బోస్టన్: ఫొటోను అందంగా ఎడిట్ చేసుకుని నిజ జీవితంలోనూ తమకు ఇలాంటి ముఖమే వచ్చేట్లు ప్లాస్టిక్ సర్జరీ చేయాలని వైద్యులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇటీవల ప్లాస్టిక్ సర్జన్లను కలిసిన వారిలో సెల్ఫీల్లో అందంగా వచ్చేలా తమ ముఖాన్ని తీర్చిదిద్దమని కోరిన వారే 55 శాతమట! ఏ లోపం లేకుండా సెలబ్రిటీల్లా సోషల్‌మీడియాలో కనపడాలనే తపనను ‘స్నాప్‌డైమోఫియా’అనే రుగ్మతగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా స్నాప్‌చాట్, ఫేస్‌ట్యూన్ యాప్‌ల వంటి సోషల్‌మీడియా ఫొటో ఎడిటింగ్ టెక్నిక్స్ మనుషులపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది.
బోస్టన్ వర్సిటీ పరిశోధకులు చేపట్టిన ఈ అధ్యయనం వివరాలు జమా ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఎడిటింగ్ టెక్నిక్స్ వల్ల అందంపై దృక్పథం మారిందని, దీంతో ఆత్మగౌరవం దెబ్బ తినడంతో పాటు శారీరక రుగ్మతలకు దారి తీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ‘అందంగా కనపడాలనే తపనతో చర్మవ్యాధులు, ప్లాస్టిక్ సర్జరీ నిపుణులను కలవడం ఒక రుగ్మత, వీరి మనసు నిండా అందం గురించిన ఆలోచనలే ఉంటాయి’ అని పరిశోధనలో పాల్గొన్న నీలమ్ వశీ పేర్కొన్నారు. సర్జరీతో అందం రాదని, సర్జరీ దీనికి ఎంత మాత్రం పరిష్కారం కాదన్నారు. సహజమైన అందాన్ని ప్రేమించగలిగేలా వీరికి మానసిక చికిత్స అవసరమని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment