చండీగఢ్‌కు చెందిన 23 సంవత్సరాల దేవిక మన్‌చందానీ ఇప్పుడు న్యూయార్క్‌లోని ప్రముఖ చెఫ్‌లలో ఒకరు. వంటలకు సంబంధించిన ఎన్నో పోటీల్లో బహుమతులు గెలుచుకుంది. పేస్ట్రీ చెఫ్‌గా రకరకాల ప్రయోగాలు చేస్తూ తనదైన ప్రత్యేకత చాటుకుంటోంది.
చిన్నప్పటి నుంచి దేవికకు వంటలన్నా, కొత్త వంటకాల గురించి తెలుసుకోవడం అన్నా చాలా ఇష్టం. ఆ ఇష్టమే తనని చండీగఢ్ వీధుల నుంచి న్యూయార్క్‌లోని ప్రసిద్ధ రెస్టారెంట్‌ల వరకు తీసుకెళ్లింది. ఆమె కుటుంబంలో, బంధువులలో పాకశాస్త్ర ప్రవీణులు ఎంతో మంది ఉన్నారు. వారి దగ్గరి నుంచి ఎన్నో కుటుంబ వంటకాలను నేర్చుకుంది.
వంటలపై దేవిక ఇష్టం ఎక్కడిదాకా వెళ్లిందంటే న్యూయార్క్‌లోని కలినరీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అమెరికా(సిఐఎ)లో చదివే వరకు. పాకశాస్త్ర పరిధిని విస్తరించుకోవడానికి,ప్రావీణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ చదువు దేవికకు ఉపయోగపడింది.
‘సిఐఎ’లో అకడమిక్ ఎక్స్‌లెన్స్ అవార్డ్ నుంచి నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఇచ్చే అవార్డ్ వరకు ఎన్నో అవార్డ్‌లు అందుకుంది దేవిక.
‘స్కిల్స్ యూఎస్‌ఏ బేకింగ్ అండ్ పేస్ట్రీ ఆర్ట్స్’ పోటీల్లో పాల్గొనడం దేవిక కేరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఆ పోటీలో పాల్గొన్న ఏకైక భారతీయురాలిగా గుర్తింపు పొందింది. అంతేకాదు, ఆ పోటీలో బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఈ విజయం తనని రెండు అడుగులు ముందుకు వేసేలా చేసింది. ప్రసిద్ధ ‘గాబ్రియెల్’ రెస్టారెంట్‌కు సంబంధించి ముఖ్యమైన ఈవెంట్స్‌కు నాయకత్వం వహించేలా చేసింది.
ఆ రెస్టారెంట్‌లో ఎప్పటికప్పుడూ కొత్త కొత్త సవాళ్లు ఎదురయ్యేవి. క్రైసిస్ మేనేజ్‌మెంట్ గురించి బాగా తెలిసిన దేవిక ఆ సవాళ్లను అధిగమించింది.
ఒక విజేతగా సిఐఏ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగం చేసే అవకాశం దేవికకు వచ్చింది. ‘పాత్ వేస్ టు ఎక్స్‌లెన్స్’ అంశంపై స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేసింది. ‘ఎగ్జయిట్‌మెంట్‌కు ఎనర్జీ తోడైతే ఎంత విజయాన్ని అయినా సాధించవచ్చు’ అంటుంది దేవిక.
‘స్కిల్స్ యూఎస్‌ఎ’ రాష్ట్ర స్థాయి పోటీలకు న్యాయనిర్దేత పాత్ర పోషించిన దేవిక ‘బేకింగ్ అండ్ పేస్ట్రీ ఆర్ట్స్’కు సంబంధించిన పోటీకి పోటీ పడుతున్న తరువాతి తరం విద్యార్థులకు మార్గనిర్దేశం చేసింది.
పేస్ట్రీ చెఫ్ కావాలనే కలతో చండీగఢ్ నుంచి అమెరికాకు వెళ్లిన దేవిక తన కలను నెరవేర్చుకోవడమే కాదు చిన్న వయసులోనే ప్రముఖ ‘పేస్ట్రీ చెఫ్’గా పెద్ద పేరు తెచ్చుకుంది.
సూపర్ స్పీకర్..
దేవిక మన్‌చందానీ చెఫ్ మాత్రమే కాదు స్ఫూర్తిదాయక వక్త కూడా. ఆమె వంటలతో పాటు ఉపన్యాసాలకు కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. పనిచేస్తున్న క్రమంలోనే క్రైసిస్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన సూత్రాలు పట్టుబడతాయని చెబుతుంది దేవిక. చదువుల కోసం వేరే దేశం వెళ్లే విద్యార్థులకు రకరకాల సవాళ్లు ఎదురవుతుంటాయి.
తాను అమెరికాకు వచ్చినప్పుడు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి, వాటిని అధిగమించిన తీరును విద్యార్థులకు చెబుతుంటుంది దేవిక. ‘ఎంతో కొంత నేర్చుకున్నాను అనే తృప్తి కంటే ‘ఇంకా ఎంతైనా నేర్చుకుంటాను’ అనే దాహం విజయానికి దారి చూపుతుంది అంటుంది దేవిక. ‘లక్ష్యం మీద అయోమయం కాదు స్పష్టత ఉండాలి’ అంటున్న దేవిక ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తుంది.
ఇవి చదవండి: Summer Season: ఈ సమ్మర్ సెలవుల్లో.. పిల్లలు ఫోన్‌కి దూరంగా ఉండాలంటే?
Comments
Please login to add a commentAdd a comment