ఉమ్మడి జిల్లాపై ‘జైపాల్‌’ చెరగని ముద్ర  | Senior Congress Leader Jaipal Reddy Died In Hyderabad | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లాపై ‘జైపాల్‌’ చెరగని ముద్ర 

Published Mon, Jul 29 2019 7:25 AM | Last Updated on Mon, Jul 29 2019 7:26 AM

Senior Congress Leader Jaipal Reddy Died In Hyderabad - Sakshi

సాక్షి, మిర్యాలగూడ : ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు గ్రహీత,  కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు సూదిని జైపాల్‌రెడ్డితో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఎనలేని అనుబంధం ఉంది. ఆయన మృతిని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. రెండు పర్యాయాలు పార్లమెంట్‌ సభ్యుడిగా జిల్లా నుంచి ఎన్నికై పదేళ్ల పాటు జిల్లా అభివృద్ధికి తనవంతుగా కృషి చేశారు. 1999లో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన తర్వాత వెంటనే మిర్యాలగూడ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

2004లో మరోసారి మిర్యాలగూడ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. యూపీఏ– 1లో జైపాల్‌రెడ్డి తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సమయంలోనే దేశంలోని కీలకమైన మంత్రి పదవులు చేపట్టారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, సమాచార, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్‌ ఎర్త్‌ సైన్స్‌ మంత్రిగా పని చేశారు. ఆయన స్వస్థలం మహబూబ్‌నగర్‌ జిల్లా అయినప్పటికీ నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నేతలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులతోనూ ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు. 

జైపాల్‌రెడ్డి హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు
సూదిని జైపాల్‌రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేసిన సమయంలో మిర్యాలగూడ, నల్లగొండ మున్సిపాలిటీలకు భూగర్భ డ్రెయినేజీ, సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేశారు. అదే విధంగా అద్దంకి–నార్కట్‌పల్లి రహదారి విస్తరణకు కృషి చేశారు. విష్ణుపురం–జగ్గయ్యపేట రైల్వే లైన్‌ ఏర్పాటుకు కృషి చేశారు. మిర్యాలగూడ, నల్లగొండ మున్సిపాలిటీల్లో నాళాల ఆధునికీకరణ పనులకు నిధులు విడుదల చేశారు. 65వ జాతీయ రహదారి నాలుగు లేన్ల రోడ్డు విస్తరణకు కృషి చేశారు. 

మిర్యాలగూడకు చివరి ఎంపీ..
మిర్యాలగూడ పార్లమెంట్‌ నియోజకవర్గానికి జైపాల్‌రెడ్డి చివరి ఎంపీగా పని చేశారు. మిర్యాలగూడ పార్లమెంట్‌ 1962లో ఏర్పడగా 1999, 2004లో  జైపాల్‌రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. కాగా 2008లో పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మిర్యాలగూడ స్థానాన్ని తొలగించారు. దాంతో మిర్యాలగూడకు ఆయన చివరి ఎంపీగా పని చేసిన వారుగా మిగిలిపోయారు.

మంత్రి జగదీశ్‌రెడ్డి సంతాపం
తాళ్లగడ్డ ( సూర్యాపేట ) : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత సూదిని జైపాల్‌రెడ్డి మృతికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో జైపాల్‌రెడ్డికి ఉన్న అనుబంధాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

జైపాల్‌రెడ్డి ఓనమాలు నేర్చుకున్న ప్రభుత్వ పాఠశాల
చండూరు : సూదిని జైపాల్‌రెడ్డికి చండూరు మండలంలోని నెర్మటతో విడదీయరాని అనుబంధం ఉంది. గ్రామానికి చెం దిన బాణాల క్రిష్ణారెడ్డి, వెంకనర్సమ్మల మనుమడు సూదిన జైపాల్‌రెడ్డి. 1942 జనవరి 16న  నెర్మటలోని అమ్మమ్మ ఇంట్లో జైపాల్‌రెడ్డి జన్మించాడు. నాలుగేళ్లు నిండిన తర్వాత స్థానిక ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాడు. అక్షరాలు నేర్చుకునే స మయంలో తండ్రి దుర్గారెడ్డి దేవరకొండ పాఠశాలలో చేర్పిం చినట్లు   జైపాల్‌రెడ్డి బావమర్ది బాణాల నర్సిరెడ్డి చెప్పారు. జైపాల్‌రెడ్డి తండ్రి దుర్గారెడ్డి చాలా ఏళ్లు నెర్మటలో రైతులకు వర్తకాలు పెట్టేవాడని గ్రామస్తులు చెబుతున్నారు.

జైపాల్‌రెడ్డి మృతి తీరని లోటు -గుత్తా సుఖేందర్‌రెడ్డి
కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి మృతి వ్యక్తిగతంగా, రాజకీయంగా తీరని లోటని  రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. జైపాల్‌రెడ్డి మృతిపట్ల ఆదివారం ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. చురుకైన ఆలోచన, మంచి వాగ్ధాటిగా పేరు తెచ్చుకొన్ని గొప్ప వ్యక్తి జైపాల్‌రెడ్డి అని కొనియాడారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌ గా ఎంపికయ్యారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జైపాల్‌రెడ్డి చేసిన కృషి మరువులేనిదన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా రాష్ట్రానికి, దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఎంతో మంది నాయకులకు జైపాల్‌రెడ్డి ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు. జైపాల్‌రెడ్డితో తనకు ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. అయన మృతి తీరనిలోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement