'గాంధీభవన్‌లో కూర్చొని గడ్డాలు పెంచితే సరిపోదు'
వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరిన చందంగా ఉందని మంత్రి కేటీఆర్ ఎద్దేవ చేశారు.
హైదరాబాద్: స్కీములు, స్కాములలో తలమునకలైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడుతుంటే.. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరిన చందంగా ఉందని మంత్రి కేటీఆర్ ఎద్దేవ చేశారు. శాసన మండలి సమావేశాల్లో భాగంగా బడ్జెట్ పద్దులపై శుక్రవారం జరిగిన చర్చలో ప్రభుత్వం అవినీతిమయమైందని కాంగ్రెస్ విమర్శించింది.
దీనికి కేటీఆర్ సమాధానం ఇస్తూ.. స్కీములు, స్కాములకు పాల్పడింది కాంగ్రెస్సే.. 40 ఏళ్లు పాలించి ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే కాంగ్రెస్ ఓర్వలేక పోతుందన్నారు. రాష్ట్రం బాగుపడుతుంటే సహకరించాలి కాని ఓర్వలేకపోవడం దారుణమన్నారు. గాంధీభవన్‌లో కూర్చొని గడ్డాలు పెంచుకోవడం వల్ల అభివృద్ధి సాధ్యం కాదన్నారు.