![Chairman And Deputy Chairman Of Legislative Council Telangana In Budget Meeting - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/23/t-l-c.jpg.webp?itok=23Dymhld)
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వార్షిక బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో సుమారు 9 నెలలుగా ఖాళీగా ఉన్న శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులకు ఎన్నిక జరగనుంది. ఇందుకు సంబంధించి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలి వారంలోనే షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశముంది. 40 మంది సభ్యులున్న మండలిలో టీఆర్‌ఎస్‌కు 36 మంది సభ్యుల బలం ఉండటంతో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులు ఏకగ్రీవం కానున్నాయి.
మండలి చైర్మన్‌గా వ్యవహరించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ గతేడాది జూన్ 3న మండలి సభ్యులుగా పదవీకాలం పూర్తి చేసుకున్నారు. వారిద్దరి పదవీకాలం ఏకకాలంలో ముగియడంతో మండలిలో సీనియర్ సభ్యుడు వెన్నవరం భూపాల్‌రెడ్డిని గతేడాది జూన్ 4న ప్రొటెమ్ చైర్మన్‌గా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నామినేట్ చేశారు. అయితే ఎమ్మెల్సీగా భూపాల్‌రెడ్డి పదవీకాలం జనవరి 4న ముగియడంతో ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ అమీనుల్ హసన్ జాఫ్రీ గత నెల ప్రొటెమ్ చైర్మన్‌గా నియమితులయ్యారు.
అమీనుల్ హసన్ జాఫ్రీని ప్రొటెం చైర్మన్‌గా నామినేట్ చేయాలని కోరుతూ ప్రభుత్వం పంపించిన సిఫారసుతో గవర్నర్ తొలుత విభేదించినట్లు సమాచారం. అయితే చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికను తక్షణమే నిర్వహించడం సాధ్యం కాదని... బడ్జెట్ సమావేశాల్లో ఎన్నిక నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో గవర్నర్ అందుకు అంగీకరించి జాఫ్రీ నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ సమావేశాల్లోనే చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక అనివార్యం కానుంది. మరోవైపు మండలిలో చీఫ్ విప్‌తోపాటు మరో నలుగురు విప్‌లు ఉండగా ఎంఎస్ ప్రభాకర్‌రావు మినహా గతంలో చీఫ్ విప్, విప్ పదవులు నిర్వహించిన ఎమ్మెల్సీలంతా పదవీకాలం పూర్తి చేసుకున్నారు.
గతేడాది మార్చి నుంచి డిసెంబర్ వరకు మండలి వివిధ కోటాల్లో జరిగిన ఎన్నికల్లో కొత్తగా 21 మంది ఎన్నికయ్యారు. గతంలో విప్‌లుగా వ్యవహరించిన కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, తానిపర్తి భానుప్రసాద్‌రావు స్థానిక సంస్థల కోటాలో మళ్లీ ఎమ్మెల్సీలయ్యారు.
చైర్మన్‌గా మళ్లీ గుత్తానే?
గవర్నర్ కోటాలో గతేడాది నవంబర్‌లో తిరిగి మండలి సభ్యుడైన గుత్తా సుఖేందర్‌రెడ్డికే మరో సారి చైర్మన్ పదవి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మధుసూదనాచారి, కడియం శ్రీహరి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకొని ఎమ్మెల్యే కోటాలో మండలికి ఎన్నికైన గుండా ప్రకాశ్ ముదిరాజ్‌కు వైస్‌చైర్మన్ పదవి ఖాయమనే ప్రచారం జరుగుతోంది. దామోదర్‌రెడ్డి, భానుప్రసాద్, వాణీదేవి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, వీజీ గౌడ్ తదితరుల పేర్లు ప్రభుత్వ విప్‌లుగా పరిశీలనలో ఉన్నట్లు తెలియవచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment