కోదండరాం, ఆమేర్ అలీఖాన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం రాష్ట్ర శాసన మండలి సభ్యునిగా నియమితులయ్యారు. ఆయనతో పాటు సియాసత్ ఉర్దూ దిన పత్రిక అసిస్టెంట్ ఎడిటర్ మీర్ ఆమేర్ అలీఖాన్‌ను కూడా సభ్యుడిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. గవర్నర్ కార్యాలయం గురువారం ఈ మేరకు ప్రకటన చేసింది. ప్రొఫెసర్ కోదండరాంను విద్యావేత్తల కోటాలో, ఆమేర్ అలీఖాన్‌ను జర్నలిస్టుల కోటాలో మండలి సభ్యులుగా ప్రభుత్వం సిఫారసు చేసింది. గత ప్రభుత్వం దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణలను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా సిఫారసు చేయగా..వారి రాజకీయ నేపథ్యం కారణంగా ఆ ప్రతిపాదనను తమిళిసై తిరస్కరించిన విషయం విదితమే. ప్రస్తుతం వీరి స్థానంలోనే కోదండరాం, మీర్ ఆమేర్ అలీ ఖాన్‌ను నియమించారు.
పెద్దల సభకు ఉద్యమ సారథి
కోదండరాం సార్‌గా సుపరిచితుడైన ముద్దసాని కోదండరాం స్వగ్రామం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నెన్నెల మండలం జోగాపూర్. 1955 సెప్టెంబర్ 5న ముద్దసాని వెంకటమ్మ, ఎం.జనార్దన్ రెడ్డి దంపతులకు జన్మించారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ , ఓయూలో పీజీ (పొలిటికల్ సైన్స్), జేఎన్‌యూలో ఎంఫిల్ పూర్తి చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ కోసం చేరగా.. 1981లో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఉద్యోగం రావడంతో పీహెచ్డీ మధ్యలో ఆపేశారు. ఆదివాసీల సమస్యలపై దివంగత హక్కుల నేత బాలగోపాల్, ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్‌రావుతో కలిసి పని చేశారు.
ఓయూలో ప్రొఫెసర్‌గా సుదీర్ఘ కాలం పనిచేసిన కోదండరాం..దివంగత ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సహా అనేక మంది ప్రముఖ తెలంగాణవాదులతోనూ కలిసి పనిచేశారు. ఉద్యమ సమయంలో రాజకీయ జేఏసీ చైర్మన్‌గా అన్ని పార్టీలను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏకం చేయడంలో క్రియాశీలంగా పని చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటి బీఆర్‌ఎస్ విధానాలతో విభేదించారు. ప్రజాస్వామిక తెలంగాణ పేరిట 2018 మార్చి 31వ తేదీన తెలంగాణ జన సమితిని ఏర్పాటు చేశారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీజేఎస్ కాంగ్రెస్‌తో కలిసి పని చేసింది. అదే క్రమంలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తో జత కట్టారు. దీనితో పాటు ఉద్యమ నేపథ్యం, ప్రొఫెసర్‌గా ఆయన అందించిన సేవలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది.
జర్నలిజంలో విశేష కృషి
జర్నలిజంలో విశేష సేవలందించిన ఆమేర్ అలీఖాన్ (సియాసత్ ఉర్దూ దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ జాహెద్ అలీఖాన్ కుమారుడు) ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీసీఏ, తరువాత సుల్తాన్–ఉల్–ఉలూమ్ కాలేజీ ఆఫ్ బిజినెస్ అడ్మిని్రస్టేషన్ నుంచి ఎంబీఏ చేశారు. ప్రస్తుతం సియాసత్‌లో న్యూస్ ఎడిటర్‌గా ఉన్న ఆయన..ప్రతిక కర్ణాటక రాష్ట్రానికి విస్తరించేందుకు విశేష కృషి చేశారు. పలు అంతర్జాతీయ ఈవెంట్లను కవర్ చేయడానికి ప్రధానమంత్రి, రాష్ట్రపతిల వెంట విదేశీ పర్యటనలకు వెళ్లారు.
మైనారిటీల్లో విద్య, నైపుణ్యాన్ని వృద్ధి చేయడానికి, నిరుద్యోగుల కోసం కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా శిక్షణ ఇప్పించేవారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సియాసత్ ప్రస్తుతం ఖతర్ దేశానికి కూడా విస్తరించింది. 1973 అక్టోబర్ 18న హైదరాబాద్‌లో జన్మించిన అమేర్ అలీ ఖాన్‌కు ఉర్దూతో పాటు ఇంగ్లి‹Ù, హిందీ, అరబిక్, తెలుగు భాషలు తెలుసు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించారు.
Comments
Please login to add a commentAdd a comment