శనివారం ప్రగతి భవన్‌లో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రి కేటీఆర్, పార్టీ సెక్రెటరీ జనరల్ కేకే, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ నామా
సాక్షి, హైదరాబాద్: తెగించి కొట్లాడుడు తెలంగాణ రక్తంలోనే ఉందని, కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపట్ల అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిపై పార్లమెంటు ఉభయసభల్లో టీఆర్‌ఎస్ ఎంపీలు తీవ్రస్థాయిలో నిరసన గళం వినిపించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు టీఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యులను ఆదేశించారు. ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణను ప్రోత్సహించకుండా కేంద్రం ద్వేషపూరితంగా వ్యవహరించడాన్ని ఎండగట్టాలన్నారు. సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన 9 మంది లోక్‌సభ, ఏడుగురు రాజ్యసభ సభ్యులు కలుపుకుని మొత్తం 16 మంది ఎంపీలు హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సి వ్యూహంపై కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఏర్పడిన 8 ఏళ్లలో రాష్ట్ర విభజన హామీలు సహా పలు హక్కులను తొక్కిపడుతున్న బీజేపీ అసంబద్ధ వైఖరిని ప్రశ్నించాలన్నారు. కలిసొచ్చే విపక్ష ఎంపీలతో సమన్వయం చేసుకొని కేంద్రాన్ని ఎండగట్టేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై పార్టీ ఎంపీలకు పలు సూచనలు చేశారు.
కేంద్రంపై పోరుకు పార్లమెంటు సరైన వేదిక..
‘కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో అన్ని రంగాల్లో దేశాభివృద్ధి నిలిచిపోతున్నందున పార్లమెంటు ఉభయ సభలను తెలంగాణ ఎంపీలు పోరాట వేదికగా ఉపయోగించుకోవాలి. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకొనేందుకు కుట్రలకు పాల్పడుతూ నిబంధనల పేరిట ఆర్థిక అణచివేతకు పాల్పడుతోంది. 8 ఏళ్లుగా తెలంగాణ క్రమం తప్పకుండా రుణాలు చెల్లిస్తుండటంతో ఆర్‌బీఐ బిడ్ల వేలంలో తెలంగాణ బిడ్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
దేశంలో 22 రాష్ట్రాలు తెలంగాణ కంటే ఎక్కువ అప్పులను కలిగి ఉన్నాయి. తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు బీజేపీ సోషల్ మీడియా గ్రూపులకు ఎలా చేరుతున్నాయో ఆ పార్టీ వివరణ ఇవ్వాలి. కేంద్రం, రాష్ట్రాల నడుమ గోప్యంగా ఉండాల్సిన ఆర్థిక వ్యవహారాలను ఉద్దేశపూర్వకంగా లీక్ చేసి తెలంగాణకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం కుట్రపూరిత చర్య. బీజేపీ అనుసరిస్తున్న దిగజారుడు, చవకబారు రాజకీయాలకు ఇది నిదర్శనం’అని కేసీఆర్ ఈ భేటీలో వ్యాఖ్యానించారు.
ఎఫ్‌ఆర్‌బీఎంపై మాటమార్చిన కేంద్రం
‘ఏటా కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని ప్రకటించిన తర్వాతే రాష్ట్రాలు బడ్జెట్లు రూపొందించుకుంటాయి. తెలంగాణ ఎఫ్‌ఆర్‌బీఎంను రూ. 53 వేల కోట్లుగా ప్రకటించి రూ. 23 వేల కోట్లకు కుదించడం కుట్రపూరితం. ఈ తరహా బీజేపీ దివాళాకోరు, తెలివితక్కువ వ్యవహారాలను నిలదీసి, వారి నిజస్వరూపాన్ని బట్టబయలు చేసేందుకు అన్ని రకాల ప్రజాస్వామిక పద్ధతులను పార్టీ ఎంపీలు అనుసరించాలి. విద్యుత్ సంస్కరణల పేరిట కావాల్సిన వారి కోసం రాష్ట్రాలపై ఒత్తిడి తేవడాన్ని నిలదీయాలి. నీతి ఆయోగ్ సిఫారసులను బుట్టదాఖలు చేయడాన్ని ప్రశ్నించాలి. తెలంగాణ సహా కేవలం 8 రాష్ట్రాలు మాత్రమే దేశ జీడీపీకి దోహదం చేస్తున్నాయి. ఎనిమిదేళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులు, రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లిన నిధుల లెక్కలు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని బట్టబయలు చేస్తాయి’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
అవసరమైతే నేనూ ఢిల్లీకి వస్తా..
పార్లమెంటు సమావేశాల సందర్భంగా అవసరమైతే తాను ఢిల్లీకి వచ్చి బీజేపీ వ్యతిరేక పోరాటంలో కలసి వచ్చే విపక్ష పార్టీల అధినేతలు, ఎంపీలతో చర్చలు జరుపుతానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనున్న పలు ప్రజావ్యతిరేక బిల్లులను నిర్ద్వందంగా తిరస్కరించాలని ఎంపీలను ఆదేశించారు. ఎఫ్‌ఆర్‌బీఎం విషయంలో కేంద్రం ఉల్లంఘనలకు పాల్పడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ బొగ్గు దిగుమతులు, కేంద్ర ప్రభుత్వ అప్పులపై నిలదీయాలన్నారు.
ధాన్యం కొనుగోలు, ఉపాధి హామీ పథకం అమలుపై కుట్రలు, పాతాళంలోకి దిగజారుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ, బీజేపీ మూకస్వామ్యంపై నిరసన గళం వినిపించి ప్రజాకోర్టులో దోషిగా నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ప్రజావ్యతిరేకత ఉధృతమైతే పార్లమెంటు మూకుమ్మడిగా రాజీనామా చేసిన సందర్భాలను సీఎం ఎంపీలకు గుర్తుచేశారు. అదే పరిస్థితిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎదుర్కోక తప్పదన్నారు. ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన పలు అంశాలకు చెందిన డిమాండ్లతోపాటు ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీయాలని, ఈ జాప్యానికి బీజేపీని దోషిగా నిలబెట్టాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment