ఎమ్మెల్సీలపై మళ్లీ నిర్ణయం | High Court CJ bench verdict in Governor Quota MLCs dispute | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీలపై మళ్లీ నిర్ణయం

Published Fri, Mar 8 2024 4:56 AM | Last Updated on Fri, Mar 8 2024 4:56 AM

High Court CJ bench verdict in Governor Quota MLCs dispute - Sakshi

దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణల పేర్లను గవర్నర్‌ తిరస్కరించిన తీరు సరికాదు

‘గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ’ల వివాదంలో హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పు

కేబినెట్‌ సిఫార్సుల మేరకే గవర్నర్‌ వ్యవహరించాలి

అభ్యంతరాలు ఉంటే పునఃపరిశీలనకు పంపాల్సింది

కానీ సిఫార్సులను పూర్తిగా రద్దుచేసే అధికారం మాత్రం లేదు

దీనిపై సెప్టెంబర్‌లో గవర్నర్‌ ఇచ్చిన ఆదేశాలను రద్దుచేసిన హైకోర్టు

కోదండరామ్, అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమించిన ప్రభుత్వ గెజిట్‌ కూడా రద్దు

గవర్నర్‌కు న్యాయస్థానాలు కూడా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేవని వ్యాఖ్య

అయితే నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలన్నదే తమ అభిప్రాయమని వెల్లడి

ఎమ్మెల్సీల అంశంపై కేబినెట్‌ మళ్లీ నిర్ణయం తీసుకోవాలని సూచన

సాక్షి, హైదరాబాద్‌: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణలను నియమించాలంటూ రాష్ట్ర కేబినెట్‌ చేసిన సిఫార్సు లపై గవర్నర్‌ వ్యవహరించిన తీరు సరికాదని రాష్ట్ర హైకోర్టు పేర్కొంది. సదరు సిఫార్సులను తిరస్క రిస్తూ 2023 సెప్టెంబర్‌ 19న గవర్నర్‌ ఇచ్చిన ఆదేశా లను రద్దు చేసింది. దీంతోపాటు గవర్నర్‌ ఆదేశాల మేరకు కోదండరామ్, ఆమెర్‌ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ఈ ఏడాది జనవరి 27న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను కూడా రద్దు చేసింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని.. మరోసారి ఎమ్మెల్సీల పేర్లను కేబినెట్‌ లో ప్రతిపాదించి గవర్నర్‌కు పంపాలని స్పష్టం చేసింది.

ఈ మేరకు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నియామక వివాదంపై దాఖలైన పిటిషన్‌లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్‌ కుమార్‌ జూకంటిల ధర్మాసనం గురువారం కీలక తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 171 (5) ప్రకారం.. కేబినెట్‌ సాయం, సలహా మేర కు గవర్నర్‌ వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొంది. కేబినెట్‌ సిఫార్సు చేసిన వ్యక్తుల అర్హత, అనర్హత అంశాలను పరిశీలించడానికి గవర్నర్‌కు అధికారం ఉంటుందని.. కావాలంటే అవసరమైన పత్రాలు, సమాచారం కోరవచ్చని తెలిపింది. కేబినెట్‌ సిఫార్సులను పునఃపరిశీలనకు పంపే అధికారం కూడా ఉంటుందని స్పష్టం చేసింది.

వాస్తవానికి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 361 ప్రకారం కోర్టుకు గవర్నర్‌ జవాబుదారీ కాదని.. గవర్నర్‌కు కోర్టులు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేవని పేర్కొంది. కానీ హైకోర్టుకు న్యాయసమీక్ష చేసే అధికారం ఉంటుందని వివరించింది. ‘గవర్నర్‌ కోటా’ పిటిషన్లపై వాదనలను పరిశీలించాక.. రాజ్యాంగంలోని నిబంధనలకు అనుగుణంగా తగిన చర్య తీసుకోవాలని భావించి తీర్పునిస్తున్నట్టు తెలిపింది. ఇక అప్పటి కేబినెట్‌ సిఫార్సులను అమలు చేయాలన్న పిటిషనర్ల డిమాండ్‌పై చర్చ అనవసరమని.. వారు గవర్నర్‌ తిరస్కరించడాన్ని మాత్రమే సవాలు చేశారని పేర్కొంది.

‘గవర్నర్‌ కోటా’వివాదం ఇదీ..
2023 జూలై 31న భేటీ అయిన గత ప్రభుత్వ కేబినెట్‌ గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బీఆర్‌ఎస్‌ నాయకులు దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణల పేర్లను గవర్నర్‌కు సిఫార్సు చేసింది. గవర్నర్‌ ఈ సిఫార్సులను తిరస్కరిస్తూ సెప్టెంబర్‌ 19న ఆదేశాలు జారీ చేశారు. దీంతో గవర్నర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ పిటిషన్లు విచారణలో ఉండగానే.. కొత్త ప్రభుత్వ కేబినెట్‌ సిఫార్సు మేరకు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరామ్, జర్నలిస్టు ఆమెర్‌ అలీఖాన్‌ల నియామకానికి గవర్నర్‌ ఆమోదం తెలిపారు. ఈ ఏడాది జనవరి 27న ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. ఈ నియామకాలను కూడా శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో సవాల్‌ చేశారు. రెండు అంశాలపైనా హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. కోదండరామ్, ఆమెర్‌ అలీఖాన్‌ను ప్రధాన పిటిషన్‌లో ఇంప్లీడ్‌ చేసింది. వారి ప్రమాణస్వీకారంపైనా స్టే ఇచ్చింది. తాజాగా తీర్పు వెలువరించింది.

గవర్నర్‌ నిర్ణయం అభ్యంతరకరం!
‘‘దాసోజు శ్రవణ్‌ రాజకీయ నాయకుడన్న కారణంగా గవర్నర్‌ తిరస్కరించారు. తర్వాత నియామకమయ్యే వారు కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండాలి. కానీ నియామకమైన వారు కూడా రాజకీయ నాయకులే. అందులో ఒకరు రాజకీయ పార్టీనే నడిపిస్తున్నారు’’ అని హైకోర్టులో దాసోజు శ్రవణ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఆదిత్యా సోంధీ వాదనలు వినిపించారు. ‘‘గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వ అర్హతలకు.. పిటిషనర్ల నామినేషన్‌ తిరస్కరణ కారణాలకు పొంతన లేదు. మంత్రివర్గ సిఫార్సులను తిరస్కరించే అధికారం గవర్నర్‌కు లేదు. దీనిపై సుప్రీంకోర్టు తీర్పులున్నాయి.

గవర్నర్‌కు అభ్యంతరం ఉంటే పునః పరిశీలన కోసం వెనక్కి పంపవచ్చు. గవర్నర్‌ తిరస్కరణ కారణంగా హక్కును కోల్పోయిన పిటిషనర్‌కు కోర్టును ఆశ్రయించే అర్హత ఉంటుంది. శ్రవణ్, సత్యనారాయణల పేర్లను నెలల తరబడి పరిశీలించిన గవర్నర్‌.. కోదండరామ్, ఆమెర్‌ అలీఖాన్‌ల పేర్లను మాత్రం కొత్త కేబినెట్‌ సిఫార్సు చేసిన వెంటనే ఆమోదించింది’’ అని వివరించారు. కుర్ర సత్యనారాయణ తరఫున సీనియర్‌ న్యాయవాది మయూర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘‘మంత్రి మండలి సిఫార్సులను గవర్నర్‌ వెనక్కి పంపడానికి, తిరస్కరించడానికి తేడా లేదని పేర్కొనడం సరికాదు. ప్రభుత్వం సిఫార్సు చేసిన అభ్యర్థులపై గవర్నర్‌గా సంతృప్తి చెందడం వేరు.. ఓ వ్యక్తిగా సంతృప్తి చెందడం వేరు. పిటిషనర్ల పేర్లను గవర్నర్‌ వ్యక్తిగతంగా తిరస్కరించినట్టు కనిపిస్తోంది’’ అని పేర్కొన్నారు.

గవర్నర్‌.. రబ్బర్‌ స్టాంప్‌ కాదు..
‘‘ఎవరికైనా రాజ్యాంగం అనేది సుప్రీం. దాన్ని ఎవరైనా అనుసరించాలి. భాషాపరమైన, సైన్స్‌ వంటి రంగాల్లో సేవలందించిన వారిని మంత్రి మండలి సిఫార్సు చేయాలి. అలా కాకుండా రాజకీయ విభాగాలకు చెందిన వారిని సిఫార్సు చేస్తే.. కారణాలను పేర్కొంటూ తిస్కరించే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. గవర్నర్‌ రబ్బర్‌ స్టాంప్‌ కాదు. గవర్నర్‌ తిరస్కరించిన తర్వాత వేరేవారి పేర్లు పంపడానికి ప్రభుత్వానికి అవకాశం ఉన్నా పంపలేదు. మంత్రి మండలి సిఫార్సులను వెనక్కి పంపిన గవర్నర్‌ చర్యలను అలహాబాద్, బాంబే హైకోర్టులు గతంలో సమర్థించాయి. కోదండరామ్, ఆమెర్‌ అలీఖాన్‌లను గవర్నర్‌ నేరుగా ఏమీ నియమించలేదు. మంత్రి మండలి సిఫార్సు చేసిన తర్వాత.. ఆయా రంగాల్లో వారు చేసిన సేవను పరిశీలించి ఆమోదముద్ర వేశారు’’ అని కోదండరామ్, అలీఖాన్‌ల తరఫు సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ కోర్టుకు విన్నవించారు.

ప్రభుత్వ సిఫార్సు మేరకే నియామకం..
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) వాదనలు వినిపిస్తూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఇద్దరి పేర్లను ఎమ్మెల్సీలుగా సూచిస్తూ జనవరి 24న ప్రభుత్వం సిఫార్సు చేసిందని, దాన్ని పరిశీలించాకే గవర్నర్‌ ఆమోదించారని వివరించారు. ఇదంతా చట్టప్రకారమే జరిగిందన్నారు. గతంలో ప్రభుత్వం చేసిన సిఫార్సులను పక్కకుపెట్టే అధికారం ఇప్పుడున్న సర్కార్‌కు ఉంటుందని స్పష్టం చేశారు.

– గవర్నర్‌ కార్యదర్శి తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.అశోక్‌ ఆనంద్కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ‘‘గవర్నర్‌ నిర్ణయాలను కోర్టులు విచారించలేవు. రాజ్యాంగం గవర్నర్‌ విచక్షణాధికారాలకు పూర్తి రక్షణ కల్పించింది. గవర్నర్‌ విచక్షణ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మంత్రి మండలి సలహాపై.. మరొకటి సొంత విచక్షణాధికారం. ప్రజాప్రతినిధుల కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నుకునే అవకాశం ఎమ్మెల్యేలకు ఎలా ఉంటుందో.. గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీలను నియమించే విచక్షణాధికారాలు గవర్నర్‌కు ఉన్నాయి’’ అని వివరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement