రఫేల్‌పై సుప్రీం తీర్పు రిజర్వు | SC Reserves Order on Review of No Probe Verdict in Rafale Case | Sakshi
Sakshi News home page

రఫేల్‌పై సుప్రీం తీర్పు రిజర్వు

Published Sat, May 11 2019 4:00 AM | Last Updated on Sat, May 11 2019 4:00 AM

SC Reserves Order on Review of  No Probe Verdict in Rafale Case - Sakshi

న్యూఢిల్లీ: రఫేల్‌ ఒప్పందానికి సంబంధించిన సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రానికి పలు ప్రశ్నలు వేసింది. ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఈ ఒప్పందంలో సార్వభౌమ గ్యారంటీని ఎందుకు మాఫీ చేశారనీ, సాంకేతికతను ఎందుకు బదిలీ చేసుకోవడం లేదని కోర్టు ప్రశ్నించింది. గతేడాది డిసెంబర్‌ 14న సుప్రీంకోర్టు రఫేల్‌ విషయంలో కేంద్రానికి క్లీన్‌చిట్‌ ఇస్తూ తీర్పు చెప్పడం తెలిసిందే. ఆ తీర్పును పునఃసమీక్షించాలంటూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌ శౌరీ, సామాజిక కార్యకర్త, లాయర్‌ ప్రశాంత్‌ భూషణ్, ఆప్‌ శాసనసభ్యుడు సంజయ్‌ సింగ్, లాయర్‌ వినీత్‌ రివ్యూ పిటిషన్లు వేయడం తెలిసిందే. ఈ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నిస్తూ సాంకేతికత బదిలీ అంశం ఒప్పందంలో ఎందుకు లేదో చెప్పాలంది. దీనికి కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ (ఏజీ) కేకే వేణుగోపాల్‌ వాదిస్తూ అలాంటి సాంకేతిక అంశాలను కోర్టు విచారించకూడదన్నారు. సార్వభౌమ గ్యారంటీని మాఫీ చేసి కేవలం లెటర్‌ ఆఫ్‌ కంఫర్ట్‌ను తీసుకోవడాన్ని ప్రశ్నించగా, ఇదేమీ కొత్తగా జరిగింది కాదనీ, రష్యా, అమెరికాలతో ఒప్పందాల్లోనూ ప్రభుత్వం ఇలాగే చేసిందని తెలిపారు. ఇంకా వేణుగోపాల్‌ మాట్లాడుతూ ‘ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం. ప్రపంచంలోని ఇతర ఏ కోర్టు కూడా ఇలాంటి వాదనలపై రక్షణ ఒప్పందాలపై విచారణ జరపదు’ అని అన్నారు. డిసెంబర్‌ 14 నాటి తీర్పును పునఃసమీక్షించాలా? వద్దా? అన్న విషయంపై తీర్పును కోర్టు రిజర్వ్‌లో ఉంచింది.

రాహుల్‌ కేసుపై తీర్పు సైతం రిజర్వ్‌లోనే..
రఫేల్‌ కేసు విషయంలో ‘కాపలాదారుడే (మోదీ) దొంగ’ అన్న వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు ఆపాదించినందుకు తాను ఇప్పటికే బేషరతుగా క్షమాపణ చెప్పినందున తనపై క్రిమినల్‌ ధిక్కార చర్యలను ఆపేయాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సుప్రీంకోర్టును కోరారు. బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి గతంలో సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ వేశారు. దీనిపై తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం రిజర్వ్‌లో ఉంచింది. రాహుల్‌ తరఫున ఏఎం సింఘ్వీ వాదిస్తూ రాహుల్‌ ఇప్పటికే బేషరతు క్షమాపణ చెప్పి, తన చింతన కూడా వ్యక్తపరిచారని కోర్టుకు తెలిపారు. మీనాక్షి తరఫున ముకుల్‌ రోహత్గీ వాదిస్తూ ఆ క్షమాపణను తిరస్కరించాలనీ, రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు క్షమాపణ చెప్పేలా రాహుల్‌ను కోర్టు ఆదేశించాలని కోరారు. దీనిపై తీర్పును కోర్టు రిజర్వ్‌లో ఉంచింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement