బంద్ సక్సెస్ | bandh success in district | Sakshi
Sakshi News home page

బంద్ సక్సెస్

Published Sun, Jul 13 2014 2:17 AM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM

bandh success in district

ఖమ్మం: పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే ఆర్డినెన్స్‌ను  లోక్‌సభ ఆమోదించడాన్ని నిరసిస్తూ శనివారం నిర్వహించిన బంద్ జిల్లాలో విజయవంతమైంది. వైఎస్సార్ సీపీ, టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, కుల, విద్యార్థి, మహిళా సంఘాలు బంద్‌కు మద్దతు ప్రకటించాయి.

ఖమ్మం, మణుగూరు, కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లి, మధిర డిపోల ఎదుట ఆయా పార్టీల నాయకులు ఉదయం నుంచే ధర్నా నిర్వహించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. వ్యాపార వాణిజ్యసంస్థలు, సినిమా హాళ్లు, పెట్రోల్ బంకులు, బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను మూసివేయించారు. దీంతో నిత్యం జనసందోహంతో ఉండే బస్టాండ్‌లు, వ్యాపార కూడళ్లు వెలవెలబోయాయి. రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీలు, మానవహారాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మలు దహనం చేశారు.

 శవ  యాత్రలు నిర్వహించారు. ఖమ్మం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్‌కు అందజేశారు. ఆర్డినెన్స్‌ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

 ఖమ్మంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు నాయకత్వంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సీపీఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సీపీఎం నాయకులు ర్యాలీ నిర్వహించి జడ్పీసెంటర్‌లో మానవహారం చేపట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో డీసీసీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి, అక్కడ ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతిప్రతం అందజేశారు.

 టీఆర్‌ఎస్ నాయకులు సైతం బంద్ విజయవంతం చేయాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. వివిధ కుల, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, ర్యాలీ నిర్వహించి బంద్‌కు మద్దతు తెలిపారు.

 భద్రాచలం బస్టాండ్ సెంటర్‌లో సీపీఎం, వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రహదారిపై బైఠాయించారు. ఆందోళనకు స్థానిక ఎమ్మెల్యే సున్నం రాజయ్య, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ తెల్లం వెంకట్రావ్ నాయకత్వం వహించారు. బస్టాండ్ సెంటర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు దిష్టిబొమ్మలకు ఉరి తీశారు. సీపీఐ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి గోదావరిలో పడేశారు. న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

పోలవరం వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. చింతూరు, దుమ్ముగూడెంలో సీపీఎం, యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాస్తారోకో, మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు కొత్తగూడెంలో వాణిజ్య సముదాయాలు, సినిమాహాళ్లు, పెట్రోల్‌బంక్‌లు, విద్యాసంస్థల ను స్వచ్ఛందంగా మూసివేశారు. ఆర్టీసీ బస్సు లు డిపోలకే పరిమితమయ్యాయి. కొత్తగూడెం త్రీటౌన్ సెంటర్‌లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఎన్‌డీఏ దిష్టిబొమ్మను దహనం చేశారు. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ ఆధ్వర్యం లో బైక్ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం త్రీ టౌన్ సెంటర్ వద్ద బైఠాయించి నిరసన తెలి పారు. బస్టాండ్ సెంటర్, ముర్రేడు బ్రిడ్జి వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహిం చారు. పాల్వంచలో న్యూడెమోక్రసీ, టీఆర్‌ఎస్, సీపీఎం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. దమ్మపేట సెంటర్‌లో రాస్తారోకో చేశారు. కేటీపీఎస్ ఎదుట విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.

 అశ్వారావుపేటలో వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ యువ జన విభాగం ఆధ్వర్యంలో పోలవరం ఆర్డినెన్స్ భూతం దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. దమ్మపేటలో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ముల్కలపల్లి, చంద్రుగొండ మండలాల్లో రాస్తారోకో నిర్వహించారు.  కుక్కునూరు, చీరవల్లి, ఉప్పేరు గ్రామాల్లో రాస్తారోకో నిర్వహించారు. నరేంద్ర మోడీ, చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు.  వేలేరుపాడు మండలంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ పాటించారు.

 మధిరలో వైఎస్‌ఆర్‌సీపీ, టీజేఏసీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బస్సులు బయటకు రాకుండా ఉదయం 5 గంటలకే  డిపో గేటువద్ద అడ్డుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను, విద్యాసంస్థలను, దుకాణాలు, పెట్రోల్‌బంక్‌లు, సినిమా హాళ్లను మూసివేయించారు.  రైల్వే ఓవర్‌బ్రిడ్జి వద్ద ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దంచేశారు. ముదిగొండలో టీఆర్‌ఎస్, సీపీఎం, కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. చింతకాని  బస్టాండ్ సెంటర్‌లో మోడీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు.

 పినపాక నియోజకవ ర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో బంద్ సంపూర్ణంగా జరిగింది. బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర్‌లో రాస్తారోకో నిర్వహించారు. వ్యాపార వర్గాలు స్వచ్ఛందగా బంద్‌లో పాల్గొన్నాయి.
 సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లో బంద్ సంపూర్ణంగా జరిగింది. అన్ని మండల కేంద్రాలలో వైఎస్‌ఆర్‌సీపీ, సీపీఎం, టీఆర్‌ఎస్, సీపీఐ, టీజేఏసీ, న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు.  
 ఇల్లెందులో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, టీజేఏసీ డివిజన్ చైర్మన్ పేరూరి అప్పారావు, సీపీఎం డివిజన్ కార్యదర్శి ఎం.సత్యనారాయణ, ఎన్డీ చంద్రన్న వర్గం జిల్లా నాయకుడు జే.సీతారామయ్య ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఎన్డీ చంద్రన్న వర్గం, వైఎస్సార్‌సీపీలు వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించాయి. టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. టేకులపల్లి, కామేపల్లి, గార్ల, బయ్యారం మండలాల్లోనూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.

 కూసుమంచిలో టీఆర్‌ఎస్, న్యూడెమోక్రసీ, వైఎస్సార్‌సీపీ, సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.  ఖమ్మం రూరల్ మండలంలోని వరంగల్ క్రాస్‌రోడ్, కోదాడ క్రాస్ రోడ్, పెద్దతండా, నాయుడుపేటలో దుకాణాలు, పెట్రోల్‌బంక్‌లు స్వచ ్ఛందంగా మూసివేశారు. నేలకొండపల్లిలో సీపీఎం, టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. తిరుమలాయపాలెం మండలంలో టీఆర్‌ఎస్, న్యూడెమోక్రసీ, సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. సీపీఎం నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను ద హనం చేశారు.

 వైరాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ పాటించారు. విద్యా, వ్యాపార సంస్థలు, హోటళ్లు మూసివేశారు. నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో సీపీఎం, టీఆర్‌ఎస్, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ, సీపీఐ పార్టీల నాయకులు బంద్‌లో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement