ఎగుమతుల్లో దూసుకుపోతున్న భారత్‌! | India export witnessed healthy gains in different sectors like petroleum, gemstones, agrochemicals and sugar | Sakshi
Sakshi News home page

ఎగుమతుల్లో దూసుకుపోతున్న భారత్‌!

Published Mon, Nov 4 2024 9:07 AM | Last Updated on Mon, Nov 4 2024 9:07 AM

India export witnessed healthy gains in different sectors like petroleum, gemstones, agrochemicals and sugar

పెట్రోలియం, జెమ్‌స్టోన్‌ (రత్నాలు), చక్కెర, ఆగ్రోకెమికల్‌ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్‌ పాత్ర అంతర్జాతీయంగా బలోపేతం అవుతోంది. గడిచిన ఐదేళ్లుగా అంతర్జాతీయ వాణిజ్యంలో ఈ రంగాల నుంచి భారత్‌ ఎగుమతుల వాటా పెరుగుతున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2018 నుంచి 2023 మధ్య కాలంలో వీటితోపాటు ఎలక్ట్రికల్‌ గూడ్స్, న్యూమాటిక్‌ టైర్లు, ట్యాప్‌లు, వాల్వ్‌లు, సెమీకండక్టర్‌ పరికరాల ఎగుమతులు సైతం పెరుగుతున్నాయి.

వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం..

2023లో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 85 బిలియన్‌ డాలర్ల(రూ.7.09 లక్షల కోట్లు)కు పెరిగాయి. ఈ రంగంలో అంతర్జాతీయంగా భారత్‌ వాటా 2018 నాటికి 6.45 శాతంగా ఉంటే, 2023 నాటికి 12.59 శాతానికి పెరిగింది. 2018లో పెట్రోలియం ఉత్పత్తుల పరంగా ఐదో అతిపెద్ద దేశంగా ఉండగా, 2023 నాటికి మూడో అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించింది.

విలువైన రాళ్లు

ప్రీషియస్, సెమీ ప్రీషియష్‌ (విలువైన రాళ్లు) స్టోన్స్‌ ఎగుమతుల పరంగా 2018 నాటికి భారత్‌ వాటా 16.27 శాతం కాగా, 2023 చివరికి 36.53 శాతానికి పెరిగింది. ఈ విభాగంలో అంతర్జాతీయంగా భారత్‌ నంబర్‌1 స్థానానికి చేరింది. 2023లో 1.52 బిలియన్‌ డాలర్ల విలువైన తర్నాలను భారత్‌ ఎగుమతి చేసింది. 2018లో ఎగుమతులు కేవలం 0.26 బిలియన్‌ డాలర్లుగానే (అంతర్జాతీయంగా రెండో స్థానం) ఉన్నాయి.

చక్కెర ఎగుమతులు

చెరకు లేదా చక్కెర ఎగుమతుల పరంగా అంతర్జాతీయంగా భారత్‌ వాటా 2018 నాటికి ఉన్న 4.17 శాతం నుంచి 2023లో 12.21 శాతానికి చేరింది. చక్కెర ఎగుమతుల్లో భారత్‌ అంతర్జాతీయంగా రెండో అతిపెద్ద దేశంగా ఉంది.  

ఆగ్రోకెమికల్, పురుగు మందులు

ఆగ్రోకెమికల్, పురుగు మందుల ఉత్పత్తుల ఎగుమతులతో అంతర్జాతీయంగా భారత్‌ వాటా 8.52 శాతం నుంచి 10.85 శాతానికి పెరిగింది. 2023 చివరికి ఎగుమతులు 4.32 బిలియన్‌ డాలర్లకు వృద్ధి చెందాయి. అంతర్జాతీయ వ్యవసాయ, పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేసే సామర్థ్యాలు భారత్‌కు కలిసొస్తున్నాయి. ఈ విభాగంలో అంతర్జాతీయంగా భారత్‌ మూడో స్థానానికి ఎగబాకింది.  

ఇదీ చదవండి: అత్యవసర నిధికి నిజంగా ‘బంగారం’ అనుకూలమా?

రబ్బర్‌ టైర్ల ఎగుమతులు

రబ్బర్‌ న్యూమాటిక్‌ టైర్ల ఎగుమతులు 2018లో 1.82 బిలియన్‌ డాలర్లుగా ఉంటే 2023 చివరికి 2.66 బిలియన్‌ డారల్లకు పెరిగాయి. అంతర్జాతీయంగా భారత్‌ వాటా 2.34 శాతం నుంచి 3.31 శాతానికి చేరింది.

సెమీకండక్టర్లు

సెమీకండక్టర్, ఫొటోసెన్సిటివ్‌ పరికరాల ఎగుమతులు 2018లో కేవలం 0.16 బిలియన్‌ డాలర్లుగానే ఉండగా, 2023 నాటికి 1.91 బిలియన్‌ డాలర్లకు వృద్ధి చెందినట్టు వాణిజ్య శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement