Gutta sukhendar reddy
-
బడ్జెట్ సమావేశాల్లో మండలి చైర్మన్ ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వార్షిక బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో సుమారు 9 నెలలుగా ఖాళీగా ఉన్న శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులకు ఎన్నిక జరగనుంది. ఇందుకు సంబంధించి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలి వారంలోనే షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశముంది. 40 మంది సభ్యులున్న మండలిలో టీఆర్ఎస్కు 36 మంది సభ్యుల బలం ఉండటంతో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులు ఏకగ్రీవం కానున్నాయి. మండలి చైర్మన్‌గా వ్యవహరించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ గతేడాది జూన్ 3న మండలి సభ్యులుగా పదవీకాలం పూర్తి చేసుకున్నారు. వారిద్దరి పదవీకాలం ఏకకాలంలో ముగియడంతో మండలిలో సీనియర్ సభ్యుడు వెన్నవరం భూపాల్‌రెడ్డిని గతేడాది జూన్ 4న ప్రొటెమ్ చైర్మన్‌గా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నామినేట్ చేశారు. అయితే ఎమ్మెల్సీగా భూపాల్‌రెడ్డి పదవీకాలం జనవరి 4న ముగియడంతో ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ అమీనుల్ హసన్ జాఫ్రీ గత నెల ప్రొటెమ్ చైర్మన్‌గా నియమితులయ్యారు. అమీనుల్ హసన్ జాఫ్రీని ప్రొటెం చైర్మన్‌గా నామినేట్ చేయాలని కోరుతూ ప్రభుత్వం పంపించిన సిఫారసుతో గవర్నర్ తొలుత విభేదించినట్లు సమాచారం. అయితే చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికను తక్షణమే నిర్వహించడం సాధ్యం కాదని... బడ్జెట్ సమావేశాల్లో ఎన్నిక నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో గవర్నర్ అందుకు అంగీకరించి జాఫ్రీ నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ సమావేశాల్లోనే చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక అనివార్యం కానుంది. మరోవైపు మండలిలో చీఫ్ విప్‌తోపాటు మరో నలుగురు విప్‌లు ఉండగా ఎంఎస్ ప్రభాకర్‌రావు మినహా గతంలో చీఫ్ విప్, విప్ పదవులు నిర్వహించిన ఎమ్మెల్సీలంతా పదవీకాలం పూర్తి చేసుకున్నారు. గతేడాది మార్చి నుంచి డిసెంబర్ వరకు మండలి వివిధ కోటాల్లో జరిగిన ఎన్నికల్లో కొత్తగా 21 మంది ఎన్నికయ్యారు. గతంలో విప్‌లుగా వ్యవహరించిన కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, తానిపర్తి భానుప్రసాద్‌రావు స్థానిక సంస్థల కోటాలో మళ్లీ ఎమ్మెల్సీలయ్యారు. చైర్మన్‌గా మళ్లీ గుత్తానే? గవర్నర్ కోటాలో గతేడాది నవంబర్‌లో తిరిగి మండలి సభ్యుడైన గుత్తా సుఖేందర్‌రెడ్డికే మరో సారి చైర్మన్ పదవి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మధుసూదనాచారి, కడియం శ్రీహరి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకొని ఎమ్మెల్యే కోటాలో మండలికి ఎన్నికైన గుండా ప్రకాశ్ ముదిరాజ్‌కు వైస్‌చైర్మన్ పదవి ఖాయమనే ప్రచారం జరుగుతోంది. దామోదర్‌రెడ్డి, భానుప్రసాద్, వాణీదేవి, తక్కళ్లపల్లి రవీందర్రావు, వీజీ గౌడ్ తదితరుల పేర్లు ప్రభుత్వ విప్‌లుగా పరిశీలనలో ఉన్నట్లు తెలియవచ్చింది. -
ఉత్తమ్ పోయి ఉత్తర కుమారుడు వచ్చాడు: గుత్తా సుఖేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఉత్తమ్ పోయి ఉత్తర కుమారుడు వచ్చాడని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి పగటి కలలు కంటున్నాడని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం అనేది ఓ కల అని అన్నారు. కాంగ్రెస్ కలహాలు సరిదిద్దడానికి రేవంత్‌కు సమయం సరిపోదని ఎద్దేవా చేశారు. అదే విధంగా బీజేపీ వాళ్లది కాకి గోల మాత్రమేనని, వాళ్లతో ఏం కాదని మండిపడ్డారు. విభజన చట్టాన్ని అమలు చేయని బీజేపీ వాళ్లకు మాట్లాడే అర్హత లేదని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రయోజనాలపై బీజేపీ వాళ్ల ఎందుకు మాట్లాడరని, రాజకీయ స్వార్ధం కోసమే వారి ఆరాటమని ధ్వజమెత్తారు. నది జలాల విషయంలో రెండు రాష్ట్రాల సీఎంలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కారం చేయాల్సిన బాధ్యత కేంద్రానికి ఉన్నదని అన్నారు. చదవండి: ఒకే దేశం.. ఒకే చట్టం... ఇదెక్కడి న్యాయం ! -
వ్యాక్సిన్ వేయించుకున్న స్పీకర్, శాసన మండలి చైర్మన్!
హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ చాలా భయంకరంగా ఉందని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.బుధవారం నిమ్స్‌లో కరోనా వ్యాక్సిన్ రెండవ డోస్‌ను వేయించుకున్నారు. ఆయనతో పాటు సభాపతి సతీమణి పుష్ప, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన సతీమణి అరుంధతిలు కూడా టీకా వేయించుకున్నారు. వీరంతా మార్చి 3న కోవిడ్ టీకా మొదటి డోస్ వేయించుకున్నారు. కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ కె.మనోహర్, నిమ్స్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి.నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ... కరోనా వ్యాక్సిన్ విషయంలో అపోహలు వద్దని..టీకా వేసుకోవడం అన్ని విధాలుగా శ్రేయస్కరమని చెప్పారు. ఇప్పుడు రెండో డోస్‌గా కొవాగ్జిన్‌ను తీసుకున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నియమనిబంధనలకు అనుగుణంగా 45 ఏళ్లు పూర్తయిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. అయితే కరోనా వైరస్ మళ్లీ ప్రబలుతున్న తరుణంలో ప్రభుత్వం సూచించిన విధంగా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. మాస్కు లేకుండా ఎవరు కూడా బయటకు రాకూడదన్నారు. మాస్క్ ధరించకపోతే రూ.1,000 జరిమానా, 2 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తారన్నారు. ఈ కఠిన నిబంధనలు ప్రజల మేలు కోసమేనని, ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలన్నారు. కరోనాను కట్టడి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రశంసనీయమన్నారు. దేశ సగటు కంటే తెలంగాణ రాష్ట్రంలో కరోనా మరణాలు అతి తక్కువ శాతంలో ఉన్నాయని చెప్పారు. -
సజావుగా సాగాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాలు, ప్రగతికి దోహదం చేసే చర్చలను ప్రజలు నిశితంగా గమనిస్తారనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని శాసనసభ సమావేశాలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులుతో కలిసి బుధవారం శాసనసభ ఆవరణలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ శాసనసభ పనితీరు దేశానికే ఆదర్శంగా ఉండేలా చూడాలని, సభ్యులు అధికారుల మధ్య సమన్వయ లోపం లేకుండా చూడాలని పోచారం ఆదేశించారు. గతంలో మాదిరిగానే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమావేశాలు నిర్వహిస్తామని గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. శాసనసభ నుంచి శాసనమండలిలోకి వచ్చే మంత్రులకు ట్రాఫిక్ సమస్య ఎదురవకుండా చూడాలని, ఉభయ సభల్లో చర్చకు వచ్చే అంశాలకు సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల నివాస సముదాయాల నుంచి వచ్చే సభ్యులకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవకుండా చూడాలని తెలిపారు. శాసనమండలి చీఫ్ విప్, విప్‌లు, ఎమ్మెల్సీల విషయంలో జిల్లా స్థాయిలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని గుత్తా వ్యాఖ్యానించారు. ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా సభ జరిగేందుకు అధికారులు సర్వసన్నద్ధులుగా ఉండాలని వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. భద్రత పరంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ కార్యదర్శులు వాట్సాప్ ద్వారా సమావేశాల తీరును ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. పోలీసు అధికారులతో ప్రత్యేక భేటీ.. శాసనసభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పోలీసు అధికారులతో గుత్తా సుఖేందర్‌రెడ్డి, పోచారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భద్రత ఏర్పాట్లను సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, డీజీపీ (ఎస్పీఎఫ్) తేజ్ దీప్ కౌర్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్, అసెంబ్లీ చీఫ్ మార్షల్ టి.కరుణాకర్ పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, చీఫ్ విప్‌లు దాస్యం వినయభాస్కర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, టీఆర్ఎల్పీ ఇన్చార్జి రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం శాసనసభ ఆవరణలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆఫీసర్స్ లాంజ్‌ను స్పీకర్, మండలి చైర్మన్ సంయుక్తంగా ప్రారంభించారు. -
నల్లగొండ సిగలో.. మరో పదవి!
సాక్షి, నల్లగొండ : నల్లగొండ జిల్లాకు మరో పదవి దక్కనుంది. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన గుత్తా సుఖేందర్‌రెడ్డికి శాసనమండలి చైర్మన్ పదవిని ఇవ్వాలని అధికార టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆదివారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు అవకాశం దక్కలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఇప్పటికే సూర్యాపేట నుంచి జగదీశ్వర్‌రెడ్డి మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, రెండో మంత్రి పదవి జిల్లాకు దక్కుతుందని భావించినా చివరకు నిరాశే మిగిలింది. ఆదివారం జరిగిన విస్తరణలో జిల్లా మంత్రి జగదీశ్వర్‌రెడ్డిని విద్యాశాఖ నుంచి తిరిగి విద్యుత్ శాఖకు మార్చడం మినహా జిల్లా నుంచి ఎవరినీ కేబినెట్లోకి తీసుకోలేదు. వాస్తవానికి ఈ సారి మంత్రి వర్గంలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పదవులు ఆశించారు. విస్తరణకు ఒక రోజు ముందుగానే, సునీతను శాసనసభలో ప్రభుత్వ విప్‌గా నియమించడంతో రేసులో గుత్తా సుఖేందర్‌రెడ్డి ఒక్కరే మిగిలారు. గత ప్రభుత్వంలోనే ఆయన పదవిని ఆశించారు. కాంగ్రెస్ ఎంపీగా ఉండి టీఆర్ఎస్లో చేరిన ఆయనకు ఆనాడే సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. నాడు మంత్రిగా అవకాశం కల్పించే వీలు లేకనే రాష్ట్ర రైతు సమన్వయ సమి తి అధ్యక్ష పదవి కట్టబెట్టారని పార్టీ శ్రేణుల్లో ఓ అభిప్రాయం బలంగా ఉంది. ఇక, 2018 ముందస్తు ఎన్నికల్లో ఘన విజయంతో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎంపీ పదవి ముగిశాక జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం కల్పించారు. ఎమ్మెల్యే కోటాలో ఆయ న ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ అయ్యారు. అప్పటి నుంచి గుత్తా మంత్రి పదవి రేసులో ఉన్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగితే కచ్చితంగా ఆయనకు స్థానం ఉంటుందని భావించారు. అదే స్థాయిలో వార్తలు కూడా వెలువడ్డాయి. కానీ, ఆదివారం నాటి విస్తరణలో కొత్తగా ఆరుగురిని కేబినెట్లోకి తీసుకోగా అందులో ఇద్దరు గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వారే. మిగిలిన నలుగురిని కొత్తగా కేబినెట్లో చేర్చుకున్నారు. ఈ కారణంగానే గుత్తా అనుచర వర్గంలో కొంత నిరాశ వ్యక్తమైంది. మండలి చైర్మన్‌గా ‘గుత్తా’కు అవకాశం? వివిధ సమీకరణలు, కారణాల నేపథ్యంలోనే సుఖేందర్‌రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం కల్పించలేకపోవడంతో ఆయనకు శాసనమండలి చైర్మన్ పదవిని ఇవ్వాలని అధికార టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ శాసన మండలి తొలి చైర్మన్‌గా పనిచేసిన స్వామిగౌడ్ పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం ఇన్చార్జ్ చైర్మన్‌గా మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ కొనసాగుతున్నారు. ఉభయ సభల బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో శాసనమండలికి పూర్తికాలపు చైర్మన్ నియమించాలని నిర్ణయించడంతో ఆ పదవి గుత్తాకు కట్టబెట్టనున్నారని సమాచారం. చైర్మన్ పదవికి ఆయన పేరును అధికారికంగా ప్రకటించి సోమవారం నామినేషన్ దాఖలు చేయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి పదవిని ఆశించిన గుత్తాకు చివరకు మండలి చైర్మన్ పదవి అందిరానుంది. ఒకే జిల్లా నుంచి చైర్మన్, వైస్ చైర్మన్.. శాసన మండలి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఒకే జిల్లాకు రానున్నాయి. ఇప్పటికే వైస్ చైర్మన్‌గా నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన నేతి విద్యాసాగర్ కొనసాగుతున్నారు. ఇప్పుడు చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డికి అవకాశం దక్కితే ఒకే జిల్లా, ఒకే నియోజకవర్గం నుంచి చైర్మన్, వైస్ చైర్మన్ పోస్టులు దక్కినట్లు అవుతుంది. మరోవైపు నల్లగొండ ఉమ్మడి జిల్లా మంత్రి జి.జగదీశ్వర్‌రెడ్డి శాఖ మార్పు జరిగింది. ఆయనను విద్యాశాఖ నుంచి విద్యుత్ శాఖకు మార్చారు. టీఆర్ఎస్ తొలి ప్రభుత్వం 2014లో ఏర్పాటైనప్పుడు కూడా జగదీశ్‌రెడ్డికి తొలుత విద్యాశాఖను కేటాయించి, ఆ తర్వాత మార్పులు చేర్పుల్లో భాగంగా ఆయనకు కీలకమైన విద్యుత్ శాఖ బాధ్యతలను అప్పజెప్పారు. 2018 ఎన్నికల్లో విజయం తర్వాత ఏర్పాటైన రెండో ప్రభుత్వంలో కూడా ఆయనకు తొలుత విద్యాశాఖను అప్పగించారు. అయితే, ఆదివారం నాటి కేబినెట్ విస్తరణలో విద్యాశాఖను సబితా ఇంద్రారెడ్డికి కేటాయించారు. ఇన్నాళ్లూ సీఎం కేసీఆర్ వద్దే ఉన్న విద్యుత్ శాఖను మళ్లీ జగదీశ్‌రెడ్డికే అప్పగించారు. -
ఉమ్మడి జిల్లాపై ‘జైపాల్’ చెరగని ముద్ర
సాక్షి, మిర్యాలగూడ : ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సూదిని జైపాల్‌రెడ్డితో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఎనలేని అనుబంధం ఉంది. ఆయన మృతిని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. రెండు పర్యాయాలు పార్లమెంట్ సభ్యుడిగా జిల్లా నుంచి ఎన్నికై పదేళ్ల పాటు జిల్లా అభివృద్ధికి తనవంతుగా కృషి చేశారు. 1999లో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వెంటనే మిర్యాలగూడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2004లో మరోసారి మిర్యాలగూడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. యూపీఏ– 1లో జైపాల్‌రెడ్డి తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సమయంలోనే దేశంలోని కీలకమైన మంత్రి పదవులు చేపట్టారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, సమాచార, సైన్స్ అండ్ టెక్నాలజీ, పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ మంత్రిగా పని చేశారు. ఆయన స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా అయినప్పటికీ నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులతోనూ ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు. జైపాల్‌రెడ్డి హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు సూదిని జైపాల్‌రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేసిన సమయంలో మిర్యాలగూడ, నల్లగొండ మున్సిపాలిటీలకు భూగర్భ డ్రెయినేజీ, సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేశారు. అదే విధంగా అద్దంకి–నార్కట్‌పల్లి రహదారి విస్తరణకు కృషి చేశారు. విష్ణుపురం–జగ్గయ్యపేట రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి చేశారు. మిర్యాలగూడ, నల్లగొండ మున్సిపాలిటీల్లో నాళాల ఆధునికీకరణ పనులకు నిధులు విడుదల చేశారు. 65వ జాతీయ రహదారి నాలుగు లేన్ల రోడ్డు విస్తరణకు కృషి చేశారు. మిర్యాలగూడకు చివరి ఎంపీ.. మిర్యాలగూడ పార్లమెంట్ నియోజకవర్గానికి జైపాల్‌రెడ్డి చివరి ఎంపీగా పని చేశారు. మిర్యాలగూడ పార్లమెంట్ 1962లో ఏర్పడగా 1999, 2004లో జైపాల్‌రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. కాగా 2008లో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మిర్యాలగూడ స్థానాన్ని తొలగించారు. దాంతో మిర్యాలగూడకు ఆయన చివరి ఎంపీగా పని చేసిన వారుగా మిగిలిపోయారు. మంత్రి జగదీశ్‌రెడ్డి సంతాపం తాళ్లగడ్డ ( సూర్యాపేట ) : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సూదిని జైపాల్‌రెడ్డి మృతికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో జైపాల్‌రెడ్డికి ఉన్న అనుబంధాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జైపాల్‌రెడ్డి ఓనమాలు నేర్చుకున్న ప్రభుత్వ పాఠశాల చండూరు : సూదిని జైపాల్‌రెడ్డికి చండూరు మండలంలోని నెర్మటతో విడదీయరాని అనుబంధం ఉంది. గ్రామానికి చెం దిన బాణాల క్రిష్ణారెడ్డి, వెంకనర్సమ్మల మనుమడు సూదిన జైపాల్‌రెడ్డి. 1942 జనవరి 16న నెర్మటలోని అమ్మమ్మ ఇంట్లో జైపాల్‌రెడ్డి జన్మించాడు. నాలుగేళ్లు నిండిన తర్వాత స్థానిక ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాడు. అక్షరాలు నేర్చుకునే స మయంలో తండ్రి దుర్గారెడ్డి దేవరకొండ పాఠశాలలో చేర్పిం చినట్లు జైపాల్‌రెడ్డి బావమర్ది బాణాల నర్సిరెడ్డి చెప్పారు. జైపాల్‌రెడ్డి తండ్రి దుర్గారెడ్డి చాలా ఏళ్లు నెర్మటలో రైతులకు వర్తకాలు పెట్టేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. జైపాల్‌రెడ్డి మృతి తీరని లోటు -గుత్తా సుఖేందర్‌రెడ్డి కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి మృతి వ్యక్తిగతంగా, రాజకీయంగా తీరని లోటని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. జైపాల్‌రెడ్డి మృతిపట్ల ఆదివారం ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. చురుకైన ఆలోచన, మంచి వాగ్ధాటిగా పేరు తెచ్చుకొన్ని గొప్ప వ్యక్తి జైపాల్‌రెడ్డి అని కొనియాడారు. ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఎంపికయ్యారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జైపాల్‌రెడ్డి చేసిన కృషి మరువులేనిదన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా రాష్ట్రానికి, దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఎంతో మంది నాయకులకు జైపాల్‌రెడ్డి ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు. జైపాల్‌రెడ్డితో తనకు ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. అయన మృతి తీరనిలోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
వీడియో నిఘాలోనే చెక్కుల పంపిణీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతుబంధు పథకాన్ని ఈ నెల 10న ముఖ్యమంత్రి కేసీఆర్ హుజురాబాద్‌లో ప్రారంభిస్తారని రైతు సమన్వయ కమిటీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ తెలిపారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీతో కలసి మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రైతు బంధు పథకం వివరాలు తెలియజేశారు. గుత్తా మాట్లాడుతూ.. మొత్తం 1,40,98,486 ఎకారాల వ్యవసాయ భూములకు గాను రైతు బందు పథకం కింద రూ. 5608 కోట్ల పంట సాయాన్ని అందించబోతున్నట్టు ప్రకటించారు. అలాగే కొత్త పాసు పుస్తకాల, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని వీడియో రికార్డ్ చేయనున్నట్టు తెలిపారు. గల్ఫ్‌లో ఉన్న రైతులకు వారి కుటుంబాలకు చెక్కులను అందిస్తామని పేర్కొన్నారు. ఈ చెక్కుల పంపిణీకి రెండు వేలకు పైగా బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. పాస్ పుస్తకాల్లో చిన్న చిన్న పొరపాట్లు దొర్లితే రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని వాటిని సవరించే అధికారం జిల్లా కలెక్టర్లకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆధార్, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటర్ కార్డు, పాస్ బుక్‌లలో ఏది ఉన్న చెక్కులు అందజేస్తామని తెలిపారు. చెక్కులు తీసుకోని వారి చెక్కులను తిరిగి రైతు సమన్వయ సమితి ఖాతాలో జమ చేసి, రైతుల సంక్షేమం కోసం వాటిని వినియోగిస్తామని పేర్కొన్నారు. రైతు బంధు పథకాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ పాసు పుస్తకాల ముద్రణలో 80 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ.. పాసు పుస్తకాల ముద్రణకు 90 కోట్లు కేటాయిస్తే 80 కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. చెట్టు కింద ఉన్న వాళ్లకు చెట్టు పైన ఉన్న వాళ్లకు తేడా ఉంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. -
ప్రజల కోసమే పాస్‌పోర్ట్ సేవలు
నల్లగొండ : ఉమ్మడి జిల్లా ప్రజల ప్రయోజనం కోసమే నల్లగొండలో పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న పాత ఆర్డీఓ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పాస్‌పోర్టు కార్యాలయాన్ని రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ చైర్మన్, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా ప్రజల ఇబ్బందులను గమనించి జిల్లా కేంద్రంలో పాస్‌పోర్టు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషిచేసిన ఎంపీ గుత్తాకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం కాలంలో పాస్‌పోర్టు ప్రతిఒక్కరికి అవసరమన్నారు. గతంలో పాస్‌పోర్టు పొందేందుకు హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేదని.. ఇప్పుడావసరం లేదన్నారు. ఎంపీ గుత్తా మాట్లాడుతూ.. నా హయాంలోనే నల్లగొండలో పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ పాస్‌పోర్టు సేవలను ఉమ్మడి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాస్‌పోర్టు సర్వీసెస్ బోర్డు మెంబరు ఉషా చంద్రమోహన్ మాట్లాడుతూ ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. సమావేశంలో ఎస్పీ ఏవీ రంగనాథ్, ఆర్డీఓ వెంకటచారి, ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎమ్మెల్యే భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎంపీపీ పాశం రాంరెడ్డి, రీజనల్ పాస్‌పోర్టు ఆఫీసర్ విష్ణువర్ధన్‌రెడ్డి, పోస్ట్‌మాస్టర్ జనరల్ ఎం.ఎలీషా, చీఫ్ పోస్ట్‌మాస్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
నేను ‘గుత్తా’ను కాదు పార్టీలు మారడానికి..
సాక్షి, యాదాద్రి : పూటకో పార్టీ మారడానికి నేను గుత్తా సుఖేందర్ రెడ్డిని కాదని నల్లగొండ ఎమ్మెల్యే, సీఎల్పీ ఉపనేత కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పీసీసీ అధ్యక్ష పదివి ఇచ్చినా..ఇవ్వకున్నా.. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. నల్గగొండ పార్లమెంట్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు. ఉన్న ఏడాది కాలమైనా మంచి పాలన అందించాలని ప్రభుత్వానికి సూచించారు. ఆ తర్వాత ఎలాగో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కోమటి రెడ్డి జోస్యం చెప్పారు. స్వరాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో ఇలాంటి పాలన ఉండటం దురదృష్టకరమన్నారు. కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలను పాటిస్తున్నారని విమర్శించారు. వాటి గురించి ప్రజల్లోకి వెళ్లి వివరిస్తామని ఈ సందర్భంగా కోమటి రెడ్డి పేర్కొన్నారు. ఇక పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వకుంటే కోమటి రెడ్డి బ్రదర్స్ బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. -
మా స్వయంకృతాపరాధమే
దేవరకొండ, న్యూస్‌లైన్: ‘నిజాలను చెప్పలేకపోయాం.. అబద్దాలను ఆడలేకపోయాం.. ఆచరణ సాధ్యం కాని హామీలను ఇవ్వలేకపోయాం.. ప్రజలను మోసగించలేకపోయాం.. అందుకే ఓటమి పాలయ్యాం.. ఇది మా స్వయంకృతాపరాధమే..’ అని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం దేవరకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరంతరం తెలంగాణ సాధన కోసం కష్టించి పని చేసిన సహచర పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రులను ప్రజలు న్యాయంగా గెలిపించాల్సి ఉందని అన్నారు. కానీ, ప్రజల తీర్పును గౌరవించాలని, తన గెలుపు సంతోషకరమే అయినా మిత్రుల ఓటమి బాధ కలిగిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, జాతీయ ఉపాధి హామీ, ఆహార భద్రత చట్టం, భూపంపిణీ, నిర్బంధ విద్యా చట్టం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. తనను అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎప్పుడూ ప్రజలకు సేవకుడిగా ఉంటానన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు ఆలంపల్లి నర్సింహ్మ, ఆ పార్టీ నగర అధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, పార్టీ దేవరకొండ మండల అధ్యక్షుడు మేకల శ్రీను, చం దంపేట మండల అధ్యక్షుడు గోవిందు, పార్టీ నాయకులు గిరిశేఖర్, జావీద్, ఇద్రిస్, ఆప్కో సత్తయ్య, సైదులు, దేవేందర్, మంజ్యనాయక్, బిక్కునాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం
కాంగ్రెస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి గుత్తా చింతపల్లి, న్యూస్‌లైన్ : కాంగ్రెస్‌తోనే బడుగు,బలహీన అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. సీపీఐ దేవరకొండ ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్రనాయక్‌తో కలిసి మండలంలోని చింతపల్లి, వర్కాల, వింజమూరు, రాయినిగూడెం, బట్టుగూడెం, కిష్టరాయినిపల్లి, నసర్లపల్లి, తీదేడు గ్రామాల్లో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. ఈ సంద ర్భంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంపూర్ణంగా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ సాధ్యమన్నారు. నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన కాంగ్రెస్సేదన్నారు. శ్రీశైలం సొరంగమార్గం త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు నేనావత్ బాలునాయక్, ఉజ్జిని యాదగిరిరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి, గుత్తా జితేందర్‌రెడ్డి, నాయకులు ముచ్చర్ల యాదగిరి, దొంతం సంజీవరెడ్డి, హరినాయక్, నాగభూషణ్, మాస భాస్కర్, వి.యుగేందర్‌రావు, బి.భూపాల్, విద్యాసాగర్‌రావు, మైసయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాసు, జంగయ్య, వెంకటయ్య, మైసయ్య, వీరయ్య, సలీం పాల్గొన్నారు. -
బీస్ సాల్ బాద్..... అన్న గుత్తా
నల్గొండ : 'రాయల్ ఎన్ఫీల్డ్' ను చూడగానే నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మనసు లాగేసినట్టుంది. బండి నడిపి తన ముచ్చట తీర్చుకున్నారు. ఓ కాంగ్రెస్ కార్యకర్త ఇటీవల ఈ బైక్‌ను కొనుగోలు చేశాడు. శుక్రవారం నల్గొండలోని ఎంపీ నివాసానికి కార్యకర్త వెళ్లగా, సుఖేందర్ రెడ్డి బుల్లెట్‌ను నడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై ఏళ్ల తర్వాత ఈ వాహనం నడిపానని చెప్పారు. రాజకీయ నేతల తమ చిన్న చిన్న కోర్కెలను కూడా తీర్చుకునేందుకు చాలా సంవత్సరాలు ఆగాల్సి వస్తుందంటే ఈ ఘటననే ఓ ఉదాహరణ -
'సోనియా విశ్వాసాన్ని కోల్పోయిన ముఖ్యమంత్రి కిరణ్'
ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల సంఖ్య పెరుగుతోంది. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నమ్మకంతో ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి కట్టబెడితే ఆయన విశ్వాసాన్ని కోల్పోయారని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. అధిష్టానాన్ని ధిక్కరించేలా కిరణ్ మాట్లాడటాన్ని తప్పుపట్టారు. ఉద్యమం పేరుతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆస్తులపై దాడి చేయడం అమానుషమని సుఖేందర్‌రెడ్డి ఖండించారు.