సాక్షి, హైదరాబాద్ : ముగ్గురు ఎమ్మెల్సీలను అనర్హులుగా ప్రకటిస్తూ తెలంగాణ శాసనమండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రకటించాలని కోరుతూ వేర్వేరుగా దాఖలైన మూడు పిటిషన్లపై గురువారం వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల నుంచి లిఖితపూర్వక వాదనలు స్వీకరించిన హైకోర్టు.. తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కె.యాదవరెడ్డి, ఎస్.రాములు నాయక్, ఆర్.భూపతిరెడ్డి అధికార టీఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారనే ఫిర్యాదుపై శాసనమండలి చైర్మన్ ఆ ముగ్గురినీ ఎమ్మెల్సీలుగా అనర్హులని ప్రకటించారు. అయితే.. రాజ్యాంగ, చట్ట నిబంధనలకు విరుద్ధంగా చైర్మన్ వ్యవహరించారంటూ ఆ ముగ్గురూ వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు.
పదో షెడ్యూల్ 8వ పేరాను సమీక్షించాలి : భూపతిరెడ్డి
భూపతిరెడ్డి తరఫు న్యాయవాది ఆనంద్ కపూర్ వాదనలు వినిపిస్తూ.. 10వ షెడ్యూల్‌లోని 8వ పేరా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు. 10వ షెడ్యూల్ కింద అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్‌లకు ఏకపక్ష అధికారాలు ఉన్నాయని, దీంతో వారు ఇష్టం వచ్చిన రీతిలో నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగానే పిటిషనర్‌ను మండలి చైర్మన్ అనర్హుడిగా ప్రకటించారని, ఈ చర్యను రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రకటించాలని కోరారు. ట్రిబ్యునల్ హోదాలో మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయం చెల్లదని, ఆయన రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని వాదించారు.
అనర్హత వేటు చట్ట వ్యతిరేకం : యాదవరెడ్డి
యాదవరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ కాంగ్రెస్ పార్టీలో చేరారనేందుకు నిర్ధిష్టమైన ఆధారాలు లేవన్నారు. ఈ విషయాన్ని పట్టించుకోకుండానే మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారని, మేడ్చల్ సభలో యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీని కలిసినందుకే అనర్హత వేటు వేశారని తెలిపారు. తెలంగాణ ఇచ్చి నందుకు కృతజ్ఞతలు చెప్పడానికే సోనియా, రాహుల్‌లను పిటిషనర్ కలిశారని వివరించారు. పార్టీ ఫిరాయించినట్టుగా ఆధారాలు చూపడంలేదని, పత్రికల్లో వచ్చిన ఫొటోలనే ఆధారాలుగా భావించడం చెల్లదన్నారు. ఫిరాయింపు వేరు ఒక జాతీయ నేతను కలవడం వేరు అని, ఈ తేడాను మండలి చైర్మన్ గుర్తించకుండానే రాజ్యాంగ విరుద్ధంగా అనర్హత వేటు వేశారని, ఇది చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు.
నామినేటెడ్ ఎమ్మెల్సీకి పార్టీతో పనిలేదు : రాములు నాయక్
రాములు నాయక్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ వాదిస్తూ.. సామాజిక సేవకు గుర్తింపుగా పిటిషనర్‌ను గవర్నర్ తన కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేశారని నివేదించారు. దీనికి పార్టీలతో సంబంధం లేదని పేర్కొన్నారు. ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీలను కలిస్తేనే పార్టీ ఫిరాయించారనే అభియోగంతో వేటు వేశారన్నారు. నామినేట్ చేసిన పత్రాల్లో ఏ పార్టీకి చెందని వ్యక్తి అని ఉందని.. ఆ పత్రాలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద కోరితే ఇవ్వలేదని వివరించారు. నాలుగు వారాల సమయం ఇస్తే తనపై ఆరోపణలు అవాస్తవమని నిరూపిస్తామని చెప్పినా మండలి చైర్మన్ ఖాతరు చేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని కోర్టుకు చెప్పారు.
బహిరంగసభలో పార్టీ ఫిరాయించారు : అదనపు ఏజీ
మండలి చైర్మన్ తరఫున అదనపు ఏజీ జె.రామచంద్రరావు వాదిస్తూ.. పిటిషనర్లు బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుని పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురూ ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని చెప్పారు. మేడ్చల్‌లో కాంగ్రెస్ నిర్వహించిన సభలో ఇద్దరు టీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని.. ఓ నేత ఢిల్లీ వెళ్లి సోనియా, రాహుల్‌గాంధీలను కలిసినట్లు పత్రిక, టీవీల్లో వార్తలు వచ్చాయని, వాటిని పిటిషనర్లు ఖండించలేదని తెలిపారు. ఒక పార్టీ తరఫు ఎమ్మెల్సీగా ఉంటూ మరో పార్టీకి కొమ్ముకాయడం క్యారెక్టర్‌కు సంబంధించిన వ్యవహారమన్నారు. ఆ క్యారెక్టర్ కోల్పోయిన నేపథ్యంలో చర్యలు తీసుకోవచ్చునని సుప్రీంకోర్టు సైతం చెప్పిందని, అందువల్ల వారిని అనర్హులుగా ప్రకటించడం రాజ్యాంగబద్ధమేనని స్పష్టంచేశారు.
రాములు నాయక్‌కు ఎప్పటి నుంచో పార్టీ సభ్యత్వం
ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసిన ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తరఫున న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. టీఆర్‌ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఉండి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుని ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓటమి కోసం పనిచేశారని వివరించారు. రాములు నాయక్‌కు పార్టీ సభ్యత్వం ఉండగానే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారని, మండలి చైర్మన్ ఎదుట వాదనల్లో పార్టీ సభ్యత్వం ఉందని కూడా నాయక్ అంగీకరించారన్నారు. నామి నేట్ అయిన ఆరు నెలల్లోగా ఏదో ఒక పార్టీలో చేరితో ఫిరాయింపు అవ్వదని, ఎప్పటి నుంచో రాములు నాయక్‌కు టీఆర్‌ఎస్ పార్టీ సభ్య త్వం ఉందని తెలిపారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే అనర్హత వేటు వేయవచ్చునని సుప్రీంకోర్టు తీర్పులు కూడా వెలువరించిందని నివేదించారు. కాగా, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ 8వ పేరాకు రాజ్యాంగబద్ధత ఉందని కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఎన్.హరినాథ్‌రెడ్డి స్పష్టంచేశారు.
ధర్మాసనం లేవనెత్తిన సందేహాలివీ..
‘‘ప్రత్యేకాధికారాలున్న రాష్ట్రపతి సైతం అనేక నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని కూడా తప్పుపట్టవచ్చా? పత్రికల్లో వార్తలు వచ్చాయని చెబుతున్నారు. ఇవన్నీ నిజమే కావచ్చు. కానీ కోర్టుకు సాక్ష్యాలు ముఖ్యం. నిజానికి కూడా సాక్ష్యం కావాలి. ఆరోపణలకు వాస్తవిక ఆధారాలు ఉండాలి. సేవా రంగంలోని వ్యక్తిని గుర్తించి గవర్నర్ ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే దానికి పార్టీ ఫిరాయింపు ఎలా వర్తిస్తుంది. క్రాస్ ఎగ్జామ్ చేసేందుకు ఇరు పక్షాలకు అవకాశం ఇచ్చారా’’అని విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. మండలి చైర్మన్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ క్వాసీ జ్యుడీషియల్ సంస్థ కాదని, ఆ ట్రిబ్యునల్‌కు సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌లు వర్తించకపోయినా సహజ న్యాయసూత్రాలకు కట్టుబడి ఉండాలని స్పష్టంచేసింది. మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన రికార్డులు, వీడియోలు ఇవ్వాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment