jagadeeswarreddy
-
పవర్ పక్కా లోకల్
సాక్షి, హైదరాబాద్ : కొత్త పంచాయతీరాజ్ చట్టం వెలుగులో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని, గ్రామ పంచాయతీ నుంచి జిల్లా పరిషత్‌ల వరకు ఎవరు ఏ విధులు నిర్వర్తించాలనే విషయంలో పూర్తి స్పష్టత ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు ఇప్పటి మాదిరిగా ఉత్సవ విగ్రహాలుగా ఉండబోవని, అధికార వికేంద్రీకరణ ద్వారా వారికి విధులు, నిధులు, బాధ్యతలు, అధికారాలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. గ్రామాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలవడానికి ముందే స్థానిక సంస్థలకు అప్పగించే విధులు, నిధులు, బాధ్యతల విషయంలో స్పష్టత ఇస్తామని వెల్లడించారు. గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంచే కార్యక్రమాన్ని పర్యవేక్షించడం కోసం కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి గ్రీన్ కమిటీని నియమిస్తున్నట్లు చెప్పారు. పంచాయతీరాజ్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ‘‘గ్రామాలు బాగుపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. పట్టుబట్టి పనిచేస్తే గ్రామాల్లో తప్పక మార్పు వస్తుందనే నమ్మకం నాకుంది. పల్లెల రూపురేఖలు మార్చడం కోసం ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చింది. ప్రజాప్రతినిధులు, అధికారుల బాధ్యతలు స్పష్టంగా నిర్వచించాం. ఇప్పుడు ప్రభుత్వం స్థానిక సంస్థలకు అధికారాలను బదిలీ చేయాలని నిర్ణయించింది. సహాయ మంత్రి హోదాగల జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూడా ప్రస్తుతం ఏ పనీ లేకుండా ఉండటం సమంజసం కాదు. ప్రజల ద్వారా ఎన్నికైన ఎంపీపీలు, జెడ్పీటీసీలదీ ఇదే కథ. భవిష్యత్తులో ఇలా జరగడానికి వీల్లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు పాలనలో పూర్తిగా భాగస్వాములు కావాలి. విద్య, వైద్యం, పచ్చదనం, పారిశుద్ధ్యం.. ఇలా ఏ విషయంలో ఎవరి పాత్ర ఎంత అనేది నిర్ధారిస్తాం. గ్రామ పంచాయతీలు ఏం చేయాలి? మండల పరిషత్‌లు ఏం చేయాలి? జిల్లా పరిషత్‌లు ఏం చేయాలి? అనే విషయాలపై పూర్తి స్పష్టత ఇస్తాం. త్వరలోనే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు కూడా వస్తాయి. దానికి సమానంగా రాష్ట్ర వాటా కేటాయిస్తాం. ఆ నిధులను స్థానిక సంస్థలకు విడుదల చేస్తాం. విధులను స్పష్టంగా పేర్కొన్న తర్వాత, నిధులు విడుదల చేశాకే గ్రామాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభిస్తాం’’అని సీఎం కేసీఆర్ చెప్పారు. విస్తృత చర్చలు, అధ్యయనం తర్వాత తుది రూపం.. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు ఏ విధులు నిర్వర్తించాలి? ఏయే అంశాల్లో వారి బాధ్యతలు ఎంతవరకుంటాయి? ఎలాంటి అధికారాలుంటాయి? తదితర విషయాలపై సమగ్ర చర్చ, పూర్తి స్థాయి అధ్యయనం జరపాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పంచాయతీరాజ్ విభాగంలో పని చేసిన అనుభవంగల నాయకులు, అధికారులు, నిపుణులతో విస్తృతంగా చర్చించి ముసాయిదా రూపొందించాలని సూచించారు. ముసా యిదాపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో చర్చిస్తామని, తర్వాత మంత్రివర్గ ఆమోదం అనంతరం అసెంబ్లీలోనూ విస్తృతంగా చర్చిస్తామని వెల్లడించారు. ఆయా సందర్భాల్లో వచ్చిన సూచనలు, సలహాలను కూడా పరిగణనలోకి తీసు కొని ప్రభుత్వం విధులు, నిధులు, బాధ్యతలు, అధికారాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తై మున్సిపల్ ఎన్నికలు కూడా ముగిశాక గ్రామాల్లో, పట్టణాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తామని చెప్పారు. ఖాళీలన్నీ భర్తీ చేయాలి... పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లా పరిషత్ సీఈవో వరకు అన్ని ఖాళీలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈవోపీఆర్డీ పోస్టులను ఇకపై మండల పంచాయతీ అధికారులుగా పరిగణిస్తామని చెప్పారు. గ్రామ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, డిప్యూటీ సీఈవోలు, డీపీఓలు, సీఈవోలు.. ఇలా అన్ని విభాగాల్లో అవసరమైన వారికి పదోన్నతులు కల్పిస్తూ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శుల ఎంపికకు నేరుగా నియామకాలు జరపాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ ఎస్.కె.జోషి, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, సీఎంవో కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్‌రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, ఎంపీ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు మర్రి జనార్థన్‌రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, తేరా చిన్నపురెడ్డి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, గట్టు రామచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. అధికారాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తై మున్సిపల్ ఎన్నికలు కూడా ముగిశాక గ్రామాల్లో, పట్టణాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తామని చెప్పారు. -
ఉమ్మడి జిల్లాపై ‘జైపాల్’ చెరగని ముద్ర
సాక్షి, మిర్యాలగూడ : ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సూదిని జైపాల్‌రెడ్డితో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఎనలేని అనుబంధం ఉంది. ఆయన మృతిని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. రెండు పర్యాయాలు పార్లమెంట్ సభ్యుడిగా జిల్లా నుంచి ఎన్నికై పదేళ్ల పాటు జిల్లా అభివృద్ధికి తనవంతుగా కృషి చేశారు. 1999లో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వెంటనే మిర్యాలగూడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2004లో మరోసారి మిర్యాలగూడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. యూపీఏ– 1లో జైపాల్‌రెడ్డి తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సమయంలోనే దేశంలోని కీలకమైన మంత్రి పదవులు చేపట్టారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, సమాచార, సైన్స్ అండ్ టెక్నాలజీ, పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ మంత్రిగా పని చేశారు. ఆయన స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా అయినప్పటికీ నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులతోనూ ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు. జైపాల్‌రెడ్డి హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు సూదిని జైపాల్‌రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేసిన సమయంలో మిర్యాలగూడ, నల్లగొండ మున్సిపాలిటీలకు భూగర్భ డ్రెయినేజీ, సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేశారు. అదే విధంగా అద్దంకి–నార్కట్‌పల్లి రహదారి విస్తరణకు కృషి చేశారు. విష్ణుపురం–జగ్గయ్యపేట రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి చేశారు. మిర్యాలగూడ, నల్లగొండ మున్సిపాలిటీల్లో నాళాల ఆధునికీకరణ పనులకు నిధులు విడుదల చేశారు. 65వ జాతీయ రహదారి నాలుగు లేన్ల రోడ్డు విస్తరణకు కృషి చేశారు. మిర్యాలగూడకు చివరి ఎంపీ.. మిర్యాలగూడ పార్లమెంట్ నియోజకవర్గానికి జైపాల్‌రెడ్డి చివరి ఎంపీగా పని చేశారు. మిర్యాలగూడ పార్లమెంట్ 1962లో ఏర్పడగా 1999, 2004లో జైపాల్‌రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. కాగా 2008లో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మిర్యాలగూడ స్థానాన్ని తొలగించారు. దాంతో మిర్యాలగూడకు ఆయన చివరి ఎంపీగా పని చేసిన వారుగా మిగిలిపోయారు. మంత్రి జగదీశ్‌రెడ్డి సంతాపం తాళ్లగడ్డ ( సూర్యాపేట ) : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సూదిని జైపాల్‌రెడ్డి మృతికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో జైపాల్‌రెడ్డికి ఉన్న అనుబంధాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జైపాల్‌రెడ్డి ఓనమాలు నేర్చుకున్న ప్రభుత్వ పాఠశాల చండూరు : సూదిని జైపాల్‌రెడ్డికి చండూరు మండలంలోని నెర్మటతో విడదీయరాని అనుబంధం ఉంది. గ్రామానికి చెం దిన బాణాల క్రిష్ణారెడ్డి, వెంకనర్సమ్మల మనుమడు సూదిన జైపాల్‌రెడ్డి. 1942 జనవరి 16న నెర్మటలోని అమ్మమ్మ ఇంట్లో జైపాల్‌రెడ్డి జన్మించాడు. నాలుగేళ్లు నిండిన తర్వాత స్థానిక ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాడు. అక్షరాలు నేర్చుకునే స మయంలో తండ్రి దుర్గారెడ్డి దేవరకొండ పాఠశాలలో చేర్పిం చినట్లు జైపాల్‌రెడ్డి బావమర్ది బాణాల నర్సిరెడ్డి చెప్పారు. జైపాల్‌రెడ్డి తండ్రి దుర్గారెడ్డి చాలా ఏళ్లు నెర్మటలో రైతులకు వర్తకాలు పెట్టేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. జైపాల్‌రెడ్డి మృతి తీరని లోటు -గుత్తా సుఖేందర్‌రెడ్డి కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి మృతి వ్యక్తిగతంగా, రాజకీయంగా తీరని లోటని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. జైపాల్‌రెడ్డి మృతిపట్ల ఆదివారం ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. చురుకైన ఆలోచన, మంచి వాగ్ధాటిగా పేరు తెచ్చుకొన్ని గొప్ప వ్యక్తి జైపాల్‌రెడ్డి అని కొనియాడారు. ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఎంపికయ్యారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జైపాల్‌రెడ్డి చేసిన కృషి మరువులేనిదన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా రాష్ట్రానికి, దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఎంతో మంది నాయకులకు జైపాల్‌రెడ్డి ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు. జైపాల్‌రెడ్డితో తనకు ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. అయన మృతి తీరనిలోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
అమెరికాలో బంగారు బోనం
చార్మినార్: తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు అనుగుణంగా నగర భక్తులు అమెరికాలో తెలంగాణ బోనాల జాతర వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు. అమెరికా తెలంగాణ అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు అమెరికాలోని హస్టన్ నగరంలో జరిగిన ‘వరల్డ్ తెలంగాణ కన్వేన్షన్–2018’ కార్యక్రమంలో మహిళా భక్తులు అమ్మవారికి బంగారు పాత్రలో తెలంగాణ బోనాన్ని సమర్పించారు. భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అ«ధ్యక్షులు గాజుల అంజయ్య ఆధ్వర్యంలో భక్తులు అమెరికాలో అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్చర ణల నడుమ పూర్ణకుంభంతో ఆట ప్రతినిధులు బోనాలకు ఘనంగా స్వాగతం పలికారు. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి అమెరికాలో జరిగిన ఈ వేడుకల్లో ఎంపీ జితేందర్‌రెడ్డి, మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణలతో పాటు ఆట అ«ధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, ఆట కన్వీనర్ బంగారు రెడ్డి తదితరులు పాల్గొన్నారని కమిటీ అధ్యక్షులు గాజుల అంజయ్య తెలిపారు. నగరంలో ప్రత్యేకంగా తయారు చేయించిన బం గారు పాత్రకు మీరాలంమండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయంలో గత నెల 26న ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 27వ తేదీన తెల్లవారు జామున విమానంలో అమెరికా బయలుదేరి వెళ్లామన్నారు. -
సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో యాడికి విద్యార్థి ప్రతిభ
తాడిపత్రి టౌన్ : యాడికి మండలం బోగాలగట్ట గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి, చంద్రావతి పెద్ద కుమారుడు జగదీశ్వరరెడ్డి సివిల్స్-16 ఫలితాల్లో 249వ ర్యాంకు సాధించాడు. ఈయన ఒకటి నుంచి 5వ తరగతి వరకు బోగాలగట్ట గ్రామంలో చదివాడు. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు లేపాక్షిలోని నవోదయ కళాశాలలో చదవి ఉత్తమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించాడు. తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదివాడు. అనంతరం ఎంబీఏ పూర్తి చేశాడు. హైదరాబాదు, ఢిల్లీలోని ప్రైవేటు కళాశాలలో పార్ట్ టైం అధ్యాపకుడిగా పనిచేస్తూ సివిల్స్‌కు సిద్ధమయ్యాడు. ఈ సందర్భంగా జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ చిన్నతనం నుంచి సివిల్స్ సాధించాలన్న బలమైన కోరికతో కష్టపడి చదివానన్నాడు. అమ్మ,నాన్న, తమ్ముడు స్నేహితుల సహకారంతో సివిల్ సాధించాను. లక్ష్యాన్ని సాధించడంతో చాలా ఆనందంగా ఉంది. రైతు సంక్షేమం కోసం నా వంతు కృషి చేస్తానన్నాడు.