Sagubadi: నేలపైన కాదు.. నేరుగా వేర్లకే 'తడి తగిలేలా'.. | Sagubadi: Water And Electricity Saving With Underground Drip | Sakshi
Sakshi News home page

Sagubadi: నేలపైన కాదు.. నేరుగా వేర్లకే 'తడి తగిలేలా'..

Published Tue, Apr 2 2024 8:18 AM | Last Updated on Tue, Apr 2 2024 8:31 AM

Sagubadi: Water And Electricity Saving With Underground Drip - Sakshi

‘స్వర్‌’ డ్రిప్‌ వ్యవస్థ ఇలా ఉంటుంది.

భూగర్భ డ్రిప్‌తో 50% నీరు, 30% విద్యుత్తు ఆదా

మామిడి, బత్తాయి తదితర పండ్ల, కూరగాయ తోటలకు రక్షణ

దీర్ఘకాలం మనుగడ సాగించే పండ్ల, పూల తోటల నుంచి కొద్ది నెలల్లో పంటకాలం ముగిసే సీజనల్‌ కూరగాయల సాగు వరకు నీటిని పొదుపుగా వాడుకోవటం అంటే వెంటనే అందరికీ గుర్తొచ్చేది చెట్ల దగ్గర మట్టిపై నీటిని చుక్కలు చుక్కలుగా వదిలే డ్రిప్‌ లైన్లు! అయితే, అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాడ్పుల కాలంలో బోర్లు ఎండిపోతూ ఉంటే.. పండ్ల, పూల తోటలను, కూరగాయ తోటలను రక్షించుకోవడానికి దీనికన్నా మెరుగైన మరో మార్గం ఉంది. అదే.. భూగర్భ డ్రిప్‌! నేల మీద నీరివ్వటం కాదు, భూమిలో వేర్లకే నేరుగా నీటి తేమ అందించటం!

భూతాపం ఏటేటా పెరిగిపోతున్న దశలో నీటి సవాళ్లు మరింత తీవ్రమవుతున్నాయి. దీనికి తగినట్లు నీటిని మరింత సమర్థవంతంగా వాడుకోవాల్సిన అవసరం వస్తోంది. ఇంతకుముందెన్నడూ ఎరుగని రీతిలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు పెచ్చుమీరుతుంటే.. ఉద్యాన తోటల సాగుకు నీటి లభ్యత తగ్గిపోతూ ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన కె.ఎస్‌. గోపాల్‌ ‘స్వర్‌’ (సిస్టం ఆఫ్‌ వాటర్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ రిజునవేషన్‌) పేరుతో వినూత్న డ్రిప్‌ను ఆవిష్కరించారు. సాధారణ డ్రిప్‌ భూమి పైనే నీటిని వదులుతూ ఉంటే.. ఈయన రూపొందించిన డ్రిప్‌ నేలపైన కాకుండా చెట్లు/మొక్కల వేర్ల దగ్గర భూగర్భంలో నీటి తేమను అతి పొదుపుగా వదులుతుంది.

సాధారణ డ్రిప్‌తో పోల్చితే కూడా సగానికి సగం నీరు ఆదా కావటంతో పాటు.. అతి తక్కువ నీరు అందుబాటులో ఉండే కరువు కాలపు మండు వేసవిలోనూ పండ్ల తోటలను కంటికి రెప్పలా కాపాడుకోవటానికి, తద్వారా వ్యవసాయాన్ని పునరుజ్జీవింపజేసుకోవడానికి ఈ భూగర్భ డ్రిప్‌ ‘స్వర్‌’ రైతులకు చక్కగా ఉపయోగపడుతోందని గోపాల్‌ ‘సాక్షి సాగుబడి’తో చె΄్పారు. 2019 మొదలుకొని ఇప్పటికి 8 రాష్ట్రాల్లో స్వర్‌ భూగర్భ డ్రిప్‌ను అనేక పండ్ల, కూరగాయ తోటల్లో అనేక సంస్థలతో కలిసి ప్రయోగాత్మకంగా ఉపయోగించి చూస్తూ సత్ఫలితాలు పొందుతున్నామన్నారాయన.

‘స్వర్‌’ ఎలా పనిచేస్తుంది?
భూగర్భంలో చెట్లు/ మొక్కల వేర్లకే నీటి తేమను అందించటమే ‘స్వర్‌’ భూగర్భ డ్రిప్‌ ప్రత్యేకత. సాధారణ ఆన్‌లైన్‌ డ్రిప్‌ లేటరల్‌ పైపునకు ఉండే డ్రిప్పర్‌ను తొలగించి, ‘స్వర్‌’ భూగర్భ డ్రిప్‌ బాక్సులను అమర్చితే సరిపోతుంది. దీని నిర్మాణం ఎలా ఉంటుందంటే.. అరచేతి సైజులో ఉండే ఒక ΄్లాస్టిక్‌ బాక్స్‌ ఉంటుంది. దానికి నిండా సన్నని బెజ్జాలుంటాయి. 5 ఎం.ఎం. మైక్రో ట్యూబ్‌తో ఒక చివర్న ఈ బాక్స్‌ను జోడించి.. మరో చివర భూమిపైన ఉండే డ్రిప్‌ లేటరల్‌ పైపులకు అమర్చాలి.

ఆ తర్వాత బాక్స్‌ను చెట్టు/మొక్క దగ్గర మట్టిని తవ్వి భూమి లోపల వేర్ల దగ్గర్లో పెట్టి, మట్టి కప్పెయ్యాలి. ఆ విధంగా ఈ భూగర్భ డ్రిప్‌ భూమి లోపల వేరు వ్యవస్థకు నీటి తేమను అందుబాటులోకి తెస్తుంది. మట్టి లోపల వేరు వ్యవస్థ దగ్గర ఉండే ఈ బాక్స్‌లో క్వార్ట్‌›్జ స్టోన్‌ గ్రాన్యూల్స్‌ ఉంటాయి. అవి నిరంతరం నీటì  తేమను మట్టి ద్వారా వేరు వ్యవస్థకు క్రమబద్ధంగా అందిస్తుంటాయి. బయటి నుంచి వేర్లు ఈ బాక్స్‌ లోపలికి అల్లుకొని దాని పనితీరును దెబ్బతీయకుండా ఉండేలా దీన్ని రూపొందించటం విశేషం. 

మామిడి, బత్తాయికి 4 డ్రిప్‌ బాక్సులు..
ఉద్యాన తోటల్లో చెట్ల వయసును, ఎత్తును బట్టి, మట్టి తీరును బట్టి ఒక్కో చెట్టుకు ఎన్ని డ్రిప్‌ బాక్సులను ఏర్పాటు చేసుకోవాలో, వేరు వ్యవస్థ వద్ద నేలలో ఎంత లోతులో ఏర్పాటు చేసుకోవాలో నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. చెట్టు మొదలు దగ్గర కాకుండా.. దాని కొమ్మలు విస్తరించిన చివరిలో పీచువేళ్లు అందుబాటులో ఉండే చోట్ల ఈ డ్రిప్‌ బాక్సులను ఏర్పాటు చేసుకోవటం ముఖ్యం.

ఎమ్మెస్‌ స్వామినాధన్‌ ఫౌండేషన్, వైజాగ్‌ కృషి విజ్ఞాన కేంద్రం, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ అయోవా, జిఐజడ్‌ వంటి సంస్థలతో కలిసి స్వర్‌ భూగర్భ డ్రిప్, లివింగ్‌ కంపోస్టుపై ప్రయోగాలు చేసి సత్ఫలితాలు సాధించామని గోపాల్‌ తెలిపారు. పెద్ద మామిడి చెట్టుకు 4 (12–16 అంగుళాల లోతులో) స్వర్‌ డ్రిప్‌ బాక్సులు, జామ చెట్టుకు 2 (12 అంగుళాల లోతులో), బత్తాయి చెట్టుకు 4 (12 అంగుళాల లోతులో), నిమ్మ చెట్టుకు 2 (6 అంగుళాల లోతులో), దానిమ్మ చెట్టుకు 2 (భగువ చెట్టుకు 4–5, గణేశ్‌ చెట్టుకు 6–7 అంగుళాల లోతులో), కొబ్బరి చెట్టుకు 4 (4–5 అంగుళాల లోతులో), మల్లె మొక్కకు 1 డ్రిప్‌ బాక్సు ఏర్పాటు చేసుకుంటే చాలని ప్రయోగాత్మక సాగులో తేలింది. రెండు చెరకు మొక్కలకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసి ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నామని గోపాల్‌ తెలిపారు.

50% నీరు, 30% విద్యుత్తు ఆదా..
భూగర్భ డ్రిప్‌ బాక్సుల ద్వారా వేరు వ్యవస్థకు నీటిని అందించటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వర్షాకాలంలో తప్ప కలుపు సమస్య ఉండదు. కాబట్టి రైతుకు శ్రమ, ఖర్చు తగ్గుతాయి. సాధారణ డ్రిప్‌తో పోల్చితే 50% నీరు, 30–40% విత్యుత్తు ఆదా అవుతుంది. డ్రిప్‌ ద్వారా ఇచ్చే ద్రవరూప ఎరువులు కూడా 30% ఆదా అవుతాయి. సౌర విద్యుత్తు ద్వారా నడిచే 5 హెచ్‌పి మోటారుకు బదులు 1.5 హెచ్‌.పి. మోటారు సరిపోతుంది. 10% అదనంగా పంట దిగుబడి వస్తుంది. అంతేకాదు, త్వరగా పూత వస్తుందని గోపాల్‌ చెబుతున్నారు.

అవార్డుల పంట..
సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ కన్‌సర్న్స్‌ (సిఇసి) తరఫున ‘స్వర్‌’ భూగర్భ డ్రిప్‌ వ్యవస్థను ఆవిష్కరించిన కె.ఎస్‌.గోపాల్‌కు 2023 అవార్డుల పంట పండించింది. న్యూఢిల్లీలోని ఐఎఆర్‌ఐలో పూసా కృషి పురస్కారం (రూ. 5 లక్షలు), ఫిక్కి ఉత్తమ నీటి సాంకేతికత పురస్కారం, రూ. 50 లక్షల యాక్ట్‌ గ్రాంటు లభించాయి. కేంద్ర జలశాఖ, యుఎన్‌డిపి, తెరి ఉమ్మడిగా 2024 ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలో ‘స్వర్‌’ ప్రథమ బహుమతిని గెల్చుకుంది.

తోటలు ఎండిపోకుండా కాపాడుకోవచ్చు!
సాధారణ డ్రిప్‌ వాడినప్పుడు చెట్టు/మొక్క దగ్గర ఉపరితలం నుంచి వేర్ల దగ్గరకు మట్టిని తడుపుకుంటూ నీరు వెళ్లాల్సి ఉంటుంది. ‘స్వర్‌’ భూగర్భ డ్రిప్‌ బాక్సులు ఏర్పాటు చేసుకుంటే ఆ అవసరం ఉండదు. నేరుగా వేర్లకే నీటి తేమను అందించవచ్చు. దీనివల్ల, నీటి వాడకం సగానికి సగం తగ్గిపోతుంది. మండు వేసవిలోనూ 3 నుంచి 5 రోజులకు ఒకసారి నీరిస్తే సరిపోతుంది.

అడుగు లోతులో నీటి తేమ ఎంత ఉందో సెన్సార్‌ ఆధారంగా తెలుసుకుంటూ.. నీటి అవసరం ఉన్నప్పుడు మాత్రమే, తగినంత నీటి తేమను, నెమ్మదిగా అందించటం వీలవుతుంది. తద్వారా తక్కువ నీటితోనే పండ్ల, పూల తోటలను, కూరగాయ తోటలను అధిక వేడి, హీట్‌వేవ్‌ కష్టకాలంలోనూ రక్షించుకోవటానికి అవకాశం ఉంది. భూగర్భ డ్రిప్‌ బాక్సు ధర గతంలో రూ. 50 ఉండేది. ఇజ్రేల్‌ కంపెనీ సహాయంతో దీన్ని రూ. 25కి తగ్గించగలిగాం.

– కె.ఎస్‌.గోపాల్‌ (98481 27794), ‘స్వర్‌’ భూగర్భ డ్రిప్‌ ఆవిష్కర్త, డైరెక్టర్, సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ కన్‌సర్న్స్,  హైదరాబాద్‌.

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

ఇవి చదవండి: కుండలు చేసే ఊరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement