హైదరాబాద్, సాక్షి: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి తారకరామారావుకు ప్రొఫెసర్ కోదండరాం కౌంటర్ ఇచ్చారు. తనకు ఎమ్మెల్సీ దక్కడంపై కేటీఆర్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై కోదండరాం తాజాగా మరోసారి స్పందించారు. ప్రజలకు అన్నీ తెలుసని.. తన ఎంపికపై అనవసరంగా వివాదం చేయడం సరికాదని అన్నారాయన.
‘‘రాజ్యాంగంలో షరతులు అర్థమైతే చర్చ ఉండదు. జాగ్రత్తగా రాజ్యాంగం చదివితే వివాదం ఉండదు. రాజ్యాంగ పరంగా సేవ చేసిన వాళ్లకు అవకాశం ఇస్తారు. నేను సుదీర్ఘకాలం సేవ చేశా. అనవసరంగా నా ఎంపికను వివాదం చేయడం తగదు. ప్రజలకు అన్నీ తెలుసు వారే అంచనా వేసుకుంటారు’’ అని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ శ్రవణ్ కరెక్ట్ కాదా? కానీ ప్రొఫెసర్ కోదండరాం కరెక్టా? అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీసిన సంగతి తెలిసిందే.
ఎదురుచూపులు..
ఇదిలా ఉంటే.. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాంతో పాటు అమెర్ అలీఖాన్ ఇవాళ ప్రమాణం చేయాలనుకున్నారు. అయితే శాసన మండలికి వెళ్లిన వాళ్లకు నిరాశ ఎదురైంది. రెండు గంటలపాటు కౌన్సిల్ హాల్‌లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కోసం వాళ్లు ఎదురు చూశారు. అయితే అయినప్పటికీ ఆయన రాలేదు. దీంతో బీఆర్‌ఎస్ నేతల ఒత్తిడి వల్లే గుత్తా రావడం లేదని కాంగ్రెస్ నేతలు చర్చించుకున్నారు. కాసేపయ్యాక.. రేపు మండలి చైర్మన్ అందుబాటులో ఉంటారనే సమాచారం వాళ్లకు అందడంతో వెనుదిరిగారు. రేపు ఉదయం 9గం.30 ని. ఈ ఇద్దరూ ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయనున్నారు.
అందుకే రాలేకపోయా
తన గైర్హాజరుపై వస్తున్న విమర్శలపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ స్పందించారు. ఆరోగ్యం బాగోలేకపోవడం వల్లే తాను ఏ కార్యక్రమానికి హాజరు కావడం లేదని వెల్లడించారాయన. మండలి స్పీకర్ పదవిని తాను సక్రమంగా నిర్వహిస్తానని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment