
అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్న ఫారూఖ్ హుస్సేన్
* మండలి బరిలో ఫారూఖ్ హుస్సేన్
* చైర్మన్ ఎన్నికల్లో గెలుపు కోసం పొన్నాల, డీఎస్, జానా మంతనాలు
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి చైర్మన్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తరపున ఎన్నికైన ఎమ్మెల్సీలందరికీ విప్ జారీ చేశారు. మండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్ మంగళవారం ఎమ్మెల్సీలందరికీ ఈ మేరకు లేఖలు పంపారు. బుధవారం జరిగే సమావేశానికి హాజరై కాంగ్రెస్ ప్రతిపాదించిన అభ్యర్థి ఫారూఖ్ హుస్సేన్‌కు ఓటు వేయాలని అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీఎస్ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ అధిష్టానం ఆమోదంతోనే ఫారూఖ్ హుస్సేన్‌ను బరిలో దించామన్నారు.
చైర్మన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని మాట వరసకు కూడా సీఎం అడగలేదని, అందుకే తాము అభ్యర్థిని బరిలో దింపామని తెలిపారు.ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన ఐదుగురు ఎమ్మెల్సీలు కె.ఆర్.ఆమోస్, జగదీశ్వర్‌రెడ్డి, భానుప్రసాద్, వి.భూపాల్‌రెడ్డి, ఎన్.రాజలింగంతోపాటు అసమ్మతి సభ్యులు కె.యాదవరెడ్డి, రాజేశ్వర్‌లకు కూడా విప్ జారీ చేసినట్టు చెప్పారు. ఇదిలాఉండగా, చైర్మన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎల్పీ కార్యాలయంలో డీఎస్‌తోపాటు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ నేత జానారెడ్డిసహా ఎమ్మెల్సీలంతా చర్చించారు.
ఫారూఖ్ హుస్సేన్ నామినేషన్ దాఖలు
శాసనమండలి చైర్మన్ పదవికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఫారూఖ్ హుస్సేన్ మంగళవారం నామినేషన్ దాఖ లు చేశారు. కార్యక్రమంలో పొన్నాల, డీఎస్, జానారెడ్డి, ఎంపీలు గుత్తా, ఎంఏఖాన్‌తోపాటు ఏడుగురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫారూఖ్ హుస్సేన్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ తాను కలిసి చదువుకున్నామని, ఆయనను కూడా కలసి గెలుపునకు సహకరించాలని కోరుతానన్నారు.
స్థానం ఉన్నతం.. విధానమే బాగోలేదు
నామినేషన్ కార్యక్రమం అనంతరం కాంగ్రెస్ నేతలంతా సీఎల్పీ కార్యాలయం వైపు వస్తుండగా స్వామిగౌడ్ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్వామిగౌడ్‌ను ఉద్దేశిస్తూ ‘చైర్మన్ స్థానం ఉన్నతమైంది. మీరు ఆ పదవి చేపట్టబోవడం ఆనందమే. కాకపోతే జరుగుతున్న విధానమే సరిగా లేదు. అందులో మిమ్ముల్ని భాగస్వామిని చేయడం మరింత బాధాకరం’అని వ్యాఖ్యానించారు.