
హైదరాబాద్, సాక్షి: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. యథాతథ స్థితినే కొనసాగించాలని చెబుతూ.. కొత్త సభ్యులతో ప్రమాణం చేయించొద్దని మంగళవారం తన ఆదేశాల్లో పేర్కొంది. దీంతో తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్‌ల ప్రమాణం చేయడానికి వీల్లేదు!.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్. వీళ్ల నియామకాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తాము వేసిన పటిషన్ విచారణ తేలెంత వరకు పిటిషన్ విచారణ ఆపాలంటూ కోరారు వాళ్లు. అయితే కోర్టు వాళ్ల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా ప్రమాణం చేయించవద్దని చెబుతూ.. ఫిబ్రవరి 8వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది.
కొద్ది నెలల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ప్రకటించింది. గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ నామినేట్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ ఇద్దరి పేర్లను గవర్నర్ కు పంపారు. అయితే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వీరి పేర్లను ఆమోదించలేదు. ఇంతలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.
అయితే గవర్నర్ తమ పేరును ఆమోదించకపోవడంపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణ రాష్ట్ర హైకోర్టుకు వెళ్లారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టికల్ 171 ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిందని.. దాన్ని తిరస్కరించే హక్కు గవర్నర్ లేదని వారు పేర్కొన్నారు. వీరి పిటిషిన్ పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంది. ఈలోపే కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాకు ప్రతిపాదించగా.. అందుకు గవర్నర్ ఆమోదం తెలపడంతోనే రాజకీయ అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment