏమిటో బాబు ఒక్కోసారి చాలా హుషారుగా ఉంటాడు. మళ్లీ కొన్నిసార్లు నిరాశలో మునిగిపోతాడు. ఒక్కోసారి రాత్రిళ్లు ‘ఛీ... ఎందుకు నాకీ బతుకు’ అంటూ ఏడుస్తుంటాడు కూడా’’ అంటూ వాపోయింది ఆ తల్లి. అందరూ కలిసి బుజ్జగించి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే... డాక్టర్ కొన్ని పరీక్షలు చేసి ఇలా చెప్పాడు ‘‘అమ్మా... రమేశ్ ఒక మానసికవ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి పేరు... బైపోలార్ డిజార్డర్’’. లక్షణాలు : బైపోలార్ డిజార్డర్ రోగులు తమ మేనిక్ ఫేజ్ అయిన ‘ఉత్సాహ దశ’లో దేన్నీ లెక్క చేయని తెంపరితనంతో ఉంటారు. ∙సాధారణం కంటే ఎక్కువ ఉత్సాహంతో ఉంటారు ∙ఒక్కోసారి సిల్లీగానూ, విచిత్రంగానూ అనిపించే పనులు చేస్తుంటారు ∙ఇతరులకు సహాయం చేయాలనే భావన బలంగా ఉంటుంది. ఒక్కోసారి ఎంతదూరమైనా వెళ్లి మేలు చేస్తారు ∙అంతులేని తెగువ చూపుతూ పోరాటాలకూ దిగే అవకాశం ఉంది ∙ఆలోచనలు పరంపరగా ఎడతెరిపి లేకుండా వస్తుంటాయి ∙ఒక ఉత్సాహపూరిత సంతోష దశలో చాలాసేపు ఉంటారు. దీన్నే ‘యుఫోరియా’ అంటారు. ∙డ్రగ్స్ లేదా ఆల్కహాల్ తీసుకోవాలన్న కోరిక ఎక్కువ ∙ఎలాంటి జంకూ లేకుండా సాహసాలకు పాల్పడవచ్చు ∙డబ్బును లెక్కలేకుండా ఖర్చు చేస్తారు ∙కొందరిలో సెక్స్ పట్ల అపరిమితమైన ఆసక్తి పెరుగుతుంది. ఈ హుషారులో సురక్షితం కాని సెక్స్ కార్యకలాపాలకూ ఒడిగడతారు. డిప్రెసివ్ ఎపిసోడ్లో: ∙చాలా విచారంగా, ఏమాత్రం ఉత్సాహం లేకుండా ఉంటారు ∙నిరాశాపూరితంగా మాట్లాడతారు ∙దుర్బలంగా ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు ∙నిద్ర పరమైన సమస్యలు. కొందరిలో అస్సలు నిద్రపట్టదు... లేదా మరికొందరు అదేపనిగా నిద్రపోతుంటారు ∙అంతకు ముందు సంతోషాన్నిచ్చిన అనేక కార్యకలాపాల మీద ఉత్సాహాన్ని కనబరచరు ∙దేని మీదా దృష్టి కేంద్రీకరించలేరు ∙చాలా ముఖ్యమైన విషయాలూ మరచిపోతారు ∙తింటే చాలా తక్కువగా తింటారు లేదా చాలా ఎక్కువగా తినేస్తుంటారు ∙ఎప్పుడూ అలసట, నీరసంగా కనిపిస్తుంటారు ∙కొన్నిసార్లు భ్రాంతులకు గురవుతుంటారు ∙తీవ్రమైన అపరాధభావంతో ఉంటారు ∙ మాటిమాటికీ చావులు లేదా ఆత్మహత్యల గురించి ప్రస్తావన తెస్తుంటారు ∙ఈ రోగులు అందరితోనూ సామాజిక సంబంధాలు నెరపలేరు. వీళ్ల ప్రవర్తన కారణంగా సాధారణంగా అవి దెబ్బతింటుంటాయి. రకాలు / తీవ్రత : బైపోలార్ డిజార్డర్‌లో బైపోలార్–ఐ, బైపోలార్–ఐఐ అన్న ప్రధానమైన రెండురకాలతో పాటు మరికొన్ని రకాలూ ఉంటాయి. ఇక తీవ్రత విషయానికి వస్తే... కొందరిలో మేనిక్ దశ చాలా తీవ్రంగా ఉంటుంది. వాళ్లను హాస్పిటల్లో ఉంచి చికిత్స చేయించాల్సి రావచ్చు. ఇక కొందరిలో మేనిక్ దశ అంత తీవ్రంగా ఉండదు. ఆ కండిషన్‌ను ‘హైపోమేనిక్’ స్టేజ్‌గా పేర్కొంటారు. వీళ్లకు హాస్పిటల్లో ఉంచి చికిత్స చేయించాల్సిన అవసరం లేదు. కానీ... వాళ్ల నిరాశ, నిస్పృహలతో భవిష్యత్తు గురించిన దిగులుతో కుంగుబాటు ఉంటుంది. అందువల్ల చికిత్స చేయించాలి. లేకపోతే... వ్యాధి ముదిరి సమస్మాత్యకంగా మారే అవకాశం ఉంటుంది. నిర్ధారణ : రోగుల్లో కనిపించే బైపోలార్ లక్షణాలను బట్టి ప్రాథమికంగా దీన్ని నిర్ధారణ చేస్తారు. అలాగే వారికి పర్సనాలిటీ డిజార్డర్స్, స్కీజోఫ్రీనియా వంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా అని డాక్టర్లు పరీక్షిస్తారు. ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో కొన్ని రక్తపరీక్షలు, ఎమ్మారై వంటివి కూడా చేయించాల్సి రావచ్చు. చిన్నప్పుడు ఏవైనా తీవ్రమైన మానసిక వేదనకు గానీ అబ్యూజ్‌కు గానీ గురయ్యారా చూస్తారు. కుటుంబ చరిత్రను పరిశీలిస్తారు. నిర్ధారణ (డయాగ్నోజ్) ప్రక్రియలో ఇలా ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. చికిత్స : చికిత్సలో రకరకాల ప్రక్రియలు అవలంబించినప్పటికీ ప్రధానంగా మందులే ఎక్కువగా పనిచేస్తాయి. ఎందుకంటే ఇది సైకోటిక్ డిజార్డర్ కిందికి వస్తుంది. కౌన్సెలింగ్ ప్రక్రియ సైకోటిక్ డిజార్డర్స్‌లో పనిచేయదు. అందుకే ప్రధానంగా మందులే వాడుతారు. దీనికి మూడు రకాల మందులు వాడాల్సి వస్తుంది. అవి... 1) మూడ్‌ను బాగుచేసే మూడ్ స్టెబిలైజర్స్, 2) మానసికసమస్యలకు ఇచ్చే యాంటీసైకోటిక్ డ్రగ్స్, 3) యాంటీడిప్రెసెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. పీరియాడిక్ టేబుల్లో మూడో ఎలిమెంట్ అయిన లిథియమ్ మనిషి భావోద్వేగాల హెచ్చుతగ్గులను ఎలా నియంత్రిస్తుందన్నది ఇప్పటికీ ఒక అద్భుతం. ఎందరో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నంత వ్యాధి తీవ్రత ఉన్నవారిలోనూ ఈ లిథియమ్ అద్భుతంగా పనిచేసి, ఎన్నో మరణాలను నివారించిందీ... నివారిస్తుంది. బైపోలార్ డిజార్డర్‌లోని మందులన్నింటినీ సమస్య తీవ్రతను బట్టి తగిన మోతాదులో సైకియాట్రిస్ట్‌లు మాత్రమే ఇవ్వాల్సినవి. కాబట్టి ఒకసారి తీసుకున్న వారు సొంతంగా వాడటం ఎంతమాత్రమూ సరికాదు. అలాగే మందులు వాడుతున్నప్పుడు అకస్మాత్తుగా ఆపేయడమూ మంచిది కాదు. దానివల్ల బైపోలార్ డిజార్డర్ తిరగబెట్టడంతో పాటు... తర్వాతి దశల్లో అదుపు చేయడం కొంత కష్టమవుతుంది కూడా. కొన్నిసార్లు కరెంట్ షాక్ ఇచ్చే ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ కూడా అవసరం కావచ్చు. అయితే ఇది ఎంతమాత్రమూ ప్రమాదకరం కాదు. ఇక నిద్రసమస్యలు ఉన్న కొందరురోగుల్లో స్లీప్ మెడికేషన్ కూడా అవసరం కావచ్చు. బైపోలార్ డిజార్డర్ ఉన్న సెలబ్రిటీలు ∙ప్రముఖ సింగర్ యో యో హనీసింగ్ బైపోలార్ డిజార్డర్‌తో బాధపడ్డాడు. చికిత్స తీసుకుని ఇప్పుడు పూర్తిగా దాని నుంచి విముక్తయ్యాడు. ∙ప్రఖ్యాత హాలివుడ్ నటి మార్లిన్‌మన్రో కూడా తీవ్రమైన మూడ్ స్వింగ్స్‌తో బాధపడుతుండేవారనీ, బైపోలార్ జబ్బువల్లనే ఇలా జరిగేదని అంటారు. ∙హెవీవెయిట్ బాక్సర్ మైక్టైసన్లో బైపోలార్ డిజార్డర్‌ను డయాగ్నైజ్ చేశారు. ∙ప్రఖ్యాత రచయిత్రి వర్జీనియా వూల్ఫ్‌కు ‘బైపోలార్ డిజార్డర్’ ఒక మేలు చేసింది. ఆమెలోని ఆ ఉత్సాహం ఆమెను ఆల్ టైమ్ బెస్ట్ రైటర్‌ను చేసింది. డిప్రెషన్లోకి కూరుకుపోవడంతో అదే జబ్బు ఆమె ఆత్మహత్యను ప్రేరేపించింది. ∙రెండుసార్లు అకాడమీ అవార్డుకు నామినేట్ అయిన యాక్షన్ హీరో మెల్ గిబ్సన్... తాను ఈ సమస్యతో బాధపడ్డట్లు వెల్లడించారు. అతడి వ్యక్తిగత జీవితం కారణంగా చాలాసార్లు వార్తల్లో నిలిచారు. 2006లో ఒకసారి డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిపోయి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ∙ప్రఖ్యాత రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత అయిన ఎర్నెస్ట్ హెమ్మింగ్వే కూడా తన జీవితకాలంలో మేనిక్ డిప్రెసివ్ బిహేవియర్ చూపేవాడు. ఆయనకు షాక్‌థెరపీ కూడా ఇచ్చారు. అయితే ఎప్పుడూ చావు ఆలోచనలతో బాధపడే హెమ్మింగ్వే 1961లో తుపాకీతో కాల్చుకుని మరణించాడు. ∙అకాడమీ అవార్డు, గోల్డెన్ గ్లోబు అవార్డులు గెలుచుకున్న ప్రముఖ నటి క్యాథరిన్ జెటా జోన్స్ కూడా ఈ వ్యాధి బారిన పడ్డారు. తన భర్త మైకెల్ డగ్లస్‌కు నాలుక క్యాన్సర్ రావడంతో ఆమె మొదట తీవ్రమైన డిప్రెషన్‌కు లోనై, ఆ తర్వాత బైపోలార్ డిజార్డర్ బారిన పడ్డారు. ∙రెండోప్రపంచయుద్ధ సమయంలో బ్రిటన్‌కు ప్రధానిగా ఉన్న ప్రపంచ ప్రఖ్యాత రాజకీయవేత్త విన్స్టన్ చర్చిల్ కూడా బైపోలార్ డిజార్డర్ బాధితుడే. యుద్ధసమయంలో తన సైనికులను తన ఉద్వేగభరిత ప్రసంగాల ద్వారా తీవ్రంగా ఉత్తేజితులను చేసేవాడు. యుద్ధం తర్వాత డిప్రెషన్‌కూ, ఆత్మహత్యాపూరితమైన ఆలోచనలకు, నిద్రలేమికి గురయ్యాడు. కారణాలు : ‘బైపోలార్ డిజార్డర్’కు కారణాలు నిర్దిష్టంగా ఉండవు. ఇవి రోగి నుంచి రోగికి మారుతుంటాయి. వీటిని జన్యుపరమైనవి, వాతావరణపరమైనవి, న్యూరలాజిక్గా చెప్పవచ్చు. జన్యుపరమైన కారణాలతో: రోగి కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉన్నప్పుడు... ఇతర కుటుంబ సభ్యుల్లోనూ అవి కనిపించే అవకాశాలు ఎక్కువ. వంశపారంపర్యంగా ‘బైపోలార్ డిజార్డర్’ను ప్రేరేపించే జన్యువు కారణంగా ఇది కనిపించవచ్చని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే అంతమాత్రాన తల్లిదండ్రుల్లోనో లేదా సోదరుల్లోనో ఉంటే ఇది తప్పక కనిపించాలనేమీ లేదు. పర్యావరణ / బాహ్య వాతావరణ పరమైన కారణాలతో : ఇక్కడ వాతావరణం అంటే పూర్తిగా పర్యావరణ కారణాలైన ఏ కాలుష్యమనో, ఇంకేదో అనో కాదు. బాహ్య అంశాలను ‘ఎన్విరాన్మెంటల్’ కారణాలుగా చెబుతారు. ఉదాహరణకు చిన్నప్పుడు తీవ్రమైన మనోవేదనకు గురి కావడం ∙ఏదైనా మనోవేదన లేదా ఇతరత్రా వ్యాధితో బాధపడాల్సి రావడం ∙ఏదైనా పెద్ద వినాశం తర్వాత కనిపించే తీవ్రమైన ఒత్తిడి అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటివి చాలా సుదీర్ఘకాలం పాటు కొనసాగడం... లాంటి బయటి కారణాలన్నింటినీ ‘ఎన్విరాన్మెంటల్’ కారణాలుగా చెప్పవచ్చు. అయితే వీటి వల్ల నేరుగా జబ్బు రాకపోయినా... ఇలాంటి వారికి జబ్బు వచ్చినప్పుడు తీవ్రత ఎక్కువవుతుంది. న్యూరలాజికల్ : నాడీపరమైన కారణాలతో కొందిరలో బైపోలార్ డిజార్డర్ కనిపించవచ్చు. ఉదాహరణకు పక్షవాతం వచ్చిన కొద్దిమందిలో లేదా ఏదైనా ప్రమాదంలో మెదడు దెబ్బతినడం వంటివి సంభవించిప్పుడు, నరాలపై ఉండే మైలీన్షీత్ అనే పొర దెబ్బతినడం వంటివి సంభవించే మల్టిపుల్ స్కి›్లరోసిస్ వంటికేసుల్లో, చాలా అరుదుగా మెదడులోని టెంపోరల్ లోబ్ అనే భాగంలోని లోపాల వల్ల వచ్చే మూర్ఛ (టెంపోరల్ లోబ్ ఎపిలెప్సీ) వ్యాధి ఉన్నవారిలో ‘బైపోలార్ డిజార్డర్’ కనిపించే అవకాశాలుంటాయి. ఇక మెదడులోని ప్రధానమైన న్యూరోట్రాన్స్మిటర్ అయిన డోపమైన్ స్రావాలు రోగుల మూడ్స్లోని మార్పులకు కారణమవుతాయి. వాళ్ల డిప్రెసివ్ దశలో సెరటోనిన్ అనే రసాయనం తాలూకు అనుబంధ రసాయనమైన ‘5–హైడ్రాక్సీ ఇండోల్ ఎసిటిక్ యాసిడ్’ పాళ్లు కూడా తగ్గుతాయి. బైపోలార్ డిజార్డర్ – ఇతర వ్యాధులు కొన్నిసార్లు బైపోలార్ డిజార్డర్... ఇతర వ్యాధులతో కలిసి కనిపించవచ్చు. ఇది ఉన్నవారిలో యాంగై్జటీ డిజార్డర్, ఈటింగ్ డిజార్డర్ వంటి మానసిక సమస్యలు ఉండవచ్చు. ఇది ఉన్నవారిలో థైరాయిడ్ సమస్యలు, మైగ్రేన్ తలనొప్పులు, గుండెజబ్బులు, డయాబెటిస్, ఒబేసిటీ లేదా ఇతరత్రా సమస్యలు కలగలిసి ఉండే అవకాశాలు ఎక్కువ. నివారణ పిల్లలు చిన్నప్పుడు తీవ్రమైన మనోవేదనకు గురయ్యే సందర్భాల్లో, ఆ కారణాన్ని బట్టి వారికి తగినంత మానసిక సాంత్వ ననివ్వడం ద్వారా పెద్దయ్యాక వారిలో బైపోలార్ డిజార్డర్ రాకుండా నివారించవచ్చు. మంచి మానవసంబంధాలను నెరపడం, అందరితో కలిసి ఉంటూ సామాజిక బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం ద్వారా చాలా సందర్భాల్లో బైపోలార్ డిజార్డర్స్ నివారితమయ్యే అవకాశాలు ఎక్కువే. డాక్టర్ శ్రీనివాస్ ఎస్‌ఆర్‌ఆర్‌వై ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీ, కాకతీయ మెడికల్ కాలేజ్, వరంగల్ -
ఎల్అండ్టీలో ఆర్థిక అవకతవకలు..!
న్యూఢిల్లీ: ఇన్ఫ్రా దిగ్గజం లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ)లో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయంటూ రాజ్యసభ ఎంపీ కెహ్కషాన్ పర్వీన్ ఆరోపించారు. ఈ మేరకు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో)కి ఫిర్యాదు చేశారు. రహదారి ప్రాజెక్టుల నిర్మాణం కోసం గ్రూప్ తీసుకున్న రూ. 8,000 కోట్ల పైగా రుణాలు .. మొండిబాకీలుగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఎల్అండ్టీ హలోల్ షామ్లాజీ టోల్‌వే (ఎల్అండ్టీ హలోల్), ఎల్అండ్టీ చెన్నై తడ ప్రాజెక్టుల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఎస్ఎఫ్ఐవో ముంబై ప్రాంతీయ కార్యాలయానికి చెసిన ఫిర్యాదులో పర్వీన్ ఆరోపించారు. ఇది విచారణార్హమైనదిగా పేర్కొంటూ సదరు ఫిర్యాదు గురించి ప్రధాన కార్యాలయానికి ముంబై కార్యాలయం తెలియజేసింది. మరోవైపు, ఎల్అండ్టీ ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవిగా తోసిపుచ్చింది. విచారణ గురించి తమకేమీ సమాచారం రాలేదని పేర్కొంది. కార్పొరేట్ గవర్నెన్స్‌లో తాము అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నామని ఎల్అండ్టీ వివరించింది. -
రుమటాయిడ్ ఆర్థరైటిస్ తగ్గుతుందా?
హమియో కౌన్సెలింగ్ నా వయసు 58 ఏళ్లు. నాకు రెండు చేతుల్లోని కీళ్లు నొప్పిగా ఉండటం, కీళ్లవద్ద ఎర్రగా మారడం జరిగింది. హోమియోలో పరిష్కారం ఉందా? – ప్రభాకర్‌రావు, తాడేపల్లిగూడెం మానసికమైన ఒత్తిడి, వ్యాకులత, బాధలు, భయాలు, ఆందోళన వలన శరీరంలోని రసాయనాలలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. అయితే వీటివలస కేవలం హార్మోన్ల అసమతుల్యత, హైపర్ టెన్షన్, కొన్నిరకాల సైకో–సొమాటిక్ డిజార్డర్స్ మాత్రమే కాదు సున్నితంగా ప్రతిస్పందించే వారిలో జన్యుపరమైన మార్పులకు దారి తీయవచ్చు. అందువల్లనే ఈ మధ్యకాలంలో ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిని ఎక్కువగా చూస్తున్నాం. ఈ తరహా వ్యాధులలో ప్రధానమైనది రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ వ్యాధిబారిన పడేవారిలో అధిక శాతం మంది స్త్రీలే అవ్వడం గమనార్హం. స్త్రీ–పురుషులలో యాభైఏళ్ళలో నొప్పులు మొదలవుతాయి. ఇది వయస్సు పెరిగేకొద్దీ కీళ్ళలో వచ్చే అరుగుదల వలన, ఎముకలలో క్యాల్షియం తగ్గిపోవడం వలన వస్తూ ఉంటుంది. దీనిని ‘ఆస్టియో ఆర్థరైటిస్’ అంటారు. ఇందుకు విరుద్ధంగా ముప్పై నుండి నలబై ఏళ్ళ మధ్యలో ఉండే యువతులలో చేతుల్లో, పాదాలలో ఉండే చిన్న చిన్న కీళ్లలో వచ్చే కీళ్ళ వాపులు, నొప్పులు రావడం రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు. అయితే ఇది పురుషుల్లోను, పిల్లల్లో్ల కూడా రావచ్చు. చిన్న పిల్లల్లో వచ్చే ఈ తరహా వ్యాధిని ‘స్టిల్స్ డిసీజ్’ అని అంటారు. వ్యాధి లక్షణాల తీవ్రతలో వివిధ మార్పులు కన్పిపిస్తాయి. అది యాక్టివ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అలసట, ఆకలి లేకపోవడం, లోగ్రేడ్ జ్వరం, కీళ్ళలో, కండరాల్లో నొప్పులు, కీళ్లను సరిగ్గా కదపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా కీళ్లనొప్పులు ఉదయాన్నే లేవగానే అత్యధికంగా ఉండి కొద్దిగా శరీరం కదిలించిన తర్వాత అదుపులో ఉంటాయి. సాధారణంగా చేతుల్లో కాళ్లలో రెండు వైపులా ఒకే కీళ్ళు ప్రభావితమవుతాయి. కీళ్ళు ఎర్రగా, వేడిగా మారి విపరీతమైన నొప్పితో బాధిస్తాయి. వ్యాధి దీర్ఘకాలంగా మారినప్పుడు కీళ్ళలోని మృదులాస్తి, ఎముకలు దెబ్బతినడం వలన వేళ్ళు వంకర్లు పోవడం, పూర్తిగా కదలికలు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటినే ‘డిఫార్మిటీస్’ అంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ని నిర్ధారించడానికి ఏ ఒక్క పరీక్ష సరిపోదు. రక్తపరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. ఆటో ఇమ్యూన్ సమస్యలలో చికిత్స చెయ్యడానికి హోమియోపతిలో మయాజ్మాటిక్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. సాధారణంగా వాడే పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వల్ల నొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం లభించడం లేదా కొన్నిసార్లు అస్సలు ప్రభావమే లేకపోవడం జరుగుతుంది. పైగా ఈ మందుల వలన డిఫార్మిటీస్‌ని నివారించలేం. హోమియోపతి మందుల ద్వారా అయితే వ్యాధిని నియంత్రించి నొప్పులను పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా డిఫార్మిటీలు రాకుండా నివారించవచ్చు. డాక్టర్ టి.కిరణ్ కుమార్ డైరక్టర్, పాజిటివ్ హోమియోపతి విజయవాడ, వైజాగ్ -
సామాజిక రుగ్మతలపై పోరాడాలి
రిటైర్డ్ చీఫ్ జస్టిస్ నర్సింహారెడ్డి ఘనంగా జిల్లా ‘లయన్స్’ కార్యవర్గ ప్రమాణ స్వీకారం కాజీపేట : సమాజాన్ని పట్టిపీడిస్తున్న రుగ్మతలను రూపుమాపేందుకు లయన్స్‌క్లబ్ సభ్యులు పాటుపడాలని పట్నా హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ లింగాల నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. నూతనంగా ఏర్పడిన జిల్లా లయన్స్‌క్లబ్ (320 ఎఫ్) కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం శనివారం రాత్రి హన్మకొండ కేయూ రోడ్డులోని పీజీఆర్ గార్డెన్స్‌లో జరిగింది. ఈ సంద ర్భంగా లయన్స్‌క్లబ్ నూతన గవర్నర్‌గా కేయూ మాజీ వీసీ వంగాల గోపాల్‌రెడ్డితో పాటు ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఆర్.సునీల్‌కుమార్, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్–1గా పి.సంపత్‌రెడ్డి, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్–2గా కే.సీ.జాన్‌బన్నీ, డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీగా డాక్టర్ పి.సుధాకర్‌రెడ్డి, కోశాధికారిగా జిల్లా పురుషోత్తం తదితరులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నర్సింహారెడ్డి మాట్లాడుతూ సమాజసేవ చేయాలన్న గొప్ప ఆశయంతో లయన్స్‌క్లబ్ సభ్యులు పోటీ పడాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరంగల్ ప్రత్యేక లయన్ డిస్ట్రిక్ట్‌గా ఆవిర్భవించిందని.. ఈ మేరకు క్లబ్ పేరును అంతర్జాతీయస్థాయిలోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పనకు కృషి చేయాలని కోరారు. అనంతరం ఆయన ప్రభుత్వ పాఠశాలల కోసం రూ.6లక్షల విలువైన 300 డెస్కులు పంపిణీæచేశారు. అలాగే, తిరుమలాయపాలెం పాఠశాల అభివృద్ధికి రూ.50వేల చెక్కు అందజేశారు. ఈ మేరకు లయన్స్‌క్లబ్ ఆఫ్ మహబూబాబాద్ ఆధ్వర్యంలో కురవి వీరభద్ర లయన్స్‌క్లబ్, వరంగల్ ఆపద్బంధు లయన్స్క్ల బ్ ఆధ్వర్యంలో వరంగల్ డైమండ్స్ క్లబ్‌ను నూతనం గా ప్రారంభించి లోగోలు ఆవిష్కరించగా, ఆచార్య కె.రమణయ్య సంపాదకత్వంలో రూపొందించిన డైరీ, నూతన వెబ్‌సైట్‌ను జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి ఆవిష్కరించారు. అలాగే తొలితరం లయన్స్ సభ్యు లు దేవులపల్లి దామోదర్‌రావు, పి.నారాయణరావు ను సత్కరించారు. ఆహ్వాన సంఘం చైర్మన్‌గా ఎన్.రాజిరెడ్డి స్వాగతం పలకగా పొట్లపల్లి శ్రీనివాసరావు, భూపతి మాస్టర్ ఆఫ్ సెర్మనీగా వ్యవహరించారు. తా డూరి రేణుక శిష్య బృందం శాస్త్రీయ జానపద నృత్యాలను ప్రదర్శించారు. కె.గోవిందరాజు, పోకల చంద ర్, డాక్టర్ కె.రాజేందర్‌రెడ్డి, దీపక్భట్టాచార్జ్, సురేష్, జావెద్ అలీ, విజయ్కుమార్శెట్టి, ప్రమోద్‌కుమార్, బీ.ఎన్.రెడ్డి, డాక్టర్ కె.సుధాకర్‌రెడ్డి, డాక్టర్ లవకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. వరంగల్‌కు ప్రత్యేక గుర్తింపు సామాజిక సేవలో ముందు నిలుస్తున్న వరంగల్ ల యన్స్క్లబ్ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించడంతో విశేష గుర్తింపు లభించినట్లయిందని క్లబ్ జిల్లా గవర్నర్ గోపాల్‌రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు ఆదిలాబాద్, కరీం నగర్, సికింద్రాబాద్, హైదరాబాద్‌తో కలిపి వరంగల్ లయన్స్‌క్లబ్ జిల్లాగా కొనసాగుతుండగా.. 1800 మంది సభ్యులు దాటిన నేపథ్యంలో ప్రత్యేక జిల్లాగా ప్రకటించారు. ఈమేరకు తొలి గవర్నర్‌గా గోపాల్‌రెడ్డి, సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.