మండలిపై టీఆర్‌ఎస్‌ నజర్‌ | TRS Focusing On Telangana Legislative Council | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 21 2018 1:26 AM | Last Updated on Fri, Dec 21 2018 8:33 AM

TRS Focusing On Telangana Legislative Council - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజ యం సాధించిన టీఆర్‌ఎస్‌ తాజాగా శాసనమండలి ఎన్నికలపై దృష్టి సారించింది. సాధారణ ఖాళీలతోపాటు రాజీనామాలు, ఇతర కారణాలతో రాష్ట్రంలో 16 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో వాటన్నింటినీ కచ్చితంగా గెలుచుకునేందుకు వ్యూహాలు మొదలు పెట్టింది. శాశ్వత సభ అయిన శాసనమండలిలో గవర్నర్, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థలు, ఉపాధ్యాయులు, పట్టభద్రుల కోటా ఉంటుంది. తెలంగాణ శాసనమండలిలో 40 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. ప్రతి రెండేళ్లకోసారి మూడో వంతు స్థానాలు ఖాళీ అవుతాయి. వాటికి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది. ఇలా 2019 మార్చి 31 నాటికి తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. రాజీనామాలు, ఇతర కారణాలతో మరో ఆరు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మైనంపల్లి హనుమంతరావు, పట్నం నరేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వరంగల్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు శుక్రవారం రాజీ నామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇలా నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ 13 ఎమ్మెల్సీ స్థానాలకు కచ్చి తంగా ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు అసెంబ్లీ ఎన్ని కలకు ముందు టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రాములు నాయక్, ఆర్‌.భూపతిరెడ్డి, కె. యాదవరెడ్డిల సభ్యత్వాలను రద్దు చేయాలని టీఆర్‌ఎస్‌ ఇటీవల శాసన మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. శాసన మండలి చైర్మన్‌ త్వరలోనే ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఫిరాయింపుల నిబంధనల ప్రకారం ఆ ముగ్గురిపై వేటు వేస్తే మరో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వాటిని సైతం కలిపితే మొత్తం 16 ఎమ్మెల్సీ స్థానాలకు మార్చిలోగా ఎన్నికలు జరగనున్నాయి.

ఖాళీ అయ్యే అన్ని ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవడం లక్ష్యంగా టీఆర్‌ ఎస్‌ వ్యూహాలు రచిస్తోంది. గవర్నర్‌ కోటా కచ్చి తంగా అధికార పార్టీ ప్రతిపాదనల ఆధారం గానే భర్తీ అవుతుంది. ఎమ్మెల్యేలు, స్థానిక సం స్థలు, ఉపాధ్యాయులు, పట్టభద్రుల కోటా స్థానాల్లోనూ విజయం సాధించాలని టీఆర్‌ఎస్‌ గట్టిగా నిర్ణయించుకుంది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త వారికి పదవీకాలం మొదలు కానుంది. ఈలో గా ఎన్నికలు పూర్తి చేసేలా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.

భారీగా పోటీపడుతున్న ఆశావహులు
ఎమ్మెల్సీ సీట్ల కోసం అధికార పార్టీలో తీవ్ర పోటీ ఉంది. ప్రతి ఉమ్మడి జిల్లా నుంచి సగటున ఐదుగురు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యేల కోటాలో ఐదు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అన్ని స్థానాలను టీఆర్‌ఎస్‌ గెలుచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న మహమూద్‌అలీ (హోంమంత్రి), మహమ్మద్‌ సలీంకు కచ్చితంగా కొనసాగింపు ఉండనుంది. కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎం. ఎస్‌. ప్రభాకర్‌లకు సైతం ఇదే కోటాలో ఇచ్చే అవకాశం ఉంది. శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్, శాసనమండలిలో టీఆర్‌ఎస్‌ చీఫ్‌ విప్‌ పాతూరి సుధాకర్‌రెడ్డి పదవీకాలం పూర్తవుతోంది. వారి కొనసాగింపు విషయంలో టీఆర్‌ఎస్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. స్వామిగౌడ్‌ ప్రస్తుతం కరీంనగర్‌–మెదక్‌– నిజామాబాద్‌–ఆదిలాబాద్‌ జిల్లాల పట్టభద్రు ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తు న్నారు. ఈసారి ఆయన ఇతర కోటాలో అవకా శం ఇవ్వాలని కోరుతున్నారు.

దీంతో ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి కరీంనగర్‌ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ పేరును టీఆర్‌ ఎస్‌ అధిష్టానం పరిశీలిస్తోంది. సీఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ సమీకరణ నేపథ్యంలో రవీందర్‌సింగ్‌కు అవకాశం ఇస్తారని తెలు స్తోంది. కేసీఆర్‌ ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే సందర్భాల్లో సిక్కు వర్గానికి చెందిన రవీం దర్‌సింగ్‌ను వెంట తీసుకెళ్లే అవకాశం ఉందని, దీనికి అనుగుణంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉంది. అయితే పట్టభద్రుల నియో జకవర్గం కావడంతో గ్రూప్‌–1 అధికారుల సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌ గౌడ్, సరోజినీదేవి మాజీ సూపరింటెండెంట్‌ ఎస్‌. రవీందర్‌గౌడ్‌ పేర్లను టీఆర్‌ఎస్‌ అధి ష్టానం పరిశీలిస్తోంది. పాతూరి సుధాకర్‌రెడ్డికి రెండోసారి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయుల స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన పూల రవీందర్‌కు మళ్లీ పోటీ చేసే అవకాశం ఇవ్వనున్నటు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యే కోటా మూడు స్థానాలతోపాటు మిగిలిన వాటిలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే విషయంలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారు.

తొలి నుంచీ ఉన్న వారికి ప్రాధాన్యత...
టీఆర్‌ఎస్‌లో మొదటి నుంచీ ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వలేకపోయిన వారికి ఎమ్మెల్సీ పదవులను ఖరారు చేయనున్నారు. కేసీఆర్‌ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శులు ఎం. సుధీర్‌రెడ్డి తక్కళ్లపల్లి రవీందర్‌రావు, సత్యవతి రాథోడ్, గ్యాదరి బాలమల్లు, సోమ భరత్‌కుమార్, కార్యదర్శులు మాలోత్‌ కవిత, కోలేటి దామోదర్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేర్లను టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పరిశీలిస్తున్నారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల విషయంలో ఆయా ఉమ్మడి జిల్లాల సమీకరణల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement