Telangana legislative council
-
కేటీఆర్‌కు కోదండరాం కౌంటర్
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి తారకరామారావుకు ప్రొఫెసర్ కోదండరాం కౌంటర్ ఇచ్చారు. తనకు ఎమ్మెల్సీ దక్కడంపై కేటీఆర్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై కోదండరాం తాజాగా మరోసారి స్పందించారు. ప్రజలకు అన్నీ తెలుసని.. తన ఎంపికపై అనవసరంగా వివాదం చేయడం సరికాదని అన్నారాయన. ‘‘రాజ్యాంగంలో షరతులు అర్థమైతే చర్చ ఉండదు. జాగ్రత్తగా రాజ్యాంగం చదివితే వివాదం ఉండదు. రాజ్యాంగ పరంగా సేవ చేసిన వాళ్లకు అవకాశం ఇస్తారు. నేను సుదీర్ఘకాలం సేవ చేశా. అనవసరంగా నా ఎంపికను వివాదం చేయడం తగదు. ప్రజలకు అన్నీ తెలుసు వారే అంచనా వేసుకుంటారు’’ అని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ శ్రవణ్ కరెక్ట్ కాదా? కానీ ప్రొఫెసర్ కోదండరాం కరెక్టా? అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీసిన సంగతి తెలిసిందే. ఎదురుచూపులు.. ఇదిలా ఉంటే.. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాంతో పాటు అమెర్ అలీఖాన్ ఇవాళ ప్రమాణం చేయాలనుకున్నారు. అయితే శాసన మండలికి వెళ్లిన వాళ్లకు నిరాశ ఎదురైంది. రెండు గంటలపాటు కౌన్సిల్ హాల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కోసం వాళ్లు ఎదురు చూశారు. అయితే అయినప్పటికీ ఆయన రాలేదు. దీంతో బీఆర్ఎస్ నేతల ఒత్తిడి వల్లే గుత్తా రావడం లేదని కాంగ్రెస్ నేతలు చర్చించుకున్నారు. కాసేపయ్యాక.. రేపు మండలి చైర్మన్ అందుబాటులో ఉంటారనే సమాచారం వాళ్లకు అందడంతో వెనుదిరిగారు. రేపు ఉదయం 9గం.30 ని. ఈ ఇద్దరూ ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయనున్నారు. అందుకే రాలేకపోయా తన గైర్హాజరుపై వస్తున్న విమర్శలపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ స్పందించారు. ఆరోగ్యం బాగోలేకపోవడం వల్లే తాను ఏ కార్యక్రమానికి హాజరు కావడం లేదని వెల్లడించారాయన. మండలి స్పీకర్ పదవిని తాను సక్రమంగా నిర్వహిస్తానని చెప్పుకొచ్చారు. -
ఎమ్మెల్సీగా కోదండరాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం రాష్ట్ర శాసన మండలి సభ్యునిగా నియమితులయ్యారు. ఆయనతో పాటు సియాసత్ ఉర్దూ దిన పత్రిక అసిస్టెంట్ ఎడిటర్ మీర్ ఆమేర్ అలీఖాన్‌ను కూడా సభ్యుడిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. గవర్నర్ కార్యాలయం గురువారం ఈ మేరకు ప్రకటన చేసింది. ప్రొఫెసర్ కోదండరాంను విద్యావేత్తల కోటాలో, ఆమేర్ అలీఖాన్‌ను జర్నలిస్టుల కోటాలో మండలి సభ్యులుగా ప్రభుత్వం సిఫారసు చేసింది. గత ప్రభుత్వం దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణలను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా సిఫారసు చేయగా..వారి రాజకీయ నేపథ్యం కారణంగా ఆ ప్రతిపాదనను తమిళిసై తిరస్కరించిన విషయం విదితమే. ప్రస్తుతం వీరి స్థానంలోనే కోదండరాం, మీర్ ఆమేర్ అలీ ఖాన్‌ను నియమించారు. పెద్దల సభకు ఉద్యమ సారథి కోదండరాం సార్‌గా సుపరిచితుడైన ముద్దసాని కోదండరాం స్వగ్రామం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నెన్నెల మండలం జోగాపూర్. 1955 సెప్టెంబర్ 5న ముద్దసాని వెంకటమ్మ, ఎం.జనార్దన్ రెడ్డి దంపతులకు జన్మించారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ , ఓయూలో పీజీ (పొలిటికల్ సైన్స్), జేఎన్‌యూలో ఎంఫిల్ పూర్తి చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ కోసం చేరగా.. 1981లో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఉద్యోగం రావడంతో పీహెచ్డీ మధ్యలో ఆపేశారు. ఆదివాసీల సమస్యలపై దివంగత హక్కుల నేత బాలగోపాల్, ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్‌రావుతో కలిసి పని చేశారు. ఓయూలో ప్రొఫెసర్‌గా సుదీర్ఘ కాలం పనిచేసిన కోదండరాం..దివంగత ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సహా అనేక మంది ప్రముఖ తెలంగాణవాదులతోనూ కలిసి పనిచేశారు. ఉద్యమ సమయంలో రాజకీయ జేఏసీ చైర్మన్‌గా అన్ని పార్టీలను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏకం చేయడంలో క్రియాశీలంగా పని చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటి బీఆర్ఎస్ విధానాలతో విభేదించారు. ప్రజాస్వామిక తెలంగాణ పేరిట 2018 మార్చి 31వ తేదీన తెలంగాణ జన సమితిని ఏర్పాటు చేశారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీజేఎస్ కాంగ్రెస్‌తో కలిసి పని చేసింది. అదే క్రమంలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తో జత కట్టారు. దీనితో పాటు ఉద్యమ నేపథ్యం, ప్రొఫెసర్‌గా ఆయన అందించిన సేవలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. జర్నలిజంలో విశేష కృషి జర్నలిజంలో విశేష సేవలందించిన ఆమేర్ అలీఖాన్ (సియాసత్ ఉర్దూ దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ జాహెద్ అలీఖాన్ కుమారుడు) ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీసీఏ, తరువాత సుల్తాన్–ఉల్–ఉలూమ్ కాలేజీ ఆఫ్ బిజినెస్ అడ్మిని్రస్టేషన్ నుంచి ఎంబీఏ చేశారు. ప్రస్తుతం సియాసత్‌లో న్యూస్ ఎడిటర్‌గా ఉన్న ఆయన..ప్రతిక కర్ణాటక రాష్ట్రానికి విస్తరించేందుకు విశేష కృషి చేశారు. పలు అంతర్జాతీయ ఈవెంట్లను కవర్ చేయడానికి ప్రధానమంత్రి, రాష్ట్రపతిల వెంట విదేశీ పర్యటనలకు వెళ్లారు. మైనారిటీల్లో విద్య, నైపుణ్యాన్ని వృద్ధి చేయడానికి, నిరుద్యోగుల కోసం కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా శిక్షణ ఇప్పించేవారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సియాసత్ ప్రస్తుతం ఖతర్ దేశానికి కూడా విస్తరించింది. 1973 అక్టోబర్ 18న హైదరాబాద్‌లో జన్మించిన అమేర్ అలీ ఖాన్‌కు ఉర్దూతో పాటు ఇంగ్లి‹Ù, హిందీ, అరబిక్, తెలుగు భాషలు తెలుసు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. -
రాష్ట్రంలో కొత్తగా 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు: మంత్రి హరీశ్‌రావు
-
శాసన మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన గుత్తా సుఖేందర్
-
రెండోసారి మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎగువ సభ ప్రతిష్టను, ఔన్నత్యాన్ని పెంచే విధంగా మనమంతా కృషి చేద్దామని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభ్యులకు సూచించారు. తన బాధ్యత తాను నిష్పక్షపాతంగా నిర్వహిస్తానని చెప్పారు. సీనియర్ సభ్యులతో పాటు జూనియర్ సభ్యులు సభా సంప్రదాయాలపై అవగాహన పెంచుకుంటూ అందరం కలిసి ముందుకు సాగుదామని అన్నారు. సోమవారం కౌన్సిల్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు టి.జీవన్‌రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆయన్ను చైర్మన్ సీటు వద్దకు తీసుకెళ్లారు. సీటులో ఆసీనులైన గుత్తాకు మంత్రులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుఖేందర్‌రెడ్డి మాట్లాడారు. చట్టసభల నిర్వహణలో తెలంగాణ తలమానికంగా నిలుస్తోందని, సభా సంప్రదాయాల విషయంలో ఆదర్శంగా ఉందని తెలిపారు. గతంలో 21 నెలల పాటు కౌన్సిల్ చైర్మన్‌గా బాధ్యతలను నిర్వహించిన సందర్భంగా సభ గౌరవ మర్యాదలు కాపాడే ప్రయత్నం చేశామన్నారు. ఎగువసభ అధ్యక్ష బాధ్యతలు తనకు మరోసారి అప్పగించిన సీఎం కేసీఆర్‌కు, ఎన్నుకున్న సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. అత్యుత్తమ పదవుల్లో రైతు బిడ్డలే: మంత్రి కేటీఆర్ ‘తెలంగాణ సీఎం కేసీఆర్, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మీరు (గుత్తా సుఖేందర్ రెడ్డి).. అంతా రైతు బిడ్డలే కావడం విశేషం. రైతు బిడ్డలే అత్యున్నతమైన రాజ్యాంగ పదవుల్లో ఉండ టం ఈ రాష్ట్ర అదృష్టం. ఈ రాష్ట్ర రైతాంగం పక్షాన కూడా మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను..’అంటూ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కౌన్సిల్లో టీఆర్ఎస్ సభ్యులు 35, 36 మంది ఉన్నారని, అందువల్ల దామాషా ప్రకారం తమకు ఎక్కువ అవకాశాలివ్వాలని కోరారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ఒక్కరే ఉన్నా యువకుడిలా ఉత్సాహంగా మాట్లాడుతున్నారని, తాము మధ్యవయసు వారి మాదిరిగా నడుచుకోవాల్సి వస్తోందని అన్నారు. ‘నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య పరిష్కారం కోసం కృష్ణా జలాలను ఇంటింటికీ అందించాలని సుఖేందర్‌రెడ్డి గతంలో సూచించారు. ప్రస్తుతం మిషన్ భగీరథ పథకంతో ఫ్లోరోసిస్ నుంచి విముక్తి పొందాం..’అని కేటీఆర్ చెప్పారు. రైతు సమన్వయ సమితి తొలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి సమర్థవంతంగా నిర్వహిం చారని గుర్తు చేశారు. మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డి, జి.జగదీశ్‌రెడ్డి, సభ్యులు కడియం శ్రీహరి, కల్వకుంట్ల కవిత, వాణీదేవి, ఉళ్ళోళ్ల గంగాధర్‌గౌడ్, ఎల్.రమణ, ఫారుఖ్ హుస్సేన్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెస్ ప్రభాకర్‌రావు, సయ్యద్ అమీనుల్ జాఫ్రీ, కాలేపల్లి జనార్ధనరెడ్డి కూడా అభినందనలు తెలియజేశారు. చదవండి: తెలంగాణ అసెంబ్లీ లైవ్ అప్డేట్స్ -
తెలంగాణ అసెంబ్లీ: ‘ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యను పరిష్కారించాం’
►పట్టణాల్లో ఉండే పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరంలో బస్తీ దవాఖానాలను ప్రారంభించారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చడానికి బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 259 బస్తీ దవాఖానాలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. మరో 91 బస్తీ దవాఖానాలను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో సందర్భంగా బస్తీ దవాఖానాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇచ్చారు. ►తెలంగాణ ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యను పరిష్కరించామని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, వినియోగం పెరిగిందని అన్నారు. రాష్ట్రంలో 26 లక్షల 36 వేల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయని, 35 వేల కోట్లతో విద్యుత్ రంగ సంస్థలకు చేయూతనిచ్చామని తెలిపారు. విద్యుత్ నష్టాలలో జాతియ సగటు కంటె తెలంగాణ సగటు తక్కువ ఉందని పేర్కొన్నారు. విద్యుత్ తీగలకు దగ్గరగా ఇళ్ళ నిర్మాణం చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని నివారిస్తామని వెల్లడించారు. ►తెలంగాణలో పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని మంత్రి స్పష్టం నిరంజన్ రెడ్డి చేశారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. పంట మార్పిడి విధానంలో భాగంగా భారీ స్థాయిలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ►కాసేపట్లో తెలంగాణ శాసన మండలి సమావేశం ప్రారంభం కానుంది. సభ ప్రారంభం కాగానే మండలి చైర్మన్‌ను ప్రొటెం చైర్మన్ జాఫ్రీ ప్రకటించానున్నారు. అనంతరం ఛైర్మెన్ చైర్ వద్ద కొత్త ఛైర్మన్‌ను మండలి సభ్యులు తీసుకెళ్లనున్నారు. సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అయితే నేడు జీరో అవర్ కూడా ఉంటుందని, సభ్యులు ప్రశ్నలు అడగాలని, ఉపన్యాసాలు ఇవ్వద్దని తెలిపారు. ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం, ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు, పోలీసు శాఖ ఆధునీకరణ, రాష్ట్రంలో విద్యుత్ రంగం, జీహెచ్ఎంసీ ప్రాంతంలో బస్తీ దవాఖానాలు, వ్యవసాయ పంపుసెట్లకు ప్రీపెయిడ్ మీటర్లు, వివిధ సంస్థల నుంచి రుణాలు, నిమ్మకాయల నిల్వ కొరకు నకిరేకల్ వద్ద శీతలీకరణ గిడ్డంగి వంటి అంశాలపై ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. కాగా మార్చి7న ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. రేపటితో బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. చదవండి: మండలి చైర్మన్‌గా గుత్తా నామినేషన్ -
బడ్జెట్ సమావేశాల్లో మండలి చైర్మన్ ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వార్షిక బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో సుమారు 9 నెలలుగా ఖాళీగా ఉన్న శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులకు ఎన్నిక జరగనుంది. ఇందుకు సంబంధించి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలి వారంలోనే షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశముంది. 40 మంది సభ్యులున్న మండలిలో టీఆర్ఎస్కు 36 మంది సభ్యుల బలం ఉండటంతో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులు ఏకగ్రీవం కానున్నాయి. మండలి చైర్మన్‌గా వ్యవహరించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ గతేడాది జూన్ 3న మండలి సభ్యులుగా పదవీకాలం పూర్తి చేసుకున్నారు. వారిద్దరి పదవీకాలం ఏకకాలంలో ముగియడంతో మండలిలో సీనియర్ సభ్యుడు వెన్నవరం భూపాల్‌రెడ్డిని గతేడాది జూన్ 4న ప్రొటెమ్ చైర్మన్‌గా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నామినేట్ చేశారు. అయితే ఎమ్మెల్సీగా భూపాల్‌రెడ్డి పదవీకాలం జనవరి 4న ముగియడంతో ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ అమీనుల్ హసన్ జాఫ్రీ గత నెల ప్రొటెమ్ చైర్మన్‌గా నియమితులయ్యారు. అమీనుల్ హసన్ జాఫ్రీని ప్రొటెం చైర్మన్‌గా నామినేట్ చేయాలని కోరుతూ ప్రభుత్వం పంపించిన సిఫారసుతో గవర్నర్ తొలుత విభేదించినట్లు సమాచారం. అయితే చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికను తక్షణమే నిర్వహించడం సాధ్యం కాదని... బడ్జెట్ సమావేశాల్లో ఎన్నిక నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో గవర్నర్ అందుకు అంగీకరించి జాఫ్రీ నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ సమావేశాల్లోనే చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక అనివార్యం కానుంది. మరోవైపు మండలిలో చీఫ్ విప్‌తోపాటు మరో నలుగురు విప్‌లు ఉండగా ఎంఎస్ ప్రభాకర్‌రావు మినహా గతంలో చీఫ్ విప్, విప్ పదవులు నిర్వహించిన ఎమ్మెల్సీలంతా పదవీకాలం పూర్తి చేసుకున్నారు. గతేడాది మార్చి నుంచి డిసెంబర్ వరకు మండలి వివిధ కోటాల్లో జరిగిన ఎన్నికల్లో కొత్తగా 21 మంది ఎన్నికయ్యారు. గతంలో విప్‌లుగా వ్యవహరించిన కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, తానిపర్తి భానుప్రసాద్‌రావు స్థానిక సంస్థల కోటాలో మళ్లీ ఎమ్మెల్సీలయ్యారు. చైర్మన్‌గా మళ్లీ గుత్తానే? గవర్నర్ కోటాలో గతేడాది నవంబర్‌లో తిరిగి మండలి సభ్యుడైన గుత్తా సుఖేందర్‌రెడ్డికే మరో సారి చైర్మన్ పదవి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మధుసూదనాచారి, కడియం శ్రీహరి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకొని ఎమ్మెల్యే కోటాలో మండలికి ఎన్నికైన గుండా ప్రకాశ్ ముదిరాజ్‌కు వైస్‌చైర్మన్ పదవి ఖాయమనే ప్రచారం జరుగుతోంది. దామోదర్‌రెడ్డి, భానుప్రసాద్, వాణీదేవి, తక్కళ్లపల్లి రవీందర్రావు, వీజీ గౌడ్ తదితరుల పేర్లు ప్రభుత్వ విప్‌లుగా పరిశీలనలో ఉన్నట్లు తెలియవచ్చింది. -
మణికొండ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతికి బాధ్యత వహిస్తాం: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇటీవల మణికొండలో రెయిలింగ్ సరిగా ఉంచకపోవడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగి రజనీకాంత్ మృతిచెందడం బాధాకరమని, ఆ సంఘటనకు పురపాలక శాఖ మంత్రిగా తాము బాధ్యత వహిస్తామని తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించారు. ఆ ఘటనపై ఇప్పటికే డీఈఈ, ఏఈఈలను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. చదవండి: టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో కేవలం 10 వేలే, బంగారం, బండి లేనే లేదు బాధితుడి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి కోరిన విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పటికే అతడి కుటుంబానికి రూ.5 లక్షలు ఇచ్చామని, మిగతా రూ.5 లక్షలు కూడా అందిస్తామని స్పష్టం చేశారు. నాలాల ఆక్రమణలు అనేవి తమకు వారసత్వంగా వచ్చిన సమస్యలని, ఏడేళ్లలో టీఆర్ఎస్ హయాంలోనూ కొన్ని నాలాల ఆక్రమణలు చోటుచేసుకుని ఉండొచ్చని వివరించారు. మండలిలో సమగ్ర రహదారి నిర్వహణ కార్యక్రమంపై జీవన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మండలి ప్రొటెమ్ చైర్మన్ భూపాల్‌రెడ్డి, ఎంఎస్ ప్రభాకరరావు అనుబంధ ప్రశ్నలు వేశారు. వీటిపై కేటీఆర్ స్పందించారు. చదవండి: నేను గెలిస్తే తెలంగాణ ముఖచిత్రం మార్పు.. కేసీఆర్ రోడ్డుమీదకు -
‘గవర్నర్ కోటా’పై ఆశావహుల కన్ను
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనమండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్ కోటా స్థానాలను ఆశించేవారి సంఖ్య పెరిగిపోతోంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆశీస్సుల కోసం పలువురు టీఆర్ఎస్ నేతలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. 40 మంది సభ్యులున్న మండలిలో గవర్నర్ కోటా కింద ఆరు స్థానాలుంటాయి. ఇప్పటికే రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గతంలో గవర్నర్ కోటాలో మండలికి ఎన్నిౖకైన రాములు నాయక్ 2018లో కాంగ్రెస్‌లో చేరడంతో టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆయ న పదవీకాలం ఈ ఏడాది మార్చిలో ముగి సింది. గతంలో గవర్నర్ కోటాలో మండలికి నామినేట్ అయిన మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి పదవీకాలం కూడా ఈ ఏడాది జూన్ 19న ముగిసింది. మండలిలో ప్రభుత్వవిప్ కర్నె ప్రభాకర్ పదవీకాలం ఈ ఏడాది ఆగస్టు 17న ముగియనుంది. దీంతో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవాలని పలువురు నేతలు పావులు కదుపుతున్నారు. మరోమారు నాయిని, కర్నెకు అవకాశం? 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించిన నాయినికి మరోమారు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ అప్పట్లో హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తనకు తిరిగి గవర్నర్ కోటాలో అవకాశం లభిస్తుందనే ధీమాతో ఆయన ఉన్నారు. అయితే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం, మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంపై నాయిని ఒకటి, రెండు సందర్భాల్లో బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యల ప్రభావం ఆయన అభ్యర్థిత్వ అవకాశాలపై ఎంతమేరకు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. కర్నె ప్రభాకర్‌ను కూడా గవర్నర్ కోటాలో మండలికి సీఎం కేసీఆర్ మరోమారు నామినేట్ చేసే అవకాశమున్నట్లు సమాచారం. ఆశావహుల జాబితాలో ఇంకొందరు... గవర్నర్ కోటాలో ఒకేసారి మూడు స్థానాలు ఖాళీ అవుతుండటంతో ఆశావహుల జాబితా కూడా పెరుగుతోంది. సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, బ్రూవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, సీనియర్ నేత తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణీదేవి పేరును పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆగస్టు రెండోవారంలో రాష్ట్ర కేబినెట్లో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి గవర్నర్ ఆమోదానికి పంపే అవకాశం ఉంది. -
పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో ప్రజా పద్దులు (పీఏసీ) కమిటీ పదవి ఎంఐఎం పార్టీని వరించింది. ఆ పార్టీ శాసనసభ పక్షం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి పీఏసీ చైర్మన్ పదవి దక్కింది. అలాగే అంచనాల కమిటీ చైర్మన్‌గా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నియమితులయ్యారు. మరోవైపు ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. పది రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాలలో మూడు బిల్లులతో పాటు ఒక తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు. అనంతరం తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. కాగా పీఏసీ చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వడం అనేది సంప్రదాయం. అయితే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళ్లడంతో ఆ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. దీంతో ఏడుగురు సభ్యులు ఉన్న మజ్లిస్ పార్టీ... తమకు పీఏసీ పదవి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. -
ఎమ్మెల్సీల అనర్హతపై తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్ : ముగ్గురు ఎమ్మెల్సీలను అనర్హులుగా ప్రకటిస్తూ తెలంగాణ శాసనమండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రకటించాలని కోరుతూ వేర్వేరుగా దాఖలైన మూడు పిటిషన్లపై గురువారం వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల నుంచి లిఖితపూర్వక వాదనలు స్వీకరించిన హైకోర్టు.. తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కె.యాదవరెడ్డి, ఎస్.రాములు నాయక్, ఆర్.భూపతిరెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారనే ఫిర్యాదుపై శాసనమండలి చైర్మన్ ఆ ముగ్గురినీ ఎమ్మెల్సీలుగా అనర్హులని ప్రకటించారు. అయితే.. రాజ్యాంగ, చట్ట నిబంధనలకు విరుద్ధంగా చైర్మన్ వ్యవహరించారంటూ ఆ ముగ్గురూ వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. పదో షెడ్యూల్ 8వ పేరాను సమీక్షించాలి : భూపతిరెడ్డి భూపతిరెడ్డి తరఫు న్యాయవాది ఆనంద్ కపూర్ వాదనలు వినిపిస్తూ.. 10వ షెడ్యూల్లోని 8వ పేరా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు. 10వ షెడ్యూల్ కింద అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్లకు ఏకపక్ష అధికారాలు ఉన్నాయని, దీంతో వారు ఇష్టం వచ్చిన రీతిలో నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగానే పిటిషనర్‌ను మండలి చైర్మన్ అనర్హుడిగా ప్రకటించారని, ఈ చర్యను రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రకటించాలని కోరారు. ట్రిబ్యునల్ హోదాలో మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయం చెల్లదని, ఆయన రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని వాదించారు. అనర్హత వేటు చట్ట వ్యతిరేకం : యాదవరెడ్డి యాదవరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ కాంగ్రెస్ పార్టీలో చేరారనేందుకు నిర్ధిష్టమైన ఆధారాలు లేవన్నారు. ఈ విషయాన్ని పట్టించుకోకుండానే మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారని, మేడ్చల్ సభలో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీని కలిసినందుకే అనర్హత వేటు వేశారని తెలిపారు. తెలంగాణ ఇచ్చి నందుకు కృతజ్ఞతలు చెప్పడానికే సోనియా, రాహుల్‌లను పిటిషనర్ కలిశారని వివరించారు. పార్టీ ఫిరాయించినట్టుగా ఆధారాలు చూపడంలేదని, పత్రికల్లో వచ్చిన ఫొటోలనే ఆధారాలుగా భావించడం చెల్లదన్నారు. ఫిరాయింపు వేరు ఒక జాతీయ నేతను కలవడం వేరు అని, ఈ తేడాను మండలి చైర్మన్ గుర్తించకుండానే రాజ్యాంగ విరుద్ధంగా అనర్హత వేటు వేశారని, ఇది చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు. నామినేటెడ్ ఎమ్మెల్సీకి పార్టీతో పనిలేదు : రాములు నాయక్ రాములు నాయక్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ వాదిస్తూ.. సామాజిక సేవకు గుర్తింపుగా పిటిషనర్‌ను గవర్నర్ తన కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేశారని నివేదించారు. దీనికి పార్టీలతో సంబంధం లేదని పేర్కొన్నారు. ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీలను కలిస్తేనే పార్టీ ఫిరాయించారనే అభియోగంతో వేటు వేశారన్నారు. నామినేట్ చేసిన పత్రాల్లో ఏ పార్టీకి చెందని వ్యక్తి అని ఉందని.. ఆ పత్రాలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద కోరితే ఇవ్వలేదని వివరించారు. నాలుగు వారాల సమయం ఇస్తే తనపై ఆరోపణలు అవాస్తవమని నిరూపిస్తామని చెప్పినా మండలి చైర్మన్ ఖాతరు చేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని కోర్టుకు చెప్పారు. బహిరంగసభలో పార్టీ ఫిరాయించారు : అదనపు ఏజీ మండలి చైర్మన్ తరఫున అదనపు ఏజీ జె.రామచంద్రరావు వాదిస్తూ.. పిటిషనర్లు బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుని పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. టీఆర్ఎస్కు చెందిన ముగ్గురూ ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని చెప్పారు. మేడ్చల్‌లో కాంగ్రెస్ నిర్వహించిన సభలో ఇద్దరు టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని.. ఓ నేత ఢిల్లీ వెళ్లి సోనియా, రాహుల్‌గాంధీలను కలిసినట్లు పత్రిక, టీవీల్లో వార్తలు వచ్చాయని, వాటిని పిటిషనర్లు ఖండించలేదని తెలిపారు. ఒక పార్టీ తరఫు ఎమ్మెల్సీగా ఉంటూ మరో పార్టీకి కొమ్ముకాయడం క్యారెక్టర్‌కు సంబంధించిన వ్యవహారమన్నారు. ఆ క్యారెక్టర్ కోల్పోయిన నేపథ్యంలో చర్యలు తీసుకోవచ్చునని సుప్రీంకోర్టు సైతం చెప్పిందని, అందువల్ల వారిని అనర్హులుగా ప్రకటించడం రాజ్యాంగబద్ధమేనని స్పష్టంచేశారు. రాములు నాయక్‌కు ఎప్పటి నుంచో పార్టీ సభ్యత్వం ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసిన ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తరఫున న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఉండి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుని ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి కోసం పనిచేశారని వివరించారు. రాములు నాయక్‌కు పార్టీ సభ్యత్వం ఉండగానే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారని, మండలి చైర్మన్ ఎదుట వాదనల్లో పార్టీ సభ్యత్వం ఉందని కూడా నాయక్ అంగీకరించారన్నారు. నామి నేట్ అయిన ఆరు నెలల్లోగా ఏదో ఒక పార్టీలో చేరితో ఫిరాయింపు అవ్వదని, ఎప్పటి నుంచో రాములు నాయక్‌కు టీఆర్ఎస్ పార్టీ సభ్య త్వం ఉందని తెలిపారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే అనర్హత వేటు వేయవచ్చునని సుప్రీంకోర్టు తీర్పులు కూడా వెలువరించిందని నివేదించారు. కాగా, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ 8వ పేరాకు రాజ్యాంగబద్ధత ఉందని కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఎన్.హరినాథ్‌రెడ్డి స్పష్టంచేశారు. ధర్మాసనం లేవనెత్తిన సందేహాలివీ.. ‘‘ప్రత్యేకాధికారాలున్న రాష్ట్రపతి సైతం అనేక నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని కూడా తప్పుపట్టవచ్చా? పత్రికల్లో వార్తలు వచ్చాయని చెబుతున్నారు. ఇవన్నీ నిజమే కావచ్చు. కానీ కోర్టుకు సాక్ష్యాలు ముఖ్యం. నిజానికి కూడా సాక్ష్యం కావాలి. ఆరోపణలకు వాస్తవిక ఆధారాలు ఉండాలి. సేవా రంగంలోని వ్యక్తిని గుర్తించి గవర్నర్ ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే దానికి పార్టీ ఫిరాయింపు ఎలా వర్తిస్తుంది. క్రాస్ ఎగ్జామ్ చేసేందుకు ఇరు పక్షాలకు అవకాశం ఇచ్చారా’’అని విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. మండలి చైర్మన్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ క్వాసీ జ్యుడీషియల్ సంస్థ కాదని, ఆ ట్రిబ్యునల్‌కు సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌లు వర్తించకపోయినా సహజ న్యాయసూత్రాలకు కట్టుబడి ఉండాలని స్పష్టంచేసింది. మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన రికార్డులు, వీడియోలు ఇవ్వాలని ఆదేశించింది. -
ఏడుగురు కొత్త ఎమ్మెల్సీల ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనమండలికి ఇటీవల ఎన్నికైన ఏడుగురు కొత్త సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ కార్యాలయంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ లుగా ఎన్నికైన మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, యెగ్గె మల్లేశం, శేరి సుభాష్‌రెడ్డి, మీర్జా రియాజ్ హసన్ ఎఫెండి... ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఎ.నర్సిరెడ్డి, కూర రఘోత్తంరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి హాజరయ్యారు. -
మండలిపై టీఆర్ఎస్ నజర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజ యం సాధించిన టీఆర్ఎస్ తాజాగా శాసనమండలి ఎన్నికలపై దృష్టి సారించింది. సాధారణ ఖాళీలతోపాటు రాజీనామాలు, ఇతర కారణాలతో రాష్ట్రంలో 16 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో వాటన్నింటినీ కచ్చితంగా గెలుచుకునేందుకు వ్యూహాలు మొదలు పెట్టింది. శాశ్వత సభ అయిన శాసనమండలిలో గవర్నర్, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థలు, ఉపాధ్యాయులు, పట్టభద్రుల కోటా ఉంటుంది. తెలంగాణ శాసనమండలిలో 40 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. ప్రతి రెండేళ్లకోసారి మూడో వంతు స్థానాలు ఖాళీ అవుతాయి. వాటికి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది. ఇలా 2019 మార్చి 31 నాటికి తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. రాజీనామాలు, ఇతర కారణాలతో మరో ఆరు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మైనంపల్లి హనుమంతరావు, పట్నం నరేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు శుక్రవారం రాజీ నామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇలా నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ 13 ఎమ్మెల్సీ స్థానాలకు కచ్చి తంగా ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు అసెంబ్లీ ఎన్ని కలకు ముందు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రాములు నాయక్, ఆర్.భూపతిరెడ్డి, కె. యాదవరెడ్డిల సభ్యత్వాలను రద్దు చేయాలని టీఆర్ఎస్ ఇటీవల శాసన మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. శాసన మండలి చైర్మన్ త్వరలోనే ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఫిరాయింపుల నిబంధనల ప్రకారం ఆ ముగ్గురిపై వేటు వేస్తే మరో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వాటిని సైతం కలిపితే మొత్తం 16 ఎమ్మెల్సీ స్థానాలకు మార్చిలోగా ఎన్నికలు జరగనున్నాయి. ఖాళీ అయ్యే అన్ని ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవడం లక్ష్యంగా టీఆర్ ఎస్ వ్యూహాలు రచిస్తోంది. గవర్నర్ కోటా కచ్చి తంగా అధికార పార్టీ ప్రతిపాదనల ఆధారం గానే భర్తీ అవుతుంది. ఎమ్మెల్యేలు, స్థానిక సం స్థలు, ఉపాధ్యాయులు, పట్టభద్రుల కోటా స్థానాల్లోనూ విజయం సాధించాలని టీఆర్ఎస్ గట్టిగా నిర్ణయించుకుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త వారికి పదవీకాలం మొదలు కానుంది. ఈలో గా ఎన్నికలు పూర్తి చేసేలా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. భారీగా పోటీపడుతున్న ఆశావహులు ఎమ్మెల్సీ సీట్ల కోసం అధికార పార్టీలో తీవ్ర పోటీ ఉంది. ప్రతి ఉమ్మడి జిల్లా నుంచి సగటున ఐదుగురు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యేల కోటాలో ఐదు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అన్ని స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న మహమూద్‌అలీ (హోంమంత్రి), మహమ్మద్ సలీంకు కచ్చితంగా కొనసాగింపు ఉండనుంది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎం. ఎస్. ప్రభాకర్లకు సైతం ఇదే కోటాలో ఇచ్చే అవకాశం ఉంది. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనమండలిలో టీఆర్ఎస్ చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి పదవీకాలం పూర్తవుతోంది. వారి కొనసాగింపు విషయంలో టీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. స్వామిగౌడ్ ప్రస్తుతం కరీంనగర్–మెదక్– నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రు ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తు న్నారు. ఈసారి ఆయన ఇతర కోటాలో అవకా శం ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ పేరును టీఆర్ ఎస్ అధిష్టానం పరిశీలిస్తోంది. సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ సమీకరణ నేపథ్యంలో రవీందర్‌సింగ్‌కు అవకాశం ఇస్తారని తెలు స్తోంది. కేసీఆర్ ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే సందర్భాల్లో సిక్కు వర్గానికి చెందిన రవీం దర్‌సింగ్‌ను వెంట తీసుకెళ్లే అవకాశం ఉందని, దీనికి అనుగుణంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉంది. అయితే పట్టభద్రుల నియో జకవర్గం కావడంతో గ్రూప్–1 అధికారుల సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, సరోజినీదేవి మాజీ సూపరింటెండెంట్ ఎస్. రవీందర్‌గౌడ్ పేర్లను టీఆర్ఎస్ అధి ష్టానం పరిశీలిస్తోంది. పాతూరి సుధాకర్‌రెడ్డికి రెండోసారి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయుల స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి టీఆర్ఎస్లో చేరిన పూల రవీందర్‌కు మళ్లీ పోటీ చేసే అవకాశం ఇవ్వనున్నటు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యే కోటా మూడు స్థానాలతోపాటు మిగిలిన వాటిలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే విషయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. తొలి నుంచీ ఉన్న వారికి ప్రాధాన్యత... టీఆర్ఎస్లో మొదటి నుంచీ ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వలేకపోయిన వారికి ఎమ్మెల్సీ పదవులను ఖరారు చేయనున్నారు. కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు ఎం. సుధీర్‌రెడ్డి తక్కళ్లపల్లి రవీందర్రావు, సత్యవతి రాథోడ్, గ్యాదరి బాలమల్లు, సోమ భరత్‌కుమార్, కార్యదర్శులు మాలోత్ కవిత, కోలేటి దామోదర్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేర్లను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలిస్తున్నారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల విషయంలో ఆయా ఉమ్మడి జిల్లాల సమీకరణల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. -
ప్రతిపక్షంలో ఉన్నా ఆయనపై గౌరవం తగ్గలేదు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : భారత దేశ అణుశక్తిని ప్రపంచానికి తెలియజేసిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్‌పేయి అని అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వాజ్‌పేయి సంతాప తీర్మానాన్ని సీఎం హోదా కేసీఆర్ శాసన మండలిలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాజ్‌పేయి విలక్షణమైన నేత, అద్భుతమైన వక్త అని పేర్కొన్నారు. వాజ్‌పేయి ఏదో ఒకరోజు ప్రధాని అవుతారని జవహర్ లాల్ నెహ్రు ముందే చెప్పారని గుర్తుచేశారు. ప్రతిపక్షంలో ఉన్నా ఆయనకు ఏ మ్రాతం గౌరవం తగ్గలేదన్నారు. బతికున్నప్పుడే భారతరత్న వచ్చిన కొద్దిమందిలో వాజ్‌పేయి ఒకరని తెలిపారు. దేశానికి ఉత్తమమైన పాలన అందించిన గొప్ప నేత వాజ్‌పేయిఅని ప్రశంసించారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా మంచిపని చేసే వారిని పొగిడేవారని గుర్తుచేశారు. ఆయన జ్ఞాపకాలు, చర్యలు భావితరాలకు స్ఫూర్తిగా ఉండాలన్నారు. ‘వాజపేయి స్మారకార్థం.. ఎకరా స్థలంలో స్మారక భవనం, విగ్రహాం కూడా నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికారులు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం, మండలి పక్షాన వాజపేయి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢమైన సానుభూతి వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను ’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. -
తెలంగాణ శాసనమండలికి లగడపాటి
సాక్షి, హైదరాబాద్: విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ గురువారం తెలంగాణ శాసనమండలి వచ్చారు. తన కొడుకు పెళ్లి త్వరలో జరుగుతున్నందున పలువురు ఎమ్మెల్సీలకు పెళ్లికి ఆహ్వానించేందకు ఆయన మండలికి చేరారు. అక్కడ పలువురు ఎమ్మెల్సీలను కలిసి శుభలేఖలు అందజేశారు. కేసీఆర్‌తో భేటీ కాగా లగడపాటి బుధవారమే ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. తన కుమారుడి వివాహానికి రావాలంటూ శుభలేఖను అందించారు. కేసీఆర్ కూడా లగడపాటిని సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్, లగడపాటి కలుసుకోవడం ఇదే తొలిసారి. ఉద్యమ నేపధ్యంలో ఒకరినొకరు తీవ్ర విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ పెప్పర్ స్ప్రే కొట్టి కలకలం రేపిన లగబపాటి రాష్ట్ర విభనను వ్యతిరేకించారు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడంతో ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. -
దుమారం రేపిన కోమటిరెడ్డి వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీలోకి రాకుంటే కేసులు పెడతామని, పార్టీ కండువా కప్పుకోవాలంటూ బెదిరిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. శాసనమండలిలో మంగళవారం ‘పోలీసు వ్యవస్థ ఆధునీకరణ, శాంతి భద్రతల నిర్వహణ’పై లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని లేపాయి. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ తీరు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ, ప్రతిపక్షాలపై అనవసర కేసులు పెడుతున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే చెప్పినట్లే చేయాలని, లేకుంటే తమను బదిలీచేస్తారని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఒత్తిడి భరించలేక సెలవు పెట్టి వెళ్తామని అనేకమంది పోలీసులు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. పోలీసులను ఇతర పార్టీలపైకి ఉసిగొల్పితే ఊరుకోబోమని హెచ్చరించారు. దీంతో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి జోక్యం చేసుకుంటూ తమ పార్టీకి లక్షలాది మంది సభ్యులున్నారని, ఇతర పార్టీల నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తమ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్నారు. -
'కాలేజ్ పేరు చూసి మోసపోకండి'
సాక్షి, హైదరాబాద్ : కార్పొరేట్ కళాశాలల పేర్లు చూసి విద్యార్థుల తల్లిదండ్రులు మోసపోవద్దని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సూచించారు. సోమవారం ఉదయం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కడియం మాట్లాడారు. కార్పొరేట్ కళాశాలల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయా కాలేజీలకు గుర్తింపు ఉందా? లేదా? అన్న విషయం తెలుసుకొని అడ్మిషన్స్ తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే 150 కార్పొరేట్ కాలేజీ హాస్టళ్లలో ప్రభుత్వం తనిఖీలు జరిపిందన్నారు. ఆ కళాశాలల్లో నెలకొన్న పరిస్థితులపై ఆ కాలేజీ యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చామన్నారు. 2018 మార్చిలోగా ప్రైవేటు విద్యాసంస్థల అప్లికేషన్లు, గుర్తింపు ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 2018-19 ఏడాదికి కళాశాలలు ప్రవేశాలు జరపవద్దని నోటీసులు ఇచ్చాం. ఇప్పటికే ప్రవేశాలకు సంబంధించి ప్రక్రియ ప్రారంభించినట్లు తెలుస్తోంది. అటువంటి కళాశాలలపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. పాఠశాలలు, కళాశాలల్లో పరిస్థితులపై కమిటీ ఏర్పాటు చేశాం. నవంబర్‌లో కమిటీ నివేదిక ఇవ్వగానే తదుపరి చర్యలు తీసుకుంటాం. కార్పొరేట్ స్కూల్స్, కాలేజీల్లో ఫీజులు నియంత్రిస్తామని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. -
'గాంధీభవన్‌లో కూర్చొని గడ్డాలు పెంచితే సరిపోదు'
హైదరాబాద్: స్కీములు, స్కాములలో తలమునకలైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడుతుంటే.. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరిన చందంగా ఉందని మంత్రి కేటీఆర్ ఎద్దేవ చేశారు. శాసన మండలి సమావేశాల్లో భాగంగా బడ్జెట్ పద్దులపై శుక్రవారం జరిగిన చర్చలో ప్రభుత్వం అవినీతిమయమైందని కాంగ్రెస్ విమర్శించింది. దీనికి కేటీఆర్ సమాధానం ఇస్తూ.. స్కీములు, స్కాములకు పాల్పడింది కాంగ్రెస్సే.. 40 ఏళ్లు పాలించి ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే కాంగ్రెస్ ఓర్వలేక పోతుందన్నారు. రాష్ట్రం బాగుపడుతుంటే సహకరించాలి కాని ఓర్వలేకపోవడం దారుణమన్నారు. గాంధీభవన్‌లో కూర్చొని గడ్డాలు పెంచుకోవడం వల్ల అభివృద్ధి సాధ్యం కాదన్నారు. -
అయితే అప్పుల భారతదేశమనాలా?: కేటీఆర్
హైదరాబాద్: బడ్జెట్ ప్రసంగంలో భాగంగా మండలిలో మంత్రి కేటీర్, ఎమ్మెల్సీ రాంచంద్రరావు మధ్య వాడివేడిగా చర్చ సాగింది. బంగారు తెలంగాణను బకాయిల తెలంగాణగా మార్చారని రాంచంద్రరావు ఆరోపించగా.. రాష్టం బకాయిల తెలంగాణ అయితే దేశాన్ని బకాయిల భారత దేశం అనాలా అని మంత్రి ఎదురుదాడికి దిగారు. అప్పుల విషయంలో రాష్ట్రాన్ని బకాయిల రాష్టం చేస్తున్నారని రాంచంద్రరావు అనగా.. రుణామాఫీల వల్ల ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారన్న మోదీ, యూపీ ఎన్నికల సందర్బంగా రైతు రుణమాఫీని ఎందుకు ప్రకటించారని ప్రశ్నించారు. రాష్ట్రానికో న్యాయం, యూపీకో న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. రుణమాఫీ చెల్లించాలని ప్రధానిని కలుద్దామంటే తామూ వస్తామని కేటీఆర్ అన్నారు. గత బడ్జెట్ పూర్తిగా ఖర్చు చేయలేదు, ఈసారి కేటాయింపులు భారీగా తగ్గించారన్న రాంచంద్రరావు వ్యాఖ్యలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. కేటాయింపులు తగ్గాయని, సరిగ్గా ఖర్చు చేయలేదనే నిందారోపణలు సరికాదన్నారు. బీజేపీ ఏలుబడిలో ఉన్న కొత్త రాష్ట్రాలు ఇంకా కుదుట పడలేదు... తెలంగాణ మాత్రం రెండేళ్లలోనే నంబర్ వన్ స్థాయికి చేరిందంటే దాని వెనుక ప్రభుత్వ కృషిని గమనించాలని కోరారు. -
ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు
హైదరాబాద్ : వచ్చే మార్చి, మే నెలల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పదవీ కాలం పూర్తవుతున్న పలు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూలును విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన తొమ్మిది మంది ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ఆయా స్థానాలకు ఈసీ షెడ్యూలు ప్రకటించింది. వీటిల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 8 స్థానాలు, తెలంగాణ నుంచి ఒక స్థానం ఖాళీ అవుతోంది. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ప్రస్తుతం విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 21 న నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఫిబ్రవరి 28 వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. మార్చి 3 వరకు ఉపసంహరణకు గడువు విధించారు. ఆ తర్వాత మార్చి 17 న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. మార్చి 20 న ఓట్ల లెక్కింపు జరుపుతారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అనంతపురం, కడప, నెల్లూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీలు పదవీ కాలం ముగుస్తోంది. అనంతపురం, కడప స్థానిక సంస్థల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మెట్టు గోవిందరెడ్డి, చదిపిరాళ్ల నారాయణరెడ్డిల పదవీ కాలం మార్చి 29 తో ముగుస్తోంది. నెల్లూరు (వాకాటి నారాయణరెడ్డి), పశ్చిమ గోదావరి (రెండు స్థానాలు - అంగర రామమోహన్, మేకా శేషుబాబు), తూర్పుగోదావరి (బొడ్డు భాస్కర రామారావు), శ్రీకాకుళం (పీరుకట్ల విశ్వప్రసాదరావు), చిత్తూరు (బి నరేష్ కుమార్ రెడ్డి), కర్నూలు (శిల్పా చక్రపాణిరెడ్డి) ల పదవీ కాలం మే ఒకట తేదీతో పూర్తవుతుంది. తెలంగాణ నుంచి హైదరాబాద్ స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన సయ్యద్ అమినుల్ హసన్ జాఫ్రీ పదవీ కాలం కూడా మే ఒకటి నాటితో పూర్తవుతుంది. ఈ స్థానానికి కూడా ఏపీకి ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారు. ఇలావుండగా, ఏపీలో ఖాళీ అవుతున్న మూడు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలు, రెండు టీచర్స్ నియోజకవర్గాల ఎన్నికల కోసం, అలాగే తెలంగాణలో ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 6 న షెడ్యూలు ప్రకటించిన విషయం తెలిసిందే. టీచర్స్, గ్రాడ్యుయేట్స్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో ఏపీ అంతా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుంది. -
కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఎందుకో అంత ఆసక్తి?
-
'కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఎందుకో అంత ఆసక్తి?'
హైదరాబాద్ : శాసనమండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు మంగళవారం గ్యాంగ్ స్టర్ నయీం కేసు అంశాన్ని ప్రస్తావించారు. నయీం డైరీని బయటపెట్టాలని, ఆ కేసులో సంబంధం ఉన్నవారందరి పేర్లు బయటపెట్టాలని ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి ఇవాళ సభలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు సమాధానం ఇస్తూ కేసులో సంబంధించిన అన్ని అంశాలను సభ ముందు ఉంచుతామని తెలిపారు. అలాగే నయీం కేసులో కోమటిరెడ్డి సోదరులకు ఎందుకో అంత ఆసక్తి అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యలు చేశారు. నయీం ఎన్‌కౌంటర్‌పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బర్ అలీ మాట్లాడుతూ ముఖ్యమత్రి ఆదేశాల మేరకే నయీం ఎన్కౌంటర్ జరిగిందా అని ప్రశ్నించారు. -
ఎమ్మెల్సీ కౌంటింగ్ రోజున సెలవు
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలికి సంబంధించి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఆదివారం (27న) జరుగనున్నాయి. ఓట్ల కౌంటింగ్ బుధవారం (30న) జరుగనుంది. కౌంటింగ్ రోజున సెలవు ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. -
తెలంగాణ శాసనమండలి ఉపాధ్యక్షుడిగా విద్యాసాగర్
-
కౌన్సిల్ లో ప్రతిపక్ష నేతగా షబ్బీర్
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలిలోప్రతిపక్ష నేతగా షబ్బీర్ అలీని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ మేరకు కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్ కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి లేఖ రాశారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ ఆదేశాలతో షబ్బీర్ అలీని ప్రతిపక్ష నేతగా ఎంపిక చేశామని ఉత్తమకుమార్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు సీనియర్ నాయకుడు డి. శ్రీనివాస్ కౌన్సిల్ లో విపక్షనేతగా కొనసాగారు. తనను తప్పించి షబ్బీర్ అలీని ప్రతిపక్ష నాయకుడిగా ఎంపికచేయడంతో డీఎస్ ఎలా స్పందిస్తారో చూడాలి. -
17 మంది ఎమ్మెల్సీలకు వీడ్కోలు
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి నుంచి రిటైరవుతున్న 17 మంది ఎమ్మెల్సీలకు మండలి చైర్మన్ స్వామి గౌడ్ వీడ్కోలు పలికారు. 10 రోజుల పాటు జరిగిన శాసనమండలి నిరవధిక వాయిదా పడింది. శాసనమండలిలో 7 బిల్లులకు ఆమోదం లభించింది. 3 తీర్మానాలపై చర్చ చేపట్టారు. 41.50 గంటల పాటు మండలిలో చర్చ జరిగింది. -
మండలి ఎన్నికల నోటిఫికేషన్ గెజిట్‌లో ప్రచురణ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలిలో 2 పట్టభద్రుల నియోజకవర్గాల (మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ) ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 11న షెడ్యూలు ప్రకటించిన ఎన్నికల సంఘం గురువారం తెలంగాణ రాష్ట్ర గెజిట్‌లో నోటిఫికేషన్‌ను ప్రచురించినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) కార్యాల యం ఒక ప్రకటనలో తెలిపింది. గురువారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని సీఈఓ కార్యాలయం పేర్కొంది. -
తెలంగాణ శాసనమండలి నిరవధిక వాయిదా
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది. శుక్రవారం ద్రవ్యవినిమయ బిల్లును మండలి ఆమోదించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ బిల్లు ఆమోదానికి సహకరించింది. చివరి రోజు రెండు బిల్లులను సభ ఆమోదించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చివరిరోజు మాత్రమే శాసనమండలికి హాజరయ్యారు. 11 రోజుల్లో 49 గంటల 22 నిమిషాలు పాటు సమావేశాలు సాగాయి. ఈసారి సమావేశాల్లో పలు అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. కాంగ్రెస్, టీడీపీ సభ్యుల పార్టీ ఫిరాయింపుపై పలుమార్లు సభ వాయిదా పడింది. కాగా ఈ అంశం తన పరిధిలో ఉందని మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు. -
నిజాం, భూస్వామ్య పాలనను కీర్తిస్తారా?
* పాఠ్యాంశాల్లో చేర్చే అంశంపై వివాదం లేపిన కె.నాగేశ్వర్ వ్యాఖ్యలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చరిత్రను, పోరాట యోధుల గాథలను పాఠ్యాంశాలుగా చేర్చే అంశం శాసనమండలిలో కొద్దిసేపు గందరగోళం సృష్టించింది. అధికార, విపక్ష సభ్యుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో మండలి అట్టుడికింది. కొత్త రాష్ట్రంలో తెలంగాణ కవులు, కళాకారులు, అమరవీరుల జీవిత చరిత్రలను పాఠ్యాంశాల్లో చేర్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందా? అని ఎమ్మెల్సీ పాటూరి సుధాకర్‌రెడ్డి ప్రశ్నకు విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి సమాధానమిస్తూ... ‘‘ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ చరిత్రను, సంస్కృతిని మరిచిపోయేట్టు చేశారు. పాఠ్యాంశాల్లో తెలంగాణ సంస్కృతి, చరిత్ర, కాకతీయుల నుంచి కుతుబ్‌షాలు, ఆజాం జాహీలు, నిజాంల వరకు సాగిన పాలన, వారిపై పోరాడిన వారి గురించి, తెలంగాణ కోసం పోరాడిన వారి గురించి పాఠ్యాంశాల్లో చేరుస్తాం. తెలంగాణ గత చరిత్ర, భౌగోళిక స్వరూపాల గురించి కూడా పొందుపరుస్తాం. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేశాం..’’ అని వెల్లడించారు. దీనిపై ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ... మంత్రి మాటలు వింటుంటే నిజాం పాలనను గొప్పదిగా కీర్తిస్తూ పాఠాలు నేర్పుతారేమోనని అనుమానం వస్తోందని వ్యాఖ్యానించారు. ‘‘నిజాం పాలనలో భూస్వాముల అకృత్యాలను, వారి వల్ల చనిపోయిన 4 వేల మంది గురించి దాచిపెడతారా? తెలంగాణ సాయుధ పోరాటం ఎందుకొచ్చిందో మరిచి పోయి నిజాం పాలన గొప్పదని పాఠ్యాంశాల్లో చేరుస్తారా?..’’ అని ప్రశ్నించారు. దీంతో మంత్రి జగదీశ్వర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ... దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, కొమరం భీమ్, రావి నారాయణరెడ్డి, షోయబుల్లా ఖాన్ వంటి తెలంగాణ పోరాట యోధుల గురించి చెప్పినప్పుడు నిజాంను కీర్తించడమెలా అవుతుందని ప్రశ్నించారు. ‘‘కాకతీయుల పాలన గొప్పతనాన్ని చెబుతూనే.. వారిపై పోరాడిన సమ్మక్క-సారక్కల గురించి కూడా చెబుతామని అంటున్నాం. హైదరాబాద్‌కు పునాదులు వేసిందెవరో.. జూబ్లీహాల్, ఆర్ట్స్ కాలేజ్, ఉస్మానియా హాస్పిటల్, అసెంబ్లీని కట్టి అభివృద్ధి చేసిందెవరో చెప్పకుండా చరిత్రను వక్రీకరించాలా? నిజాంసాగర్‌ను కట్టి, ైరె ల్వే లైన్లు వేసిన నిజాం గురించి విద్యార్థులకు తెలపడం తప్పా? నిజాం పాలనతో పాటు ఆయన హయంలో చివరి రోజుల్లో జరిగిన అకృత్యాల గురించీ పాఠ్యాంశాల్లో చేర్చేందుకు కమిటీ పనిచేస్తుంది’’ అని మంత్రి పేర్కొన్నారు. నాగేశ్వర్ వినకుండా నిజాం అందించింది గొప్ప పాలనే కానీ కొన్ని పొరపాట్ల కారణంగా కొమరం భీమ్, చాకలి ఐలమ్మ వంటి వారు పోరాడాల్సి వచ్చిందని చెప్పే ప్రయత్నం జరుగుతుందేమోనని వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ చరిత్రను పాఠ్యాంశాల్లో చేరుస్తామని మంత్రి చెబుతోంటే అందులో తప్పులు వెతికి, తామే అన్నట్లుగా వ్యవహరించడం మంచిది కాదని నాగేశ్వర్‌కు సూచించారు. -
టీఆర్ఎస్లో చేరిన నేతి విద్యాసాగర్
హైదరాబాద్: శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ శుక్రవారం టీఆర్ఎస్లో చేరారు. నేతి విద్యాసాగర్, ఆయన అనుచరులు సీఎం క్యాంపు కార్యాలయానికి రాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీకే చెందిన మరో ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్‌రావు కూడా రెండు మూడు రోజుల్లో టీఆర్ఎస్లో చేరనున్నారని సమాచారం. శాసనమండలి చైర్మన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన స్వామిగౌడ్‌కు నేతి విద్యాసాగర్‌తో పాటు రాజేశ్వర్‌రావు కూడా ఓటేసిన సంగతి విదితమే. -
చప్రాసీ నుంచి మండలి చైర్మన్ దాకా..
ఇది గొప్ప ప్రజాస్వామ్యం: స్వామిగౌడ్ సాక్షి, హైదరాబాద్: చప్రాసీగా ఉన్న తనను పెద్దల సభకు చైర్మన్‌ను చేసిన ఘనత భారత ప్రజాస్వామ్యానిదేనని శాసనమండలి నూతన చైర్మన్ స్వామిగౌడ్ పేర్కొన్నారు. ప్రపంచంలో ఇంతకంటే గొప్ప ప్రజాస్వామ్యం మరెక్కడుందని వ్యాఖ్యానించారు. ఎక్కడో బీసీ కుటుంబంలో పుట్టి, అటెండర్‌గా ఉద్యోగం చేస్తూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తనకు మండలి చైర్మన్‌గా అత్యున్నతమైన బాధ్యతను కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రులకు, సహకరించిన సభ్యులకు తల వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. అంతకుముందు సభలో 21 మంది సభ్యులు నూతన చైర్మన్‌గా ఎన్నికైన స్వామిగౌడ్‌ను అభినందించడంతోపాటు ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు. అనంతరం స్వామిగౌడ్ ప్రసంగిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. ప్రసంగం ఆయన మాటల్లోనే... * తట్టుకోలేని ఉద్వేగానికి గురవుతున్న సందర్భమిది. కన్నీళ్లు ఆగడం లేదు. తెలంగాణ సాయుధ, ఉద్యమ అమర వీరుల పోరాట ఫలితమే ఇది. నన్ను అక్కున చేర్చుకున్న నా ఊరుతోపాటు ఈ బాధ్యతను అప్పగించిన సభ్యులందరికీ తలవంచి నమస్కరిస్తున్నా. ఈ రోజు ఆచార్య జయశంకర్, అమర వీరుల ఆత్మలు పులకించినట్లే. * నేను పోరాటం మొదలుపెట్టాక ఏనాడూ మూడు గంటల సేపు మౌనంగా ఉన్న సందర్భం లేదు. ఈ రోజే తొలిసారిగా మీరంతా మాట్లాడుతుండగా మౌనంగా ఉన్నాను. చెప్పింది విని సలహాలు, సూచనలు తీసుకుని నిర్ణయం తీసుకోవడాన్ని నా బాధ్యతగా భావిస్తున్నా. * మీ అందరితో పోలిస్తే రాజకీయాల్లో నేను పసిబాలుడిని. మీ అందరి సహకారంతో తప్ప స్వతహాగా ముందుకు వెళ్లలేనివాడిని. ఇకపై నేను అధికార, ప్రతిపక్షానికి అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ రెండు పయ్యల(చక్రాల)ను పట్టాలపై సమంగా నడిపించేందుకు కృషి చేస్తా. -
మండలి చైర్మన్‌గా స్వామిగౌడ్
* ఏకపక్షంగా ఓటింగ్.. పోలైనవన్నీ స్వామిగౌడ్‌కే * ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపటికే బరి నుంచి తప్పుకున్న కాంగ్రెస్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనమండలి తొలి చైర్మన్‌గా స్వామిగౌడ్ ఎన్నికయ్యారు. మండలిలో బుధవారం జరిగిన చైర్మన్ ఎన్నిక పూర్తిగా ఏకపక్షమైంది. మొత్తం 35 మంది సభ్యులున్న మండలిలో 21 మంది మాత్రమే ఓటువేయగా... వాటన్నింటినీ స్వామిగౌడ్ కైవసం చేసుకున్నారు. మండలి తాత్కాలిక చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు సైతం స్వామిగౌడ్‌కే ఓటేయడం విశేషం. అయితే స్వామిగౌడ్‌కు పోటీగా అభ్యర్థిని బరిలో దింపిన కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఎన్నిక నుంచి తప్పుకొంది. చైర్మన్ ఎన్నిక విషయంలో ప్రభుత్వం అనుసరించిన అప్రజాస్వామిక వైఖరికి నిరసనగా నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లుగా పేర్కొంటూ మండలిలో ప్రతిపక్ష నేత డి.శ్రీనివాస్ సహా పలువురు కాంగ్రెస్ సభ్యులు బయటకు వెళ్లిపోయారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం సభాధ్యక్ష స్థానంలో ఉన్న నేతి విద్యాసాగర్‌రావు... నూతన చైర్మన్‌గా స్వామిగౌడ్ ఎన్నికైనట్లు ప్రకటించారు. ఇప్పుడంత అవసరమేముంది..: విపక్షం బుధవారం ఉదయం 11 గంటలకు మండలి ప్రారంభమైన వెంటనే చైర్మన్ పదవికి ఓటింగ్ నిర్వహిస్తున్నట్లు తాత్కాలిక చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు ప్రకటించారు. దీనిపై అభ్యంతరం తెలిపిన డీఎస్.. ప్రతిపక్షాల అభిప్రాయం వినకుండానే ఓటింగ్ నిర్వహించడమేంటని ప్రశ్నించారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పినా తమ పార్టీ సభ్యులను ఆకర్షించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వర్షాల్లేక, విద్యుత్ లేక ప్రజలు అల్లాడుతుంటే ఇంత అత్యవసరంగా చైర్మన్ ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలను ప్రోత్సహించేందుకే బ్యాలెట్ ద్వారా ఎన్నిక చేపట్టారని మండిపడ్డారు. వాయిదా కోరి నామినేషన్ వేశారేం..: టీఆర్ఎస్ అయితే డీఎస్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు.. బ్యాలెట్ ద్వారానే చైర్మన్ ఎన్నిక నిర్వహించాలనే నిబంధన ఉందంటూ సభ ప్రొసీజర్లను చదివి వినిపించారు. ఎన్నికను వాయిదా వేయాలని కోరుతున్న కాంగ్రెస్ నేతలు నామినేషన్ ఎందుకు వేశారని ప్రశ్నించారు. ఈ దశలో తాత్కాలిక చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు జోక్యం చేసుకుని అక్షర క్రమంలో సభ్యులను పిలవాలని శాసనసభ కార్యదర్శి రాజా సదారాంను ఆదేశించారు. వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోడియం వద్దకు దూసుకొచ్చారు. మండలిలో కాంగ్రెస్ ఉపనేత షబ్బీర్‌అలీ తన చేతిలో ఉన్న పత్రాలను చింపి గాల్లోకి విసిరేశారు. ఆయనను అడ్డుకోబోయిన ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డిని నెట్టివేశారు. దీంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య వివాదం మొదలైంది. ఒకదశలో పొంగులేటి, ఈటెల తదితరుల మధ్య వాగ్వాదం కూడా జరిగింది. ఇదంతా జరుగుతుండగానే ఓటింగ్ ప్రారంభమై డీఎస్ వంతు రావడంతో.. ఆయన అసహనం వ్యక్తం చేస్తూ.. ‘‘నేను మాట్లాడుతుంటే ఓటింగ్ ప్రారంభిస్తారా? దీనిని బట్టి సభలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. దీనికి నిరసనగా మా అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నాం..’’ అంటూ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యుల్లో ఏడుగురు డీఎస్‌ను అనుసరించి వెళ్లిపోగా... మరో 8 మంది సభలోనే ఉండి స్వామిగౌడ్‌కు అనుకూలంగా ఓటేశారు. ఇందులో సభాధ్యక్ష స్థానంలో ఉన్న నేతి విద్యాసాగర్‌రావు కూడా ఉండటం గమనార్హం. మరోవైపు చైర్మన్ ఎన్నిక సమయంలో ప్రభుత్వ తీరు సక్రమంగా లేదని, ఇతర పక్షాల మద్దతు తీసుకునే విషయంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ విఫలమైందని పేర్కొంటూ మండలిలో టీడీపీ ఫ్లోర్‌లీడర్ అరికెల నర్సారెడ్డి సభ నుంచి వాకౌట్ చేశారు. కానీ, ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు (పట్నం నరేందర్‌రెడ్డి, సలీం, బోడకుంటి వెంకటేశ్వర్లు) ఓటింగ్‌లో పాల్గొని స్వామిగౌడ్‌కు ఓటేశారు. ఇక టీఆర్ఎస్ ప్రతిపాదించిన అభ్యర్థికి ఓటేయడం సుముఖంగా లేని ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ సమావేశానికి రాలేదు. అసమ్మతి నేతల హైడ్రామా.. అయితే మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్సీల వద్దకొచ్చి కాంగ్రెస్ సభ్యులతోపాటు వారు కూడా బయటకు వెళ్లిపోవాలని.. విప్ ధిక్కరణ నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తూ వారిని బయటకు తోడ్కొని వెళ్లారు. తరువాత కొద్ది నిమిషాలకే మళ్లీ ఆ నేతలంతా సభలోకి వచ్చి ఓటు వేశారు. ఎన్నికకు సీఎం దూరం శాసనమండలి చైర్మన్ ఎన్నిక కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దూరంగా ఉన్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమై.. మధ్యాహ్నం 3.15 గంటల వరకు కొనసాగినప్పటికీ సీఎం సభకు రాలేదు. అయితే దాదాపు మంత్రులంతా సభకు హాజరై తొలిరోజు ఎజెండా ముగిసే వరకు ఉన్నారు. -
మండలి చైర్మన్‌గా స్వామిగౌడ్ ఎన్నిక
-
మండలి చైర్మన్‌గా స్వామిగౌడ్ ఎన్నిక
హైదరాబాద్ : తెలంగాణ శాసనమండలి చైర్మన్ పీఠాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మండలి ఛైర్మన్‌గా ఆపార్టీ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన మండలి చైర్మన్ ఎన్నికల్లో పోలైన ఓట్లులో మొత్తం 21 స్వామిగౌడ్‌కే వచ్చాయి. దాంతో స్వామిగౌడ్ ఎంపిక లాంఛనమే అయ్యింది. స్వామిగౌడ్‌ను మద్దతుగా ఎనిమిదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఓటు వేశారు. ఆమోస్, భూపాల్ రెడ్డి, రాజలింగం, జగదీశ్వర్ రెడ్డి, భాను ప్రసాద్, యాదవ్ రెడ్డి, రాజేశ్వరరావు టీఆర్ఎస్కు అనుకూలంగా ఓటు వేశారు. ఎన్నిక అనంతరం తాత్కాలిక చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు... స్వామిగౌడ్ ఎన్నికను అధికారికంగా వెల్లడించారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ నేతలు స్వామిగౌడ్‌ను ఛైర్మన్ కుర్చీ వరకూ సాదరంగా తోడ్కొని వెళ్లి అభినందనలు తెలిపారు. మండలి ఛైర్మన్ గా స్వామిగౌడ్ బాధ్యతలు స్వీకరించారు. -
కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు విప్ జారీ
* మండలి బరిలో ఫారూఖ్ హుస్సేన్ * చైర్మన్ ఎన్నికల్లో గెలుపు కోసం పొన్నాల, డీఎస్, జానా మంతనాలు సాక్షి, హైదరాబాద్: శాసనమండలి చైర్మన్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తరపున ఎన్నికైన ఎమ్మెల్సీలందరికీ విప్ జారీ చేశారు. మండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్ మంగళవారం ఎమ్మెల్సీలందరికీ ఈ మేరకు లేఖలు పంపారు. బుధవారం జరిగే సమావేశానికి హాజరై కాంగ్రెస్ ప్రతిపాదించిన అభ్యర్థి ఫారూఖ్ హుస్సేన్‌కు ఓటు వేయాలని అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీఎస్ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ అధిష్టానం ఆమోదంతోనే ఫారూఖ్ హుస్సేన్‌ను బరిలో దించామన్నారు. చైర్మన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని మాట వరసకు కూడా సీఎం అడగలేదని, అందుకే తాము అభ్యర్థిని బరిలో దింపామని తెలిపారు.ఇటీవల టీఆర్ఎస్లో చేరిన ఐదుగురు ఎమ్మెల్సీలు కె.ఆర్.ఆమోస్, జగదీశ్వర్‌రెడ్డి, భానుప్రసాద్, వి.భూపాల్‌రెడ్డి, ఎన్.రాజలింగంతోపాటు అసమ్మతి సభ్యులు కె.యాదవరెడ్డి, రాజేశ్వర్లకు కూడా విప్ జారీ చేసినట్టు చెప్పారు. ఇదిలాఉండగా, చైర్మన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎల్పీ కార్యాలయంలో డీఎస్‌తోపాటు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ నేత జానారెడ్డిసహా ఎమ్మెల్సీలంతా చర్చించారు. ఫారూఖ్ హుస్సేన్ నామినేషన్ దాఖలు శాసనమండలి చైర్మన్ పదవికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఫారూఖ్ హుస్సేన్ మంగళవారం నామినేషన్ దాఖ లు చేశారు. కార్యక్రమంలో పొన్నాల, డీఎస్, జానారెడ్డి, ఎంపీలు గుత్తా, ఎంఏఖాన్తోపాటు ఏడుగురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫారూఖ్ హుస్సేన్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ తాను కలిసి చదువుకున్నామని, ఆయనను కూడా కలసి గెలుపునకు సహకరించాలని కోరుతానన్నారు. స్థానం ఉన్నతం.. విధానమే బాగోలేదు నామినేషన్ కార్యక్రమం అనంతరం కాంగ్రెస్ నేతలంతా సీఎల్పీ కార్యాలయం వైపు వస్తుండగా స్వామిగౌడ్ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్వామిగౌడ్‌ను ఉద్దేశిస్తూ ‘చైర్మన్ స్థానం ఉన్నతమైంది. మీరు ఆ పదవి చేపట్టబోవడం ఆనందమే. కాకపోతే జరుగుతున్న విధానమే సరిగా లేదు. అందులో మిమ్ముల్ని భాగస్వామిని చేయడం మరింత బాధాకరం’అని వ్యాఖ్యానించారు. -
స్వామిగౌడ్ గెలుపు లాంఛనమే!
* మండలి చైర్మన్ ఎన్నిక నేడే * మజ్లిస్, పీడీఎఫ్ మద్దతూ గులాబీకే * మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కూడా * టీఆర్ఎస్ అభ్యర్థికి 21 ఓట్లు ఖాయం * కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కే పరిమితం! సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి చైర్మన్ ఎన్నిక అనివార్యమైంది. ఈ పదవి కోసం మంగళవారం అధికార టీఆర్ఎస్ తరఫున స్వామిగౌడ్, విపక్ష కాంగ్రెస్ తరఫున ఫారూఖ్ హుస్సేన్ నామినేషన్ దాఖలు చేశారు. సభా నిబంధనల మేరకు బ్యాలెట్ ద్వారా ఎన్నిక నిర్వహించేందుకు మండలి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం మండలి సమావేశమైన అనంతరం తాత్కాలిక చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు నూతన చైర్మన్ ఎన్నిక కోసం వచ్చిన నామినేషన్లు సభలో చదివి వినిపిస్తారు. ఒకటికి మించి నామినేషన్లు దాఖలైన నేపథ్యంలో బ్యాలెట్ ద్వారా ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ప్రకటించి సభను కొద్దిసేపు వాయిదా వేస్తారు. ఎమ్మెల్సీలంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆ తర్వాత నూతన చైర్మన్‌గా ఎవరు ఎన్నికయ్యారన్న విషయాన్ని విద్యాసాగర్‌రావు ప్రకటిస్తారు. ఆ వెంటనే కొత్త చైర్మన్‌ను తోడ్కొని వెళ్లి సభాపతి స్థానంలో కూర్చోబెడతారు. చెర్మన్‌ను అభినందిస్తూ సీఎం సహా అన్ని పార్టీల నేతలు, సీనియర్ సభ్యులు మాట్లాడిన అనంతరం సభ వాయిదా పడుతుంది. కాగా, శాసనమండలిలోని 35 మంది సభ్యుల్లో స్వామిగౌడ్‌కు కచ్చితంగా 21 మంది మద్దతిస్తారని అధికార పార్టీ ధీమాతో ఉంది. రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నిక జరుగుతుండటంతో అంతకుమించి ఓట్లు పడినా ఆశ్చర్యం లేదని అభిప్రాయపడుతోంది. వాస్తవానికి టీఆర్ఎస్కు సాంకేతికంగా ఆరుగురు సభ్యులు మాత్రమే ఉన్నప్పటికీ.. ఇటీవలే 10 మంది ఎమ్మెల్సీలు ఆ పార్టీలో చేరారు. అలాగే ఇద్దరు మజ్లిస్ సభ్యులతోపాటు పీడీఎఫ్ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా స్వామిగౌడ్‌కు మద్దతు ప్రకటించారు. వీరితోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, రాజేశ్వర్ కూడా స్వామిగౌడ్‌కు ఓటేయడం ఖాయమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన గెలుపు ఖాయమని తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ నేతలు సైతం టీఆర్ఎస్కే గెలుపు అవకాశాలు స్పష్టంగా ఉన్నాయన్న అభిప్రాయంతో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయన్నదే ఆసక్తికరంగా మారింది. మండలిలో సాంకేతికంగా 17 మంది ఎమ్మెల్సీలున్న కాంగ్రెస్‌కు పడే ఓట్లు సింగిల్ డిజిట్ దాటుతుందా అన్నది చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్సీ ఒకరు మాట్లాడుతూ తమ అభ్యర్థికి 9 ఓట్లకు మించి పడే అవకాశం లేదని చెప్పడం గమనార్హం. మండలిలో వ్యూహంపై కేసీఆర్ దృష్టి శాసనమండలి చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ సభ్యులు బుధవారం ఉదయం 10 గంటలకే సభకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. కొందరు మంత్రులు, ముఖ్య నేతలతో సీఎం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ మంగళవారం సమావేశమయ్యారు. మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. సమయం కంటే ముందుగానే సభకు చేరుకోవాలని, ఓటింగ్ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని నేతలను ఆదేశించారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు ఈటెల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, హరీష్‌రావు, కె.తారక రామారావు, జి.జగదీశ్ రెడ్డి, టి.పద్మారావుతో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వెంట రాగా మంగళవారమే స్వామిగౌడ్ తన నామినేషన్‌ను శాసనసభా కార్యదర్శికి అందజేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నట్లు నామినేషన్ పత్రాలపై ఎంఐఎం ఎమ్మెల్సీలు ఎస్.ఎం.జాఫ్రీ, రిజ్వీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ సంతకాలు చేశారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కె.స్వామిగౌడ్ మాట్లాడుతూ.. వినతిపత్రం ఇవ్వడానికి పోతే లాఠీలతో కొట్టిన పోలీసులే ఇప్పుడు సెల్యూట్ చేసే స్థాయికి తెలంగాణ వచ్చిందన్నారు. -
తటస్థంగా ఉండాలని టీడీపీ విప్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఓటింగ్ సమయంలో తటస్థ వైఖరిని అవలంభించాలని, టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు సమదూరం పాటించాలని టీడీపీ నిర్ణయించింది. ఈ ఎన్నికను బహిష్కరించాలని, హాజరైనా ఎవరికి ఓటు వేయకూడదని విప్ జారీ చేసింది. మండలిలో తెలుగుదేశానికి ఏడుగురు సభ్యులుండగా.. ఎన్నికలకు ముందే పట్నం నరేందర్ రెడ్డి(రంగారెడ్డి) టీఆర్ఎస్లో చేరారు. ఇటీవలే మండలిలో పార్టీ ఫ్లోర్ లీడర్ బి. వెంకటేశ్వర్లు, మరో సభ్యుడు సలీం కూడా అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. వీరితో పాటు కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురు సభ్యులు కూడా టీఆర్ఎస్ అభ్యర్థి స్వామిగౌడ్‌కే మద్దతివ్వనున్న నేపథ్యంలో టీడీపీ తాజా నిర్ణయం తీసుకుంది. పార్టీ సభ్యులందరికీ విప్ జారీ చేయడం ద్వారా టీఆర్ఎస్లో చేరిన వారిపై అనర్హత వేటు వేయించాలని ఆ పార్టీ భావిస్తోంది. -
'కాంగ్రెస్ గెలుస్తుందని నమ్మకం ఉంది'
మండలి ఛైర్మన్ ఎన్నికపై ఎమ్మెల్సీలందరికీ విప్ జారీ చేశామని తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ సభ పక్ష నాయకుడు డి.శ్రీనివాస్ (డీఎస్) స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ... శాసనమండలి ఛైర్మన్ ఎన్నికకు రహస్య బ్యాలెట్ పెట్టడం సరికాదని డిఎస్ అభిప్రాయపడ్డారు. ఇంత హడావుడిగా కౌన్సిల్ సమావేశం ఎందుకు అంటు ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సెషన్‌ను గవర్నర్‌ను కోరినప్పటికీ ప్రయోజనం లేదన్నారు. ఛైర్మన్‌గా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఇతర పార్టీ ఎమ్మెల్సీలను కోరామని చెప్పారు. శాసనమండలి ఛైర్మన్ పదవిని గెలుస్తామని తమకు నమ్మకం ఉందని డీఎస్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర మండలి ఛైర్మన్ పదవికి బుధవారం ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి స్వామిగౌడ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేయగా, కాంగ్రెస్ నుంచి పారూక్ హుస్సేన్ నామినేషన్ దాఖలు చేశారు. -
మండలిలో పెరిగిన టీఆర్ఎస్ బలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో టీఆర్ఎస్ బలం ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం 35 మంది సభ్యులున్న మండలిలో ఇప్పటిదాకా టీఆర్ఎస్కు ఏడుగురు సభ్యులు ఉండగా... వివిధ పార్టీలకు, సంఘాలకు చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్సీలు చేరడంతో ఆ సంఖ్య 16కు చేరింది. దీనితో వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే శాసనమండలి చైర్మన్‌గా కె.స్వామిగౌడ్‌ను ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న నేతి విద్యాసాగర్‌కు రాజీనామా చేయాల్సిందిగా సంకేతాలు పంపాలని సీఎం కేసీఆర్ పార్టీ ముఖ్యులకు సూచనలు ఇచ్చారు. టీఎన్జీవోల అధ్యక్షుడిగా ఉన్న స్వామిగౌడ్‌ను ఎమ్మెల్సీగా చేయడంతో పాటు మంత్రివర్గంలోకి తీసుకుని.. ఉద్యోగులకు సంబంధించిన వ్యవహారాలను అప్పగిస్తామని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మిగతా ఏడు ఖాళీల్లో గవర్నర్ కోటాలోని ఇద్దరు సభ్యులను (నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్) భర్తీచేశారు. స్థానిక సంస్థల కోటాలోని ఐదు పదవులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ప్రస్తుతం 35 మంది సభ్యులున్న మండలిలో టీఆర్ఎస్కు 16 మంది (ఎమ్మెల్సీ కె.దిలీప్ సాంకేతికంగా టీఆర్ఎస్ సభ్యుడిగానే వ్యవహరిస్తున్నారు) ఉన్నారు. కాంగ్రెస్‌కు 12 మంది, టీడీపీకి నలుగురు, ఎంఐఎంకు ఇద్దరు, పీడీఎఫ్‌కు ఒకరు ఉన్నారు. చైర్మన్ నేతి విద్యాసాగర్ గౌరవంగా రాజీనామా చేయకుంటే సంఖ్యాబలం కోసం ఎంఐఎం, పీడీఎఫ్(2+1) మద్దతు తీసుకోవాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. -
'కేసీఆర్‌కు డీఎస్ అమ్ముడుపోతారు'
-
మండలిలో కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ గా డీఎస్
-
కేసీఆర్‌కు డీఎస్ అమ్ముడుపోతారు: రాజలింగం
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలిలో ఫ్లోర్‌లీడర్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల మధ్య విభేదాలు బయటపడ్డాయి. కాంగ్రెస్ పక్షనేతగా డి. శ్రీనివాస్ ఎన్నికను వ్యతిరేకించినట్టు ఎమ్మెల్సీ రాజలింగం వెల్లడించారు. డీఎస్ కౌన్సిల్ సమావేశాలకు హాజరుకారని ఆరోపించారు. కేసీఆర్‌కు డీఎస్ అమ్ముడుపోతారని అన్నారు. డీఎస్ ఎన్నికను వ్యతిరేకించవద్దంటూ పదిలక్షల రూపాయలు పంపిస్తే వెనక్కి పంపానని వెల్లడించారు. హైకమాండ్ పెద్దలు సీనియారిటీ పేరుతో ప్రయోజనం లేని నేతలకు పదవులు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. కాగా, ఎమ్మెల్సీల అభిప్రాయాలు తీసుకునే తమను ఎన్నుకున్నారని డీఎస్ తెలిపారు. తమ పార్టీ సోనియా గాంధీని సంప్రదించాకే ఎన్నికైనట్లు ప్రకటించారని చెప్పారు. తాను, షబ్బీర్ అలీ కలిసి పనిచేయాలని అధిష్టాన పెద్దలు నిర్ణయించారని అన్నారు. ఎమ్మెల్సీల మధ్య బేధాభిప్రాయాలున్నా అందరినీ కలుపుకుపోతామన్నారు. టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేస్తామని డీఎస్ పేర్కొన్నారు. -
మండలిలో కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ గా డీఎస్
హైదరాబాద్: తెలంగాణ కౌన్సిల్లో కాంగ్రెస్ పక్షనేతగా పీసీసీ మాజీ అధ్యక్షు డు ధర్మపురి శ్రీనివాస్, ఉపనేతగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్, వయలార్ రవి పర్యవేక్షణలో ఈ సమావేశం జరిగింది. అయితే ఓటింగ్ నిర్వహించకపోవడంపై రాజలింగం, పొంగులేటి సుధాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈనెల ఎనిమిదో తేదీ నుంచి శాసనసభ, తొమ్మిదో తేదీనుంచి శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.