ఇంటి పనులతోనే రోజంతా గడిచిపోతుంటుంది. అభిరుచిని మెరుగుపరుచుకోవాలన్నా సమయమే సరిపోదనిపిస్తుంది. కానీ, కొందరు మాత్రమే ఉన్న కాస్త సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమతోపాటు మరికొందరికి ఉపాధి అవకాశాలను అందిస్తుంటారు. ఈ కోవకే చెందుతారు సవిత ఆలంపల్లి. తెలంగాణలోని జహీరాబాద్ వాసి అయిన సవిత కాటన్ ఫ్యాబ్రిక్‌పైన సహజసిద్ధమైన పువ్వులు, ఆకులతో సహజమైన ప్రింట్లను తీసుకువస్తుంది. అదే ఫ్యాబ్రిక్‌ని ఉపయోగిస్తూ మోడ్రన్ డ్రెస్సులను డిజైన్ చేస్తోంది. వర్క్‌షాప్స్ నిర్వహిస్తూ, బెంగళూరులో స్టూడియో ఏర్పాటు చేసి, సెల్ఫ్ మేడ్ బిజినెస్ ఉమన్‌గా తనని తాను నిరూపించుకుంటుంది. ఆసక్తిని ఉపాధిగా మలుచుకునేందుకు చేసిన ప్రయాణంలో తాను వేసిన అడుగుల గురించి ఆనందంగా వివరించింది.
‘‘డిగ్రీ వరకు చదువుకున్న నేను పెళ్లయ్యాక మావారు రామకృష్ణతో కలిసి అమెరికాకు వెళ్లాను. గృహిణిగానే కొన్నాళ్లు ఉండిపోయాను. న్యూయార్క్ ఎఫ్‌ఐటిలో ఫ్యాషన్ డిజైనింగ్‌కి సంబంధించిన కోర్స్ చేశాను. పదేళ్ల క్రితం ఇండియా వచ్చి బెంగళూరులో స్థిరపడ్డాం. రోజంతా ఇంటిపనులు, పిల్లల పనులు ఉన్నా నా కోసం కొంత సమయాన్ని కేటాయించుకునేదాన్ని.
ఫాస్ట్ ఫ్యాషన్‌లో ఉపయోగించే ఫ్యాబ్రిక్ తీవ్రమైన కాలుష్యానికి గురి చేస్తుందని తెలుసుకున్నాను. అప్పటినుంచి నా వంతుగా ఏదైనా చేయాలనుకుని ప్రయత్నాలు చేస్తుండేదాన్ని. ఫ్లోర్ క్లీనర్స్, సుగంధ ద్రవ్యాలు వంటివి ఇంట్లో తయారు చేస్తుండేదాన్ని. వాటివల్ల ఇంట్లో వాళ్లు కూడా చాలా మెచ్చుకునేవారు. ఎకో ప్రింటింగ్, సస్టెయిన్‌బుల్ ఫ్యాబ్రిక్స్ పైన వర్క్ చేయడం మొదలుపెట్టాను. ప్రకృతి ద్వారా లభించే వస్తువులతో రోజూ ఏదో ఒక ప్రయోగం చేస్తుండేదాన్ని.
ఆకులు – పువ్వులు..
పూజలు, ఇతర సంప్రదాయ వేడుకలలో పువ్వులు, ఆకులను కూడా ఉపయోగిస్తుంటాం. సాధారణంగా వాటిని ఉడకబెట్టి, టై అండ్ డై చేస్తుంటారు. నేను వాటిని ఎండబెట్టి, కొన్నింటిని తాజాగా ఉన్నప్పుడే ఫ్యాబ్రిక్ మీద చల్లి, దగ్గరగా చుట్టి, కొన్ని రోజులు అలాగే ఉంచి ప్రయోగాలు చేసేదాన్ని. ప్రయత్నాలు చేయగా చేయగా ఫ్యాబ్రిక్‌పైన రకరకాల డిజైన్స్ అమితంగా నన్ను ఆకట్టుకున్నాయి. మోదుగ, శంఖపుష్ప, పారిజాత.. వంటివే కాదు అరుదుగా పూసే పువ్వులనూ సేకరిస్తాను. వాటిని ఎండబెట్టి నిల్వ ఉంచుతాను. మామిడి, జామ, మందార ఆకులనూ డిజైన్‌కు వాడుతుంటాను. ఏ మాత్రం రసాయనాలు లేని ప్రయోగం ఇది.
ఇంటి నుంచి స్టూడియో వరకు..
రసాయనాలతో పండించే పత్తి కాకుండా వర్షాధార పంటద్వారా వచ్చే కాటన్ ఫ్యాబ్రిక్‌ను కలెక్ట్ చేసి, నా ప్రయత్నాలను ఇంకా విరివిగా చేయడం మొదలుపెట్టాను. సస్టెయిన్‌బుల్ డ్రెస్సులు అంటే చాలావరకు వదులుగా ఉండే దుస్తులు అనుకుంటారు. కానీ, మంచి ఫిటింగ్, డిజైన్, ప్రింట్లతో ఈ తరం మెచ్చేలా డ్రెస్ డిజైనింగ్ చేయాలనుకున్నాను.
కార్పొరేట్ ఉమెన్‌కు నప్పే విధంగా, అలాగే టీనేజ్ కలెక్షన్స్ కూడా ప్రిపేర్ చేస్తుంటాను. ఎకో ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్, ప్రింటింగ్.. డ్రెస్సులు ధరిస్తే ఒంటికి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. ప్రకృతికి దగ్గరగా ఉన్నామన్న అనుభూతి సొంతం అవుతుంది. ఏడెనిమిదేళ్లుగా సస్టెయినబిలిటీ మీద రకరకాల ప్రయోగాలు చేసి, ఐదేళ్ల క్రితం ‘టింక్టోరియా’ పేరుతో బెంగళూరులో స్టూడియో ఏర్పాటు చేశాను. ఆకులలో ఉండే జీవాన్ని టింక్టోరియా అంటారు.
దానిని ఫ్యాబ్రిక్ మీదకు తీసుకురావాలని చేసిన ప్రయత్నం కాబట్టి అదే పేరును నా డిజైన్స్‌కు పెట్టాను. ఇంటినుంచి స్టూడియోదాకా మారేందుకు చేసిన రకరకాల ప్రయోగాల వల్ల ఇప్పుడు నాతోపాటు మరో ఐదుగురు మహిళలకు ఉపాధి అవకాశాలు లభించాయి. మేమంతా కలిసి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌కు వచ్చిన ఆర్డర్స్ ప్రకారం పని చేస్తుంటాం.
అవగాహనకు వర్క్‌షాప్స్..
ఎకోప్రింటింగ్ పట్ల ప్రజలలో అవగాహన కల్పించడానికి హైదరాబాద్, బెంగళూరు ఇతర క్రాఫ్ట్ ఎగ్జిబిషన్స్‌లలో ఉచితంగా వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నాను. స్టాల్స్ ఏర్పాటు చేస్తుంటాను. అక్కడి వచ్చి, ఆసక్తితో నేర్చుకుంటాను అనేవారు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి ప్రింటింగ్ ్రపాసెస్ అడుగుతుంటారు. చాలా మందికి ఆకులతోనూ, పువ్వులతోనూ డిజైన్ చేస్తారని తెలియదు. ఈ డిజైన్ ఉతికితే పోతుందేమో అనుకుంటారు. కానీ, సరైన విధంగా చేస్తే రంగు ఏ మాత్రం పోదు.
ముందు కుంకుడుకాయ రసంతో ఫ్యాబ్రిక్‌ను శుభ్రం చేస్తాం. ఆ తర్వాత ఆకులను, పువ్వులను అనుకున్న డిజైన్స్‌లో అమర్చి, దగ్గరగా చుట్టి, ఆవిరిమీద ఉంచుతాం. ఆ తర్వాత బయటకు తీసి, ఒకరోజంతా అలాగే ఉంచుతాం. ఆ తర్వాత పూర్తిగా విప్పి, క్లాత్‌ని శుభ్రం చేస్తాం. సరైన డిజైన్ రావడానికి 3 నుంచి 4 రోజుల సమయం పడుతుంది. షిబోరి, టై అండ్ డై, కలంకారీ డిజైన్స్‌తోపాటు నేతకారులతో ముందే మాట్లాడి ఫ్యాబ్రిక్ డిజైన్‌లో మోటిఫ్ ప్రింట్స్ వచ్చేలా గైడెన్స్ ఇస్తుంటాను.
కొన్ని రకాల ఆకులు, పువ్వుల ప్రింటింగ్‌లో థ్రెడ్ వర్క్ కూడా ఉంటుంది. ప్రకృతిపైన ప్రేమ, ఇష్టంతో నన్ను నేను కొత్తగా మార్చుకునే క్రమంలో ఎంచుకున్న మార్గం ఇది. ఇంట్లో వాడాల్సిన కెమికల్స్ స్థానంలో ఏ మాత్రం రసాయనాలు లేని వస్తువులను తయారు చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటాను. ఈ విధానం వల్ల ఐదారేళ్లలో నాదైన ఓ కొత్త ప్రపంచాన్ని నిర్మించుకున్నాను అనిపిస్తుంది’ అని ఆనందంగా వివరిస్తారు సవిత. – నిర్మలారెడ్డి
ఇవి చదవండి: Devika Manchandani: పాకశాస్త్ర ప్రవీణ! వంటలపై ఇష్టం ఎక్కడిదాకా వెళ్లిందంటే?
Comments
Please login to add a commentAdd a comment