సాక్షి, హైదరాబాద్: ఎవరినో గద్దె దించి, వేరెవరినో ఎక్కించాలనేది తమ విధానం కాదని రాష్ట్ర మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పారు. కాంగ్రెస్‌తోనో మరొకరితోనో జట్టు కట్టడం, థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్ కూడా తమ విధానం కాదన్నారు. రాజకీయ ప్రక్రియలో గెలుపోటములు కాకుండా ప్రజలకు ఏం చేస్తామన్నదే ముఖ్యమని వ్యాఖ్యానించారు.
మోదీని గద్దె దించడమనేది కాకుండా ప్రభుత్వ పాలనలో మెరుగైన విధానాలే తమ నినాదమని స్పష్టం చేశారు దేశ చరిత్రలో అత్యంత అసమర్థ ప్రధాని మోదీ అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. విపక్ష భేటీకి సంబంధించి తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదని తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు.
దేశమంతటా బీఆర్‌ఎస్ సంచలనం
‘భారత్‌లో బహుళ పార్టీ వ్యవస్థ ఉంది. కాంగ్రెస్ లేదా బీజేపీ నాయకత్వం వహించాలనే ఆలోచనకు మేం వ్యతిరేకం. మోదీ, రాహుల్ ఏం చేస్తారన్నది మాకు అనవసరం. 2024లో మేము మాకు వీలున్న చోట పోటీ చేస్తాం. మెరుగైన పాలన ఎక్కడ ఉంటే అటువైపు ప్రజ లు ఆకర్షితులవుతారు. బీఆర్‌ఎస్ సంచలనం దేశమంతటా విస్తరిస్తుంది. ఎన్నికలకు 6నెలల ముందే ఎవరికి టికెట్లు వస్తాయో రావో చెప్పలేము. పనితీరు ఆధారంగా పాత వారికి టికెట్లు ఇస్తాం..’అని కేటీఆర్ చెప్పారు.
మాపై వ్యతిరేకత లేదు
‘కర్ణాటకలో అసమర్థ బీజేపీని ప్రజలు తిరస్కరించారు. మణిపూర్ మండిపోతుంటే ప్రధాని, కేంద్రం హోం మంత్రి, 8 మంది సీఎంలు కర్ణాటకలో మకాం వేయడాన్ని ప్రజలు అర్దం చేసుకున్నారు. కర్ణాటక ఓటర్లు బీజేపీ ప్రభుత్వాన్ని మాత్రమే తిరస్కరించారు. తెలంగాణలో మా ప్రభుత్వ వ్యతిరేకతకు ఎలాంటి కారణాలు లేవు. తెలంగాణలో 2018 ఎన్నికల్లో 109 సీట్లలో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీని ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. రాష్ట్రంలో వారికున్న మూడు సీట్లు కూడా మళ్లీ రావు..’అని స్పష్టం చేశారు.
తెలంగాణను దేశం అనురిస్తోంది..
‘తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ మోడల్‌కు పునాది. నాయకులు తలచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని తెలంగాణ తొమ్మిదేళ్లలో రుజువు చేసింది. సంపదను సృష్టించి అన్ని వర్గాల సంక్షేమానికి అందిస్తున్నాం. విద్య, ఆరోగ్యం, విద్యుత్ ఇలా అన్ని రంగాల్లో సమగ్ర, సమతుల్య, సమీకృత, సమ్మిళిత అభివృద్దితో తెలంగాణ కొత్త పుంతలు తొక్కుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల నడుమ అభివృద్ధిలో సమతూకం పాటిస్తూ విధానాల రూపకల్పనలో వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నాం.
గుడిసెల నుంచి గూగుల్ దాకా.. పాతాళంలో బొగ్గు నుంచి అంతరిక్షంలో రాకెట్ దాకా.. అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకుపోతోంది. సమర్ధ ప్రభుత్వం– సుస్థిర నాయకత్వం నినాదంతో ముందుకు సాగుతున్న తెలంగాణను ఈ రోజు దేశం అనుసరిస్తోంది. తెలంగాణ ఏర్పడి దశాబ్ది అవుతున్న సందర్భంలో జేబులో ఉన్న రూపాయిని కింద పారేసి చిల్లర నాణేలు ఏరుకోవద్దు. కేసీఆర్ లాంటి అద్భుత నాయకుడు ఉండగా వీధుల్లో కారుకూతలు, పెడబొబ్బలు పెట్టే వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.
ప్రధాని మోదీ, నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సవాలు చేస్తున్నా. దేశంలో తెలంగాణ మోడల్‌కంటే మెరుగైన నమూనా ఉన్న రాష్ట్రాన్ని చూపండి. 55 ఏళ్లలో జాతీయ పార్టీలు చేయలేని పనిని తొమ్మిదేళ్లలో కేసీఆర్ చేసి చూపించారు. దశాబ్దం నిండుతున్న సందర్భంగా ఎన్నికల సంవత్సరంలో కేసీఆర్, బీఆర్‌ఎస్‌ను నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతున్నా..’అని కేటీఆర్ చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించాలి
► ‘రాజకీయాల్లో పోరాటాలు, కొట్లాటలు సమ ఉజ్జీలతో ఉంటాయి కానీ మరుగుజ్జులతో ఉండవు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ రాజకీయ మరుగుజ్జులు. ఇక్కడ మరో ప్రత్యామ్నాయం ఉందని రాష్ట్ర ప్రజలు అనుకోవడం లేదు. మేము చేసింది చెప్పుకునేందుకు ఎంతో ఉంది. 90 నుంచి 100 సీట్లతో మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం. తెలంగాణ సీఎంగా వరుసగా తొమ్మిదేళ్లు పనిచేసి రికార్డు సృష్టించిన కేసీఆర్ మూడోసారి కూడా ముఖ్యమంత్రిగా ఉంటారు. సీఎం అభ్యర్థి ఎవరో కాంగ్రెస్, బీజేపీ ప్రకటించాలి..’అని డిమాండ్ చేశారు.
డీ లిమిటేషన్‌లో హేతుబద్ధత ఉండాలి
► ‘2026లో జరిగే లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో శాస్త్రీయత, హేతుబద్ధత ఉండాలి. కేంద్రం సూచన మేరకు జనాభా నియంత్రణ చేసిన ప్రగతిశీల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిథ్యం తగ్గిస్తామనడం దారుణం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రగతిశీల రాష్ట్రాలకు నష్టం జరగకుండా లోతైన చర్చ జరిపి సరైన పరిష్కారం చూపాలి. జనాభాను అధికంగా పెంచి దేశానికి గుదిబండగా మారిన రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచి, బాగా పనిచేసిన రాష్ట్రాల గొంతు నులమడం సరికాదు. అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించడంలో తప్పులేదు..’అని పేర్కొన్నారు.
ఏది నిజమో ఒవైసీనే అడగండి
► ‘తెలంగాణలో అమలవుతున్న మైనారిటీ సంక్షేమం ఇక్కడ ఎందుకు అమలు కావడం లేదంటూ అసదుద్దిన్ ఒవైసీ గతంలో ఉత్తరప్రదేశ్‌లో ప్రసంగించారు. ఇక్కడ మైనారిటీలకు ఏమీ జరగడం లేదని అంటున్నారు. మరి ఆయన చేసిన ప్రకటనల్లో ఏది కరెక్టోఆయన్నే చెప్పమనండి..’అని తెలిపారు.
అత్యంత సమర్ధ ప్రధాని పీవీ
► ‘దేశ ప్రధానుల్లో ఇప్పటివరకు అత్యంత సమర్ధుడు పీవీ నర్సింహారావు, ఆయన తెచ్చిన ఆర్థిక సంస్కరణల వల్లే నేడు భారత్ అభివృద్ధి చెందుతోంది. సొంత పార్టీలో అవమానంతో పాటు గుర్తింపునకు నోచుకోని వ్యక్తి పీవీ. కాంగ్రెస్ విధానాలే భారత్ దుస్థితికి కారణం. రాహుల్ గాంధీ పార్టీకి బదులుగా స్వచ్ఛంద సంస్థ పెట్టుకుంటే బెటర్.
నోట్ల రద్దుతో సాధించిందేమిటో మోదీ నేటికీ దేశ ప్రజలకు చెప్పలేదు. గతంలో తుగ్లక్ గురించి విని ఉన్నాం.. మిగతాది మీరే పూరించుకోండి. ఎంపీలుగా ఉన్న బండి సంజయ్, రేవంత్‌కు దేశానికి ప్రధాని కాగలిగే సత్తా ఉంది (వ్యంగ్యంగా)..’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
మెరుగైన విధానాలే మా నినాదం
Published Fri, Jun 2 2023 4:57 AM | Last Updated on Fri, Jun 2 2023 4:57 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment