శాసనసభ ఆవరణలో స్వామిగౌడ్ ను అభినందిస్తున్న జానారెడ్డి, పొంగులేటి
* మండలి చైర్మన్ ఎన్నిక నేడే
* మజ్లిస్, పీడీఎఫ్ మద్దతూ గులాబీకే
* మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కూడా
* టీఆర్‌ఎస్ అభ్యర్థికి 21 ఓట్లు ఖాయం
* కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కే పరిమితం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి చైర్మన్ ఎన్నిక అనివార్యమైంది. ఈ పదవి కోసం మంగళవారం అధికార టీఆర్‌ఎస్ తరఫున స్వామిగౌడ్, విపక్ష కాంగ్రెస్ తరఫున ఫారూఖ్ హుస్సేన్ నామినేషన్ దాఖలు చేశారు. సభా నిబంధనల మేరకు బ్యాలెట్ ద్వారా ఎన్నిక నిర్వహించేందుకు మండలి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం మండలి సమావేశమైన అనంతరం తాత్కాలిక చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు నూతన చైర్మన్ ఎన్నిక కోసం వచ్చిన నామినేషన్లు సభలో చదివి వినిపిస్తారు.
ఒకటికి మించి నామినేషన్లు దాఖలైన నేపథ్యంలో బ్యాలెట్ ద్వారా ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ప్రకటించి సభను కొద్దిసేపు వాయిదా వేస్తారు. ఎమ్మెల్సీలంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆ తర్వాత నూతన చైర్మన్‌గా ఎవరు ఎన్నికయ్యారన్న విషయాన్ని విద్యాసాగర్‌రావు ప్రకటిస్తారు. ఆ వెంటనే కొత్త చైర్మన్‌ను తోడ్కొని వెళ్లి సభాపతి స్థానంలో కూర్చోబెడతారు. చెర్మన్‌ను అభినందిస్తూ సీఎం సహా అన్ని పార్టీల నేతలు, సీనియర్ సభ్యులు మాట్లాడిన అనంతరం సభ వాయిదా పడుతుంది.
కాగా, శాసనమండలిలోని 35 మంది సభ్యుల్లో స్వామిగౌడ్‌కు కచ్చితంగా 21 మంది మద్దతిస్తారని అధికార పార్టీ ధీమాతో ఉంది. రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నిక జరుగుతుండటంతో అంతకుమించి ఓట్లు పడినా ఆశ్చర్యం లేదని అభిప్రాయపడుతోంది. వాస్తవానికి టీఆర్‌ఎస్‌కు సాంకేతికంగా ఆరుగురు సభ్యులు మాత్రమే ఉన్నప్పటికీ.. ఇటీవలే 10 మంది ఎమ్మెల్సీలు ఆ పార్టీలో చేరారు. అలాగే ఇద్దరు మజ్లిస్ సభ్యులతోపాటు పీడీఎఫ్ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా స్వామిగౌడ్‌కు మద్దతు ప్రకటించారు.
వీరితోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, రాజేశ్వర్ కూడా స్వామిగౌడ్‌కు ఓటేయడం ఖాయమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన గెలుపు ఖాయమని తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ నేతలు సైతం టీఆర్‌ఎస్‌కే గెలుపు అవకాశాలు స్పష్టంగా ఉన్నాయన్న అభిప్రాయంతో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయన్నదే ఆసక్తికరంగా మారింది. మండలిలో సాంకేతికంగా 17 మంది ఎమ్మెల్సీలున్న కాంగ్రెస్‌కు పడే ఓట్లు సింగిల్ డిజిట్ దాటుతుందా అన్నది చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్సీ ఒకరు మాట్లాడుతూ తమ అభ్యర్థికి 9 ఓట్లకు మించి పడే అవకాశం లేదని చెప్పడం గమనార్హం.
మండలిలో వ్యూహంపై కేసీఆర్ దృష్టి
శాసనమండలి చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో టీఆర్‌ఎస్ సభ్యులు బుధవారం ఉదయం 10 గంటలకే సభకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. కొందరు మంత్రులు, ముఖ్య నేతలతో సీఎం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ మంగళవారం సమావేశమయ్యారు. మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. సమయం కంటే ముందుగానే సభకు చేరుకోవాలని, ఓటింగ్ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని నేతలను ఆదేశించారు.
మరోవైపు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు ఈటెల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, హరీష్‌రావు, కె.తారక రామారావు, జి.జగదీశ్ రెడ్డి, టి.పద్మారావుతో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వెంట రాగా మంగళవారమే స్వామిగౌడ్ తన నామినేషన్‌ను శాసనసభా కార్యదర్శికి అందజేశారు.
ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నట్లు నామినేషన్ పత్రాలపై ఎంఐఎం ఎమ్మెల్సీలు ఎస్.ఎం.జాఫ్రీ, రిజ్వీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ సంతకాలు చేశారు. కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కె.స్వామిగౌడ్ మాట్లాడుతూ.. వినతిపత్రం ఇవ్వడానికి పోతే లాఠీలతో కొట్టిన పోలీసులే ఇప్పుడు సెల్యూట్ చేసే స్థాయికి తెలంగాణ వచ్చిందన్నారు.