సిరుల పంట.. సుస్థిర సేద్యపు బాట! | ustainable agricultural growth | Sakshi
Sakshi News home page

సిరుల పంట.. సుస్థిర సేద్యపు బాట!

Published Tue, Aug 18 2015 12:10 AM | Last Updated on Sun, Sep 3 2017 7:37 AM

సిరుల పంట..  సుస్థిర సేద్యపు బాట!

సిరుల పంట.. సుస్థిర సేద్యపు బాట!

స్థానిక సేంద్రియ వనరులతోనే సేద్యానికి పునరుజ్జీవం
పంచగవ్య, జీవామృతం, ఆముదం పిండి, వేప పిండితో చక్కని ఫలసాయం
2,700 చీనీ చెట్ల నుంచి 255 టన్నుల  దిగుబడి పొందిన రైతు రవీంద్రనాథరెడ్డి

 
రసాయనిక వ్యవసాయంలో అధిక పెట్టుబడులు పెట్టి ఎంత శ్రమపడినా ఫలసాయం నానాటికీ తీసికట్టుగా మారుతున్న అనుభవాలే ఎదురవుతున్నాయి. అయితే, శ్రద్ధ, పట్టుదలకు కాసింత సుస్థిర వ్యవసాయ పరిజ్ఞానాన్ని జోడిస్తే.. వ్యవసాయాన్ని రైతే పండుగగా మార్చుకోవచ్చని చాటుతున్నారు వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం కసనూరు గ్రామానికి చెందిన రైతు పెద్ద రవీంద్రనాథరెడ్డి. 30 ఎకరాల చీనీ తోటలో గత ఏడాది నుంచి సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయాన్ని చేపట్టారు.

వ్యవసాయంపై అమిత మక్కువ కలిగిన రైతు రవీంద్రనాథరెడ్డి. ప్రకృతి ప్రేమికుడు, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పితామహుడు అయిన సుభాష్ పాలేకర్ బోధనలను ఆకళింపు చేసుకున్నారు.శాస్త్రవేత్తల సూచనల మేరకు అందుబాటులో ఉన్న సేంద్రియ వనరులతో సుస్థిర వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తున్నారు. చీనీ, వేరుశనగ, చిరుధాన్యపు పంట కొర్రను సాగు చేస్తు పరిసర గ్రామాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రసాయనిక వ్యవసాయంతో విసిగిపోయిన ఆయన దీక్షగా అనుసరిస్తున్న సుస్థిర వ్యవసాయం ఏమిటో, పాటిస్తున్న పద్ధతులేమిటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..
 
సింహాద్రిపురం మండలం బోడివారిపల్లె-రావులకొలను గ్రామాల పరిసరాల్లో కనుచూపు మేరలో కనిపించేవన్నీ తువ్వ, ఎర్రనేలలే. వర్షాధారం లేదా బోర్ల కిందే పంటల సాగు. పెట్టుబడులు ఎంత పెట్టినా దిగుబడులు అంతంత మాత్రమే. అధిక దిగుబడుల ఆశతో పొలాల్లో బస్తాల కొద్దీ రసాయనిక ఎరువులు, లీటర్ల కొద్దీ పురుగు మందులు పోయడమే ఈ వ్యవసాయంలో ఉన్న అసలు సమస్య అన్న వాస్తవాన్ని గ్రహించాను. సేంద్రియ పద్ధతులను అవలంబించి సుస్థిర వ్యవసాయం చేస్తే భూమిలో గతంలో మాదిరిగా ఎర్రలు (భూమిలో బొరియలు చేస్తూ ఉండే వానపాములు) వృద్ధి చెందుతాయని, భూమి గుల్లబారి మెత్తగా మారుతుందని, కోరిన, ఆరోగ్యకరమైన పంటలు పండించవచ్చనే విషయాన్ని కొందరు శాస్త్రవేత్తల వద్ద నుంచి తెలుసుకొని సుస్థిర వ్యవసాయం దిశగా అడుగులు వేస్తున్నాను.
 
సుస్థిర సేద్యంతో భూసారం పెరిగింది

 వ్యవసాయమంటే ఒడుదుడుకులతో కూడుకున్నది. ఒక ఏడాది పంట బాగా పండితే మరో ఏడాది ప్రకృతి విపత్తులో లేక పురుగులో, తెగుళ్లో ఆశించి పంటలను దెబ్బతీస్తాయి. దీంతో పంటల సాగుకు పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు ఉండవు. ఈ దుస్థితి నుంచి బయట పడేందుకు సుస్థిర వ్యవసాయమే మార్గమని భావించాను. రసాయనిక వ్యవసాయం నుంచి ఈ పద్ధతిలోకి మారి భూసారం పెంచుకున్నాను. బండబారిన భూమి బాగా గుల్లబారుతోంది. ఎర్రలు సహజంగానే వృద్ధి చెందుతున్నాయి. పదునుపాటి వర్షం కురిసినప్పుడు భూమిలో జానెడు లోతు మట్టి తవ్వితే ఎర్రలు విరివిగా కనిపిస్తున్నాయి. ఏ పంట సాగు చేసినా నిర్భయంగా దిగుబడి తీయవచ్చని ఏడాది సుస్థిర వ్యవసాయ అనుభవం ద్వారా గ్రహించాను.

 జీవామృతం, పంచగవ్యతో పురుగులు, తెగుళ్లకు చెక్
 జీవామృతం, పంచగవ్య, ఆవు మూత్రంను డ్రిప్ ఇరిగేషన్‌కు ఉపయోగించే డ్రమ్ముల్లో పోసి నేరుగా పంటలకు అందిస్తున్నారు. దీంతో సూక్ష్మపోషకాలను వృద్ధి చేసే సూక్ష్మజీవులు, ఎర్రలు భూమిలో పుష్కలంగా పెరిగిపోయాయి. పంటలను దెబ్బతీసే తెగుళ్లు, పురుగులకు జీవామృతం, పంచగవ్య సింహస్వప్నంగా మారాయి. దీనివల్ల ఎలాంటి తెగుళ్లు, పురుగులు ఆశించకుండా చీనీ చెట్లు ఆరోగ్యంగా పెరుగుతూ కళకళలాడుతున్నాయి.

 జీవామృతం, పంచగవ్య తయారు చేయాలంటే నాటు ఆవు పేడ, మూత్రం కావాలి. అందుకే పొలంలోనే ఎనిమిది నాటు ఆవులను పెంచుతున్నాను. వాటి మూత్రాన్ని ప్రతి రోజు డ్రమ్ముల్లో నింపి తోటలోని చింతచెట్టు కింద భద్రపరచి జీవామృతం, పంచగవ్య తయారు చేస్తున్నాం. చీనీ చెట్లకు జీవామృతాన్ని ట్రాక్టర్‌కు అమర్చిన స్ప్రేయర్‌తో చెట్టు, మొదళ్ల వద్ద, చెట్టు అడుగున నేలను బాగా తడిచేలా పిచికారీ చేస్తాం. ఒక్కో చెట్టుకు పంచగవ్య కలిపిన నీరు 5 లీటర్ల వరకు పోస్తాం. 80 కిలోల పశువుల ఎరువు వేస్తాం. జీవామృతాన్ని అప్పుడప్పుడూ డ్రిప్ ద్వారా పంపిస్తుంటాము.

 నూనె తీయని ఆముదం, వేప పిండి మేలు
 సొంతంగా తయారు చేసుకున్న ఆముదం పిండి, వేప పిండినే చీనీ చెట్లకు వేస్తున్నాం. మార్కెట్‌లో అమ్మే పిండి నూనె తీసినది. దాన్ని వేసినా ఉపయోగం ఉండదు. అందుకని తోటలోనే పిండి మిల్లును ఏర్పాటు చేసుకున్నాను. ఆముదాలు, వేప కాయలను మిషనులో ఆడించి నూనె తోనే చెట్టుకు 10 కిలోల చొప్పున వేస్తున్నాం. పశువుల పేడను ఆరు నెలల పాటు మాగబెట్టి చీనీ చెట్లకు వేస్తున్నాం. ఇందుకోసం 50 లారీల ఎరువు పట్టే గుంత తవ్వించాను. ఆ గుంతలో పేడతోపాటు జిల్లేడు, కానుగ, మద్ది, నేలతంగేడు చెట్ల ఆకులను వేసి, తగుమాత్రంగా నీళ్లుపెడతాం. 6 నెలలు మాగిన పశువుల ఎరువును చీనీ చెట్లకు వేస్తున్నాం.

 దోమ, పల్లాకు, ఉడప మటుమాయం!
 జీవామృతం, పంచగవ్యం, ఆముదం పిండి, వేప పిండి చీనీ చెట్లను దెబ్బతీసే దోమ, పల్లాకు తెగులును సమర్థవంతంగా నియంత్రించాయి. పల్లాకు తెగులు పోయి ఆకులు నల్లగా నిగనిగలాడుతున్నాయి. ఎండుపుల్ల ఏ చెట్టులో వెతికినా కనిపించదు. పక్వానికి రాకముందే కాయ రాలిపోవడం (ఉడప) మటుమాయమైంది. సేంద్రియ ఎరువులు వేయడం వల్లనే ఇది సాధ్యమైందని అర్థమవుతోంది. పక్వానికి వచ్చేంత వరకూ ఒక్క కాయ కూడా నేల రాలడం లేదు.   

 నాణ్యత, నిల్వ సామర్థ్యంతో అధిక ధర
 సుస్థిర వ్యవ సాయం ద్వారా పండించే పంట ఉత్పత్తులకు మార్కెట్‌లో అధిక ధర పలుకుతుంది. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. నాణ్యత బాగుంటుంది. కాయల సైజు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ పద్ధతిలో సాగైన పూలు ఎంత దూరం తీసుకెళ్లినా నాలుగైదు రోజుల వరకు దెబ్బతినవు. అలాగే కూరగాయలు కూడా ఐదు రోజుల వరకు చెడిపోవని వ్యాపారులే స్వయంగా చెబుతున్నారు. ఈ ఉత్పత్తులను వినియోగదారులు కూడా ఇష్టపడుతున్నారు. అందువల్లే సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్‌లో ధర ఎక్కువ పలుకుతోంది.
 - ప్రభాకర్‌రెడ్డి, కడప అగ్రికల్చర్
 
 మా చీనీ తోటకు 30 ఏళ్లు ఢోకా లేదు!
 పశువుల ఎరువు, వేప పిండితోపాటు రసాయనిక ఎరువులు చాలా తక్కువ వేసిన రోజుల్లో చీనీ తోటలు 25-30 ఏళ్లు చక్కని దిగుబడినిచ్చేవి. ఇప్పుడు రసాయనిక ఎరువులు ఎక్కువ వేస్తున్నందు వల్ల 15-18 ఏళ్లకే చెట్లు పోతున్నాయి. నా చీనీ తోట 30 ఎకరాలు. పన్నెండేళ్ల ఈ తోటలో 2,700 చెట్లున్నాయి. ఐఐఐటికి చెందిన డా. గున్నంరెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి (99082 24649) సూచనలతో ఏడాదిగా సుస్థిర సేద్య పద్ధతులను అవలంబిస్తున్నాను. చెట్లు బాగా ఆరోగ్యంగా తయారయ్యాయి. చాలా మార్పు వచ్చింది. తొలి పంటగా ఈ సీజన్‌లో 255 టన్నుల దిగుబడి వచ్చింది. కిలో రూ.35ల ధర పలకడంతో మంచి ఆదాయమే వచ్చింది. రాబోయే రోజుల్లో మరింత మేలైన దిగుబడులు సాధిస్తానన్న నమ్మకం ఉంది. మా తోటలో ప్రతి చెట్టూ ఆరోగ్యంగా ఉంది. తోట 30 ఏళ్ల వయసు వరకు నిశ్చింతగా ఫలసాయాన్నిస్తుందన్న నమ్మకం కుదిరింది. మిగతా పొలాన్ని కూడా ఇలాగే సాగు చేయబోతున్నా. ఇతర రైతుల్లోనూ చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తా.
 - పెద్ద రవీంద్రనాథరెడ్డి (98663 14080),
 కసనూరు, సింహాద్రిపురం మండలం, వైఎస్సార్ జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement