Rashi Agarwal: నా కళ..
ఒక ఠావు పేపర్ తయారు కావాలంటే పది లీటర్ల నీళ్లు కావాల్సి వస్తుంది. రాసుకోవడానికి ఒక రీము పేపర్ సిద్ధం అవ్వాలంటే పాతికేళ్లు పెరిగిన చెట్టు కొమ్మలను సమూలంగా నరకాలి. చెట్టును నరక్కుండా, నీటిని వృథా చేయకుండా ఒక డైరీ తయారయితే? అంతకంటే ఇంకేం కావాలి? ఇంతే కాదు, టెక్స్‌టైల్ ఇండస్ట్రీ వృథాను హరాయించుకోవడానికి భూమాత పడే యాతన కూడా తగ్గిపోతుంది. ఇలాంటి వినూత్న ప్రయత్నానికి తెర తీసింది సూరత్‌లో ఓ ఆర్కిటెక్ట్. స్టేషనరీ వస్తువులు, ఇంటీరియర్ డెకరేషన్‌ని కలగలుపుతూ చేసిన ప్రయోగమే రుహానీ రంగ్. ఆ ప్రయోగం వెనుక దాగిన నేపథ్యాన్ని వివరించింది రాశి అగర్వాల్. ఆమె మదిలో వెలిగిన ఈ ఆలోచన తొమ్మిది వేల కిలోల పత్తికి పుస్తక రూపాన్నిచ్చింది.
మనదేశంలో కళ ఉంది!
‘‘నేను ఆర్కిటెక్చర్ ఫైనలియర్‌లో ఉన్నప్పుడు మన సంప్రదాయ నిర్మాణాలు, కళలు, చేతివృత్తుల అధ్యయనం కోసం విస్తృతంగా పర్యటించాను. ఢిల్లీ నుంచి జైపూర్, అహ్మదాబాద్, కచ్, పాండిచ్చేరి నుంచి పూనా వరకు పరిశీలిస్తే మనదేశంలో రకరకాల కళలు, కళా నైపుణ్యాలున్న పని వాళ్లున్నారని తెలిసింది. వాళ్ల చేతుల్లో ఉన్న ప్రతిభను ప్రదర్శించే వేదికలు తగినంతగా లేవు.
అలాంటి ఒక వేదికను ఏర్పాటు చేసి, నా వృత్తిలో ఇంటీరియర్ డిజైనింగ్‌కు దోహదం చేసే విధంగా ఒక ప్రయోగం చేశాను. అది విజయవంతమైంది. రకరకాల కళలను ఒక వేదిక మీదకు తీసుకురావాలనే ఉద్దేశంతో ‘రుహానీ రంగ్’ పేరుతో ఆర్ట్ స్టార్టప్ మొదలు పెట్టాను. ప్లానర్ బుక్ కవర్ పేజీ మీద మధుబని ఆర్ట్ ఉంటే ఇంట్లో అందమైన షో పీస్ ఉన్నట్లే. ప్లానర్ బుక్‌ని కార్నర్ స్టాండ్‌లో అందంగా అమరిస్తే డ్రాయింగ్ రూమ్ కళాత్మకంగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో హస్త కళలను పునరుద్ధరించగలుగుతున్నాను.
రుహానీ రంగ్‌ను ఐదు వేల రూపాయలతో మొదలు పెట్టాను. నాతో కలిసి 50 మంది కళాకారులు, 40 మంది ఇతర ఉద్యోగులు పని చేస్తున్నారు. వస్త్రాలను తయారు చేసే భారీ పరిశ్రమలకు పెద్ద సంఖ్యలో పత్తి బేళ్లు వస్తుంటాయి. ప్రతి బేలు లోనూ మెషీన్‌లో అమరికకు తగినట్లు ఉపయోగించగా మిగిలిన పత్తి వృథా అవుతూ ఉంటుంది.
అది భూమిలో కలిసి పోవాల్సిందే తప్ప మరో పనికి ఉపయోగించేవారు కాదు. ఎందుకూ పనికి రాదని వదిలేస్తున్న ఆ పత్తే నా కుటీర పరిశ్రమకు ముడిసరుకు. నాకు కోవిడ్ సమయం కూడా మంచే చేసింది. ఆ టైమ్‌లో పెద్ద చిన్న పరిశ్రమలన్నీ మూత పడ్డాయి. హస్తకళాకారులు పని లేక ఆర్థికంగా మానసికంగా దెబ్బతిని ఉన్నారు. ఆ సమయంలో నేను ఒక్కొక్కరిని కలిసి నా ఆలోచన చెప్తుంటే వాళ్లు ఉత్సాహంగా నాకు మరికొన్ని ఐడియాలు చెప్తూ తమ అనుభవాన్ని జోడించారు.
అలా 2020లో మొదలు పెట్టిన నా కుటీర పరిశ్రమ ఇంత వరకు హ్యాండ్ మేడ్ పేపర్‌తో ప్లానర్స్, క్యాలెండర్‌లు, నోట్‌బుక్స్, జర్నల్స్, స్కెచ్ బుక్స్ వంటి 15 వేల ఉత్పత్తులకు రూపమిచ్చింది. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే నలభై వేల ఫాలోవర్స్‌ను తెచ్చి పెట్టింది. ఆర్ట్ పీస్ కేవలం కళాభిరుచి, కళారాధన కోసమే కాదు. అది మన దైనందిన జీవితంలో భాగంగా మారాలి. అప్పుడే కళ ఎప్పటికీ నిలిచి ఉంటుంది’’ అని వివరించింది రాశి అగర్వాల్.
ఇవి చదవండి: పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
Comments
Please login to add a commentAdd a comment