వేసవి వస్తే ప్రయాణాలు గుర్తుకు వస్తాయి. విమానం ఎక్కితే మొబైల్ ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచాలి. కాని ఈ ప్రయాణాల వెనుక చాలా రాజకీయాలు ఉంటాయంటోంది షెహనాజ్ హబీబ్. అమెరికాలో ప్రొఫెసర్‌గా ఉన్న ఈ కేరళ వనిత స్థానిక సంపదను ‘డిస్కవరీ’ చేయడానికే సామ్రాజ్యవాదులు ప్రయాణాలు చేశారని చెబుతుంది. సగటు మనిషి ప్రయాణాలకు ఎన్ని అడ్డంకులున్నాయో ఆమె పుస్తకం ‘ఎయిర్‌ప్లేన్ మోడ్’ విశదంగా తెలియజేస్తోంది. ట్రావెల్ రైటర్ షెహనాజ్ పరిచయం.
‘ప్రయాణాల్లో కూడా వివక్ష ఉంటుంది’ అంటుంది షహనాజ్ హబీబ్. ‘మీ ఒంటి రంగు, మీ పాస్‌పోర్ట్ రంగు మీ ప్రయాణం సులభం చేయవచ్చో, జటిలం చేయవచ్చో నిర్ణయిస్తాయి’ అంటుందామె.
అమెరికాలోని బే పాత్ యూనివర్సిటీలోప్రొఫెసర్‌గా పని చేసే షహనాజ్ హబీబ్ కేరళలోని ఎర్నాకుళంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించింది. కాని ఆమె నేర్చిన ఇంగ్లిష్ భాష, ఆమె వ్యక్తీకరణ ఆమెకు విశేషమైన గుర్తింపు తెచ్చి పెట్టింది. అమెరికాలోని వ్యాసకర్తల్లో ఆమెకు గుర్తింపు ఉంది. న్యూయార్క్ టైమ్స్‌లో షహనాజ్ హబీబ్ వ్యాసాలు వస్తాయి.
కేరళ రచయిత బెన్యమిన్ రాసిన ఒక నవలను ‘జాస్మిన్ డేస్’ పేరున షహనాజ్ మలయాళంలో అనువదిస్తే ప్రతిష్టాత్మక 25 లక్షల రూపాయల జె.సి.బి. పురస్కారం లభించింది. కవిత్వం, కథలతో పాటు ట్రావెలోగ్స్ కూడా రాసే షహనాజ్ ఇటీవల వెలువరించిన యాత్రా కథనం ‘ఏరోప్లేన్ మోడ్’. అమెరికాలోనూ ఇండియాలోనూ విడుదలైన ఈ పుస్తకం యాత్రల విషయంలో కొత్త చూపును కలిగిస్తోంది.
‘ప్రపంచ దేశాల పర్యటనలు తెల్లవాళ్లకు ఒక రకంగానూ రంగు తక్కువ ఆసియా, ఆఫ్రికా దేశాల వారికి ఒక రకంగానూ జరుగుతాయి. అమెరికా, యూరప్ దేశాల వారి తెల్లరంగు చూడగానే వారి ప్రయాణాలకు ఒక విలువ, గౌరవం ఉన్నాయని భావిస్తారు. వారిని అధికారులు చూసే పద్ధతి వేరుగా ఉంటుంది. అదే బ్రౌన్, బ్లాక్ కలర్ ఉన్నవారికి అన్నీ ఆటంకాలే. ఇక అమెరికా పాస్‌పోర్ట్ ఉండి, వారు తెల్లవారైతే వారికి వీసా క్యూలన్నీ లేనట్టే. అమెరికా పాస్‌పోర్ట్ ఉంటే చాలా దేశాలకు అసలు వీసాయే అక్కర్లేదు. అంటే ఒక మనిషికి ప్రయాణ గౌరవం పాస్‌పోర్ట్ వల్లే వస్తోందన్న మాట. దీనినే నేను పాస్‌పోర్టిజమ్ అంటాను’ అంటుంది షహనాజ్.
సంస్కృతి, సంపదల కోసం..
‘17, 18 శతాబ్దాల్లో యాత్రీకులకు యూరప్ ప్రభుత్వాలు నిధులు ఇచ్చేవి. అలా ఇచ్చేది యాత్రికులను గౌరవించడానికి కాదు. వారు దేశ దేశాలు తిరిగి అక్కడి సంస్కృతులు, పంటలు, డబ్బు, బంగారం, వస్త్రాలు, మతాలు... వీటన్నింటి గురించి సమాచారం తెస్తే ఏ దేశాన్ని ఏ విధంగా కబళించవచ్చో ఆ ప్రభువులకు తెలిసేది. ఖండాలు, దేశాలు వాటిలోని ప్రజలు అనాదిగా జీవిస్తున్నా ఈ యూరోపియన్ యాత్రికులు వారిని ‘డిస్కవరీ’ చేశామని చరిత్రలు రాసుకున్నారు. కాని ఆ చరిత్రల్లో స్థానికులను ఏ విధంగా తుడిచి పెట్టారో ఉండదు.
అలాగే ఇప్పుడు బ్రిటన్, యూరప్, ఆస్ట్రేలియా, జపాన్‌ల నుంచి ప్రపంచం తిరిగే పర్యాటకులకు వారి దేశాల్లోని పాఠ్య పుస్తకాల్లో తమ దేశాలు ఏయే దేశాలను ఎలా ఆక్రమించాయి, ఎలా దోచుకున్నాయో తెలియజేయరు. యాత్రల వెనుక చాలా చరిత్ర ఉంటుంది. అది తెలుసుకోవడం అవసరం’ అంటుంది షహనాజ్.
ఎన్నో అందాలు..
‘టూరిజమ్‌ను ఒక వ్యసనంగా మార్చారు. దీని వెనుక చాలా వ్యాపార ఎత్తుగడ ఉంది. కొత్త ప్రాంతాలు చూడకపోతే వెనుకబడతారనే భావజాలం సృష్టించారు. మా నాన్న ఎక్కడికీ తిరగడానికి ఇష్టపడేవాడు కాదు. మా అమ్మకు కొత్త ప్రాంతాలు చూడటం ఇష్టం. ఇద్దరూ కరెక్టే. ఈ టూరిజమ్‌లో కూడా తెల్లవారి దేశాలకే గిరాకీ ఎక్కువ. కాని ఆఫ్రికాలో ఎన్నో అందమైన దేశాలు ఉన్నాయి. ఇథియోపియాలోని అండర్‌గ్రౌండ్ చర్చ్‌లను చూస్తే మతి పోతుంది. కాని వాళ్లకు ప్రమోట్ చేసుకోవడానికి డబ్బు లేదు. ప్రతి దేశంలో సాంస్కృతిక చిహ్నాలుంటాయి. వాటి ఘన చరిత్ర ఉంటుంది. అయితే దానిని వర్తమానంలో ప్రతీకారాలకు ఉపయోగించకూడదు’ అంటుందామె. – షెహనాజ్ హబీబ్
Comments
Please login to add a commentAdd a comment