మండలి చైర్మన్‌గా స్వామిగౌడ్ | Swamy Goud elected Telangana Council chairman | Sakshi
Sakshi News home page

మండలి చైర్మన్‌గా స్వామిగౌడ్

Published Thu, Jul 3 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM

మండలి చైర్మన్‌గా స్వామిగౌడ్

మండలి చైర్మన్‌గా స్వామిగౌడ్

* ఏకపక్షంగా ఓటింగ్.. పోలైనవన్నీ స్వామిగౌడ్‌కే  
* ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపటికే బరి నుంచి తప్పుకున్న కాంగ్రెస్
 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనమండలి తొలి చైర్మన్‌గా స్వామిగౌడ్ ఎన్నికయ్యారు. మండలిలో బుధవారం జరిగిన చైర్మన్ ఎన్నిక పూర్తిగా ఏకపక్షమైంది. మొత్తం 35 మంది సభ్యులున్న మండలిలో 21 మంది మాత్రమే ఓటువేయగా... వాటన్నింటినీ స్వామిగౌడ్ కైవసం చేసుకున్నారు. మండలి తాత్కాలిక చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు సైతం స్వామిగౌడ్‌కే ఓటేయడం విశేషం.

అయితే స్వామిగౌడ్‌కు పోటీగా అభ్యర్థిని బరిలో దింపిన కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఎన్నిక నుంచి తప్పుకొంది. చైర్మన్ ఎన్నిక విషయంలో ప్రభుత్వం అనుసరించిన అప్రజాస్వామిక వైఖరికి నిరసనగా నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లుగా పేర్కొంటూ మండలిలో ప్రతిపక్ష నేత డి.శ్రీనివాస్ సహా పలువురు కాంగ్రెస్ సభ్యులు బయటకు వెళ్లిపోయారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం సభాధ్యక్ష స్థానంలో ఉన్న నేతి విద్యాసాగర్‌రావు... నూతన చైర్మన్‌గా స్వామిగౌడ్ ఎన్నికైనట్లు ప్రకటించారు.

ఇప్పుడంత అవసరమేముంది..: విపక్షం
బుధవారం ఉదయం 11 గంటలకు మండలి ప్రారంభమైన వెంటనే చైర్మన్ పదవికి ఓటింగ్ నిర్వహిస్తున్నట్లు తాత్కాలిక చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు ప్రకటించారు. దీనిపై అభ్యంతరం తెలిపిన డీఎస్.. ప్రతిపక్షాల అభిప్రాయం వినకుండానే ఓటింగ్ నిర్వహించడమేంటని ప్రశ్నించారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పినా తమ పార్టీ సభ్యులను ఆకర్షించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వర్షాల్లేక, విద్యుత్ లేక ప్రజలు అల్లాడుతుంటే ఇంత అత్యవసరంగా చైర్మన్ ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలను ప్రోత్సహించేందుకే బ్యాలెట్ ద్వారా ఎన్నిక చేపట్టారని మండిపడ్డారు.

వాయిదా కోరి నామినేషన్ వేశారేం..: టీఆర్‌ఎస్
అయితే డీఎస్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు.. బ్యాలెట్ ద్వారానే చైర్మన్ ఎన్నిక నిర్వహించాలనే నిబంధన ఉందంటూ సభ ప్రొసీజర్‌లను చదివి వినిపించారు. ఎన్నికను వాయిదా వేయాలని కోరుతున్న కాంగ్రెస్ నేతలు నామినేషన్ ఎందుకు వేశారని ప్రశ్నించారు. ఈ దశలో తాత్కాలిక చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు జోక్యం చేసుకుని అక్షర క్రమంలో సభ్యులను పిలవాలని శాసనసభ కార్యదర్శి రాజా సదారాంను ఆదేశించారు.

వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోడియం వద్దకు దూసుకొచ్చారు. మండలిలో కాంగ్రెస్ ఉపనేత షబ్బీర్‌అలీ తన చేతిలో ఉన్న పత్రాలను చింపి గాల్లోకి విసిరేశారు. ఆయనను అడ్డుకోబోయిన ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డిని నెట్టివేశారు. దీంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య వివాదం మొదలైంది. ఒకదశలో పొంగులేటి, ఈటెల తదితరుల మధ్య వాగ్వాదం కూడా జరిగింది. ఇదంతా జరుగుతుండగానే ఓటింగ్ ప్రారంభమై డీఎస్ వంతు రావడంతో.. ఆయన అసహనం వ్యక్తం చేస్తూ..

‘‘నేను మాట్లాడుతుంటే ఓటింగ్ ప్రారంభిస్తారా? దీనిని బట్టి సభలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. దీనికి నిరసనగా మా అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నాం..’’ అంటూ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యుల్లో ఏడుగురు డీఎస్‌ను అనుసరించి వెళ్లిపోగా... మరో 8 మంది సభలోనే ఉండి స్వామిగౌడ్‌కు అనుకూలంగా ఓటేశారు. ఇందులో సభాధ్యక్ష స్థానంలో ఉన్న నేతి విద్యాసాగర్‌రావు కూడా ఉండటం గమనార్హం.

మరోవైపు చైర్మన్ ఎన్నిక సమయంలో ప్రభుత్వ తీరు సక్రమంగా లేదని, ఇతర పక్షాల మద్దతు తీసుకునే విషయంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ విఫలమైందని పేర్కొంటూ మండలిలో టీడీపీ ఫ్లోర్‌లీడర్ అరికెల నర్సారెడ్డి సభ నుంచి వాకౌట్ చేశారు. కానీ, ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు (పట్నం నరేందర్‌రెడ్డి, సలీం, బోడకుంటి వెంకటేశ్వర్లు) ఓటింగ్‌లో పాల్గొని స్వామిగౌడ్‌కు ఓటేశారు. ఇక టీఆర్‌ఎస్ ప్రతిపాదించిన అభ్యర్థికి ఓటేయడం సుముఖంగా లేని ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ సమావేశానికి రాలేదు.

అసమ్మతి నేతల హైడ్రామా..
అయితే మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్సీల వద్దకొచ్చి కాంగ్రెస్ సభ్యులతోపాటు వారు కూడా బయటకు వెళ్లిపోవాలని.. విప్ ధిక్కరణ నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తూ వారిని బయటకు తోడ్కొని వెళ్లారు. తరువాత కొద్ది నిమిషాలకే మళ్లీ ఆ నేతలంతా సభలోకి వచ్చి ఓటు వేశారు.
 
ఎన్నికకు సీఎం దూరం
శాసనమండలి చైర్మన్ ఎన్నిక కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దూరంగా ఉన్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమై.. మధ్యాహ్నం 3.15 గంటల వరకు కొనసాగినప్పటికీ సీఎం సభకు రాలేదు. అయితే దాదాపు మంత్రులంతా సభకు హాజరై తొలిరోజు ఎజెండా ముగిసే వరకు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement