judgement reserve
-
నేరస్థులను జైలులో పెట్టాల్సిందే.. కేజ్రీవాల్ పిటిషన్‌పై ఈడీ వాదనలు
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు బుధవారం(ఏప్రిల్ 3)న విచారించి తీర్పును రిజర్వు చేసింది. ఎన్నికల వేళ ఢిల్లీ సీఎంను అరెస్టు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశాలున్నాయని కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు వాదించారు. దీనికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)తరపున వాదించిన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎస్.వి రాజు ఘాటుగా స్పందించారు. ఎన్నికల కారణంగా తమను అరెస్టు చేయవద్దనే హక్కు నిందితులకు లేదన్నారు. విచారణ సక్రమంగా సాగాలంటే నిందితులను అరెస్టు చేసి జైలులో ఉంచాల్సిందేనని కోర్టుకు తెలిపారు. కేజ్రీవాల్ అక్రమ అరెస్టు పిటిషన్‌పై ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పును గురువారం మధ్యాహ్నానికి వాయిదా వేశారు. కాగా, లిక్కర్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఇదీ చదవండి.. లిక్కర్ కేసు.. తీహార్ జైలు నుంచి ఆప్ ఎంపీ రిలీజ్ -
చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
సాక్షి, గుంటూరు: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు కొనసాగాయి. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కౌంటర్ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు ముగియడంతో.. ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు.. ఈ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ కండిషన్స్ ఉల్లంఘించి ర్యాలీలు చేశారు. ర్యాలీలు చేయడంపై తెలంగాణ పోలీసులు కేసులు కూడా పెట్టారు. స్కిల్ స్కామ్ రూ.10 నోట్లు వాడి హవాలా రూపంలో డబ్బు తరలించారు. చిన్నప్ప అనే వ్యక్తి ద్వారా మూడు 10 రూపాయల నోట్లు ఉపయోగించి హవాలా ద్వారా కోట్ల రూపాయలు హైదరాబాద్‌కు తరలించారు. బోస్ అనే వ్యక్తి ఫోన్ మెస్సేజ్‌ల ద్వారా ఈ విషయం బయటపడింది. బోస్, కన్వేల్కర్ మెస్సేజ్‌ల ఆధారంగా డబ్బు హైదరాబాద్‌కు చేరినట్లు తెలిసింది. స్స్కిల్ స్కామ్‌లో మెన్స్ వారే నిధులు మళ్లింపు జరిగిందని నిర్థారించారు. చంద్రబాబు ఆదేశాల మేరకే ఆ విధంగా వ్యవహరించారు. అప్పటి చీఫ్ సెక్రటరీ తన లెటర్లో అప్పటి సీఎం రూ.270 కోట్లు విడుదల చేయమని చెప్పారని ఫైనాన్స్ సెక్రటరీకి లేఖ రాశారు. చంద్రబాబు పలు అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది. చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేస్తారు చట్టం ముందు అందరూ సమానులే. ఈ కేసు తీర్పు ద్వారా సమాజానికి ఒక మెసేజ్ వెళ్లాలి. అందుకే చంద్రబాబుకు బెయిల్ ఇవ్వకూడదు లూథ్రా వాదనలు ఎన్నికల ముందు కావాలనే అక్రమ కేసుల్లో చంద్రబాబును అరెస్ట్ చేశారు. బెయిల్పిటిషన్పై విచారణ చేసినప్పుడు.. కేసు మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ కేసులో 2018 నుంచి విచారణ జరిపి సాధించింది ఏంటి?. ఇప్పుడు మళ్లీ విచారణ ఎందుకు? సీఐడీ డీఐజీ, ఏఏజీలు ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి అసత్యాలు ప్రచారం చేశారు. ఇది అడ్వకేట్స్ ఎథిక్స్‌కు విరుద్ధం. పోలీస్ వ్యవస్థ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అధికారంలో ఉన్నవారికి తొత్తులుగా వ్యవహరించకూడదు. పొన్నవోలు, లూథ్రా తమ తమ వాదనలు ముగించడంతో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. -
ఈడబ్ల్యూఎస్ కోటాపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 కోటా కల్పిస్తూ చేసిన 103 రాజ్యాంగ సవరణ చట్టబద్దతపై దాఖలైన దాదాపు 40కిపైగా పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. దీనిపై తీర్పును రిజర్వ్‌లో ఉంచుతున్నట్లు సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం పేర్కొంది. 50 శాతం జనరల్ కోటాలో ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సీనియర్ లాయర్లు రవి వర్మ కుమార్, పి. విల్సన్ సహా పలువురు లాయర్లు కోర్టులో వాదించారు. ఈడబ్ల్యూఎస్‌కు ఆర్థికపరిస్థితినే గీటురాయిగా తీసుకోకూడదని తమిళనాడు తరఫున హాజరైన సీనియర్ లాయర్ శేఖర్ నఫరే వాదించారు. వీటిని అటార్నీ జనరల్ వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తోసిపుచ్చారు. -
ఎస్ఈసీ ఆదేశాలపై తీర్పును రిజర్వ్‌లో ఉంచిన హైకోర్టు
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లో వలంటీర్లు జోక్యం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ పూర్తయింది. తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వులో ఉంచింది. కాగా, వలంటీర్ల సెల్ఫోన్లు స్వాధీనం చేసుకోవాలన్న ఎస్ఈసీ ఆదేశాలు ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా, పంచాయతీరాజ్ చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని.. అందుకు వాటిని రద్దు చేయాలని సవాలు చేస్తూ గ్రామ వలంటీర్, వార్డు వలంటీర్, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. అజయ్‌జైన్ సోమవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
టాటా–మిస్త్రీ వివాదం సుప్రీం తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ : టాటా గ్రూప్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ తొలగింపునకు సంబంధించి దాఖలైన క్రాస్ అప్పీల్స్‌పై తీర్పును సుప్రీంకోర్టు గురువారం రిజర్వ్ చేసుకుంది. రెండు గ్రూపులూ తమ వాదనలను రాతపూర్వకంగా సమర్పించాలనీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. టాటా గ్రూప్ చీఫ్‌గా మిస్త్రీ తొలగింపు, నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) పునఃనియామకం ఉత్తర్వులు, ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన క్రాస్ అప్పీల్స్ గురువారం చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే. ఎస్. బోపన్న, వి.రామసుబ్రమణ్యన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. కేసు పూర్వాపరాలు ఇవీ... 2012లో టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా వారసునిగా సైరస్ మిస్త్రీ బాధ్యతలు చేపట్టారు. 2017 మార్చిలో జరగాల్సిన పదవీకాలానికి ముందే 2016 అక్టోబర్ 24న గ్రూప్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని టాటా సన్స్ బోర్డ్ అర్ధాంతరంగా తొలగించింది. ఈ చర్య మిస్త్రీలు–టాటాల మధ్య న్యాయపోరాటానికి దారితీసింది. తనను తొలగించడంపై ఎన్సీఎల్ఏటీని సైరస్ మిస్త్రీ ఆశ్రయించారు. ఈ కేసులో సైరస్ను తిరిగి నియమిస్తూ, 2019 డిసెంబర్ 18న ఎన్సీఎల్ఏటీ ఆదేశాలు ఇచ్చింది. అయితే 100 బిలియన్ డాలర్ల విలువైన (దాదాపు రూ.7,50,000 కోట్లు) గ్రూప్ పాలనా అంశాలకు సంబంధించి తగిన ఆదేశాలు రాలేదని, ట్రిబ్యునల్ ఆదేశాల్లో వైరుధ్యాలు ఉన్నాయని పేర్కొంటూ మిస్త్రీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు సైరస్ మిస్త్రీ పునఃనియామకాన్ని సవాలుచేస్తూ, టాటా సన్స్ కూడా అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లింది. తద్వారా రెండు గ్రూప్‌లూ వివాదంపై క్రాస్ అప్పీల్స్ దాఖలు చేసినట్లయ్యింది. డిసెంబర్ 18న ఎన్సీఎల్ఏటీ జారీ చేసిన పునఃనియామక ఉత్తర్వులపై జనవరి 10వ తేదీన సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఎస్పీఎల్)లో తమకున్న షేర్లను తనఖా పెట్టడంకానీ లేదా బదలాయించడంగానీ చేయరాదని కూడా ఎస్పీ గ్రూప్, సైరస్ మిస్త్రీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. చైర్మన్‌గా మిస్త్రీని తొలగింపు విషయంలో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, అలాగే కంపెనీ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినట్లు షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ ఆరోపిస్తోంది. అయితే టాటా గ్రూప్ ఈ ఆరోపణలను ఖండిస్తోంది. వాటా విలువలపైనా వివాదం టాటా సన్స్‌లో షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ వాటా 18.37 శాతం విలువ ప్రస్తుతం రెండు గ్రూప్‌ల మధ్య తాజా న్యాయపోరాటానికి వేదికగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాటా సన్స్‌లో షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ వాటా విలువ రూ.70,000 కోట్లు–రూ.80,000 కోట్ల మధ్య ఉంటుందని డిసెంబర్ 8వ తేదీన సుప్రీంకోర్టుకు టాటా గ్రూప్ తెలిపింది. టాటా గ్రూప్‌తో ఏడు దశాబ్దాల సుదీర్ఘ సంబంధాలకు ముగింపు పలకడానికి సంబంధించిన ఒక ప్రణాళికను అత్యున్నత న్యాయస్థానం– సుప్రీంకోర్టుకు షాపూర్జీ పలోంజీ (ఎస్పీ) గ్రూప్ అప్పటికే సమర్పించింది. టాటా గ్రూప్‌లో మిస్త్రీల వాటా విలువ రూ.1.75 లక్షల కోట్లు అని న్యాయస్థానానికి తెలిపినట్లు అక్టోబర్ 29న సంబంధిత వర్గాలు తెలిపాయి. -
టెలికం బాకీలు... రిజర్వ్‌లో సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: టెలికం సంస్థలు కట్టాల్సిన ఏజీఆర్ బాకీలపై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఆర్‌కామ్ తదితర సంస్థల నుంచి స్పెక్ట్రం తీసుకున్నందుకు గాను రిలయన్స్ జియో, ఎయిర్టెల్ కూడా అదనంగా బాకీలు కట్టాల్సి ఉంటుందా అన్న దానిపై కూడా స్పష్టతనివ్వనున్నట్లు అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) ఫార్ములా ప్రకారం టెలికం సంస్థలు కట్టాల్సిన స్పెక్ట్రం యూసేజీ చార్జీలు, లైసెన్సు ఫీజు బాకీలకు సంబంధించిన కేసుపై సోమవారం కూడా విచారణ కొనసాగింది. ఒకవేళ స్పెక్ట్రం విక్రేత గానీ బాకీలు కట్టకుండా అమ్మేసిన పక్షంలో ఆ బకాయీలన్నీ కొనుగోలు సంస్థకు బదిలీ అవుతాయని సుప్రీం కోర్టు పేర్కొంది. ఒకవేళ టెల్కోలు గానీ బాకీలు కట్టేందుకు సిద్ధంగా లేకపోతే స్పెక్ట్రం కేటాయింపును పూర్తిగా రద్దు చేయాలని ఆదేశిస్తామని స్పష్టం చేసింది. అయితే, స్పెక్ట్రం రద్దు చేసిన పక్షంలో ప్రభుత్వానికి గానీ బ్యాంకులకు గానీ దక్కేది ఏమీ ఉండదని జియో తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే తెలిపారు. విక్రేత, కొనుగోలుదారు నుంచి విడివిడిగా లేదా సంయుక్తంగా బాకీలను తాము వసూలు చేసుకోవచ్చని టెలికం శాఖ (డాట్) వెల్లడించింది. ఈ వాదనల దరిమిలా దివాలా చర్యలు ఎదుర్కొంటున్న టెలికం సంస్థలు.. స్పెక్ట్రంను విక్రయించవచ్చా అన్న అంశంతో పాటు వాటి నుంచి ప్రభుత్వం ఏజీఆర్‌పరమైన బాకీలను ఎలా రాబట్టాలి అన్న దానిపైన సుప్రీం కోర్టు ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచింది. ఏజీఆర్ బకాయిల విషయంలో సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయింపునకు విజ్ఞప్తి మరోవైపు, ఏజీఆర్ బకాయిలపై సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ టెలికం ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ కేంద్రాన్ని కోరింది. అదనంగా లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలను కట్టాల్సి రానుండటంతో దీనికి సర్వీస్ ట్యాక్స్ కూడా తోడైతే మరింత భారం అవుతుందని జూలై 17న కేంద్ర టెలికం శాఖకు రాసిన లేఖలో సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 2016 – మార్చి 2017 మధ్యకాలంలో సర్వీస్ ట్యాక్స్ బాకీల కింద టెలికం సంస్థలు రూ. 6,600 కోట్లు కట్టినట్లు తెలిపారు. -
ఎమ్మెల్సీల అనర్హతపై తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్ : ముగ్గురు ఎమ్మెల్సీలను అనర్హులుగా ప్రకటిస్తూ తెలంగాణ శాసనమండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రకటించాలని కోరుతూ వేర్వేరుగా దాఖలైన మూడు పిటిషన్లపై గురువారం వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల నుంచి లిఖితపూర్వక వాదనలు స్వీకరించిన హైకోర్టు.. తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కె.యాదవరెడ్డి, ఎస్.రాములు నాయక్, ఆర్.భూపతిరెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారనే ఫిర్యాదుపై శాసనమండలి చైర్మన్ ఆ ముగ్గురినీ ఎమ్మెల్సీలుగా అనర్హులని ప్రకటించారు. అయితే.. రాజ్యాంగ, చట్ట నిబంధనలకు విరుద్ధంగా చైర్మన్ వ్యవహరించారంటూ ఆ ముగ్గురూ వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. పదో షెడ్యూల్ 8వ పేరాను సమీక్షించాలి : భూపతిరెడ్డి భూపతిరెడ్డి తరఫు న్యాయవాది ఆనంద్ కపూర్ వాదనలు వినిపిస్తూ.. 10వ షెడ్యూల్లోని 8వ పేరా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు. 10వ షెడ్యూల్ కింద అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్లకు ఏకపక్ష అధికారాలు ఉన్నాయని, దీంతో వారు ఇష్టం వచ్చిన రీతిలో నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగానే పిటిషనర్‌ను మండలి చైర్మన్ అనర్హుడిగా ప్రకటించారని, ఈ చర్యను రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రకటించాలని కోరారు. ట్రిబ్యునల్ హోదాలో మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయం చెల్లదని, ఆయన రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని వాదించారు. అనర్హత వేటు చట్ట వ్యతిరేకం : యాదవరెడ్డి యాదవరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ కాంగ్రెస్ పార్టీలో చేరారనేందుకు నిర్ధిష్టమైన ఆధారాలు లేవన్నారు. ఈ విషయాన్ని పట్టించుకోకుండానే మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారని, మేడ్చల్ సభలో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీని కలిసినందుకే అనర్హత వేటు వేశారని తెలిపారు. తెలంగాణ ఇచ్చి నందుకు కృతజ్ఞతలు చెప్పడానికే సోనియా, రాహుల్‌లను పిటిషనర్ కలిశారని వివరించారు. పార్టీ ఫిరాయించినట్టుగా ఆధారాలు చూపడంలేదని, పత్రికల్లో వచ్చిన ఫొటోలనే ఆధారాలుగా భావించడం చెల్లదన్నారు. ఫిరాయింపు వేరు ఒక జాతీయ నేతను కలవడం వేరు అని, ఈ తేడాను మండలి చైర్మన్ గుర్తించకుండానే రాజ్యాంగ విరుద్ధంగా అనర్హత వేటు వేశారని, ఇది చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు. నామినేటెడ్ ఎమ్మెల్సీకి పార్టీతో పనిలేదు : రాములు నాయక్ రాములు నాయక్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ వాదిస్తూ.. సామాజిక సేవకు గుర్తింపుగా పిటిషనర్‌ను గవర్నర్ తన కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేశారని నివేదించారు. దీనికి పార్టీలతో సంబంధం లేదని పేర్కొన్నారు. ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీలను కలిస్తేనే పార్టీ ఫిరాయించారనే అభియోగంతో వేటు వేశారన్నారు. నామినేట్ చేసిన పత్రాల్లో ఏ పార్టీకి చెందని వ్యక్తి అని ఉందని.. ఆ పత్రాలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద కోరితే ఇవ్వలేదని వివరించారు. నాలుగు వారాల సమయం ఇస్తే తనపై ఆరోపణలు అవాస్తవమని నిరూపిస్తామని చెప్పినా మండలి చైర్మన్ ఖాతరు చేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని కోర్టుకు చెప్పారు. బహిరంగసభలో పార్టీ ఫిరాయించారు : అదనపు ఏజీ మండలి చైర్మన్ తరఫున అదనపు ఏజీ జె.రామచంద్రరావు వాదిస్తూ.. పిటిషనర్లు బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుని పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. టీఆర్ఎస్కు చెందిన ముగ్గురూ ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని చెప్పారు. మేడ్చల్‌లో కాంగ్రెస్ నిర్వహించిన సభలో ఇద్దరు టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని.. ఓ నేత ఢిల్లీ వెళ్లి సోనియా, రాహుల్‌గాంధీలను కలిసినట్లు పత్రిక, టీవీల్లో వార్తలు వచ్చాయని, వాటిని పిటిషనర్లు ఖండించలేదని తెలిపారు. ఒక పార్టీ తరఫు ఎమ్మెల్సీగా ఉంటూ మరో పార్టీకి కొమ్ముకాయడం క్యారెక్టర్‌కు సంబంధించిన వ్యవహారమన్నారు. ఆ క్యారెక్టర్ కోల్పోయిన నేపథ్యంలో చర్యలు తీసుకోవచ్చునని సుప్రీంకోర్టు సైతం చెప్పిందని, అందువల్ల వారిని అనర్హులుగా ప్రకటించడం రాజ్యాంగబద్ధమేనని స్పష్టంచేశారు. రాములు నాయక్‌కు ఎప్పటి నుంచో పార్టీ సభ్యత్వం ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసిన ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తరఫున న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఉండి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుని ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి కోసం పనిచేశారని వివరించారు. రాములు నాయక్‌కు పార్టీ సభ్యత్వం ఉండగానే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారని, మండలి చైర్మన్ ఎదుట వాదనల్లో పార్టీ సభ్యత్వం ఉందని కూడా నాయక్ అంగీకరించారన్నారు. నామి నేట్ అయిన ఆరు నెలల్లోగా ఏదో ఒక పార్టీలో చేరితో ఫిరాయింపు అవ్వదని, ఎప్పటి నుంచో రాములు నాయక్‌కు టీఆర్ఎస్ పార్టీ సభ్య త్వం ఉందని తెలిపారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే అనర్హత వేటు వేయవచ్చునని సుప్రీంకోర్టు తీర్పులు కూడా వెలువరించిందని నివేదించారు. కాగా, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ 8వ పేరాకు రాజ్యాంగబద్ధత ఉందని కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఎన్.హరినాథ్‌రెడ్డి స్పష్టంచేశారు. ధర్మాసనం లేవనెత్తిన సందేహాలివీ.. ‘‘ప్రత్యేకాధికారాలున్న రాష్ట్రపతి సైతం అనేక నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని కూడా తప్పుపట్టవచ్చా? పత్రికల్లో వార్తలు వచ్చాయని చెబుతున్నారు. ఇవన్నీ నిజమే కావచ్చు. కానీ కోర్టుకు సాక్ష్యాలు ముఖ్యం. నిజానికి కూడా సాక్ష్యం కావాలి. ఆరోపణలకు వాస్తవిక ఆధారాలు ఉండాలి. సేవా రంగంలోని వ్యక్తిని గుర్తించి గవర్నర్ ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే దానికి పార్టీ ఫిరాయింపు ఎలా వర్తిస్తుంది. క్రాస్ ఎగ్జామ్ చేసేందుకు ఇరు పక్షాలకు అవకాశం ఇచ్చారా’’అని విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. మండలి చైర్మన్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ క్వాసీ జ్యుడీషియల్ సంస్థ కాదని, ఆ ట్రిబ్యునల్‌కు సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌లు వర్తించకపోయినా సహజ న్యాయసూత్రాలకు కట్టుబడి ఉండాలని స్పష్టంచేసింది. మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన రికార్డులు, వీడియోలు ఇవ్వాలని ఆదేశించింది. -
రఫేల్‌పై సుప్రీం తీర్పు రిజర్వు
న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందానికి సంబంధించిన సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రానికి పలు ప్రశ్నలు వేసింది. ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఈ ఒప్పందంలో సార్వభౌమ గ్యారంటీని ఎందుకు మాఫీ చేశారనీ, సాంకేతికతను ఎందుకు బదిలీ చేసుకోవడం లేదని కోర్టు ప్రశ్నించింది. గతేడాది డిసెంబర్ 14న సుప్రీంకోర్టు రఫేల్ విషయంలో కేంద్రానికి క్లీన్చిట్ ఇస్తూ తీర్పు చెప్పడం తెలిసిందే. ఆ తీర్పును పునఃసమీక్షించాలంటూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, సామాజిక కార్యకర్త, లాయర్ ప్రశాంత్ భూషణ్, ఆప్ శాసనసభ్యుడు సంజయ్ సింగ్, లాయర్ వినీత్ రివ్యూ పిటిషన్లు వేయడం తెలిసిందే. ఈ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నిస్తూ సాంకేతికత బదిలీ అంశం ఒప్పందంలో ఎందుకు లేదో చెప్పాలంది. దీనికి కేంద్రం తరఫున అటార్నీ జనరల్ (ఏజీ) కేకే వేణుగోపాల్ వాదిస్తూ అలాంటి సాంకేతిక అంశాలను కోర్టు విచారించకూడదన్నారు. సార్వభౌమ గ్యారంటీని మాఫీ చేసి కేవలం లెటర్ ఆఫ్ కంఫర్ట్‌ను తీసుకోవడాన్ని ప్రశ్నించగా, ఇదేమీ కొత్తగా జరిగింది కాదనీ, రష్యా, అమెరికాలతో ఒప్పందాల్లోనూ ప్రభుత్వం ఇలాగే చేసిందని తెలిపారు. ఇంకా వేణుగోపాల్ మాట్లాడుతూ ‘ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం. ప్రపంచంలోని ఇతర ఏ కోర్టు కూడా ఇలాంటి వాదనలపై రక్షణ ఒప్పందాలపై విచారణ జరపదు’ అని అన్నారు. డిసెంబర్ 14 నాటి తీర్పును పునఃసమీక్షించాలా? వద్దా? అన్న విషయంపై తీర్పును కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. రాహుల్ కేసుపై తీర్పు సైతం రిజర్వ్‌లోనే.. రఫేల్ కేసు విషయంలో ‘కాపలాదారుడే (మోదీ) దొంగ’ అన్న వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు ఆపాదించినందుకు తాను ఇప్పటికే బేషరతుగా క్షమాపణ చెప్పినందున తనపై క్రిమినల్ ధిక్కార చర్యలను ఆపేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును కోరారు. బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి గతంలో సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేశారు. దీనిపై తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం రిజర్వ్‌లో ఉంచింది. రాహుల్ తరఫున ఏఎం సింఘ్వీ వాదిస్తూ రాహుల్ ఇప్పటికే బేషరతు క్షమాపణ చెప్పి, తన చింతన కూడా వ్యక్తపరిచారని కోర్టుకు తెలిపారు. మీనాక్షి తరఫున ముకుల్ రోహత్గీ వాదిస్తూ ఆ క్షమాపణను తిరస్కరించాలనీ, రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు క్షమాపణ చెప్పేలా రాహుల్‌ను కోర్టు ఆదేశించాలని కోరారు. దీనిపై తీర్పును కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. -
జయ అక్రమాస్తుల కేసులో తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే చీఫ్ జయలలితపై అక్రమాస్తుల కేసును విచారించిన సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఈ కేసులో కర్ణాటక హైకోర్టు జయలలితను నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 18 ఏళ్లు సాగిన అక్రమాస్తుల కేసులో జయలలితను దోషిగా తేలుస్తూ గతేడాది ప్రత్యేక కోర్టు ఆమెకు నాలుగేళ్ల జైలుశిక్ష, వంద కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. దాంతో ఆమె పరప్పన అగ్రహార జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తర్వాత ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తర్వాత కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా..జయకు ఊరట లభించింది. దీంతో ఆమె మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు.