కోకో సాగులో కళ్లు చెదిరే దిగుబడి!
రసాయనిక వ్యవసాయం నష్టదాయకంగా పరిణమించిన విషయాన్ని పూర్తిగా గ్రహించిన రైతులు కూడా సేంద్రియ సాగు పద్ధతిని చేపట్టాలనుకున్నప్పుడు వారి మనస్సులో నూరారు సందేహాలు తలెత్తుతుంటాయి.
ఇందులో మొదటిది సేంద్రియ విధానంలో సరైన దిగుబడులు వస్తాయా? అనేది. కానీ, సేంద్రియ సాగు విధానంలోకి అడుగుపెట్టి తొలిపంట నుంచే దిగుబడులు పెంచుకోవచ్చని చాటి చెబుతున్నారు కోకో రైతు కొత్తపల్లి శ్రీమహావిష్ణు(9959363689).
తూ. గో. జిల్లా ఆలమూరు మండలం మడికిలోని ఐదెకరాల కొబ్బరి తోటలో 1995 నుంచి కోకో పంటను ఆయన రసాయనిక పద్ధతిలో అంతర పంటగా సాగు చేస్తున్నారు. 2003 వరకు ఎకరాకు సగ టున 400 కేజీల దిగుబడి వచ్చింది. తరువాత క్రమేపీ తగ్గుతూ ఎకరాకు వంద కేజీలకు పడిపోయింది. అటువంటి దశలో సమీప బంధువు నరుకుల శ్రీహర్ష సూచన మేరకు 2012లో రెండెకరాల్లో సేంద్రియ సాగు చేపట్టారు. తొలి ఏడాది ఎకరాకు 200 కిలోలు, 2013లో ఎకరాకు 600 కేజీలకు పైగా దిగుబడి సాధించారు.
ఒక చెట్టు ఏకంగా 126 కాయలు కాసి చూపరులను అబ్బుర పరుస్తోంది. ఈ తోట పక్కనే ఇప్పటికీ రసాయనిక పద్ధతిలో సాగు చేస్తున్న 3 ఎకరాల్లో దిగుబడి ఎకరానికి సగటున 120 కేజీల స్థాయిలోనే ఉంది. ‘ఎకరాకు కేవలం రూ.16 వేల పెట్టుబడితో 600 కిలోల దిగుబడి సాధించాను. మిగిలిన మూడు ఎకరాల్లోనూ సేంద్రియ సాగు చేపడతా. డెరైక్టరేట్ ఆఫ్ క్యాజు అండ్ కోకో(కేరళ)కు చెందిన అధికారి వెంకటేశన్ కాంబ్లే మా తోటను చూసెళ్లడం మరచిపోలేని అనుభూతి’ అన్నారు శ్రీమహావిష్ణు.
- నిమ్మకాయల సతీష్‌బాబు, న్యూస్‌లైన్, అమలాపురం, తూ. గో. జిల్లా