సాక్షి ప్రతినిధి, ఖమ్మం : పోలవరం ముంపు కింద ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన జిల్లాలోని ఏడు మండలాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల కథ కమలనాథన్ కమిటీ కోర్టుకు చేరింది. ఈ ఉద్యోగులను ఏ ప్రభుత్వానికి కేటాయించాలన్న అంశంపై రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తేలనందున, రాష్ట్ర కేడర్ ఉద్యోగుల పంపకాలు చేస్తున్న కమలనాథన్ కమిటీకే ఈ బాధ్యతలు కూడా అప్పగించనున్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్.కె.ఇలంబరితి పంపిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కమలనాథన్ కమిటీకి పంపినట్టు తెలుస్తోంది. ఈ కమిటీ తీసుకునే నిర్ణయం మేరకు ఉద్యోగుల కేటాయింపు ఉంటుందని, అప్పటివరకు ఎక్కడ పనిచేస్తున్న వారు అక్కడే ఉంటారని జిల్లా యంత్రాంగం చెపుతోంది. అయితే, ఏడు మండలాలను విలీనం చేసుకుంటూ అంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం కింద నోటిఫికేషన్ ఇచ్చినందున సమస్య తేలి పంపకాలు జరిగేంతవరకు ముంపు ఉద్యోగుల జీతాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరించనుందని సమాచారం.
ఆప్షన్లు ఇచ్చినా.... ఆ నిర్ణయం మేరకే
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో విలీనం కానున్న ఏడు మండలాల్లో దాదాపు మూడు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారని అంచనా. వీరిలో జిల్లా కేడర్, జోనల్ కేడర్ వారున్నారు. గిరిజన సంక్షేమ పాఠశాలల టీచర్లు, ఎంపీ, జడ్పీ పాఠశాలల్లో పనిచేసే టీచర్లు కూడా 1300 పైగానే ఉన్నారు. వీరు పోను మరో 1700 మంది ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఉంటారని అంచనా. మండలాల విలీనం చర్చ ప్రారంభం అయినప్పటి తమను ఏ ప్రభుత్వానికి పంపుతారోనని ఇక్కడి ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
అయితే, విలీన ప్రక్రియ నేడో, రేపో పూర్తయ్యే వరకు వచ్చినా ఉద్యోగుల అంశం మాత్రం తేలలేదు. ఇటీవలే జిల్లా యంత్రాంగం అన్ని శాఖల ఉద్యోగుల నుంచి ఆప్షన్లు కూడా స్వీకరించింది. ఇందులో టీచర్లు 65:35, ఇతర ఉద్యోగులు 80:20 నిష్పత్తిలో తెలంగాణ, ఆంధ్ర ఆప్షన్లు ఇచ్చినట్టు సమాచారం. ఈ ఆప్షన్ల వివరాలన్నింటినీ జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కోసం జిల్లా యంత్రాంగం వేచిచూస్తుండగా, నిర్ణయం తీసుకునే బాధ్యతను కమలనాథన్ కమిటీకి అప్పగించారన్న సమాచారం రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి వచ్చింది.
దీంతో కమలనాథన్ కమిటీ నిర్ణయం తీసుకునే వరకు ఎక్కడి వారు వారి అక్కడే కొనసాగనున్నారు. ఆప్షన్లు, ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యాలను దృష్టిలో ఉంచుకుని కమలనాథన్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెపుతున్నారు. అయితే, వీరికి వేతనాల అంశం కూడా సమస్యగా మారనుంది. కమలనాథన్ కమిటీ నిర్ణయం తీసుకుని పంపకాలు పూర్తయ్యేందుకు నెలకుపైగా సమయం పడితే జీతాలు ఎవరు ఇస్తారన్నది ప్రశ్నగా మారింది. అయితే, వేతనాల విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని, విలీనం నోటిఫికేషన్ రానంతవరకు తెలంగాణలోనే ఆ ఏడు మండలాలుంటాయి కనుక ఈ ప్రభుత్వం, ఒకవేళ నోటిఫికేషన్ వస్తే ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోతాయి కనుక అక్కడి ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుందని జిల్లా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
సూపర్‌న్యూమరీ పోస్టులు సృష్టిస్తారా..?
కమలనాథన్ కమిటీ నిర్ణయం ఎలా ఉన్నా ముంపు ప్రాంతంలో పనిచేస్తున్న ఉద్యోగులను తెలంగాణకు కేటాయించే అంశంలో ఆసక్తికర అంశాలు ఇమిడి ఉన్నాయనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఈ ఉద్యోగులంతా (ఓపెన్‌కేటగిరీ, డిప్యూటేషన్లపై వచ్చిన వారు కాకుండా) తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే. వీరు రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణలోనే ఉండాలని కోరుకుంటారు. అయితే, వీరంతా తెలంగాణలో ఉండాలని ఆప్షన్ ఇస్తే అనివార్యంగా అందరికీ ఖమ్మం జిల్లాలోనే పోస్టింగ్‌లు ఇవ్వాల్సిందే.
అలా పోస్టింగ్‌లిస్తే ఇక జిల్లాలోని ఏ ప్రభుత్వ శాఖలోనూ మరో పదేళ్ల వరకు కనీసం పదోన్నతులు కూడా రావని ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి. ఒకేసారి 1300 మంది టీచర్లను సర్దుబాటు చేస్తే సమీప భవిష్యత్తులో డీఎస్సీ పడే అవకాశం లేదని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇక్కడకు ఎంతమంది ఉద్యోగులు వస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని పోస్టుల భర్తీకి అవకాశం ఉంటుంది. అంటే అక్కడి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగనున్నాయి. అంటే ఈ ఏడు మండలాల సిబ్బందిని తెలంగాణకే కేటాయిస్తే ఇక్కడి నిరుద్యోగులు నష్టపోతుండగా, ఆంధ్రలోని నిరుద్యోగులు లాభపడనున్నారు.
అయితే జిల్లాలో ఇప్పటివరకు పనిచేస్తున్న వారు ఇక్కడే ఉండాలనుకుంటే వారిని ఉంచాలని, ఈ మేరకు సూపర్‌న్యూమరీ సృష్టించాలనే వాదన వినిపిస్తోంది. అలా సూపర్‌న్యూమరీ పోస్టులు సృష్టించడం ద్వారా ఇక్కడి ఉద్యోగులకు కూడా నష్టం ఉండదని, ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు లభించి ఉభయతారకంగా ఉంటుందన్నది ఉద్యోగుల వాదన. మరి, ఈ విషయం లో కమలనాథన్ కమిటీ ఏం చెపుతుందో, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడా ల్సిందే.
కమలనాథా..నీవే దిక్కు
Published Thu, Sep 4 2014 2:20 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement
Advertisement