చప్రాసీ నుంచి మండలి చైర్మన్ దాకా..
ఇది గొప్ప ప్రజాస్వామ్యం: స్వామిగౌడ్
సాక్షి, హైదరాబాద్: చప్రాసీగా ఉన్న తనను పెద్దల సభకు చైర్మన్‌ను చేసిన ఘనత భారత ప్రజాస్వామ్యానిదేనని శాసనమండలి నూతన చైర్మన్ స్వామిగౌడ్ పేర్కొన్నారు. ప్రపంచంలో ఇంతకంటే గొప్ప ప్రజాస్వామ్యం మరెక్కడుందని వ్యాఖ్యానించారు. ఎక్కడో బీసీ కుటుంబంలో పుట్టి, అటెండర్‌గా ఉద్యోగం చేస్తూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తనకు మండలి చైర్మన్‌గా అత్యున్నతమైన బాధ్యతను కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రులకు, సహకరించిన సభ్యులకు తల వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు.
అంతకుముందు సభలో 21 మంది సభ్యులు నూతన చైర్మన్‌గా ఎన్నికైన స్వామిగౌడ్‌ను అభినందించడంతోపాటు ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు. అనంతరం స్వామిగౌడ్ ప్రసంగిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. ప్రసంగం ఆయన మాటల్లోనే...
* తట్టుకోలేని ఉద్వేగానికి గురవుతున్న సందర్భమిది. కన్నీళ్లు ఆగడం లేదు. తెలంగాణ సాయుధ, ఉద్యమ అమర వీరుల పోరాట ఫలితమే ఇది. నన్ను అక్కున చేర్చుకున్న నా ఊరుతోపాటు ఈ బాధ్యతను అప్పగించిన సభ్యులందరికీ తలవంచి నమస్కరిస్తున్నా. ఈ రోజు ఆచార్య జయశంకర్, అమర వీరుల ఆత్మలు పులకించినట్లే.
* నేను పోరాటం మొదలుపెట్టాక ఏనాడూ మూడు గంటల సేపు మౌనంగా ఉన్న సందర్భం లేదు. ఈ రోజే తొలిసారిగా మీరంతా మాట్లాడుతుండగా మౌనంగా ఉన్నాను. చెప్పింది విని సలహాలు, సూచనలు తీసుకుని నిర్ణయం తీసుకోవడాన్ని నా బాధ్యతగా భావిస్తున్నా.
* మీ అందరితో పోలిస్తే రాజకీయాల్లో నేను పసిబాలుడిని. మీ అందరి సహకారంతో తప్ప స్వతహాగా ముందుకు వెళ్లలేనివాడిని. ఇకపై నేను అధికార, ప్రతిపక్షానికి అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ రెండు పయ్యల(చక్రాల)ను పట్టాలపై సమంగా నడిపించేందుకు కృషి చేస్తా.