Sagubadi: మండుటెండల్లోనూ కన్నుల పండుగగా.. సౌరాష్ట్ర ‘ఫుడ్‌ ఫారెస్ట్‌లు’ | Sagubadi: Subhash Palekar Researching And Explaining Rare Crop Forests | Sakshi
Sakshi News home page

Sagubadi: మండుటెండల్లోనూ కన్నుల పండుగగా.. సౌరాష్ట్ర ‘ఫుడ్‌ ఫారెస్ట్‌లు’

Published Tue, Apr 9 2024 8:37 AM | Last Updated on Tue, Apr 9 2024 8:37 AM

Sagubadi: Subhash Palekar Researching And Explaining Rare Crop Forests - Sakshi

ఫుడ్‌ ఫారెస్ట్‌లో నరోత్తమ్‌తో.. పాలేకర్‌, కరన్షి తోటలో పంటలను ఆశ్చర్యంగా చూస్తున్న రైతు

నరోత్తం భాయ్‌ జాదవ్‌.. చిన్న రైతు. కరన్షి అభయ్‌సింగ్‌ పర్మర్‌.. పెద్ద రైతు. వీరిది గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌ నగరానికి 150 కి.మీ. దూరంలోని బొటాడ్‌ జిల్లా. వీరు 9 నెలల క్రితం చెరొక ఎకరంలో 5 దొంతర్ల పంటల అడవి సాగునుప‍్రాంరంభించారు. సుభాష్‌ పాలేకర్‌ కృషి (ఎస్‌.పి.కె.) పద్ధతిలో ఎకరానికి 2 టన్నుల ఘనజీవామృతం వేస్తూ, 10–15 రోజులకోసారి ద్రవజీవామృతం డ్రిప్, పిచికారీ చేస్తూ తొలి ఏడాదే గణనీయంగా ఆదాయం పొందుతున్నారు. ఎత్తుమడులపై కొలువుదీరిన ఈ వత్తయిన ఉద్యాన తోటలు చూపరులకు కన్నుల పండుగ చేస్తున్నాయి. పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. సుభాష్‌ పాలేకర్‌ ఈ 5 లేయర్‌ మోడల్‌ క్షేత్రాలను మార్చి 31న సుమారు 500 మంది రైతులకు స్వయంగా చూపించి ఆశ్చర్యచకితులను చేశారు. ఈ క్షేత్రాలను సందర్శించిన ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధి పంతంగి రాంబాబు గ్రౌండ్‌ రిపోర్ట్‌.

బొటాడ్‌ జిల్లాలో వార్షిక సగటు వర్షపాతం 500–600 ఎం.ఎం. మాత్రమే. ఎక్కువ మంది రైతులు వర్షాధారంగానే పంటలు పండిస్తారు. పత్తి, గోధుమ, సోంపు తదితర పంటలను ఏక పంటలుగా అక్కడి రైతులు రసాయనిక పద్ధతిలో పండిస్తారు. అయితే, పాలేకర్‌ పద్ధతిలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు, ఇతరత్రా పంటలతో కూడిన 5 దొంతర్ల సాగు అల్ప వర్షపాత ప‍్రాంంతాల్లో సైతం రైతులకు ఏడాది పొడవునా పౌష్టికాహార భద్రతను, ఆదాయ భద్రతను అందిస్తాయని ఈ ఇద్దరు రైతులు రుజువు చేస్తున్నారు.

ఈ సుసంపన్న క్షేత్రాలను స్వయంగా రైతులకు చూపించిన సుభాష్‌ పాలేకర్‌.. అందుకు దోహదం చేసిన ప్రకృతి సేద్య సూక్ష్మాలను రైతులకు విశదీకరించారు. 3 రోజుల శిక్షణా శిబిరంలో ప్రతి చిన్న విషయాన్నీ విడమర్చి చెప్పి, నోట్సు రాయించారు. శ్రద్ధగా రాసుకున్న ప్రతినిధుల్లో సాధారణ రైతులతో పాటు ఇద్దరు డాక్టర్లూ ఉండటం విశేషం. 

5 అడుగుల బెడ్లపై 70 పంటలు!
నరోత్తమ్‌ భాయ్‌ జాదవ్‌ (96872 57381– హిందీ/గుజరాతీ) స్వగ్రామం గుజరాత్‌ బొటాడ్‌ జిల్లా రాంపూర్‌ తాలూకాలోని నగనేశ్‌. ఆయనకు 5 ఎకరాల నల్లరేగడి మెట్ట భూమి ఉంది. 2017 నుంచి పాలేకర్‌ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 9 నెలల క్రితం ఒక ఎకరంలో.. చివరి దుక్కిలో 2 వేల కిలోల ఘనజీవామృతం వేశారు. 5 అడుగుల వెడల్పున ఎత్తుమడులు, పక్కన 3 అడుగుల వెడల్పున కాలువలు ఏర్పాటు చేశారు. బొ΄్పాయి, చెరకు, అరటి, మునగ, చిక్కుడు, కంది, జామ, సొర, కాకర, టొమాటో, మిరప, పసుపు, గాజర్, ఉల్లి, శనగ, తులసి, సోంపు, బీట్‌రూట్, ముల్లంగి, ఆకుకూరలతో పాటు కొబ్బరి, బాదం, అంజీర, జీడిమామిడి, సీతాఫలం, రామాఫలం, బత్తాయి, దానిమ్మ, అవకాడో తదితర పండ్ల మొక్కల్ని కూడా నాటారు.

నరోత్తమ్‌ ఫుడ్‌ ఫారెస్ట్‌లో రైతులతో సుభాష్‌ పాలేకర్‌

బెడ్లపై ఆ చివరన, ఈ చివరన వై ఆకారంలో పంగల ఇనుప స్టాండ్లను పాతి.. వాటికి పైన 8, కింద 4 తీగలు కట్టి.. వాటిపైకి చిక్కుడు, ఆనప, కాకార వంటి పంటలను పాకించారు. పంట వ్యర్థాలతో బెడ్లపై మొక్కల మధ్య ఆచ్ఛాదన చేశారు. బెడ్లపైన పంటలకు నాలుగు డ్రిప్‌ లైన్ల ద్వారా బోరు నీటిని అందిస్తున్నారు. పంటలన్నీటినీ ఒకేసారి కాకుండా 3 నెలల్లో దశల వారీగా నాటామని రైతు నరోత్తమ్‌ వివరించారు. ‘నా భార్య, ఇద్దరు కుమార్తెలు కూడా రోజువారీ తోట పనుల్లో భాగస్వాములవుతారు. ఒక కూలీ కూడా పనిచేస్తుంటారు. హైవే పక్కనే ఉండటం వల్ల పంట ఉత్పత్తులను తోట దగ్గర కొన్ని అమ్ముతాం.

మిగతా వాటిని అహ్మదాబాద్‌లో గురు, ఆదివారాల్లో అమ్ముతున్నాం. కిలో రూ. 80 నుంచి 140 ధరకు నేరుగా వినియోగదారులకే అమ్ముతున్నాం..’ అన్నారాయన. 5 లేయర్‌ మోడల్‌ పంటల సాగుకు ఎకరానికి అన్నీ కలిపి రూ. 3,50,000 పెట్టుబడి పెట్టగా.. ఇప్పటి వరకు 9 నెలల్లో రూ. 2,87,000 ఆదాయం వచ్చిందని, మరో మూడు నెలల్లో పెట్టుబడి పెట్టిన దానికన్నా ఎక్కువ మొత్తంలోనే ఆదాయం వస్తుందని నరోత్తమ్‌ ధీమాగా చె΄్పారు. పండ్ల చెట్లు పెరిగిన తర్వాత ఏడాదికి  ఆదాయం రూ. 6 లక్షలకు పెరుగుతుందన్నారు. సుమారు 70 రకాల ఉద్యాన పంటలను 5 దొంతర్లలో సాగు చేస్తుండటం సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేసింది.

కనువిందు చేసిన పంటల అడవి
కరన్షి అభయ్‌సింగ్‌ పర్మర్‌ (99793 59711 హిందీ/గుజరాతీ) స్వగ్రామం బొటాడ్‌ జిల్లా రాంపూర్‌ తహశిల్‌ వెజల్క. 40 ఎకరాల ఆసామి. మెట్ట వ్యవసాయం. 2019 నుంచి పాలేకర్‌ పద్ధతిలోనే సేద్యం అంతా. 5 ఆవులు ఉన్నాయి. 6 వేల లీటర్ల జీవామృతం ట్యాంకు కట్టి, నేరుగా డ్రిప్‌ డ్వారా జీవామృతం పది రోజులకోసారి పంటలకు ఇస్తున్నారు. పది రోజులకోసారి పిచికారీ చేస్తున్నారు. 20 ఎకరాల్లో బీటీ పత్తి వేస్తారు. 5 ఎకరాల్లో పచ్చిగడ్డి, గోధుమ, మిగతా పొలంలో మొక్కజొన్న, శనగ,పెసర, జిలకర, సోంపు వంటి పంటలు వేస్తారు.

గుజరాత్‌లోని వెజల్క గ్రామంలో కరన్షి సృష్టించిన దట్టమైన పంటల అడవి 

ఒక ఎకరంలో 9 నెలల క్రితం పాలేకర్‌ పద్ధతిలో 5 దొంతర్ల నమూనాలో అనేక పంటలను 5 అడుగుల వెడల్పు బెడ్స్‌పై డ్రిప్‌తో సాగు చేస్తున్నారు. చివరి దుక్కిలో 2 వేల కిలోల ఘనజీవామృతం వేశారు. 5 అడుగుల వెడల్పున ఎత్తుమడులు ఏర్పాటు చేసి 20 పంటలను సాగు చేస్తున్నారు. బెడ్స్‌పై ఆ చివరన, ఈ చివరన వై ఆకారంలో పంగల ఇనుప స్టాండ్లను పాతి.. వాటికి పైన 8, కింద 4 తీగలు కట్టి.. వాటిపైకి చిక్కుడు, ఆనప తీగలను పాకించారు. కరన్షికి చెందిన నల్లరేగడి భూమిలో ఏర్పాటైన 5 లేయర్‌ తోటలో ఎత్తుగా, ఆకుపచ్చగా ఆరోగ్యంగా ఎదిగిన మధుబిందు అనే దేశీ రకం బొప్పాయి చెట్లు, అరటి గెలలు, ఎత్తుగా ఎదిగిన దేశీ టొమాటో పొదలు, వంగ చెట్లు కన్నుల పండుగ చేస్తున్నాయి. ఆ చెట్లకు ఉన్న కాతను చూసి రైతులు అవాక్కయ్యారు.

మార్చి ఆఖరు నాటికి చుట్టూతా ఒకటి అరా పొలాల్లో సోంపు, గోధుమ పంటలు మాత్రమే కోతకు సిద్ధంగా ఉన్నాయి. కానీ, అనేక పంటలతో పచ్చగా ఉంది కరన్షి తోట మాత్రమే. సుభాష్‌ పాలేకర్‌ ఈ ఫుడ్‌ ఫారెస్ట్‌ గురించి ఒక్కమాటలో చె΄్పాలంటే అద్భుతం అని అభివర్ణించారు.

రైతు కరన్షి మాట్లాడుతూ, తాను 9 నెలల క్రితం మొదట చెరకు నాటానన్నారు. తర్వాత నాలుగు అడుగులకు ఒకచోట అరటి, బొ΄్పాయి, మునగ, మామిడి, సపోట, జామ, నిమ్మ, కొబ్బరి, అవిశ,పోక, తమలపాకు, ఆపిల్, ఉల్లి, గాజర్‌ తదితర మొక్కలు పెట్టుకుంటూ వచ్చానన్నారు. అంచుల్లో దుంప పంటలు పెట్టానన్నారు. ఏ పంటైనా మార్కెట్‌ ధర కన్నా రూ. 20 ఎక్కువ ధరకు అమ్ముతున్నామన్నారు. ఈ 5 లేయర్‌ ఫుడ్‌ ఫారెస్ట్‌ను ఎకరంలో నిర్మించడానికి ఇప్పటి వరకు రూ. 1,40,000 ఖర్చు చేశానని, 9 నెలల్లో రూ. 1,38,000 ఆదాయం వచ్చిందన్నారు. మరో 2 నెలల్లో మరో రూ. లక్షకు పైగా ఆదాయం వస్తుందన్నారు.

ఈ ఫుడ్‌ ఫారెస్ట్‌లో టొమాటో, వంగ మొక్కలు మనిషి ఎత్తు పెరిగి మంచి దిగుబడి ఇస్తున్నప్పటికీ వాటికి వైరస్‌ ఆశించటాన్ని గమనించిన రైతులు పాలేకర్‌ను వివరణ అడిగారు. నల్లరేగడి భూమిలో నీటిని ఎక్కువగా ఇవ్వటమే ఇందుకు కారణమని పాలేకర్‌ అన్నారు. డ్రిప్‌ కన్నా స్ప్రింక్లర్లు మేలన్నారు.

పంటల అడవులు.. పలు ప్రత్యేకతలు..

  • నేల: నల్లరేగడి (ఏ నేలలోనైనా చేయొచ్చు) విస్తీర్ణం: 1 ఎకరం. ఎరువు: సుభాష్‌ పాలేకర్‌ కృషి (ఎస్‌.పి.కె.) పద్ధతిలో సాగు. చివరి దుక్కిలో ఎకరానికి 2 టన్నుల ఘన జీవామృతం (పాలేకర్‌ ఎకరానికి 400 కిలోలు చాలంటున్నా రైతులు 2 టన్నులు వేశారు).
  • బెడ్లు: 5 అడుగుల వెడల్పున ఎత్తు మడులు (బెడ్ల మధ్య 3 అడుగుల దూరం). గడ్డీగాదంతో ఆచ్ఛాదన ముఖ్యం. ఎత్తు మడులపై ఏ పంటైనా పండించొచ్చు. వర్షం ఎక్కువైనా, తక్కువైనా తట్టుకుంటాయి.
  • పంటల వైవిధ్యం: ఖాళీ లేకుండా 20–70 వరకు వత్తుగా 4 వరుసలుగా రకరకాల ఎత్తు పెరిగే సీజనల్, దీర్ఘకాలిక పంటలు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతులు, దుంపలు, ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్య పంటలు, పప్పుధాన్యాలు, చెరకు.. బెడ్లపైనే ‘వై’ ఆకారపు ఇనుప ఫ్రేమ్‌లకు ప్లాస్టిక్‌ తాళ్లు కట్టి అనేక రకాల తీగజాతి కూరగాయల సాగు.
  • దేశీ వంగడాలు: పంట ఏదైనా దేశీ విత్తనమే. ప్రతి రైతూ విత్తన రేతే. డ్రిప్‌: బెడ్లపై 4 లైన్ల డ్రిప్‌ (మన నేలలకు డ్రిప్‌ కన్నా స్ప్రింక్లర్లు మేలు: పాలేకర్‌). 10 రోజులకోసారి నీటితోపాటు ద్రవ జీవామృతం.
  • పిచికారీ: 15 రోజులకోసారి ద్రవజీవామృతం. అవసరాన్ని బట్టి కషాయాలు. దిగుబడి: నిరంతరం. పూర్తయ్యే పంట పూర్తవుతుంటే విత్తే పంట విత్తుకోవాలి. అనుదినం పనితో పాటు ఏడాది పొడవునా పౌష్టికాహార, ఆదాయ భద్రత.
  • మార్కెటింగ్‌: రైతే ధర నిర్ణయించుకొని, నేరుగా వినియోగదారులకే అమ్మకం.
  • ఆదాయం: తొలి ఏడాదే రూ. 2 లక్షల ఆదాయం. ఆరేళ్ల నుంచి రూ. 6 లక్షల ఆదాయం.

    రైతు కరన్షి పర్మర్‌

ప్రతి రైతుకూ ఫుడ్‌ ఫారెస్ట్‌!
5 దొంతర్ల ఫుడ్‌ ఫారెస్ట్‌ నమూనా ఒక అద్భుతం. ఆహార సార్వభౌమత్వాన్ని, స్వావలంబనను అందించే ఫుడ్‌ ఫారెస్ట్‌ రైతు కుటుంబానికి ఎంతో అవసరం. కనీసం ఒక ఎకరంలో ఏర్పాటు చేసుకోవాలి. అనేక పంటలు పండించుకుంటూ ఇంటిల్లపాదీ తినటం, మిగతా పంటలను నేరుగా వినియోగదారులకే తాము నిర్ణయించిన ధరకు అమ్ముకోవటం ద్వారా ఏడాది పొడవునా మంచి ఆదాయం కూడా పొందవచ్చు.

రకరకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో పాటు పప్పుధాన్యాలు, ఔషధ మొక్కలు, మసాలా దినుసులు, చివరకు చిరుధాన్యాలను కూడా పండించుకోవటానికి ఈ నమూనాలో అవకాశం ఉంది. చెరకు సాగు చేసుకొని ఇంట్లోనే బెల్లం తయారు చేసుకోవచ్చు. నీరు నిలవని,సున్నపు రాళ్లు లేని భూముల్లో (రాళ్ల భూమైనా ఫర్వాలేదు) ఫుడ్‌ ఫారెస్ట్‌ను 5 అడుగుల వెడల్పున ఎత్తు మడులు చేసి, వాటి మధ్యన 3 అడుగుల కాలువలు తవ్వుకోవాలి. బెడ్స్‌ తయారు చేసుకోవడానికి ముందే వర్షం పడినప్పుడు లేదా తడులు పెట్టి అయినా రెండు సార్లు కలుపు మొలిపించి, నిర్మూలిస్తే ఆ తర్వాత ఇక కలుపు సమస్య ఉండదు.

దుక్కిలో ఎకరానికి 400 కిలోల ఘనజీవామృతం సరిపోతుంది. అయితే, గుజరాత్‌ రైతులు అందుబాటులో ఉంది కాబట్టి 2 వేల కిలోలు వేశారు.  దేశీ విత్తనాలు, రకాలే వాడాలి. నర్సరీ మొక్కలు వద్దు. సొంతంగానే మొక్కలను తయారు చేసుకొని నాటుకోవాలి. స్వావలంబన ద్వారా రైతులు అన్ని విధాలుగా సుస్థిరత సాధించాలి. 5 లేయర్‌ ఫుడ్‌ ఫారెస్ట్‌ల ద్వారా ఎకరానికి తొలి ఏడాదే రూ. 2 లక్షల (ఆరేళ్ల నుంచి రూ. 6 లక్షల) ఆదాయం పొందుతున్న ఈ రైతుల నుంచి దేశంలో 
రైతులందరూ స్ఫూర్తి పొందాలి. –  పద్మశ్రీ గ్రహీత డా. సుభాష్‌ పాలేకర్‌ (98503 52745)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement