![PV Narasimha Rao Daughter Vani Devi Nominated For Governor Post In Telangana Legislative Council - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/23/TERS.jpg.webp?itok=HF7SktUk)
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనమండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్ కోటా స్థానాలను ఆశించేవారి సంఖ్య పెరిగిపోతోంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆశీస్సుల కోసం పలువురు టీఆర్‌ఎస్ నేతలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. 40 మంది సభ్యులున్న మండలిలో గవర్నర్ కోటా కింద ఆరు స్థానాలుంటాయి. ఇప్పటికే రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గతంలో గవర్నర్ కోటాలో మండలికి ఎన్నిౖకైన రాములు నాయక్ 2018లో కాంగ్రెస్‌లో చేరడంతో టీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆయ న పదవీకాలం ఈ ఏడాది మార్చిలో ముగి సింది. గతంలో గవర్నర్ కోటాలో మండలికి నామినేట్ అయిన మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి పదవీకాలం కూడా ఈ ఏడాది జూన్ 19న ముగిసింది. మండలిలో ప్రభుత్వవిప్ కర్నె ప్రభాకర్ పదవీకాలం ఈ ఏడాది ఆగస్టు 17న ముగియనుంది. దీంతో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవాలని పలువురు నేతలు పావులు కదుపుతున్నారు.
మరోమారు నాయిని, కర్నెకు అవకాశం?
2018 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించిన నాయినికి మరోమారు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ అప్పట్లో హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తనకు తిరిగి గవర్నర్ కోటాలో అవకాశం లభిస్తుందనే ధీమాతో ఆయన ఉన్నారు. అయితే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం, మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంపై నాయిని ఒకటి, రెండు సందర్భాల్లో బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యల ప్రభావం ఆయన అభ్యర్థిత్వ అవకాశాలపై ఎంతమేరకు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. కర్నె ప్రభాకర్‌ను కూడా గవర్నర్ కోటాలో మండలికి సీఎం కేసీఆర్ మరోమారు నామినేట్ చేసే అవకాశమున్నట్లు సమాచారం.
ఆశావహుల జాబితాలో ఇంకొందరు...
గవర్నర్ కోటాలో ఒకేసారి మూడు స్థానాలు ఖాళీ అవుతుండటంతో ఆశావహుల జాబితా కూడా పెరుగుతోంది. సీఎం కార్యాలయ ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్, బ్రూవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, సీనియర్ నేత తక్కళ్లపల్లి రవీందర్‌రావు, మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణీదేవి పేరును పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆగస్టు రెండోవారంలో రాష్ట్ర కేబినెట్‌లో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి గవర్నర్ ఆమోదానికి పంపే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment