Kalaiyarasi: తను ఒక ‘రైజింగ్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌’.. | Kalaiyarasi: Ratai Startup Portable DIY Handloom Woman Success Story | Sakshi
Sakshi News home page

Kalaiyarasi: తను ఒక ‘రైజింగ్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌’..

Published Fri, Apr 26 2024 11:41 AM | Last Updated on Fri, Apr 26 2024 11:51 AM

Kalaiyarasi: Ratai Startup Portable DIY Handloom Woman Success Story - Sakshi

బాధ పడి ఆ బాధను కాలగమనంలో మరచిపోయేవారు కొందరు. బాధ పడి ఆ బాధలో నుంచి కొత్త అడుగు వేసేవారు కొందరు. కలైయారసి రెండో కోవకు చెందిన మహిళ. నేతకార్మికుల బంగారు కాలాన్ని కళ్లతో చూసిన కలైయారసి అవే కళ్లతో వారి కష్టాలను చూసింది. ఆ బాధలో నుంచి ‘రాటై’ స్టార్టప్‌కు స్వీకారం చుట్టింది. సంప్రదాయ నేతకళకు డిఐవై(డూ ఇట్‌ యువర్‌ సెల్ఫ్‌) కిట్స్‌ ద్వారా కొత్త వెలుగు తెస్తోంది తమిళనాడుకు చెందిన కలైయారసి రామచంద్రన్‌. పిల్లలు, పెద్దలు ఉపయోగించేలా ఈ కిట్‌ను డిజైన్‌ చేశారు. సంప్రదాయ కళకు విస్తృతప్రాచుర్యం కల్పిస్తున్న కలైయారసి గురించి...

కొన్ని సంవత్సరాల క్రితం..
‘చదువుకోవాలని ఉంది’ అని తన మనసులోని మాటను భర్తకు చెప్పింది కలైయారసి. పెళ్లికి ముందు పై చదువులు చదువుకోడానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డుగోడలుగా నిలిచాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల పై చదువులకు తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. కలైయారసి మనసులో మాట విన్న భర్త ‘తప్పకుండా’ అని ప్రోత్సహించాడు. అలా కలైయారసి ఎంసీఎ పూర్తి చేసింది. ఆ తరువాత ఒక ఐటీ కంపెనీలో డెవలపర్‌గా పని చేసింది.

ఈరోడ్‌(తమిళనాడు) జిల్లాలోని సాలంగపాలయం గ్రామానికి చెందిన కలైయారసి నేతకార్మికుల కుటుంబం నుంచి వచ్చింది. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసినా నేతకళపై ఆమెకు ఉన్న ప్రత్యేకాభిమానం మాత్రం దూరం కాలేదు. సెలవుల్లో సొంత ఊరుకు వచ్చిన కలైయారసి అక్కడ నేతకార్మికుల కష్టాలను ప్రత్యక్షంగా చూసింది. ఊళ్లో చేనేత మగ్గాల సంఖ్య 7,500 నుంచి 2,500కు పడిపోయింది.

కష్టాలలో ఉన్న నేతకార్మికులకు ఆసరాగా నిలవడానికి తన వంతుగా ఏదైనా చేయాలనుకుంది కలైయారసి. నేతకళ గురించి మరిన్ని వివరాలు తెలుసుకొని ‘రాటై హ్యాండ్లూమ్‌’ పేరుతో స్వగ్రామంలో ఎకో–ఫ్రెండ్లీ హ్యాండ్లూమ్‌ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టింది. పర్యావరణహిత కోణంలో ఆలోచించి ఆర్గానిక్‌ క్లాత్‌ వీవింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది.

‘నేతపని ద్వారా ఉపాధి పొంది సంతోషంగా ఉన్న కార్మికుల ఆర్థికపరిస్థితి ఆ తరువాత దిగజారిపోయింది. చాలామంది ఉపాధి వెదుక్కుంటూ పట్టణాల బాట పడ్టారు. డబుల్‌ షిఫ్ట్‌లలో పనిచేసేవాళ్లు. కొందరు వాచ్‌మెన్‌గా పని చేశారు. తల్లిదండ్రులు ఊళ్లో లేకపోవడంతో పిల్లల చదువు గాడి తప్పింది. తమిళనాడులో ఎన్నో గ్రామాలకు వెళ్లి నేతకార్మికులతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకున్నాను. ఈ పరిస్థితి నాకు బాధాకరంగా అనిపించింది’ అంటున్న కలైయారసి తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి నేతకళను స్వయంగా నేర్చుకుంది. సహజరంగులతో పాటు అరటి పీచు, జనపనార, ఇతర పదార్థాలతో తయారుచేసిన సేంద్రియ నూలును ‘రాటై’ ఉపయోగిస్తోంది. ప్రస్తుతం 28 కుటుంబాల వరకు ‘రాటై హ్యాండ్లూమ్‌’ కోసం పనిచేస్తున్నాయి.

సంప్రదాయ చేనేత వస్త్రాలకు ఊతం ఇచ్చేందుకు పోర్టబుల్‌ డిఐౖవై  హ్యాండ్లూమ్‌ కిట్‌ల ఆలోచనకు శ్రీకారం చుట్టింది కలైయారసి. ఎక్కడికంటే అక్కడికి చేతితో తీసుకెళ్లగలిగే ఈ మగ్గాలకు యూజర్‌ మాన్యువల్, క్యూ ఆర్‌ కోడ్‌ ఉంటుంది. దీని ద్వారా యూట్యూబ్‌ వీడియోల సహాయంతో పరికరాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవచ్చు. తమిళనాడులోని ఎన్నో స్కూల్స్‌లో పిల్లల దగ్గర పోర్టబుల్‌ లూమ్స్‌ కనిపిస్తున్నాయి. స్కూల్స్‌లో వీవింగ్‌ క్లబ్స్‌ ఏర్పాటు కావడం మరో విశేషం. మూడు ఆప్షన్‌లలో, మూడు స్థాయుల్లో అందుబాటులో ఉన్న వీటిని పెద్దలు, పిల్లలు ఉపయోగించవచ్చు.

‘రాటై’ స్టార్టప్‌ ‘రైజింగ్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డ్‌ గెలుచుకుంది. టాన్‌సీడ్‌ (తమిళనాడు స్టార్టప్‌ అండ్‌ ఇనోవేషన్‌ మిషన్‌) ద్వారా పది లక్షల గ్రాంట్‌ వచ్చింది.
‘నేతకార్మికులకు ఉపాధి కల్పించడమే కాదు ఈ తరానికి ఆ కళపై ఆసక్తి కలిగేలా, నేర్చుకునేలా చేయాలనేది నా లక్ష్యం’  అంటుంది కలైయారసి.

పిల్లల కోసం వర్క్‌షాప్‌..

‘రాటై’ ద్వారా నేత కార్మికులకు అండగా నిలిస్తూనే మరో వైపు నేతకళపై పిల్లలకు అవగాహన, ఆసక్తి కలిగించడానికి వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది కలైయారసి. పెద్దలకు ‘నేతపని’ని స్ట్రెస్‌–బస్టింగ్‌ ఎక్సర్‌సైజ్‌గా పరిచయం చేస్తోంది. ‘వీలైనన్ని ఎక్కువ స్కూల్స్‌కు వెళ్లి పిల్లలకు నేతకళ గురించి చె΄్పాలనుకుంటున్నాను. ఒక ఆర్ట్‌గా మన విద్యావిధానంలో నేతకళ భాగం కావాలని ఆశిస్తున్నాను’ అంటుంది కలైయారసి.

ఇవి చదవండి: Naima Khatoon: వందేళ్లకు ఆమె వచ్చింది..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement