ఖమ్మం జడ్పీసెంటర్ : పోలవరం ముంపునకు గురవుతున్న గిరిజనుల సమస్యలపై ఉద్యమిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివాసీల ఆందోళనలకు మద్దతు తెలపాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. పోలవరం విషయంలో ప్రభుత్వపరంగా ఒక రకంగా, టీఆర్‌ఎస్‌గా మరో విధంగా వ్యవహరించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ఖమ్మంలోని మమత మెడికల్ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన టీయూడబ్ల్యూజే జిల్లా ప్రథమ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఎంత సత్యమో... ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలిసింది కూడా అంతే నిజమని, అయితే ప్రభుత్వ పరంగా చేయాల్సింది చేస్తామని చెప్పారు. పార్లమెంట్‌లో గిరిజన ప్రజా ప్రతినిధులందరినీ కలుపుకుని పోరాడుతామని, ఈ విషయంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు.
అన్యాయాన్ని ఎదిరించే సత్తా జర్నలిస్టులకే...
అన్యాయాన్ని ఎదిరించేందుకు ఎవరినైనా ప్రశ్నించే సత్తా జర్నలిస్టులకే ఉందని జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం టీజేఎఫ్ ఏర్పడిందని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం టీయూడబ్ల్యూజేగా అవతరించిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన ఉద్యమంలో జర్నలిస్టులు కీలకపాత్ర పోషించారని, రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా వారి భాగస్వామ్యం అవసరమని అన్నారు.
ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఉద్యమాన్ని నడిపించింది జర్నలిస్టులేనని, రాజకీయ పక్షాలు రాకపోవడం, ఇక్కడ టీఆర్‌ఎస్ బలంగా లేకపోవడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు అందిస్తామని, ప్రభుత్వ వైద్యశాలలను మెరుగుపరచడంతోపాటు జిల్లా కేంద్రంలో కార్పొరేట్ వైద్యశాలలను ఏర్పాటు చేసి ఉచిత వైద్యం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మంలో పాత్రికేయులకు ఇచ్చిన ఇళ్లస్థలాలను ఇతర శాఖలకు కేటాయించడంపై కలెక్టర్‌తో మాట్లాడతానని, ఇక్కడ పరిష్కారం కాకపోతే సీఎంతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.
విద్యుత్ సమస్యపై నేడు కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఆందోళన చేస్తున్నారని, ఈ సంక్షోభానికి కారణం ఆ పార్టీలేనని ఆరోపించారు. ప్రెస్ అకాడమి చైర్మన్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో టీజేఎఫ్ కీలక భూమిక పోషించిందన్నారు. తెలంగాణ సాధనకు జర్నలిస్టులు అనేక ఉద్యమాలు చేశారని, ఇప్పుడు రాష్ర్టం ఏర్పడిన తర్వాత తెలంగాణకు పొంచి ఉన్న ప్రమాదాన్ని అరికట్టేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వృత్తి పరంగా చొచ్చుకుని వెళ్తూ.. దేశ ప్రధానమంత్రితో కూడా మాట్లాడే పాత్రికేయుల జీవన ప్రమాణాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
జర్నలిస్టులకు రూ.10 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం నిధి ఏర్పాటు చేసిందని, వారి సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తారనే నమ్మకం ఉందని చెప్పారు. పాత్రికేయులందరికీ ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇప్పించాలని మంత్రిని కోరారు. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ తెలంగాణ వాదం, ఉద్యమం నుంచి టీయూడబ్ల్యూజే పుట్టిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరినీ వెన్నుతట్టి నడిపించింది జర్నలిస్టులేనన్నారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అనేక మంది పోరాటాల ఫలితంగానే తెలంగాణ ఆవిర్భవించిందన్నారు.
బంగారు తెలంగాణ నిర్మిస్తామని చేసిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. ఖమ్మంలో జర్నలిస్టులకు కేటాయించిన 10 ఎకరాలకు సంబంధించిన భూ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. జర్నలిస్టులు చేసే ఉద్యమాలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. పోలవరం ముంపునకు గురవుతున్న ఏడు మండలాలను తెలంగాణలో ఉంచేంత వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ ఆర్డినెన్స్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు తాను వ్యతిరేకించామని గుర్తుచేశారు.
మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, గిరిజనులను ముంచే పోలవరం విషయంలో న్యాయపరమైన పోరాటం సాగిస్తామని చెప్పారు. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణానికి జర్నలిస్టులు పాటుపడాలన్నారు. జర్నలిస్టుల శ్రేయస్సుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అనేక ప్రభుత్వాలు మారినా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు.
తెలంగాణ ప్రభుత్వంలోనైనా వారి సమస్యలను పరిష్కరించేలా చొరవ చూపాలన్నారు. ఏడు మండలాలను ఆంధ్రాలో కలపడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ జర్నలిస్టుల జీవితాల వెనుక చీకట్లు ఉన్నాయని, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. కాంట్రాక్టు కార్మికుల కంటే తక్కువగా జర్నలిస్టుల జీవన ప్రమాణాలు ఉన్నాయన్నారు.
టీయూడబ్ల్యూజే రాష్ట్ర సహాయ కార్యదర్శి మేకల కల్యాణ చక్రవర్తి అధ్యక్షతన జరిగిన ఈ సభలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్. క్రాంతికిరణ్, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎం.వి.రమణ, రాష్ట్ర నాయకులు పల్లె రవి, పీవీ శ్రీనివాస్, రమేశ్‌హజారీ, వర్థెల్లి వెంకటేశ్వర్లు, ఇస్మాయిల్, అవ్వారి భాస్కర్, కిరణ్, యోగానంద్, యుగంధర్, రాజు, ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, సయ్యద్ ఇస్మాయిల్, నాగేందర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, రవీందర్, పి.శ్రీనివాస్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, నాగేందర్, ఖదీర్, అన్సార్‌పాషా, రామారావు, కోటేశ్వరరావు, అప్పారావు పాల్గొన్నారు.
‘ముంపు’పై ఉద్యమిస్తాం
Published Mon, Aug 25 2014 2:13 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement