Hybrid varieties
-
నయా టమాటా
సాక్షి, అమరావతి: కొత్త రకం టమాటా వంగడాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. యూఎస్–6242, అన్సోల్, జువేల్ వంటి హైబ్రీడ్ రకాలను రబీలో పైలట్ ప్రాజెక్ట్ కింద సాగు చేయగా.. సూపర్ సక్సెస్ కావడంతోపాటు రైతులకు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. దీంతో నూతన వంగడాల సాగును ప్రోత్సహించేందుకు ఉద్యాన శాఖ సన్నాహాలు చేస్తోంది. ఏడాది పొడవునా టమాటాలు పండుతున్నా.. మార్కెట్ ధరల్లో తీవ్రమైన వ్యత్యాసాలు ఉంటున్నాయి. కొన్ని రోజులు రైతులకు లాభాలు వస్తుండగా.. కొన్ని రోజులు కనీసం పెట్టుబడి కూడా దక్కడం గగనంగా మారుతోంది. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ.. స్థానిక వెరైటీలకు ప్రత్యామ్నాయంగా యూఎస్–6242, అన్సోల్, జువేల్ వంటి హైబ్రీడ్ రకాలను ఉద్యాన శాఖ అందు బాటులోకి తెచ్చింది. గుజ్జు ఎక్కువ.. ధర మక్కువ లోకల్ వెరైటీ టమాటా రకాల్లో గుజ్జు శాతం ఎక్కువ లేకపోవడం వల్ల ప్రాసెసింగ్‌కు పూర్తిస్థాయిలో పనికిరావడం లేదు. విధిలేని పరిస్థితుల్లో రైతుల నుంచి తక్కువ ధరకు ప్రాసెసింగ్ కంపెనీలు వీటిని కొనుగోలు చేస్తున్నాయి. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ గుజ్జు శాతం అధికంగా ఉండి ప్రాసెసింగ్‌తోపాటు స్థానికంగా వినియోగించుకునేందుకు వీలుగా ఉండే ఈ హైబ్రీడ్ రకాలను ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ సంకల్పించింది. ఒకవేళ మార్కెట్లో కనీస ధర లేకపోయినప్పటికీ కిలోకు రూ.6 తక్కువ కాకుండా రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా సేకరించి ప్రాసెసింగ్ కంపెనీలకు విక్రయించేలా అవగాహన ఒప్పందం కూడా చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వేసవిలో చిత్తూరు జిల్లా పలమనేరు, వి.కోట మండలాల్లో 136 మంది రైతులను గుర్తించి వారి ద్వారా 250 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా హైబ్రీడ్ రకాలను సాగు చేశారు. సాగును ప్రోత్సహించేందుకు వివిధ రూపాల్లో హెక్టార్‌కు రూ.68,225 సబ్సిడీ ఇచ్చారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా లోకల్ వెరైటీలైన సాహో, సాహితీ రకాలకు ఆశించిన స్థాయిలో పూత రాలేదు. వచ్చిన పూత, పిందె రాలిపోవడంతో ఎకరాకు 15–20 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. ఇదే సమయంలో హైబ్రీడ్ టమాటాలు 35–40 టన్నుల వరకు దిగుబడులొచ్చాయి. వైరస్‌ను తట్టుకుని తీవ్రమైన ఉష్ణోగ్రతల సమయంలో కూడా ఆశించిన స్థాయిలో దిగుబడులొచ్చాయి. మరోవైపు లోకల్ వెరైటీ టమాటాలు 15 కేజీల బాక్స్ రూ.70–రూ.80 ధర లభించగా.. హైబ్రీడ్ వెరైటీలకు రూ.190–రూ.200 వరకు ధర పలికింది. హైబ్రీడ్ రకాలకు రెట్టింపు ధరలు రావడంతో రైతులు మంచి లాభాలను ఆర్జించారు. దీంతో రానున్న రబీలోనూ ఈ రకాలను ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ సంకల్పించింది. హైబ్రీడ్ రకాలకు ఊతం సంప్రదాయ నాటు వెరైటీలకు ప్రత్యామ్నాయంగా హైబ్రీడ్ వెరైటీలను అందుబాటులోకి తీసుకొచ్చాం. రబీలో పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో రానున్న రబీలో కూడా హైబ్రీడ్ రకాల సాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకున్నాం. ధర లేకపోతే ప్రాసెసింగ్ కంపెనీల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం.– డి.మధుసూదనరెడ్డి, డీహెచ్ఓ, చిత్తూరు జిల్లా -
రంగుల్లో వరి వంగడాలు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రసాయన వ్యవసాయంలో హైబ్రిడ్ రకాల ప్రభావం పెరిగిపోతున్న ఈ రోజుల్లో దేశ వాళీ రకాల పరిరక్షణకు ఓ యువకుడు నడుం బిగించాడు. ఇంతింతై వటుడింతై అన్న చందంగా.. ఆరంభంలో ఐదు రకాల వరి వంగడాలతో సాగు మొదలుపెట్టి, నేడు 300 పైచిలుకు వరి విత్తనాలను సాగుచేస్తున్నాడు. ఎలాంటి లాభాపేక్షకు పోకుండా.. దేశవాళీ రకాలను దేశమంతా విస్తరింపజేయాలన్న సంకల్పంతో పదిమందికి పంచుతూ గొప్ప మనసు చాటుకుంటున్నాడు.. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం వ్యవసాయ విస్తరణ అధికారి యాదగిరి శ్రీనివాస్. వ్యవసాయంపై ఉన్న మక్కువకు తోడు సేంద్రియసాగులో పాలేకర్ ప్రభావంతో దేశీయవిత్తనాలను కాపాడాలనే లక్ష్యంతో తనకు ఉన్న మూడెకరాల వ్యవసాయభూమిలో సాగుచేస్తున్నాడు. పండించిన వరిధాన్యాన్ని తన అవసరాలకు పోగా, మిగిలిన వాటిని తెలుగు రాష్ట్రాల్లో వరి సాగు చేసే రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా సాగుతున్నాడు. వివిధ రకాల దేశవాళీ వరి వంగడాలను ఇతర ప్రాంతాల నుండి సేకరించి ప్రకృతి వ్యవసాయ(సేంద్రీయవిధానంలో పండిస్తున్నాడు. ఇంద్రధనస్సు రంగులీనే ఈ వంగడాలు బాలింతల్లో పాల వృద్ధికి, పురుషుల్లో వీర్యవృద్ధికి ఉపయోగపడటం విశేషం. రసాయనాలు లేని సేంద్రియ సాగు చేయాలన్న ఆకాంక్షతో 2009లో పాలేకర్ శిక్షణ శిబిరానికి ఏఈవో శ్రీనివాస్ హాజరయ్యారు. దీనిలో భాగంగా మొదట్లో పరిమళ సన్నా(తమిళనాడు), పంచరత్న (ఈశాన్యరాష్ట్రాల) కాలబట్టి(బెంగాల్, దుదేశ్వర్, అంబేమహర్(మహారాష్ట్ర)లకు చెందిన ఐదు రకాల వరి వంగడాలను తీసుకొచ్చి సాగు మొదలు పెట్టాడు. దేశంలో ఒకప్పుడు ఐదువేలకుపైగా రకాలు సాగులో ఉండేవి. ఇవి మనిషి జీవితంలో బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అన్ని దశల్లోనూ కావాల్సిన పోషకాలను అందించగలవు. చిన్నారుల ఉగ్గు నుండి మొదలుకొని దేవుడి నైవేద్యం వరకు ప్రత్యేక రకాల వరి బియ్యం సాగులో ఉండేవి. ఆ రకాలను కాపాడాలన్న సంకల్పంతో ఇలా ఐదు నుంచి మొదలుపెట్టిన వరిరకాలు నేడు 300 వరివంగడాలకు చేరుకున్నాయి. శ్రీనివాస్ సాగు చేసే రకాలు.. 1) నల్లరంగు వడ్లు: పంచరత్న, కాలాబట్ట, బర్మాబ్లాక్, కరిగేజావలి, ఇల్లపు సాంబా, కరిజిద్దా, రమ్యగళి, నవార, కాకిరెక్కలు, కాలాజీరా, ముడిమురంగి, తలంగూర్, తైవాన్బ్లాక్, చిట్టిగ, కాజీసాల. 2) గోధుమ రంగు వడ్లు: మాపిళైసాంబా, కండసాగర్, ఆప్తోకల్, కస్మకుందా, హల్లబట్టా. 3) ఎరుపు రంగు వడ్లు: సేలం సన్న, చిన్న బైసి ల్మోర్, రాంశ్రీ, అరుకులోయ, కుంకుమసాలి. 4) పొట్టిగింజ వడ్లు: తులసీబాసో, డడ్డీగ, అంబేమోహర్, పరిమళ సన్న, నికో, బాలాజీ, రాధజీగేల్, బేళనాళా, జీరగసాంబా, టిక్కిమిస్రీ, సమేలీ బోగ్, బాస్ బోగ్, ఘని. 5) సువాసన వడ్లు: బాసుమతి(ఢిల్లీ, చంద్రగుప్తా, లోకల్), పరిమళ సన్న, సుగంధి, అంబేమొహర్. 6) సన్నవడ్లు: దూదేశ్వర్, చింతలూరి సన్న, ఛత్తీస్‌గఢ్, మచ్చ కాంత, డీఆర్కే2, రాణి కంద, సొనకడిక, నారాయణ కామిని, కమల్ సాంగ్రి, రత్న చోడి. 7) పొడవు వడ్లు: మల్లీపూల్, సన్నజాజులు. 8) దొడ్డు వడ్లు: నికో, బహురూపి, రెడ్ జాస్మిన్. సాగు చేసిన వాటిలో కొన్ని రకాల ప్రత్యేకతలు 1) పుంగార్: బాలింతలకు అధిక పాల వృద్ధికి దోహదపడుతుంది. 2) మపిలైసాంబా: యుక్త వయస్సు వారికి వీర్య వృద్ధికి తోడ్పడుతుంది. 3) కులాకార్: గర్బిణులకు సుఖ ప్రసవానికి ఉపయోగపడుతుంది. 4) నవారా: మధుమేహ వ్యాధి గ్రస్తులకు వ్యాధి నియంత్రణకు, నివారణకు ఉపయుక్తంగా ఉంటుంది. 5) బ్లాక్ రైస్: అన్ని రకాల నల్ల బియ్యం రోగనిరోధక శక్తి పెంపొందిస్తాయి. -
విత్తనమే కీలకం!
సాధారణంగా విత్తనాలు సూటి రకాలు, హైబ్రీడ్ రకాలుగా ఉంటాయి. సూటి రకాలంటే రైతులు ప్రతి సంవత్సరం తమ పంట నుంచి వచ్చిన విత్తనాన్ని తరువాత పంటగా వేసుకోవచ్చు. విత్తనాలను మార్చుకునేటప్పుడు ధ్రువీకరించిన వాటినే వేసుకోవడం మంచిది. హెబ్రిడ్ రకాలంటే ఏటా సంకర పర్చి తయారు చేసిన విత్తనాలు. ప్రతి పంట కాలానికి కొత్త విత్తనం వాడాల్సి ఉంటుంది. పాత విత్తనాలను వాడినట్లయితే దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ధ్రువీకరణ విత్తనం జన్యుపరమైన అసలు లక్షణాలు కలిగి, చీడపీడలను తట్టుకునే శక్తి అధికంగా ఉంటుంది. ఇతర వంట విత్తనాలు కానీ కలుపు మొక్కల విత్తనాలు లేకుండా పరిశుభ్రంగా ఉంటాయి. వ్యర్థ పదార్థాలు లేకుండా ధ్రుడమైన విత్తనాలు ఎక్కువ శాతం కల్గి ఉంటాయి. బాగా మొలకెత్తే ఎక్కువ మొలక సాంద్రత కల్గిన విత్తనాలు అధిక దిగుబడికి దోహదపడతాయి. విత్తనం ద్వారా వ్యాపించే శిలీంధ్రాల నుంచి రక్షణ ఎక్కువగా ఉంటుంది. విత్తనంలో నిర్ణీత తేమ శాతం వల్ల ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. నాణ్యమైన విత్తన లక్షణాలు నాణ్యమైన విత్తనమంటే వంద శాతం జన్యు స్వచ్ఛత మొలక శాతం కలిగి ఉండాలి. మేలైన విత్తనం 20 నుంచి 25 శాతం అవసరాల్లో 8 నుంచి 9 శాతం దిగుబడిని పెంచుతుంది. అంతర్గత చీడపీడలు లేని ఆరోగ్యకరమైన విత్తనమే నాణ్యంగా ఉన్నట్లు లెక్క. విత్తనాలు తయారు చేసుకోవడం ఇలా.... ప్రతి రైతు తనకు కావాల్సిన విత్తనాలను తన పంట నుంచి లేదా బాగా పండిన ఇతర రైతుల పంట నుంచి సేకరించాలి. భద్రంగా దాచుకోవాలి. స్వపరాగ సంపర్కం జరిగే పంటలలో రైతులు ఎవరి విత్తనాన్ని వారు తయారు చూసుకుంటే విత్తనంపై పెట్టే పెట్టుబడి తగ్గడమే కాకుండా నాణ్యమైన విత్తనాన్ని పొందే అవకాశం ఉంటుంది. విత్తనోత్పత్తి చేసే పొలం సారవంతమైనదిగా ఉండాలి. నీటి వసతితో పాటు మురుగునీరు పోయేలా ఏర్పాట్లు ఉండాలి. విత్తనం కోసం పండించే పొలానికి అదే పంటకు చెందిన ఇతర రకాల పొలానికి మధ్య కనీస దూరం ఉండాలి. విత్తనోత్పత్తి చేయదల్చిన పొలంలో నీటితడి ఇచ్చినట్లయితే అంతకు ముందు పండించిన రకం విత్తనాలు మొలకెత్తుతాయి. తరువాత గొర్రు, గుంటుకతో దుక్కి చేయిస్తే పొలంలో ఉండే కల్తీ మొక్కులతో పాటు కలుపు మొక్కలు నాశనం అవుతాయి. విత్తనోత్పత్తి చేసే పొలంలో బెరుకులు (కేశీలు) ఏరి వేయాలి. మొక్క ఎదుగుదల దశలో పంట పూత దశలో గింజ గట్టిపడే దశలో మూడు సార్లు కలుపు మొక్కలు లేకుండా చూడాలి. మొదటి దశ ఎత్తులో తేడా ఉన్న మొక్కలను పీకేయాలి. ఆకుల రంగు, ఆకారం, అమరికలో తేడా లేకుండా చూడాలి. రెండో దశలో కంకుల్లో తేడా ఉన్న మొక్కలను తొలగించాలి. రెమ్మల అమరిక, పుప్పొడి రంగులో తేడా పుప్పొడి తిత్తుల్లో తేడా లేకుండా చూసుకోవాలి. మూడోదశలో గింజ ఆకారం, పరిమాణం, గింజ రంగు వీటన్నింటినీ రెండు మూడు సార్లు విత్తన క్షేత్రమంతా తిరిగి ఏరి వేయాలి. -
విత్తనం మనదైతే.. ఆ దిగుబడే వేరబ్బా!
ఒంగోలు టూటౌన్ : రైతులు విత్తనాల కోసం ప్రైవేట్ కంపెనీలను ఆశ్రయించడం.. అవి సరిగ్గా మొలకెత్తకపోవడం.. ఒకవేళ మొలకెత్తినా దిగుబడి లేకపోవడం వెరసి అన్నదాత తీవ్రంగా నష్టపోతున్నాడు. ఈ నేపథ్యంలో రైతులే నాణ్యమైన విత్తనాలు తయారు చేసుకుంటే ఆశించిన దిగుబడి దక్కుతుందని వ్యవసాయశాఖ జిల్లా సంచాలకుడు జే ముర ళీకృష్ణ పేర్కొన్నారు. మేలైన విత్తనం వాడితే.. జన్యు, స్వచ్ఛత, అధిక మొలక శాతం కలిగి ఉండటంతో పాటు అధిక దిగుబడిని ఇవ్వగలిగే శక్తి ఉండాలి. మేలైన విత్తనం వాడితే 20 శాతం నుంచి 25 శాతం అధిక దిగుబడిని పొందే అవకాశముంటుంది. విత్తనాల్లో రకాలు విత్తనాల్లో సూటి, హైబ్రిడ్ రకాలు ఉంటాయి. సూటి రకాలంటే రైతులు ఏటా తమ పంట నుంచి వచ్చిన విత్తనాన్ని తర్వాత పంటగా వేసుకోవచ్చు. ఈ పద్ధతిలో రైతులు తమ విత్తనాలను ప్రతి మూడు, నాలుగేళ్లకోమారు మార్చుకోవాల్సి ఉంటుంది. విత్తనాలను మార్చే సమయంలో ధ్రువీకరించిన విత్తనాలు ఎంచుకోవాలి. హైబ్రిడ్ రకాలంటే ఏటా ఆడ, మగ రకాలను సంకరపరిచి తయారు చేసిన విత్తనాలు. ప్రతి పంట కాలానికి కొత్త విత్తనం వాడాల్సి ఉంటుంది. పాత విత్తనాలు అంతగా పనికిరావు. దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. విత్తనం తయారీ ఇలా.. స్వపరాగ సంపర్కం జరిగే పంటలో రైతులు ఎవరి విత్తనాన్ని వారు తయారు చేసుకుంటే విత్తనంపై పెట్టుబడి తగ్గడంతో పాటు మేలు రకాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. విత్తనోత్పత్తి చేసే పొలం సారవంతమైనదై ఉండాలి. మురుగు నీరు నిల్వ ఉండకూడదు. విత్తనం కోసం పండించే పొలానికి అదే పంటకు చెందిన ఇతర రకాలు సాగవుతున్న పొలానికి మధ్య కనీస దూరం ఉండాలి. విత్తనోత్పత్తి చేయదలచిన పొలానికి నీరు పెడితే అంతకు ముందు పండించిన పంట రకం మొలకెత్తుతుంది. వాటిని గొర్రు, గుంటకతో నాశనం చేయాలి. పొలంలో బెరుకులు లేకుండా చూసుకోవాలి. మొక్క ఎదిగేటప్పుడు పూత, గింజ గట్టిపడే దశలో ఏరిపాయాలి. ఎత్తులో తేడాలున్నా ఆకుల రంగు, ఆకారం, అమరిక సరిగా లేకున్నా వెంటనే గుర్తించి తొలగించాలి. ఏ విత్తనమైనా నారు పోసే ముందు విత్తన శుద్ధి తప్పని సరి. రైతులు తమ పంట నుంచి గానీ లేదా బాగా పండించిన ఇతర రైతుల నుంచి గానీ విత్తనాలు సేకరించి నిల్వ చేసుకోవాలి.