
ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు
హైదరాబాద్ :
వచ్చే మార్చి, మే నెలల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పదవీ కాలం పూర్తవుతున్న పలు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూలును విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన తొమ్మిది మంది ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ఆయా స్థానాలకు ఈసీ షెడ్యూలు ప్రకటించింది. వీటిల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 8 స్థానాలు, తెలంగాణ నుంచి ఒక స్థానం ఖాళీ అవుతోంది.
ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ప్రస్తుతం విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 21 న నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఫిబ్రవరి 28 వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. మార్చి 3 వరకు ఉపసంహరణకు గడువు విధించారు. ఆ తర్వాత మార్చి 17 న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. మార్చి 20 న ఓట్ల లెక్కింపు జరుపుతారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి అనంతపురం, కడప, నెల్లూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీలు పదవీ కాలం ముగుస్తోంది. అనంతపురం, కడప స్థానిక సంస్థల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మెట్టు గోవిందరెడ్డి, చదిపిరాళ్ల నారాయణరెడ్డిల పదవీ కాలం మార్చి 29 తో ముగుస్తోంది. నెల్లూరు (వాకాటి నారాయణరెడ్డి), పశ్చిమ గోదావరి (రెండు స్థానాలు - అంగర రామమోహన్, మేకా శేషుబాబు), తూర్పుగోదావరి (బొడ్డు భాస్కర రామారావు), శ్రీకాకుళం (పీరుకట్ల విశ్వప్రసాదరావు), చిత్తూరు (బి నరేష్ కుమార్ రెడ్డి), కర్నూలు (శిల్పా చక్రపాణిరెడ్డి) ల పదవీ కాలం మే ఒకట తేదీతో పూర్తవుతుంది.
తెలంగాణ నుంచి హైదరాబాద్ స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన సయ్యద్ అమినుల్ హసన్ జాఫ్రీ పదవీ కాలం కూడా మే ఒకటి నాటితో పూర్తవుతుంది. ఈ స్థానానికి కూడా ఏపీకి ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారు.
ఇలావుండగా, ఏపీలో ఖాళీ అవుతున్న మూడు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలు, రెండు టీచర్స్ నియోజకవర్గాల ఎన్నికల కోసం, అలాగే తెలంగాణలో ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 6 న షెడ్యూలు ప్రకటించిన విషయం తెలిసిందే. టీచర్స్, గ్రాడ్యుయేట్స్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో ఏపీ అంతా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుంది.