ఇటు రైతు ఆదాయ భద్రతకు, అటు వినియోగదారుల ఆరోగ్య భద్రతకు దేశీ వంగడాలతో ప్రకృతి సేద్యమే ఆశాదీపమని చాటిచెబుతున్నారు యువ రైతు యనమల జగదీష్‌రెడ్డి. దేశంలో ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి ముఖ్య కారకుడైన సుభాష్ పాలేకర్ బాటలో పయనిస్తున్నారు. రసాయనిక అవశేషాల్లేని అమృతాహార ఉత్పత్తులను హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలోని 200కు పైగా కుటుంబాలకు నేరుగా విక్రయిస్తూ ‘ఫ్యామిలీ ఫార్మర్’గా గుర్తింపు పొందారు.
చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలం దండువారిపల్లెకు చెందిన జగదీష్‌రెడ్డి వ్యవసాయ కుటుంబంలో పుట్టి పాలిటెక్నిక్ కోర్సును మధ్యలో ఆపేసి వ్యవసాయం బాట పట్టారు. 20 ఎకరాల పొలంలో తొలుత అందరి మాదిరిగానే రసాయనిక వ్యవసాయం చేశారు. ఆశించిన ఫలితం లేక పోగా రసాయనాల వాడకం వల్ల పర్యావరణంతో పాటు ప్రజారోగ్యానికి హాని కలుగుతోందని పాలేకర్ ద్వారా తెలుసుకొని ప్రకృతి సేద్యం చేపట్టారు.
వ్యవసాయ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఐసీఏఆర్ అనుబంధ సంస్థ అయిన భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐ.ఎ.ఆర్.ఐ.) నుంచి మూడేళ్ల వ్యవధిలో రెండు అవార్డులను సొంతం చేసుకున్నారు. 2019లో ఐ.ఎ.ఆర్.ఐ. ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డును అందుకున్నారు. ‘ఐ.ఎ.ఆర్.ఐ. ఫెలో అవార్డు’ను గత నెల 11న పూసాలో జరిగిన కృషి విజ్ఞాన్ మేళాలో అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జగదీష్‌రెడ్డిని అభినందించటం విశేషం.
2012లో తిరుపతి నగరంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై పాలేకర్ 5 రోజుల శిక్షణా తరగతుల్లో జగదీష్‌రెడ్డి పాల్గొన్నారు. రసాయనిక వ్యవసాయం రైతులకు ఎన్ని విధాలా నష్టదాయకంగా పరిణమించిందో శాస్త్రీయంగా వివరిస్తూ పాలేకర్ ఇచ్చిన సందేశం ఆయనను ఆకట్టుకుంది. ఆ విధంగా పాలేకర్ స్పూర్తితో జగదీష్‌రెడ్డి ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేశారు. ఏడేళ్లుగా పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో రకరకాల పంటలు సాగు చేస్తున్నారు.
ఎంత ఆరోగ్యదాయక పోషకాలను పండిస్తున్నాం?
జగదీష్‌రెడ్డి 13 ఎకరాల్లో మామిడి, 5 రకాల దేశీ వరి, కొద్ది విస్తీర్ణంలో చెరకు, వేరుశనగ, చిరుధాన్యాలు తదితర పంటలు పండిస్తున్నారు. దేశీ వరి రకాల దిగుబడి తక్కువైనప్పటికీ ఆరోగ్య రక్షక పోషకాల గనులైనందున ప్రజలు ఆదరిస్తున్నారని, దిగుబడి ఎంతని కాకుండా ఎంత ఆరోగ్యదాయక పోషకాలను పండిస్తున్నామన్నది అందరూ గ్రహించాలని ఆయన అంటారు.
పంటలకు ముందు జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట పంటలను సాగు చేసి కలియదున్నుతారు. దేశీయ ఆవు పేడ, మూత్రం తదితరాలతో ఘనజీవామృతం, జీవామృతం, బీజామృతం, ఆచ్ఛాదన వంటి ప్రకృతి వ్యవసాయ మౌలిక సూత్రాలను పాటిస్తున్నారు. మామిడి తోటలో చెట్ల మధ్య దుక్కి చేయకుండా సాగు చేస్తుండటం విశేషం. నవార, ఇంద్రాణి, కుజిపటాలియా తదితర దేశీ రకాల ధాన్యాన్ని మర పట్టించి ముడి బియ్యంతోపాటు.. ఈ బియ్యంతోపాటు ఔషధ, సుగంధ ద్రవ్యాలను జోడించి పోషక పొడుల (బూస్టర్ పౌడర్స్)ను తయారు చేసి విక్రయిస్తున్నారు.
ఈ పొడులతో హెల్త్ డ్రింక్స్ తయారు చేసుకొని తాగుతున్న వారు జీవనశైలి వ్యాధులను జయించడంతో పాటు మందులు వాడాల్సిన అవసరం తగ్గిపోతున్నదని ఆయన తెలిపారు. చెరకుతో బెల్లం తయారు చేసుకుంటారు. చిరుధాన్యాలతో మురుకులు, వేరుశనగలతో బెల్లం ఉండలు, పల్లికారం పొడులతోపాటు గానుగ నూనెలను సైతం ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నారు. పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. తాను పండించిన పంటలతో తయారు చేసిన 20 రకాల ఉత్పత్తులను ప్రజలకు నేరుగా విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. ప్రాణహిత పేరుతో కంపెనీని ఏర్పాటు చేశానని, అమెజాన్ ద్వారా కూడా ఉత్పత్తులను విక్రయిస్తానన్నారు.
‘పంటల సాగు కోసం రసాయన ఎరువులు, పురుగుల మందులను విచ్చల విడిగా వినియోగిస్తూ భూమిని కలుషితం చేయడం తగదు. రసాయనాల మూలంగా సాగు భూమి సహజత్వాన్ని, జీవాన్ని కోల్పోతోంది. పంటలు సాగు చేసుకుని జీవిస్తూనే.. భూమి సహజత్వాన్ని, సారవంతమైన భూమిని యథాతథంగా భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది..’ అంటున్నారు జగదీష్‌రెడ్డి.
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ఆవశ్యకత, సాగు పద్ధతులు, దళారులు లేని డైరెక్ట్ మార్కెటింగ్ మెళకువల గురించి వాట్సప్, ఫేస్‌బుక్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. పాలేకర్ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా 50 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యంతో ఆరోగ్యకరమైన పంటలను సాగు చేస్తున్నారని జగదీష్‌రెడ్డి అన్నారు. ప్రకృతి సేద్యంపై సలహాల కోసం తనకు ఫోన్ చేయవచ్చన్నారు.
– బాబన్నగారి శివశంకర్, సాక్షి, బంగారుపాళెం, చిత్తూరు జిల్లా
‘ఫ్యామిలీ ఫార్మర్’ అవసరాన్ని గుర్తెరగాలి
ప్రకృతి ఆహారానికి రోజురోజుకూ విలువ పెరుగుతోంది. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు నికరాదాయాన్ని పెంచుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాక, రైతు కుటుంబం – సమాజం ఆరోగ్యదాయకంగా మనుగడ సాగించడానికి, భూమి – పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతున్నది. పోషకాల గనులైన దేశీ వంగడాలతో ప్రకృతి వ్యవసాయం చేయటం ముఖ్యం.
తదుపరి తరం ఆరోగ్యంగా ఉండే ఆహారం ప్రాధాన్యాన్ని సమాజంలో అందరూ గ్రహించాలి. ఫ్యామిలీ ఫార్మర్ అవసరాన్ని గుర్తెరగాలి. అప్పుడు ఫ్యామిలీ డాక్టర్ అవసరం రాకుండా ఉంటుంది. ఆరుగాలం కష్టించి పనిచేసి ప్రకృతి వ్యవసాయం చేసే రైతుతో ఎంత బిజీగా ఉన్నా ప్రతి ఒక్కరూ నెలకు కనీసం 5 నిమిషాలు మాట్లాడితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి.
– యనమల జగదీష్‌రెడ్డి (94400 44279), ఐఎఆర్‌ఐ ఇన్నోవేటివ్ ఫార్మర్, ఫెలో అవార్డుల గ్రహీత, దండువారిపల్లె, బంగారుపాళెం మండలం, చిత్తూరు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment