నల్లగొండ సిగలో.. మరో పదవి!  | Another Cabinet Ministry May Get In Nalgonda | Sakshi
Sakshi News home page

నల్లగొండ సిగలో.. మరో పదవి! 

Published Mon, Sep 9 2019 7:31 AM | Last Updated on Mon, Sep 9 2019 7:41 AM

Another Cabinet Ministry May Get In Nalgonda - Sakshi

సాక్షి, నల్లగొండ : నల్లగొండ జిల్లాకు మరో పదవి దక్కనుంది. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన గుత్తా సుఖేందర్‌రెడ్డికి శాసనమండలి చైర్మన్‌ పదవిని ఇవ్వాలని అధికార టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆదివారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు అవకాశం దక్కలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఇప్పటికే సూర్యాపేట నుంచి జగదీశ్వర్‌రెడ్డి మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, రెండో మంత్రి పదవి జిల్లాకు దక్కుతుందని భావించినా చివరకు నిరాశే మిగిలింది.

ఆదివారం జరిగిన విస్తరణలో జిల్లా మంత్రి జగదీశ్వర్‌రెడ్డిని విద్యాశాఖ నుంచి తిరిగి విద్యుత్‌ శాఖకు మార్చడం మినహా జిల్లా నుంచి ఎవరినీ కేబినెట్‌లోకి తీసుకోలేదు. వాస్తవానికి ఈ సారి మంత్రి వర్గంలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పదవులు ఆశించారు. విస్తరణకు ఒక రోజు ముందుగానే, సునీతను శాసనసభలో ప్రభుత్వ విప్‌గా నియమించడంతో రేసులో గుత్తా సుఖేందర్‌రెడ్డి ఒక్కరే మిగిలారు.

గత ప్రభుత్వంలోనే ఆయన పదవిని ఆశించారు. కాంగ్రెస్‌ ఎంపీగా ఉండి టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయనకు ఆనాడే సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. నాడు మంత్రిగా అవకాశం కల్పించే వీలు లేకనే రాష్ట్ర రైతు సమన్వయ సమి తి అధ్యక్ష పదవి కట్టబెట్టారని పార్టీ శ్రేణుల్లో ఓ అభిప్రాయం బలంగా ఉంది. ఇక, 2018 ముందస్తు ఎన్నికల్లో ఘన విజయంతో టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చింది. గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎంపీ పదవి ముగిశాక జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం కల్పించారు. ఎమ్మెల్యే కోటాలో ఆయ న ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ అయ్యారు.

అప్పటి నుంచి గుత్తా మంత్రి పదవి రేసులో ఉన్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగితే కచ్చితంగా ఆయనకు స్థానం ఉంటుందని భావించారు. అదే స్థాయిలో వార్తలు కూడా వెలువడ్డాయి. కానీ, ఆదివారం నాటి విస్తరణలో కొత్తగా ఆరుగురిని కేబినెట్‌లోకి తీసుకోగా అందులో ఇద్దరు గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వారే. మిగిలిన నలుగురిని కొత్తగా కేబినెట్‌లో చేర్చుకున్నారు. ఈ కారణంగానే గుత్తా అనుచర వర్గంలో కొంత నిరాశ వ్యక్తమైంది.

మండలి చైర్మన్‌గా ‘గుత్తా’కు అవకాశం?
వివిధ సమీకరణలు, కారణాల నేపథ్యంలోనే సుఖేందర్‌రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం కల్పించలేకపోవడంతో ఆయనకు శాసనమండలి చైర్మన్‌ పదవిని ఇవ్వాలని అధికార టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ శాసన మండలి తొలి చైర్మన్‌గా పనిచేసిన స్వామిగౌడ్‌ పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం ఇన్‌చార్జ్‌ చైర్మన్‌గా మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ కొనసాగుతున్నారు.

ఉభయ సభల బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో శాసనమండలికి పూర్తికాలపు చైర్మన్‌ నియమించాలని నిర్ణయించడంతో ఆ పదవి గుత్తాకు కట్టబెట్టనున్నారని సమాచారం. చైర్మన్‌ పదవికి ఆయన పేరును అధికారికంగా ప్రకటించి సోమవారం నామినేషన్‌ దాఖలు చేయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి పదవిని ఆశించిన గుత్తాకు చివరకు మండలి చైర్మన్‌ పదవి అందిరానుంది.

ఒకే జిల్లా నుంచి చైర్మన్, వైస్‌ చైర్మన్‌..
శాసన మండలి చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పదవులు ఒకే జిల్లాకు రానున్నాయి. ఇప్పటికే వైస్‌ చైర్మన్‌గా నకిరేకల్‌ నియోజకవర్గానికి చెందిన నేతి విద్యాసాగర్‌ కొనసాగుతున్నారు. ఇప్పుడు చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డికి అవకాశం దక్కితే ఒకే జిల్లా, ఒకే నియోజకవర్గం నుంచి చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పోస్టులు దక్కినట్లు అవుతుంది. మరోవైపు నల్లగొండ ఉమ్మడి జిల్లా మంత్రి జి.జగదీశ్వర్‌రెడ్డి శాఖ మార్పు జరిగింది. ఆయనను విద్యాశాఖ నుంచి విద్యుత్‌ శాఖకు మార్చారు.

టీఆర్‌ఎస్‌ తొలి ప్రభుత్వం 2014లో ఏర్పాటైనప్పుడు కూడా జగదీశ్‌రెడ్డికి తొలుత విద్యాశాఖను కేటాయించి, ఆ తర్వాత మార్పులు చేర్పుల్లో భాగంగా ఆయనకు కీలకమైన విద్యుత్‌ శాఖ బాధ్యతలను అప్పజెప్పారు. 2018 ఎన్నికల్లో విజయం తర్వాత ఏర్పాటైన రెండో ప్రభుత్వంలో కూడా ఆయనకు తొలుత విద్యాశాఖను అప్పగించారు. అయితే, ఆదివారం నాటి కేబినెట్‌ విస్తరణలో విద్యాశాఖను సబితా ఇంద్రారెడ్డికి కేటాయించారు. ఇన్నాళ్లూ సీఎం కేసీఆర్‌ వద్దే ఉన్న విద్యుత్‌ శాఖను మళ్లీ జగదీశ్‌రెడ్డికే అప్పగించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement