
స్పష్టం చేస్తున్న నిమ్స్ నివేదికలు
మేనరికం, బంధుత్వ వివాహాలు కారణమంటున్న శాస్త్రవేత్తలు
అత్యధిక మందిలో బీటా తలసేమియా, వెన్నెముక కండరాల క్షీణత లక్షణాలు
హైదరాబాద్ నగరంలో జన్యుపరమైన రోగాల సంఖ్య పెరుగుతోందనే నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. దశాబ్ద కాలంలో 418 శాతం కేసుల వృద్ధి కనిపించిందని నిమ్స్ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిస్థితికి ప్రధానంగా మేనరికం, దగ్గర బంధువుల వివాహాలే కారణమని పేర్కొంటున్నారు. జన్యు సంబంధిత కేసుల్లో అత్యధిక శాతం బీటా తలసేమియా, వెన్నెముక కండరాల క్షీణత వంటి లక్షణాలు కనిపిస్తున్నట్లు తేలింది.
2021 నుంచి గణనీయంగా పెరుగుదల
నిమ్స్ ఆసుపత్రికి వచ్చే జన్యు పరమైన కేసుల్లో 2014 నుంచి నివేదికలను పరిశీలిస్తే 2020 వరకు సాధారణ పెరుగుదల కనిపించింది. 2021 నుంచి 2024 మధ్య గణనీయమైన రీతిలో కేసులు నమోదయ్యాయి. 2014లో 2453 కేసులు నమోదు కాగా, 2020 నాటికి వాటి సంఖ్య 3,735కి చేరింది. 2021లో 6,967 కేసులు నమోదు కాగా 2024 నాటికి కేసుల సంఖ్య 12,042 పెరగడం సాధారణ విషయం కాదని వైద్యులు పేర్కొంటున్నారు.
గతంతో పోలిస్తే అవగాహన పెరగడం, మెరుగైన డయాగ్నోస్టిక్ సామర్థ్యాలు కేసులు పెరగడానికి ఒక కారణమంటూనే, మేనరిక వివాహాలు చేసుకున్న వారిలో జన్యు పరమైన రోగాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. గర్భధారణ తర్వాత డీఎన్‌ఏలో మార్పులు, కాలుష్యం, జీవనశైలి, ఇతర ఒత్తిళ్లు వంటి కారణాలు ఆంకోలాజికల్ రిఫరల్‌లకు కారణమయ్యాయి. భార్య, భర్తల్లో అండం, స్పెర్మ్ నాణ్యత పడిపోవడాన్ని గుర్తించారు. 25 మందిలో ఒకరు బీటా తలసేమియా వ్యాధి, 40 మందిలో ఒకరికి వెన్నెముక కండరాల క్షీణత ఉన్నట్లు వైద్యుల అధ్యయనంలో తేలింది.
క్యారియర్ స్క్రీనింగ్ ముఖ్యం
గర్భధారణ ప్లాన్ చేసుకునే జంటలు జన్యు నిపుణులను సంప్రదించాలని నిపుణులు పేర్కొంటున్నారు. కుటుంబ చరిత్రలో జన్యుపరమైన రుగ్మతలు (genetic disorders) ఉన్నా, రక్తసంబంధమైన వివాహం అయినా భవిష్యత్ తరాలలో రుగ్మతల నివారణలో సహాయపడుతుందంటున్నారు.

బీటా తలసేమియా, వెన్నెముక కండరాల క్షీణత కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని నిమ్స్ సీనియర్ జన్యు శాస్త్రవేత్త డా. ప్రజ్ఞా రంగనాథ్ అన్నారు, జన్యుపరమైన రుగ్మతల సంఖ్య పెరగడానికి ప్రజల్లో అవగాహన పెరగడమూ ఒక కారణమని తెలిపారు.
అరుదైన సందర్భాల్లో గౌచర్, ఎంపీఎస్ (మ్యూకోపాలిసాకరిడో–సిస్), పాంపే వంటి ఇతర కేసులు కనిపిస్తున్నాయని సీనియర్ జన్యు శాస్త్రవేత్త డాక్టర్ షా–గన్ అగర్వాల్ అన్నారు. రేడియేషన్ ఎక్స్‌పోజర్, రసాయనాలు, వైరల్ ఇన్‌ఫెక్షన్లతో సహా వివిధ సోమాటిక్ ఆర్జిత ఉత్పరివర్తనాలు ప్రేరేపిస్తాయని ఆమె చెప్పారు.
చదవండి: పూర్తి ఫీజు చెల్లిస్తేనే ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ
జన్యు ఆరోగ్య సంరక్షణకు నిమ్స్ (NIMS) పనిచేస్తోందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భీరప్ప నగరి అన్నారు. అరుదైన వ్యాధుల చికిత్సలకు ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ, అవసరమైన రోగులకు చికిత్సలతో పాటు విద్యుత్ వీల్‌చైర్‌లు కూడా ఉచితంగా అందిస్తామని ఆయన అన్నారు.