15 సంస్థల శాస్త్రవేత్తలతో ప్రాజెడ్ పేరుతో పరిశోధన ప్రాజెక్టు
సీడీఎఫ్‌డీ, నిమ్స్ ఆసుపత్రి సంయుక్త అధ్యయనం..
దేశంలో 7 కోట్ల మందికి అరుదైన జన్యువ్యాధులు.. సీడీఎఫ్‌డీలో ప్రాజెడ్‌పై అవగాహన కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్: జన్యు లోపాలతో మనుషుల్లో వచ్చే వ్యాధులపై పోరాటాన్ని భారత్ మరింత తీవ్రం చేసింది. ఈ రకమైన వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచటంతోపాటు వ్యాధి నిర్ధారణను సులభతరం చేసేందుకు దేశంలోని 15 పరిశోధన సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలతో ‘మిషన్ ప్రోగ్రామ్ ఆన్ పీడియాట్రిక్ రేర్ జెనెటిక్ డిజార్డర్స్’(ప్రాజెడ్)ను కేంద్ర బయోటెక్నాలజీ విభాగం ప్రారంభించారు. దీనికి హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‌డీ) శాస్త్రవేత్త డాక్టర్ అశ్వన్ దలాల్ నేతృత్వం వహిస్తున్నారు.
గురువారం సీడీఎఫ్‌డీలో ప్రాజెడ్‌పై అవగాహన పెంచేందుకు ఏర్పాటైన కార్యక్రమంలో ఆ సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ ఉల్లాస్ కొల్తూర్ మాట్లాడుతూ.. దేశంలోని అరుదైన వ్యాధులపై అధ్యయనానికి ప్రాజెడ్ ఎంతో కీలకమని తెలిపారు. దేశవ్యాప్తంగా జన్యువ్యాధులపై పరిశోధనల కోసం 12 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీల ఏర్పాటు జరుగుతోందని ప్రాజెడ్‌కు నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త డాక్టర్ అశ్వన్ దలాల్ తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ శ్వేత త్యాగి, డాక్టర్ రశన భండారీలు జన్యువ్యాధులపై తాము చేస్తున్న పరిశోధనలు, గుర్తించిన కీలక అంశాలను వివరించారు.
7 కోట్ల మందికి జన్యు వ్యాధులు
మనదేశంలో అరుదైన జన్యు వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య సుమారు ఏడు కోట్లు ఉంటుందని అంచనా. సికిల్‌సెల్ అనీమియా, డౌన్ సిండ్రోమ్, మసు్కలర్ అట్రోఫీ, ఫ్రెడ్రిక్స్ అటాక్సియా తదితర ఎన్నో జన్యు వ్యాధులతో ప్రజలు బాధపడుతున్నారు. జన్యువ్యాధులు ఉన్నవారిని గుర్తించేందుకు కొన్ని సామాన్య లక్షణాలు ఉంటాయి. ఉదాహరణకు దృష్టి, వినికిడి, గుండె, గర్భకోశ, నాడీ సమస్యలు, కండరాల బలహీనత, మానసిక ఎదుగుదల సమస్యలున్న వారిలో కొందరు జన్యుపరమైన వ్యాధికి గురై ఉండవచ్చు. ప్రతి 5 వేల మందిలో ఒకరికి జన్యుపరమైన వ్యాధి ఉండే అవకాశముందని అంచనా. పసిపిల్లల నుంచి యుక్తవయసు వారిలో ఇవి కనిపించే అవకాశం ఉంటుంది.
5 వేల మంది రోగులను పరీక్షిస్తాం
దేశంలో అరుదైన జన్యువ్యాధుల గుర్తింపు, అధ్యయనానికి ప్రాజెడ్ కార్యక్రమం చాలా కీలకం. హైదరాబాద్‌లోని నిమ్స్‌తో కలిసి మేము దీన్ని చేపట్టాం. ఇంకో మూడేళ్లపాటు నడిచే ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం ఐదు వేల మంది జన్యు వ్యాధిగ్రస్తులను గుర్తించి అధ్యయనం చేయాలని నిర్ణయించాం. – ‘సాక్షి’తో సీడీఎఫ్‌డీ డైరెక్టర్ ప్రొ. ఉల్లాస్ కొల్తూర్
తెలుసుకోవాల్సింది చాలా ఉంది
మానవ కణాల్లో సుమారు 19 వేల జన్యువులు ఉంటాయి. వీటిల్లో ఏడు వేల జన్యువుల్లో తేడాలొస్తే వచ్చే వ్యాధుల గురించి మాత్రమే మనకు తెలుసు. మిగిలిన 12 వేల జన్యువులకు సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. అందుకే ఈ అరుదైన జన్యువ్యాధుల గుర్తింపునకు ప్రాధాన్యం ఏర్పడింది – డాక్టర్ అశ్వన్ దలాల్, శాస్త్రవేత్త
Comments
Please login to add a commentAdd a comment