* పాఠ్యాంశాల్లో చేర్చే అంశంపై వివాదం లేపిన కె.నాగేశ్వర్ వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చరిత్రను, పోరాట యోధుల గాథలను పాఠ్యాంశాలుగా చేర్చే అంశం శాసనమండలిలో కొద్దిసేపు గందరగోళం సృష్టించింది. అధికార, విపక్ష సభ్యుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో మండలి అట్టుడికింది. కొత్త రాష్ట్రంలో తెలంగాణ కవులు, కళాకారులు, అమరవీరుల జీవిత చరిత్రలను పాఠ్యాంశాల్లో చేర్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందా? అని ఎమ్మెల్సీ పాటూరి సుధాకర్‌రెడ్డి ప్రశ్నకు విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి సమాధానమిస్తూ... ‘‘ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ చరిత్రను, సంస్కృతిని మరిచిపోయేట్టు చేశారు. పాఠ్యాంశాల్లో తెలంగాణ సంస్కృతి, చరిత్ర, కాకతీయుల నుంచి కుతుబ్‌షాలు, ఆజాం జాహీలు, నిజాంల వరకు సాగిన పాలన, వారిపై పోరాడిన వారి గురించి, తెలంగాణ కోసం పోరాడిన వారి గురించి పాఠ్యాంశాల్లో చేరుస్తాం. తెలంగాణ గత చరిత్ర, భౌగోళిక స్వరూపాల గురించి కూడా పొందుపరుస్తాం. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేశాం..’’ అని వెల్లడించారు.
దీనిపై ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ... మంత్రి మాటలు వింటుంటే నిజాం పాలనను గొప్పదిగా కీర్తిస్తూ పాఠాలు నేర్పుతారేమోనని అనుమానం వస్తోందని వ్యాఖ్యానించారు. ‘‘నిజాం పాలనలో భూస్వాముల అకృత్యాలను, వారి వల్ల చనిపోయిన 4 వేల మంది గురించి దాచిపెడతారా? తెలంగాణ సాయుధ పోరాటం ఎందుకొచ్చిందో మరిచి పోయి నిజాం పాలన గొప్పదని పాఠ్యాంశాల్లో చేరుస్తారా?..’’ అని ప్రశ్నించారు. దీంతో మంత్రి జగదీశ్వర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ... దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, కొమరం భీమ్, రావి నారాయణరెడ్డి, షోయబుల్లా ఖాన్ వంటి తెలంగాణ పోరాట యోధుల గురించి చెప్పినప్పుడు నిజాంను కీర్తించడమెలా అవుతుందని ప్రశ్నించారు.
‘‘కాకతీయుల పాలన గొప్పతనాన్ని చెబుతూనే.. వారిపై పోరాడిన సమ్మక్క-సారక్కల గురించి కూడా చెబుతామని అంటున్నాం. హైదరాబాద్‌కు పునాదులు వేసిందెవరో.. జూబ్లీహాల్, ఆర్ట్స్ కాలేజ్, ఉస్మానియా హాస్పిటల్, అసెంబ్లీని కట్టి అభివృద్ధి చేసిందెవరో చెప్పకుండా చరిత్రను వక్రీకరించాలా? నిజాంసాగర్‌ను కట్టి, ైరె ల్వే లైన్లు వేసిన నిజాం గురించి విద్యార్థులకు తెలపడం తప్పా? నిజాం పాలనతో పాటు ఆయన హయంలో చివరి రోజుల్లో జరిగిన అకృత్యాల గురించీ పాఠ్యాంశాల్లో చేర్చేందుకు కమిటీ పనిచేస్తుంది’’ అని మంత్రి పేర్కొన్నారు.
నాగేశ్వర్ వినకుండా నిజాం అందించింది గొప్ప పాలనే కానీ కొన్ని పొరపాట్ల కారణంగా కొమరం భీమ్, చాకలి ఐలమ్మ వంటి వారు పోరాడాల్సి వచ్చిందని చెప్పే ప్రయత్నం జరుగుతుందేమోనని వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ చరిత్రను పాఠ్యాంశాల్లో చేరుస్తామని మంత్రి చెబుతోంటే అందులో తప్పులు వెతికి, తామే అన్నట్లుగా వ్యవహరించడం మంచిది కాదని నాగేశ్వర్‌కు సూచించారు.
నిజాం, భూస్వామ్య పాలనను కీర్తిస్తారా?
Published Wed, Nov 12 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM
Advertisement
Advertisement