ఆటలతో ఆరోగ్య విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న అర్చన సిన్హా
పిల్లలు, ఆటలు, పాటలు ఒకే కుటుంబం. ఆటపాటలంటే పిల్లలకు బోలెడు ఇష్టం. ఆ ఇష్టాన్ని దృష్టిలో పెట్టుకొని పోషకాహారం నుంచి పరిసరాల పరిశుభ్రత వరకు ఎన్నో కాన్సెప్ట్‌లను ఆటల రూపంలో డిజైన్ చేసిన బెంగళూరుకు చెందిన నరిషింగ్ స్కూల్స్ ఫౌండేషన్(ఎన్‌ఎస్‌ఎఫ్) వారి కృషి వృథా పోలేదు. స్కూల్ గార్డెన్ నుంచి గ్రూప్ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొనడం వరకు పిల్లల్లో ఎంతో సానుకూల మార్పు కనిపిస్తోంది..
ప్రభుత్వ పాఠశాలలకు వెళుతూ పిల్లల వయసు, ఎత్తు, బరువు.. మొదలైన విషయాల ఆధారంగా బేస్‌లైన్ సర్వేలు నిర్వహిస్తోంది ఎన్‌ఎస్‌ఎఫ్ ఫౌండేషన్. సర్వే ఫలితాల గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలియజేయడమే కాదు తగిన సూచనలు కూడా ఇస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సమస్యలను అర్థం చేసుకోవడానికి ఈ సర్వే ఫలితాలు ఉపయోగపడుతున్నాయి.
‘పారిశుధ్య ప్రాముఖ్యత, సరైన పౌష్టికాహారం గురించి పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా టూల్ కిట్ ఆధారిత విధానానికి రూపకల్పన చేశాము. వారికి తగిన పరిజ్ఞానాన్ని అందించి ఆలోచనాపరులుగా మార్చడమే మా లక్ష్యం’ అంటుంది ఎన్‌ఎస్‌ఎఫ్ కో–ఫౌండర్, సీయివో అర్చన సిన్హా.
పోషకాహారం, పారిశుధ్యంతో పాటు నవీన వ్యవసాయ పద్ధతుల గురించి పిల్లలకు అవగాహన పరిచే పదిహేను గేమ్స్‌తో కూడిన టూల్‌కిట్‌లను ఎన్‌ఎస్‌ఎఫ్ ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాలలకు అందిస్తోంది. పోషకాహార లోపాల లక్షణాలను గుర్తించడానికి ఈ టూల్‌కిట్‌లలోని ఎనిమీ కార్డ్, అలాగే... ఈ లోపాలను పరిష్కరించడానికి సహాయపడే ఆహార వనరుల గురించి తెలుసుకోవడానికి ఫ్రెండ్ కార్డు పిల్లలకు ఉపయోగపడుతుంది.
వైకుంఠపాళిలోని పాములు, నిచ్చెనలతో కూడా పిల్లలు ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండేవారి సత్‌ప్రవర్తనకు బహుమతులు, జంక్ ఫుడ్‌ను అమితంగా ఇష్టపడేవారికి ఈ ఆటలో శిక్షలు (పాముకాటు)లు ఉంటాయి. సబ్బు వాడకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడానికి ఆకట్టుకునే కాన్సెప్ట్‌కు రూపకల్పన చేశారు.
టూల్‌కిట్స్ యాక్టివిటీల ద్వారా పిల్లలు స్కూల్ గార్డెన్‌లను పెంచుతున్నారు. వారికి ఇచ్చిన గైడ్‌బుక్‌లో వెజిటేబుల్ క్యాలెండర్, మొక్కల పెంపకానికి సంబంధించి స్టెప్–బై–స్టెప్ ఇన్‌ఫర్‌మేషన్ ఉంటుంది. టూల్‌కిట్‌లు పిల్లలపై ఏ మేరకు ప్రభావం చూపాయి... అనే విషయంలో ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తుంటుంది ఫౌండేషన్.
‘పిల్లల ఆహారపుటలవాట్లపై టూల్‌కిట్స్ సానుకూల ప్రభావం చూపించడమే కాదు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. గ్రూప్ యాక్టివిటీలలో చురుగ్గా పాల్గొనేలా చేస్తున్నాయి’ అంటుంది ఒకిత ఎం అనే గృహిణి.
‘ప్రభుత్వ పాఠశాలలతో పోల్చితే ప్రైవేట్ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగ్గా ఉండవచ్చు. అయితే ఊబకాయంలాంటి సమస్యలు ఉన్నాయి’ అంటుంది అర్చన సిన్హా. త్వరలో ప్రైవేట్ స్కూల్స్‌లోకూడా ఆన్‌లైన్ మాడ్యుల్ అందుబాటులోకి తీసుకు రానున్నారు.
‘ఎన్‌ఎస్‌ఎఫ్’ దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రభుత్వ పాఠశాలల్లో యాక్టివిటీ ్రపోగ్రామ్స్ నిర్వహించింది. వేలాదిమంది విద్యార్థులపై ఇవి సానుకూల ప్రభావం చూపుతున్నాయి.
అలా వచ్చిన ఆలోచనే.. ఎన్‌ఎస్‌ఎఫ్..
జర్నలిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టిన అర్చన సిన్హా ఆ తరువాత మేనేజ్‌మెంట్ అండ్ కన్సల్టింగ్‌లోకి వచ్చింది. సామాజికసేవా కార్యక్రమాలు అంటే మొదటి నుంచి ఇష్టం ఉన్న అర్చన ‘అశోక ఇన్నోవేటర్స్ ఫర్ ది పబ్లిక్’ అనే స్వచ్ఛంద సంస్థలో పనిచేసింది.
ఒడిషాలోని గ్రామాలకు వెళ్లినప్పుడు అక్కడి మహిళలతో పౌష్టికాహారం గురించి మాట్లాడింది. అరుదుగా మాత్రమే వారు పౌష్టికాహారం గురించి పట్టించుకుంటున్నారు. పౌష్టికాహారం, పారిశుధ్యం గురించి వారికి అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించిన అర్చన ‘నరిషింగ్ స్కూల్స్ ఫౌండేషన్’కు శ్రీకారం చుట్టింది.
ఇవి చదవండి: Priya Chhetri - 'ప్రియ'మైన విజయం
Comments
Please login to add a commentAdd a comment