చెన్నైకి చెందిన చరణ్య కుమార్‌కు గేమింగ్ అంటే ఎంతో ఇష్టమో, పురాణాలు అంటే కూడా అంతే ఇష్టం. అందుకే పురాణాలలోని ఆసక్తికర అంశాలను, స్ఫూర్తిదాయకమైన విషయాలను గేమింగ్‌లోకి తీసుకువచ్చింది చరణ్య కుమార్. ఆమెప్రారంభించిన ‘చిత్తం’ గేమింగ్ కంపెనీ విజయపథంలో దూసుకుపోతోంది...
యూఎస్‌లో ఇంజినీరింగ్ చేసిన చరణ్య కుమార్ ఎన్నో పెద్ద కంపెనీలలో కన్సల్టింగ్ విభాగంలో పనిచేసింది. కొన్ని సంవత్సరాల క్రితం వ్యక్తిగత జీవితంలో ఏర్పడిన సమస్యల వల్ల పురాణాలకు దగ్గరైంది. వాటిని చదవడం తనకు ఎంతో సాంత్వనగా ఉండేది. అమ్మమ్మ ద్వారా పురాణాలలోని గొప్పదనం గురించి చిన్న వయసులోనే విన్నది కుమార్.
‘జీవితంలో ప్రతి సమస్యకు పురాణాల్లో సమాధానం దొరుకుతుంది’ అంటుంది కుమార్. ఉద్యోగం నుంచి బ్రేక్ తీసుకున్న కుమార్ ఆ తరువాత ఎంబీఏ చేసింది. ‘పురాణాలు ఆధ్యాత్మికతకు మాత్రమే పరిమితమైనవి కాదు. పౌరాణిక విషయాలు నిత్యజీవితంలో ఎన్నో రకాలుగా దారి చూపుతాయి. కష్టకాలంలో పురాణ పఠనం నాకు ధైర్యాన్ని ఇవ్వడమే కాదు సొంతంగా ఏదైనాప్రారంభించాలనే పట్టుదలను కూడా ఇచ్చింది. కానీ ఏం చేయాలో ఎలా చేయాలో తెలియదు. నేను ధైర్యంగా వేసిన మొదటి అడుగు ఎంబీఏ చేయడం’ అంటున్న కుమార్ గేమింగ్ కంపెనీ ‘చిత్తం’ రూపంలో తన కలను నెరవేర్చుకుంది.
తక్కువప్రాడక్ట్‌లతో మొదలైన ‘చిత్తం’ మొదటి సంవత్సరంలోనే పదమూడుప్రాడక్ట్స్‌కు చేరుకుంది. ‘ఫన్’ ఎలిమెంట్స్‌ను జత చేస్తూ ‘చిత్తం’ రూపొందించిన గేమ్స్, యాక్టివిటీస్, బుక్స్ సూపర్ హిట్ అయ్యాయి. తమిళ సామెతలను దృష్టిలో పెట్టుకొని ‘పార్టీ టాక్స్’ అనే గేమ్‌ను డిజైన్ చేశారు. ‘భరత విలాస్’ అనేది చిత్తం బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ఈ కార్డ్ గేమ్ మన సంస్కృతిలోని రకరకాల నృత్యరూపాలు, వంటల రుచులు... మొదలైన వాటిని వెలికితీస్తుంది.
‘సింపుల్ గేమ్ ప్లే–సింపుల్ కంటెంట్ అనే రూల్‌ని నమ్ముకొని ప్రయాణంప్రారంభించాం. మా నమ్మకం వృథా పోలేదు’ అంటుంది చరణ్య. వ్యాపార అనుభవం లేకపోవడం వల్ల మొదట్లో ఫండింగ్ విషయంలో కాస్తో కూస్తో ఇబ్బంది పడినా ఆ తరువాత మాత్రం తనదైన ప్రత్యేకతతో ఇన్వెస్టర్‌లను ఆకర్షించి విజయపథంలో దూసుకుపోతోంది ‘చిత్తం’.
ఇవి చదవండి: కాన్స్‌లో ఆ ముగ్గురు
Comments
Please login to add a commentAdd a comment