సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రసాయన వ్యవసాయంలో హైబ్రిడ్ రకాల ప్రభావం పెరిగిపోతున్న ఈ రోజుల్లో దేశ వాళీ రకాల పరిరక్షణకు ఓ యువకుడు నడుం బిగించాడు. ఇంతింతై వటుడింతై అన్న చందంగా.. ఆరంభంలో ఐదు రకాల వరి వంగడాలతో సాగు మొదలుపెట్టి, నేడు 300 పైచిలుకు వరి విత్తనాలను సాగుచేస్తున్నాడు. ఎలాంటి లాభాపేక్షకు పోకుండా.. దేశవాళీ రకాలను దేశమంతా విస్తరింపజేయాలన్న సంకల్పంతో పదిమందికి పంచుతూ గొప్ప మనసు చాటుకుంటున్నాడు..
పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం వ్యవసాయ విస్తరణ అధికారి యాదగిరి శ్రీనివాస్. వ్యవసాయంపై ఉన్న మక్కువకు తోడు సేంద్రియసాగులో పాలేకర్ ప్రభావంతో దేశీయవిత్తనాలను కాపాడాలనే లక్ష్యంతో తనకు ఉన్న మూడెకరాల వ్యవసాయభూమిలో సాగుచేస్తున్నాడు. పండించిన వరిధాన్యాన్ని తన అవసరాలకు పోగా, మిగిలిన వాటిని తెలుగు రాష్ట్రాల్లో వరి సాగు చేసే రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా సాగుతున్నాడు. వివిధ రకాల దేశవాళీ వరి వంగడాలను ఇతర ప్రాంతాల నుండి సేకరించి ప్రకృతి వ్యవసాయ(సేంద్రీయవిధానంలో పండిస్తున్నాడు. ఇంద్రధనస్సు రంగులీనే ఈ వంగడాలు బాలింతల్లో పాల వృద్ధికి, పురుషుల్లో వీర్యవృద్ధికి ఉపయోగపడటం విశేషం.
రసాయనాలు లేని సేంద్రియ సాగు చేయాలన్న ఆకాంక్షతో 2009లో పాలేకర్ శిక్షణ శిబిరానికి ఏఈవో శ్రీనివాస్ హాజరయ్యారు. దీనిలో భాగంగా మొదట్లో పరిమళ సన్నా(తమిళనాడు), పంచరత్న (ఈశాన్యరాష్ట్రాల) కాలబట్టి(బెంగాల్, దుదేశ్వర్, అంబేమహర్(మహారాష్ట్ర)లకు చెందిన ఐదు రకాల వరి వంగడాలను తీసుకొచ్చి సాగు మొదలు పెట్టాడు. దేశంలో ఒకప్పుడు ఐదువేలకుపైగా రకాలు సాగులో ఉండేవి. ఇవి మనిషి జీవితంలో బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అన్ని దశల్లోనూ కావాల్సిన పోషకాలను అందించగలవు. చిన్నారుల ఉగ్గు నుండి మొదలుకొని దేవుడి నైవేద్యం వరకు ప్రత్యేక రకాల వరి బియ్యం సాగులో ఉండేవి. ఆ రకాలను కాపాడాలన్న సంకల్పంతో ఇలా ఐదు నుంచి మొదలుపెట్టిన వరిరకాలు నేడు 300 వరివంగడాలకు చేరుకున్నాయి.
శ్రీనివాస్ సాగు చేసే రకాలు..
1) నల్లరంగు వడ్లు: పంచరత్న, కాలాబట్ట, బర్మాబ్లాక్, కరిగేజావలి, ఇల్లపు సాంబా, కరిజిద్దా, రమ్యగళి, నవార, కాకిరెక్కలు, కాలాజీరా, ముడిమురంగి, తలంగూర్, తైవాన్‌బ్లాక్, చిట్టిగ, కాజీసాల.
2) గోధుమ రంగు వడ్లు: మాపిళైసాంబా, కండసాగర్, ఆప్తోకల్, కస్మకుందా, హల్లబట్టా.
3) ఎరుపు రంగు వడ్లు: సేలం సన్న, చిన్న బైసి ల్‌మోర్, రాంశ్రీ, అరుకులోయ, కుంకుమసాలి.
4) పొట్టిగింజ వడ్లు: తులసీబాసో, డడ్డీగ, అంబేమోహర్, పరిమళ సన్న, నికో, బాలాజీ, రాధజీగేల్, బేళనాళా, జీరగసాంబా, టిక్కిమిస్రీ, సమేలీ బోగ్, బాస్ బోగ్, ఘని.
5) సువాసన వడ్లు: బాసుమతి(ఢిల్లీ, చంద్రగుప్తా, లోకల్), పరిమళ సన్న, సుగంధి, అంబేమొహర్.
6) సన్నవడ్లు: దూదేశ్వర్, చింతలూరి సన్న, ఛత్తీస్‌గఢ్, మచ్చ కాంత, డీఆర్‌కే2, రాణి కంద, సొనకడిక, నారాయణ కామిని, కమల్ సాంగ్రి, రత్న చోడి.
7) పొడవు వడ్లు: మల్లీపూల్, సన్నజాజులు.
8) దొడ్డు వడ్లు: నికో, బహురూపి, రెడ్ జాస్మిన్.
సాగు చేసిన వాటిలో కొన్ని రకాల ప్రత్యేకతలు
1) పుంగార్: బాలింతలకు అధిక పాల వృద్ధికి దోహదపడుతుంది.
2) మపిలైసాంబా: యుక్త వయస్సు వారికి వీర్య వృద్ధికి తోడ్పడుతుంది.
3) కులాకార్: గర్బిణులకు సుఖ ప్రసవానికి ఉపయోగపడుతుంది.
4) నవారా: మధుమేహ వ్యాధి గ్రస్తులకు వ్యాధి నియంత్రణకు, నివారణకు ఉపయుక్తంగా ఉంటుంది.
5) బ్లాక్ రైస్: అన్ని రకాల నల్ల బియ్యం రోగనిరోధక శక్తి పెంపొందిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment