jagadeeswar reddy
-
20 ఎకరాల్లో ప్రకృతి సేద్యం.. 200కు పైగా కుటుంబాలకు నేరుగా విక్రయిస్తూ..
ఇటు రైతు ఆదాయ భద్రతకు, అటు వినియోగదారుల ఆరోగ్య భద్రతకు దేశీ వంగడాలతో ప్రకృతి సేద్యమే ఆశాదీపమని చాటిచెబుతున్నారు యువ రైతు యనమల జగదీష్‌రెడ్డి. దేశంలో ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి ముఖ్య కారకుడైన సుభాష్ పాలేకర్ బాటలో పయనిస్తున్నారు. రసాయనిక అవశేషాల్లేని అమృతాహార ఉత్పత్తులను హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలోని 200కు పైగా కుటుంబాలకు నేరుగా విక్రయిస్తూ ‘ఫ్యామిలీ ఫార్మర్’గా గుర్తింపు పొందారు. చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలం దండువారిపల్లెకు చెందిన జగదీష్‌రెడ్డి వ్యవసాయ కుటుంబంలో పుట్టి పాలిటెక్నిక్ కోర్సును మధ్యలో ఆపేసి వ్యవసాయం బాట పట్టారు. 20 ఎకరాల పొలంలో తొలుత అందరి మాదిరిగానే రసాయనిక వ్యవసాయం చేశారు. ఆశించిన ఫలితం లేక పోగా రసాయనాల వాడకం వల్ల పర్యావరణంతో పాటు ప్రజారోగ్యానికి హాని కలుగుతోందని పాలేకర్ ద్వారా తెలుసుకొని ప్రకృతి సేద్యం చేపట్టారు. వ్యవసాయ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఐసీఏఆర్ అనుబంధ సంస్థ అయిన భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐ.ఎ.ఆర్.ఐ.) నుంచి మూడేళ్ల వ్యవధిలో రెండు అవార్డులను సొంతం చేసుకున్నారు. 2019లో ఐ.ఎ.ఆర్.ఐ. ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డును అందుకున్నారు. ‘ఐ.ఎ.ఆర్.ఐ. ఫెలో అవార్డు’ను గత నెల 11న పూసాలో జరిగిన కృషి విజ్ఞాన్ మేళాలో అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జగదీష్‌రెడ్డిని అభినందించటం విశేషం. 2012లో తిరుపతి నగరంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై పాలేకర్ 5 రోజుల శిక్షణా తరగతుల్లో జగదీష్‌రెడ్డి పాల్గొన్నారు. రసాయనిక వ్యవసాయం రైతులకు ఎన్ని విధాలా నష్టదాయకంగా పరిణమించిందో శాస్త్రీయంగా వివరిస్తూ పాలేకర్ ఇచ్చిన సందేశం ఆయనను ఆకట్టుకుంది. ఆ విధంగా పాలేకర్ స్పూర్తితో జగదీష్‌రెడ్డి ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేశారు. ఏడేళ్లుగా పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో రకరకాల పంటలు సాగు చేస్తున్నారు. ఎంత ఆరోగ్యదాయక పోషకాలను పండిస్తున్నాం? జగదీష్‌రెడ్డి 13 ఎకరాల్లో మామిడి, 5 రకాల దేశీ వరి, కొద్ది విస్తీర్ణంలో చెరకు, వేరుశనగ, చిరుధాన్యాలు తదితర పంటలు పండిస్తున్నారు. దేశీ వరి రకాల దిగుబడి తక్కువైనప్పటికీ ఆరోగ్య రక్షక పోషకాల గనులైనందున ప్రజలు ఆదరిస్తున్నారని, దిగుబడి ఎంతని కాకుండా ఎంత ఆరోగ్యదాయక పోషకాలను పండిస్తున్నామన్నది అందరూ గ్రహించాలని ఆయన అంటారు. పంటలకు ముందు జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట పంటలను సాగు చేసి కలియదున్నుతారు. దేశీయ ఆవు పేడ, మూత్రం తదితరాలతో ఘనజీవామృతం, జీవామృతం, బీజామృతం, ఆచ్ఛాదన వంటి ప్రకృతి వ్యవసాయ మౌలిక సూత్రాలను పాటిస్తున్నారు. మామిడి తోటలో చెట్ల మధ్య దుక్కి చేయకుండా సాగు చేస్తుండటం విశేషం. నవార, ఇంద్రాణి, కుజిపటాలియా తదితర దేశీ రకాల ధాన్యాన్ని మర పట్టించి ముడి బియ్యంతోపాటు.. ఈ బియ్యంతోపాటు ఔషధ, సుగంధ ద్రవ్యాలను జోడించి పోషక పొడుల (బూస్టర్ పౌడర్స్)ను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ పొడులతో హెల్త్ డ్రింక్స్ తయారు చేసుకొని తాగుతున్న వారు జీవనశైలి వ్యాధులను జయించడంతో పాటు మందులు వాడాల్సిన అవసరం తగ్గిపోతున్నదని ఆయన తెలిపారు. చెరకుతో బెల్లం తయారు చేసుకుంటారు. చిరుధాన్యాలతో మురుకులు, వేరుశనగలతో బెల్లం ఉండలు, పల్లికారం పొడులతోపాటు గానుగ నూనెలను సైతం ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నారు. పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. తాను పండించిన పంటలతో తయారు చేసిన 20 రకాల ఉత్పత్తులను ప్రజలకు నేరుగా విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. ప్రాణహిత పేరుతో కంపెనీని ఏర్పాటు చేశానని, అమెజాన్ ద్వారా కూడా ఉత్పత్తులను విక్రయిస్తానన్నారు. ‘పంటల సాగు కోసం రసాయన ఎరువులు, పురుగుల మందులను విచ్చల విడిగా వినియోగిస్తూ భూమిని కలుషితం చేయడం తగదు. రసాయనాల మూలంగా సాగు భూమి సహజత్వాన్ని, జీవాన్ని కోల్పోతోంది. పంటలు సాగు చేసుకుని జీవిస్తూనే.. భూమి సహజత్వాన్ని, సారవంతమైన భూమిని యథాతథంగా భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది..’ అంటున్నారు జగదీష్‌రెడ్డి. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ఆవశ్యకత, సాగు పద్ధతులు, దళారులు లేని డైరెక్ట్ మార్కెటింగ్ మెళకువల గురించి వాట్సప్, ఫేస్బుక్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. పాలేకర్ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా 50 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యంతో ఆరోగ్యకరమైన పంటలను సాగు చేస్తున్నారని జగదీష్‌రెడ్డి అన్నారు. ప్రకృతి సేద్యంపై సలహాల కోసం తనకు ఫోన్ చేయవచ్చన్నారు. – బాబన్నగారి శివశంకర్, సాక్షి, బంగారుపాళెం, చిత్తూరు జిల్లా ‘ఫ్యామిలీ ఫార్మర్’ అవసరాన్ని గుర్తెరగాలి ప్రకృతి ఆహారానికి రోజురోజుకూ విలువ పెరుగుతోంది. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు నికరాదాయాన్ని పెంచుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాక, రైతు కుటుంబం – సమాజం ఆరోగ్యదాయకంగా మనుగడ సాగించడానికి, భూమి – పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతున్నది. పోషకాల గనులైన దేశీ వంగడాలతో ప్రకృతి వ్యవసాయం చేయటం ముఖ్యం. తదుపరి తరం ఆరోగ్యంగా ఉండే ఆహారం ప్రాధాన్యాన్ని సమాజంలో అందరూ గ్రహించాలి. ఫ్యామిలీ ఫార్మర్ అవసరాన్ని గుర్తెరగాలి. అప్పుడు ఫ్యామిలీ డాక్టర్ అవసరం రాకుండా ఉంటుంది. ఆరుగాలం కష్టించి పనిచేసి ప్రకృతి వ్యవసాయం చేసే రైతుతో ఎంత బిజీగా ఉన్నా ప్రతి ఒక్కరూ నెలకు కనీసం 5 నిమిషాలు మాట్లాడితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. – యనమల జగదీష్‌రెడ్డి (94400 44279), ఐఎఆర్ఐ ఇన్నోవేటివ్ ఫార్మర్, ఫెలో అవార్డుల గ్రహీత, దండువారిపల్లె, బంగారుపాళెం మండలం, చిత్తూరు జిల్లా -
కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలం
సాక్షి, తుంగతుర్తి : గోదావరి జలాల కోసం 50 ఏళ్లుగా పోరాడాం.. వేయి కళ్లతో ఎదురుచూశాం.. కానీ చుక్కనీరు రాలేదు. కాళేశ్వరం జలాల పుణ్యమాని ప్రస్తుతం జిల్లా సస్యశ్యామలంగా మారిందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిలు పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెం గ్రామంలో సీనియర్ జర్నలిస్టు, రచయిత వర్ధెల్లి వెంకటేశ్వర్లు రచించిన పిట్టవాలిన చెట్టు పుస్తకాన్ని ఆదివారం తుంగతుర్తి, దుబ్బాక ఎమ్మెల్యేలు డాక్టర్ గాదరి కిశోర్‌కుమార్, సోలిపేట రామలింగారెడ్డి, ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జెడ్పీచైర్‌పర్సన్ గుజ్జ దీపికయుగేందర్రావులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తకావిష్కరణ సభలో వారు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో మొదటి ఫలాలు సూర్యాపేట జిల్లాకే దక్కాయన్నారు. జిల్లా పరిస్థితిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని మొట్టమొదట జిల్లాకు విడుదల చేయించారని గుర్తుచేశారు. రెండు నెలల నుంచి కాళేశ్వరం జలాలు నిరంతరాయంగా జిల్లాకు వస్తున్నాయన్నారు. దీంతో జిల్లాలోని చెరువులు, కుంట లు నిండి, నీటితో కళకళలాడుతున్నాయన్నారు. కేసీఆర్ సీఎం కాకపోతే కాళేశ్వరం జలాలు వచ్చేవి కావు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే మరో వెయ్యి జన్మలెత్తినా కాళేశ్వరం జలాలు వచ్చేవి కావన్నారు. హుజూర్నగర్ ఎన్నికలు అయ్యాక సీఎం కేసీఆర్ అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెల్పడానికి వెళ్తున్న సందర్భంగా సూర్యాపేట ప్రాంతంలో ఆగి గోదావరి జలాలను చూసినప్పుడు ఆయన కళ్లల్లో ఆనందం మాటల్లో చెప్పలేనిదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆయన కళ్లల్లో చూసిన ఆనందం మళ్లీ కాళేశ్వరం జలాలు చూశాక వచ్చిందన్నారు. సమైక్యాంధ్రలో నిర్మించిన ఎస్సారెస్పీ కాలువలు అధ్వానంగా ఉండడం వల్ల 69 డీబీఎం పరిధిలో మరికొన్ని చెరువులకు నీరుపోవడం లేదని ఆ పరిస్థితిని ప్రస్తుతం చక్కదిద్దనున్నట్లు చెప్పారు. దివంగత నేతలు భీంరెడ్డి నర్సింహారెడ్డి, వర్ధెల్లి బుచ్చిరాములు బతికి ఉంటే గోదావరి జలాలను చూసి ఎంతో ఆనందపడేవారని గుర్తుచేశారు. తాము చేసిన పోరాటాల ఫలితంగానే నేడు గోదావరి జలాల వస్తున్నాయని వారి ఆత్మలు ప్రస్తుతం శాంతిస్తాయని చెప్పారు. చెరువులు నిండితేనే ఊర్లు పచ్చగా ఉండి రైతులు సంతోషంగా ఉంటారని అన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్‌కుమార్ మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గంలో 60 ఏళ్లుగా జరగని అభివృద్ధిని కేవలం 5ఏళ్లలో సాధించానని గుర్తుచేశారు. కాళేశ్వరం జలాలతో చెరువులు, కుంటలు నింపడానికి తన శాయశక్తులా కృషి చేశానని తెలిపారు. గతంలో నియోజవర్గంలో హత్యలతో రక్తం పారిందని, కానీ ప్రస్తుతం వాటికి స్వస్తిపలికి గోదావరి జలాలతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నాని చెప్పారు. రాష్ట్రంలో అత్యధికంగా చెరువులున్నది తుంగతుర్తి నియోజకవర్గమేనని తెలిపారు. గోదావరి జలాలతో చెరువులు కుంటలు నింపడంతో తన జీవితం ధన్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు గోరెటి వెంకన్న, తెంజు రాష్ట్ర అధ్యక్షుడు ఇస్మాయిల్, పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ మనోజ, జేసీ సంజీవరెడ్డి, జెడ్పీవైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, పోలెబోయిన నర్సయ్యయాదవ్, జిల్లా చైర్మన్ ఎస్ఏ రజాక్, ఎంపీపీ గుండగాని కవితరాములుగౌడ్, వర్ధెల్లి శ్రీహరి, క్రిష్ణ, వజ్జ వీరయ్యయాదవ్, ఎన్.అయోధ్య, వైస్‌ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం, సర్పంచ్ నకిరేకంటి విజయ్, బుద్ద సత్యనారాయణ, సీనియర్ జర్నలిస్టు అబ్దుల్లా, గుడిపాటి సైదులు, వెంకటనారాయణ, సీతయ్య, వివిధ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వర్ధెల్లికి పలువురి అభినందన సీనియర్ జర్నలిస్టు, పిట్టవాలిన చెట్టు పుస్తక రచయిత వర్ధెల్లి వెంకటేశ్వర్లును ఈ సందర్భంగా మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్యేలు డాక్టర్ గాదరి కిశోర్‌కుమార్, రామలింగారెడ్డితో పాటు పలువురు అభినందించారు. గతంలో చెంచులపై మరణం అంచున, ప్రస్తుతం చెరువుల పునరుద్ధరణపై పిట్ట వాలిన చెట్టు అనే పుస్తకాలను రాయడం అభినందనీయమన్నారు. సామాజిక సృహ ఉన్న జర్నలిస్టు అని కొనియాడారు. తన నిధుల నుంచి ఈ పుస్తకానికి అయ్యే ఖర్చుకు సాయం అందిస్తానని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ ప్రకటించారు. చరిత్రను గుర్తుచేయడం కోసమే ఇలాంటి పుస్తకాలను రాస్తున్నారని చెప్పారు. మంచి రచయితగా మరింత పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. రచయిత వెంకటేశ్వర్లు కోరిక మేరకు ఆయన స్వగ్రామం కొత్తగూడెంకు కావాలి్సన నిధులు మంజూరు చేసి అన్నిరంగాల్లో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. మంత్రులకు ఘన స్వాగతం రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డిలకు ఆదివారం ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ఆధ్వర్యంలో తుంగతుర్తి నుంచి కొత్తగూడెం వరకు భారీ బైక్‌ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. అలాగే కొత్తగూడెం గ్రామస్తులు బతుకమ్మలు, కోలాటాల బృందంతో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా వెన్నెల నాగరాజు కళాబృందం ఆధ్వర్యంలో వివిధ రకాల కళాప్రదర్శనలు ఇచ్చారు. అలాగే గోరెటి వెంకన్న పాడిన పాటలు ప్రజలను ఉర్రూతలూగించాయి. కాగా యాదవసంఘం ఆధ్వర్యంలో మంత్రులకు గొర్రెపిల్లలను, గొంగడిని బహూకరించారు. -
నల్లగొండ సిగలో.. మరో పదవి!
సాక్షి, నల్లగొండ : నల్లగొండ జిల్లాకు మరో పదవి దక్కనుంది. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన గుత్తా సుఖేందర్‌రెడ్డికి శాసనమండలి చైర్మన్ పదవిని ఇవ్వాలని అధికార టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆదివారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు అవకాశం దక్కలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఇప్పటికే సూర్యాపేట నుంచి జగదీశ్వర్‌రెడ్డి మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, రెండో మంత్రి పదవి జిల్లాకు దక్కుతుందని భావించినా చివరకు నిరాశే మిగిలింది. ఆదివారం జరిగిన విస్తరణలో జిల్లా మంత్రి జగదీశ్వర్‌రెడ్డిని విద్యాశాఖ నుంచి తిరిగి విద్యుత్ శాఖకు మార్చడం మినహా జిల్లా నుంచి ఎవరినీ కేబినెట్లోకి తీసుకోలేదు. వాస్తవానికి ఈ సారి మంత్రి వర్గంలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పదవులు ఆశించారు. విస్తరణకు ఒక రోజు ముందుగానే, సునీతను శాసనసభలో ప్రభుత్వ విప్‌గా నియమించడంతో రేసులో గుత్తా సుఖేందర్‌రెడ్డి ఒక్కరే మిగిలారు. గత ప్రభుత్వంలోనే ఆయన పదవిని ఆశించారు. కాంగ్రెస్ ఎంపీగా ఉండి టీఆర్ఎస్లో చేరిన ఆయనకు ఆనాడే సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. నాడు మంత్రిగా అవకాశం కల్పించే వీలు లేకనే రాష్ట్ర రైతు సమన్వయ సమి తి అధ్యక్ష పదవి కట్టబెట్టారని పార్టీ శ్రేణుల్లో ఓ అభిప్రాయం బలంగా ఉంది. ఇక, 2018 ముందస్తు ఎన్నికల్లో ఘన విజయంతో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎంపీ పదవి ముగిశాక జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం కల్పించారు. ఎమ్మెల్యే కోటాలో ఆయ న ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ అయ్యారు. అప్పటి నుంచి గుత్తా మంత్రి పదవి రేసులో ఉన్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగితే కచ్చితంగా ఆయనకు స్థానం ఉంటుందని భావించారు. అదే స్థాయిలో వార్తలు కూడా వెలువడ్డాయి. కానీ, ఆదివారం నాటి విస్తరణలో కొత్తగా ఆరుగురిని కేబినెట్లోకి తీసుకోగా అందులో ఇద్దరు గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వారే. మిగిలిన నలుగురిని కొత్తగా కేబినెట్లో చేర్చుకున్నారు. ఈ కారణంగానే గుత్తా అనుచర వర్గంలో కొంత నిరాశ వ్యక్తమైంది. మండలి చైర్మన్‌గా ‘గుత్తా’కు అవకాశం? వివిధ సమీకరణలు, కారణాల నేపథ్యంలోనే సుఖేందర్‌రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం కల్పించలేకపోవడంతో ఆయనకు శాసనమండలి చైర్మన్ పదవిని ఇవ్వాలని అధికార టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ శాసన మండలి తొలి చైర్మన్‌గా పనిచేసిన స్వామిగౌడ్ పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం ఇన్చార్జ్ చైర్మన్‌గా మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ కొనసాగుతున్నారు. ఉభయ సభల బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో శాసనమండలికి పూర్తికాలపు చైర్మన్ నియమించాలని నిర్ణయించడంతో ఆ పదవి గుత్తాకు కట్టబెట్టనున్నారని సమాచారం. చైర్మన్ పదవికి ఆయన పేరును అధికారికంగా ప్రకటించి సోమవారం నామినేషన్ దాఖలు చేయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి పదవిని ఆశించిన గుత్తాకు చివరకు మండలి చైర్మన్ పదవి అందిరానుంది. ఒకే జిల్లా నుంచి చైర్మన్, వైస్ చైర్మన్.. శాసన మండలి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఒకే జిల్లాకు రానున్నాయి. ఇప్పటికే వైస్ చైర్మన్‌గా నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన నేతి విద్యాసాగర్ కొనసాగుతున్నారు. ఇప్పుడు చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డికి అవకాశం దక్కితే ఒకే జిల్లా, ఒకే నియోజకవర్గం నుంచి చైర్మన్, వైస్ చైర్మన్ పోస్టులు దక్కినట్లు అవుతుంది. మరోవైపు నల్లగొండ ఉమ్మడి జిల్లా మంత్రి జి.జగదీశ్వర్‌రెడ్డి శాఖ మార్పు జరిగింది. ఆయనను విద్యాశాఖ నుంచి విద్యుత్ శాఖకు మార్చారు. టీఆర్ఎస్ తొలి ప్రభుత్వం 2014లో ఏర్పాటైనప్పుడు కూడా జగదీశ్‌రెడ్డికి తొలుత విద్యాశాఖను కేటాయించి, ఆ తర్వాత మార్పులు చేర్పుల్లో భాగంగా ఆయనకు కీలకమైన విద్యుత్ శాఖ బాధ్యతలను అప్పజెప్పారు. 2018 ఎన్నికల్లో విజయం తర్వాత ఏర్పాటైన రెండో ప్రభుత్వంలో కూడా ఆయనకు తొలుత విద్యాశాఖను అప్పగించారు. అయితే, ఆదివారం నాటి కేబినెట్ విస్తరణలో విద్యాశాఖను సబితా ఇంద్రారెడ్డికి కేటాయించారు. ఇన్నాళ్లూ సీఎం కేసీఆర్ వద్దే ఉన్న విద్యుత్ శాఖను మళ్లీ జగదీశ్‌రెడ్డికే అప్పగించారు. -
మూడు రోజుల్లో ‘ఇంటర్’ నివేదిక
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఫలితాల విషయంలో వస్తున్న అపోహలను నివృత్తి చేసేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. టీఎస్టీఎస్ ఎండీ వెంకటేశ్వరరావుతో పాటు హైదరాబాద్ బిట్స్‌కు చెందిన ప్రొఫెసర్ వాసన్, ఐఐటీ ప్రొఫెసర్ నిశాంత్‌లతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇంటర్ ఫలితాల విషయంలో సత్వర దర్యాప్తు జరిపి మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించారు. ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళంపై ఆదివారం ఆయన విద్యా శాఖ కార్యదర్శి జనార్దనరెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్ ఫలితాల విషయంలో తల్లిదండ్రులెవరూ గందరగోళానికి గురికావద్దని సూచించారు. కొందరు అధికార అంతర్గత తగాదాల వల్లే ఈ విషయంలో అపోహలు వచ్చాయని వెల్లడించారు. ఫలితాల విషయంలో ఎలాంటి పొరపాటు జరిగినా సరిదిద్దుతామని హామీ ఇచ్చారు. ప్రొఫెసర్ వాసన్ ఐటీ విషయంలో, నిశాంత్ పోటీ పరీక్షల నిర్వహణలో నిపుణులని, వారిచ్చే నివేదిక మేరకు ఏ ఒక్క విద్యార్థికీ నష్టం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఫలితాల్లో ఎక్కడైనా తప్పులు వచ్చాయని భావిస్తే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌లకు దరఖాస్తు చేసుకోవాలని, తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. -
బరిలో హేమాహేమీలు.. ఎన్నికల పోరు హోరాహోరీనే
సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లా ఎన్నికల రంగం వేడెక్కింది. ఏ నియోజకవర్గంలో ఎవరెవరు ప్రత్యర్థులో... ఏయే నియోజకవర్గంలో ఎలాంటి పోటీ జరగనుందో దాదాపు స్పష్టమైంది. మెజారిటీ స్థానాల్లో ఈసారి ద్విముఖ పోటీలే కనిపిస్తున్నాయి. కాగా, కొన్నిచోట్ల మాత్రం బహుముఖ పోటీ తప్పేలా లేదు. టీఆర్ఎస్ పదకొండు, కాంగ్రెస్ పదకొండు స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించాయి. వీరిలో ఇప్పటికే అత్యధికులు నామినేషన్లు కూడా వేశారు. చివరి రోజు అయిన 19వ తేదీన ఎక్కువ నామినేషన్లు దాఖలు కానున్నాయి. టీఆర్ఎస్ కోదాడలో, కాంగ్రెస్ మిర్యాలగూడ స్థానానికి ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికల బరిలో నిలిచిన వారిని పరిగణనలోకి తీసుకుంటే ఈసారి కూడా హేమాహేమీలు పోటీ పడుతున్నారు. దీంతో పోటీ కూడా హోరాహోరీగా సాగనుంది. ఆ.. ఐదుగురు నేతలు టీఆర్ఎస్ నుంచి పోటీ పడుతున్న వారిలో ఒక్కరు మినహా మిగిలిన పది మంది రెండో సారి అంతకంటే ఎక్కువ పర్యాయాలు అసెంబ్లీకి పోటీ చేస్తున్నవారే. ఇక, కాంగ్రెస్‌లో నలుగురు నాయకులు, ఒక ఇండిపెండెంట్ మొత్తంగా ఐదుగురు అభ్యర్థులు నాలుగు అంతకంటే ఎక్కువ సార్లు అసెంబ్లీ బరిలో నిలుస్తున్నవారే కావడం గమనార్హం. ప్రధానంగా సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి ఎనిమిదో విజయం కోసం నాగార్జున సాగర్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా టీఆర్ఎస్ నుంచి నోముల నర్సింహయ్య పోటీలో ఉన్నారు. బీజేపీ, బీఎల్ఎఫ్ అభ్యర్థులు కొందరు తొలి ఎన్నికలను ఎదుర్కొంటున్న వారే. హుజూర్‌నగర్‌లో టీ.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఐదో విజయంపై కన్నేశారు. ఆయనకు ప్రత్యర్థిగా టీఆర్ఎస్ నుంచి తొలి సారిగా ఎస్.సైదిరెడ్డి పోటీలో ఉన్నారు. సీపీఎం అభ్యర్థి రెండో సారి పోటీలో ఉన్నారు. నల్లగొండలో కాంగ్రెస్ సిట్టింగ్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐదో విజయం కోసం పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో కోమటిరెడ్డి చేతిలో ఓడిపోయిన కంచర్ల భూపాల్ రెడ్డి ఈ సారి టీఆర్ఎస్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డిపై కాంగ్రెస్, బీజేపీల నుంచి సీనియర్లే పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఆర్.దామోదర్ రెడ్డి, బీజేపీ నుంచి సంకినేని వెంకటేశ్వర్ రావు గత ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థికి ప్రత్యర్థులుగా పోటీ చేసిన వారే. ఈసారి మరో మారు ఈ ముగ్గురు నేతలూ తలపడుతున్నారు. ఆలేరు బరిలో బీఎల్ఎఫ్ మద్దతుతో బీఎల్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోత్కుపల్లి నర్సింహులు కూడా అత్యధిక పర్యాయాలు విజయాలు సాధించిన నేతనే కావడం గమనార్హం. ఇక్కడనుంచి ప్రభుత్వ విప్‌గా పనిచేసిన గొంగిడి సునిత టీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి బూడిద భిక్షమయ్య గౌడ్ పోటీ పడుతున్నారు. ఇక, మిగిలిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఎం పార్టీల నుంచి పోటీ పడుతున్న నేతల్లో అత్యధికులు రెండో సారి, అంత కంటే ఎక్కువ సార్లు పోటీ పడుతున్న వారే. అసెంబ్లీ బరిలోకి తొలిసారి ఈసారి ఎన్నికల్లో అసెంబ్లీ బరిలోకి తొలిసారి దిగుతున్న వారు ఎక్కువ మందే ఉన్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (ఎంపీగా పనిచేశారు. ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు) ఎమ్మెల్యే పదవి కోసం తొలిసారి పోటీ పడుతున్నారు. భువనగిరి నుంచి కాంగ్రెస్ తరపున కుంభం అనిల్ కుమార్‌రెడ్డి, హుజూర్నగర్ నుంచి టీఆర్ఎస్ తరఫున ఎస్.సైదిరెడ్డి మొదటిసారి పోటీ పడుతున్నారు. బీజేపీ, బీఎల్ఎఫ్, సీపీఎం నుంచి తొలిసారి పోటీ చేస్తున్నవారూ ఉన్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బరిలో నిలిచిన వారిలో అత్యధికులు సీనియర్లే కావడంతో పోటీ కూడా హోరా హోరీగా సాగనుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
ఘనంగా జగదీశ్‌రెడ్డి జన్మదినం
భువనగిరి : రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణరెడ్డి నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఎర్రవెల్లి నుంచి ఉదయం 11 గంటలకు భువనగిరికి చేరుకున్న మంత్రికి ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్సీ నివాసానికి చేరుకుని కేక్ కట్ చేశారు.అనంతరం స్వీట్లను పంపిణీచేశారు. ఈ సందర్భంగా మంతికి భారీ పూల మాల వేసి శాలువాతో సత్కరించారు. అనంతరం మంత్రికి ఎడ్ల బండిని బహుకరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, కలెక్టర్ అనితారామచంద్రన్, జేసీ రవినాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ కొలపుల అమరేందర్, తెలంగాణ జాగృతి నాయకులు రాజీవ్‌సాగర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి ప్రణితా పింగల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పంతులు నాయక్, ఎంపీపీ వెంకటేశం, టీఆర్ఎస్ పట్టణ కమిటీ అధ్యక్షులు గోమారి సుధాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు చందుపట్ల వెంకటేశ్వర్రావు, జనగాం పాండు, సిద్దుల పద్మ, టీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. బాణా సంచాల మధ్యలో.. స్థానిక నాయకులు మంత్రి జన్మదిన వేడుకల సందర్భంగా స్థానిక బాబూ జగ్జీవన్‌రావ్ చౌరస్తా మరియు ఎమ్మెల్సీ నివాసం సమీపంలో సుమారు 30 నిమిషాల పాటు బాణాసంచాలను కాల్చారు. అదే విధంగా బ్యాండ్ మేళాల మధ్య వేడుకలను నిర్వహించారు. మంత్రిని కలిసిన చింతల వెంకటేశ్వర్‌రెడ్డి మంత్రి జగదీశ్‌రెడ్డి జన్మదినం సందర్భంగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌తో కలిసి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌లో మంత్రిని కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. -
జేసీ బదర్స్ ముఠా అరాచకాలు తారస్థాయికి చేరాయి
-
విచారణకు భయమెందుకు?
సాక్షి, హైదరాబాద్: డాక్యుమెంట్లు, ఆధారాలతోసహా మంత్రి జగదీశ్వర్‌రెడ్డి బినామీల బాగోతాలు, అవినీతి అంశాలను తాము బయటపెట్టినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. తాము లేవనెత్తిన అంశాలపై మంత్రి స్పందించకుండా బినామీ సైదిరెడ్డితో ప్రకటనలు ఇప్పించారని, జగదీశ్వర్‌రెడ్డి అవినీతిపై ఇంతకన్నా ఆధారాలు ఇంకేం కావాలని నిలదీశారు. సోమవారం గాంధీభవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. కుడకుడ గ్రామంలో సర్వే నంబర్ 301, 302లో ఉన్న సాయి డెవలపర్స్‌కు చెందిన ప్రైవేట్ భూమిని రూ.18 లక్షలకు ఎకరం చొప్పున కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి మంత్రి జగదీశ్వర్‌రెడ్డి సూచించారని, ఆయన సూచన మేరకే కొనుగోలు చేశామని కలెక్టర్ ప్రొసీడింగ్స్‌లో (లెటర్ నంబర్ ఇ1–143–2017, తేదీ 02–08–2017) పేర్కొన్నారని, మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ప్రమేయం ఉందని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏమి కావాలని ఆయన ప్రశ్నించారు. ఇంత పెద్దఎత్తున అవినీతి జరుగుతున్నా సీఎం కేసీఆర్ దృష్టికి ఎందుకు రావడం లేదో తమకు అర్థంకావడం లేదని, జగదీశ్వర్‌రెడ్డి అంటే కేసీఆర్‌కు గారాబం ఎందుకని ఎద్దేవా చేశారు. దళితుడైన ఉప ముఖ్యమంత్రి రాజయ్య మీదనే కేసీఆర్ తన ప్రతాపాన్ని చూపారని, మంత్రులు జూపల్లి కృష్ణారావు, జగదీశ్వర్‌రెడ్డిల అవినీతిపై తాము ఆధారాలతో మాట్లాడినా చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ వ్యవహారం చూస్తుంటే సైదిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డికి బినామీ అయితే, జగదీశ్వర్‌రెడ్డి కేసీఆర్ బినామీనేమో అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. అలా కాకపోతే విచారణ జరిపేందుకు భయమెందుకని ప్రశ్నించారు. ప్రతి చిన్న విషయంపైనా మంత్రి కేటీఆర్ ట్వీటర్లో స్పందిస్తారని, కానీ జగదీశ్వర్‌రెడ్డి విషయంలో ఎందుకు స్పందించడం లేదని ఎద్దేవా చేశారు. ఇది పక్కాగా క్విడ్‌ప్రోకో తరహాలో ఉందని, సైదిరెడ్డికి హుజూర్నగర్ టికెట్ ఇప్పించాలని ప్రయత్నిస్తున్నారని, ఆయన ద్వారా కోట్ల రూపాయలు జగదీశ్వర్‌రెడ్డికి ముడుతున్నాయని ఆరోపించారు. ఈ విషయంలో తాము చీఫ్ విజిలెన్స్ కమిషనర్, లోకాయుక్తకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయనున్నట్టు శ్రవణ్ వెల్లడించారు. -
కాంగ్రెస్ నాయకులు పారిపోతుండ్రూ...
భువనగిరి : అసెంబ్లీ సమావేశాలంటే కాంగ్రెస్ నాయకులు భయపడి పారిపోతుండ్రని విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం బీబీనగర్ మండల కేంద్రంలో రూ. 3.64 కోట్లతో చేపట్ట నున్న సీసీరోడ్లు, అండర్ డ్రెయినేజీ, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ వద్ద ఎమ్మె ల్యే పైళ్ళ శేఖర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంటే కాంగ్రెస్ నాయకుల తీరు పదో తరగతి విద్యార్థులు పరీక్ష కు ఎగ్గొట్టేలా ఉందని ఎద్దేవా చేశారు. 2014లో టీఆర్ఎస్ ఇచ్చిన ఎన్నికల హామీలను మూడేళ్లో అమలు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. హామీ ఇవ్వని అనేక సంక్షే మ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు. రైతులు పండించిన ధరను వారే నిర్ణయించుకోవడానికి రైతుల సమన్వయ సమి తులను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అధిక నిధులు కేటా యించినట్టు చెప్పారు. గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా 44 లక్షల ఎకరాల భూమి సస్యశ్యామలం చేయనున్నట్టు తెలిపారు. బీబీనగర్‌లో ఎస్సీ ఫంక్షన్ హాల్‌కు అవసరమైతే మరి న్ని నిధులు అందజేస్తామని హామీ ఇచ్చారు. నిధులను సద్వినియోగం చేసుకోవాలి – ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి బీబీనగర్‌కు మంజూరైన సుమారు రూ.4 కోట్ల నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి సూచించారు. 70ఏళ్ల కాలంలో ఎన్నడూ రాని నిధులు ఒకేసారి వచ్చినందున గ్రామ అభివృద్ధికి ఖర్ఛు చేయాలని సూచించారు. అంతకు ముందు కొండమడుగు మెట్టు నుంచి బీబీనగర్ వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. డప్పులు, బాణాసంచా కాల్చి మం త్రికి స్వాగతం పలికారు. కళాకారులు నిర్వహించిన ఆట, పాట అందరినీ అలరించాయి. సమావేశంలో కలెక్టర్ అనితారామచంద్రన్, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ మందుల సామేల్, డీఆ ర్ఓ రావుల మహేదంర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా. జడల అమరేందర్‌గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ కొలుపుల అమరేందర్, భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ పంతులు నాయక్, ఎంపీపీ గోలి ప్రణితా పింగల్‌రెడ్డి, నాయకులు సుధాకర్, నరేందర్‌రెడ్డి,వెంకన్నగౌడ్, వెంకట్ కిషన్, మండలాల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కేటీఆర్ సాయం – ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి భువనగిరి నియోజకవర్గంలో హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న మండలాల అభివృద్ధికి మంత్రి కేటీఆర్ నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే భూ దాన్‌పోచంపల్లికి రూ. 3 కోట్లు ఇవ్వడం సంతోషకరం అన్నారు. బీబీనగర్, భూదాన్‌పోంచంపల్లి, వలిగొండ, భువనగిరి మండలాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరిన వెంటనే మంత్రి కేటీఆర్ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పరుగులు – ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రా మాల్లో అభివృద్ధి పరిగెడుతుందని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. కేంద్రం నుంచి నిధులను రాబట్టేందుకు ముఖ్య మంత్రి కేసీఆర్ కొత్తగా రాష్ట్రంలో 4,380 గ్రామ పంచాయతీలు 147 మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారన్నారు. గ్రామంలో సర్పంచ్, ఉపసర్పంచ్‌కు జాయింట్ చెక్‌పవర్‌ను కల్పించినట్టు తెలిపారు. జిల్లాకు బీసీ స్టడీ సర్కిల్ మంజూరైందని, ఎస్సీ స్టడీ సర్కిల్ మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. -
టీడీపీ నేతల వర్గపోరు.. తాడిపత్రిలో 144 సెక్షన్
తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ నేతల వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ నేత జగదీశ్వర్‌రెడ్డి వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావారణం నెలకొన్న నేపథ్యంలో ముందస్తుగా తాడిపత్రిలో 144 సెక్షన్ విధించినట్లు డీఎస్పీ చిదానందరెడ్డి తెలిపారు. జనవరి 23వ తేదీ వరకూ ఈ 144 సెక్షన్ కొనసాగుతుందని డీఎస్పీ వివరించారు. -
పదో షెడ్యూల్‌పై న్యాయపోరాటం
పదో షెడ్యూల్ అంశాలపై ఏపీ ఆలోచన సీఎంతో భేటీ అయిన గంటా సాక్షి, హైదరాబాద్: పదోషెడ్యూల్‌లో ఉన్న సంస్థలు పదేళ్లపాటు ఉమ్మడిగానే కొనసాగాల్సిం దేనని, ఈ విషయంలో అవసరమైతే న్యాయపోరాటం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావి స్తోంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం రాజ్యాంగ నిపుణులు, సీనియర్ న్యాయవాదులతో చర్చించారు. ఇంటర్మీడియెట్ పరీక్షలు, ఎంసెట్, పదో షెడ్యూల్లోని సంస్థలకు సంబంధించి మంత్రి గంటా శ్రీనివాసరావు తెలంగాణ విద్యామంత్రి జగదీశ్వర్‌రెడ్డితో సోమవారం చర్చలు జరపడం తెలి సిందే. ఆయన మంగళవారం సీఎం చంద్రబాబు ని కలసి చర్చల సారాంశాన్ని నివేదించారు. ఉమ్మడి సంస్థలపై తెలంగాణ ప్రభుత్వ వాదన ను సీఎం దృష్టికి తెచ్చారు. ఇంటర్మీడియెట్ పరీక్షలు సహ అన్నీ ఉమ్మడిగానే కొనసాగాలని, ఈ విషయంలో రాజీవద్దని చంద్రబాబు స్పష్టంచేసినట్లు తెలిసింది. విభజన చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిస్తుండడాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తేనున్నారు. అసరమైతే కేంద్ర జోక్యాన్ని కూడా కోరనున్నారు. తెలంగాణ ప్రభుత్వం మరింత దూకుడుగా వెళ్తే మాత్రం న్యాయపోరాటం ద్వారా అడ్డుకట్టవేయాలన్న అభిప్రాయానికి వచ్చారు. విభజన చట్టంలోని సెక్షన్ 95, 75 ప్రకారం పదో షెడ్యూల్లోని సంస్థలను ఇరు రాష్ట్రాలు సంప్రదింపులతో ఏకాభిప్రాయం వచ్చాకే విభజన చేయాలి. అలా కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యామండలిని, ఇంట ర్మీడియెట్బోర్డును ఏర్పాటుచేసింది. ఇక దీనిపై ఉపేక్షిస్తే ఇతర సంస్థల విషయంలోనూ ఇలాగే ముందుకు వెళ్తుంది. ముందుగానే దీనికి అడ్డుకట్టవేయాలి. అందుకు తక్షణమే కేంద్రం జోక్యాన్ని కోరాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ అంశంపై రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ దృష్టికి తెచ్చారు. మరోవైపు రాష్ట్ర ఎంపీలతో కూడా దీనిపై కేంద్రానికి వినతిపత్రం అందింపచేయనున్నారు. అవసరమైతే మంత్రులు, ఇతర ముఖ్యు లు కూడా కేంద్రప్రభుత్వం వద్దకు వెళ్లి రాష్ట్రం లోని తాజా పరిస్థితులను వివరించాలని భావిస్తున్నారు. ప్రజాప్రయోజనవాజ్యం మరోవైపు సోమవారం నాటి మంత్రుల భేటీ సమయంలో తాము వేరేగా ఇంటర్మీడియెట్, ఎంసెట్ పరీక్షలు నిర్వహించుకుంటామని తెలంగాణ మంత్రి పేర్కొనడంతో దాని ఆధారంగా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఉమ్మడి పరీక్ష రాసి రెండో సంవత్సరంలో వేర్వేరు పరీక్ష సరికాదని, ఇది తమ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని కొంతమంది విద్యార్థులతో సుప్రీంలో పిల్ దాఖలు చేయించే సూచనలు కనిపిస్తున్నాయి. -
‘ముంపు’పై ఉద్యమిస్తాం
ఖమ్మం జడ్పీసెంటర్ : పోలవరం ముంపునకు గురవుతున్న గిరిజనుల సమస్యలపై ఉద్యమిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివాసీల ఆందోళనలకు మద్దతు తెలపాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. పోలవరం విషయంలో ప్రభుత్వపరంగా ఒక రకంగా, టీఆర్ఎస్గా మరో విధంగా వ్యవహరించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఖమ్మంలోని మమత మెడికల్ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన టీయూడబ్ల్యూజే జిల్లా ప్రథమ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఎంత సత్యమో... ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలిసింది కూడా అంతే నిజమని, అయితే ప్రభుత్వ పరంగా చేయాల్సింది చేస్తామని చెప్పారు. పార్లమెంట్లో గిరిజన ప్రజా ప్రతినిధులందరినీ కలుపుకుని పోరాడుతామని, ఈ విషయంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. అన్యాయాన్ని ఎదిరించే సత్తా జర్నలిస్టులకే... అన్యాయాన్ని ఎదిరించేందుకు ఎవరినైనా ప్రశ్నించే సత్తా జర్నలిస్టులకే ఉందని జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం టీజేఎఫ్ ఏర్పడిందని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం టీయూడబ్ల్యూజేగా అవతరించిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన ఉద్యమంలో జర్నలిస్టులు కీలకపాత్ర పోషించారని, రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా వారి భాగస్వామ్యం అవసరమని అన్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఉద్యమాన్ని నడిపించింది జర్నలిస్టులేనని, రాజకీయ పక్షాలు రాకపోవడం, ఇక్కడ టీఆర్ఎస్ బలంగా లేకపోవడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు అందిస్తామని, ప్రభుత్వ వైద్యశాలలను మెరుగుపరచడంతోపాటు జిల్లా కేంద్రంలో కార్పొరేట్ వైద్యశాలలను ఏర్పాటు చేసి ఉచిత వైద్యం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మంలో పాత్రికేయులకు ఇచ్చిన ఇళ్లస్థలాలను ఇతర శాఖలకు కేటాయించడంపై కలెక్టర్‌తో మాట్లాడతానని, ఇక్కడ పరిష్కారం కాకపోతే సీఎంతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. విద్యుత్ సమస్యపై నేడు కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఆందోళన చేస్తున్నారని, ఈ సంక్షోభానికి కారణం ఆ పార్టీలేనని ఆరోపించారు. ప్రెస్ అకాడమి చైర్మన్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో టీజేఎఫ్ కీలక భూమిక పోషించిందన్నారు. తెలంగాణ సాధనకు జర్నలిస్టులు అనేక ఉద్యమాలు చేశారని, ఇప్పుడు రాష్ర్టం ఏర్పడిన తర్వాత తెలంగాణకు పొంచి ఉన్న ప్రమాదాన్ని అరికట్టేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వృత్తి పరంగా చొచ్చుకుని వెళ్తూ.. దేశ ప్రధానమంత్రితో కూడా మాట్లాడే పాత్రికేయుల జీవన ప్రమాణాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు రూ.10 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం నిధి ఏర్పాటు చేసిందని, వారి సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తారనే నమ్మకం ఉందని చెప్పారు. పాత్రికేయులందరికీ ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇప్పించాలని మంత్రిని కోరారు. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ తెలంగాణ వాదం, ఉద్యమం నుంచి టీయూడబ్ల్యూజే పుట్టిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరినీ వెన్నుతట్టి నడిపించింది జర్నలిస్టులేనన్నారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అనేక మంది పోరాటాల ఫలితంగానే తెలంగాణ ఆవిర్భవించిందన్నారు. బంగారు తెలంగాణ నిర్మిస్తామని చేసిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. ఖమ్మంలో జర్నలిస్టులకు కేటాయించిన 10 ఎకరాలకు సంబంధించిన భూ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. జర్నలిస్టులు చేసే ఉద్యమాలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. పోలవరం ముంపునకు గురవుతున్న ఏడు మండలాలను తెలంగాణలో ఉంచేంత వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ ఆర్డినెన్స్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు తాను వ్యతిరేకించామని గుర్తుచేశారు. మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, గిరిజనులను ముంచే పోలవరం విషయంలో న్యాయపరమైన పోరాటం సాగిస్తామని చెప్పారు. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణానికి జర్నలిస్టులు పాటుపడాలన్నారు. జర్నలిస్టుల శ్రేయస్సుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అనేక ప్రభుత్వాలు మారినా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వంలోనైనా వారి సమస్యలను పరిష్కరించేలా చొరవ చూపాలన్నారు. ఏడు మండలాలను ఆంధ్రాలో కలపడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ జర్నలిస్టుల జీవితాల వెనుక చీకట్లు ఉన్నాయని, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. కాంట్రాక్టు కార్మికుల కంటే తక్కువగా జర్నలిస్టుల జీవన ప్రమాణాలు ఉన్నాయన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర సహాయ కార్యదర్శి మేకల కల్యాణ చక్రవర్తి అధ్యక్షతన జరిగిన ఈ సభలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్. క్రాంతికిరణ్, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎం.వి.రమణ, రాష్ట్ర నాయకులు పల్లె రవి, పీవీ శ్రీనివాస్, రమేశ్హజారీ, వర్థెల్లి వెంకటేశ్వర్లు, ఇస్మాయిల్, అవ్వారి భాస్కర్, కిరణ్, యోగానంద్, యుగంధర్, రాజు, ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, సయ్యద్ ఇస్మాయిల్, నాగేందర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, రవీందర్, పి.శ్రీనివాస్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, నాగేందర్, ఖదీర్, అన్సార్పాషా, రామారావు, కోటేశ్వరరావు, అప్పారావు పాల్గొన్నారు.