K.ilambariti
-
ప్రగతే లక్ష్యం
ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతే ధ్యేయం అభివృద్ధిలో అందరూపాలుపంచుకోండి బంగారు తెలంగాణ నిర్మించుకుందాం కోట్ల నిధులతో ప్రగతి పథంలో జిల్లా.. గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ ఇలంబరితి సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టపరిచేందుకు, జిల్లాను అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి పిలుపునిచ్చారు. ప్రగతి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో పాలుపంచుకోవాలన్నారు. నగరంలోని పోలీస్‌పరేడ్ గ్రౌండ్లో సోమవారం నిర్వహించిన 66వ గణతంత్ర దిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. అంతకుముందు పోలీస్ గౌరవవందనం స్వీకరించి, జాతీయజెండాను ఆవిష్కరించారు. జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు- వాటి అమలుతీరు- లక్ష్యాలను వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే భారతీయ సంస్కృతికి అనుగుణంగా నడుచుకోవాలన్నారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహనీయుల ఆశయాలు, త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని దేశ నిర్మాణం, జిల్లా సమగ్రాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పథకాల గురించి.. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని అమలు చేసిందన్నారు. జిల్లాలో తొలిదశలో రూ.427.84 కోట్లను విడుదల చేసి 2,88,453 మంది రైతుల ఖాతాల్లో రూ.341 కోట్లు జమచేశామని వివరించారు. రూ.1877 కోట్ల పంట రుణాలను అందించడం లక్ష్యం కాగా రూ.1108 కోట్లు అందించామన్నారు. ఆసరా పథకం కోసం 3,13,831 దరఖాస్తులు వచ్చాయన్నారు. 2,41,373 మందిని అర్హులుగా గుర్తించి రూ.25.50 కోట్లు పంపిణీ చేశామన్నారు. ఆహార భద్రత పథకంలో భాగంగా 7,04,119 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఆరు కేజీల చొప్పున 13,678 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేశామన్నారు. ఈ పథకం కింద నెలకు రూ.35.56 కోట్లు, సంవత్సరానికి రూ.426.72 కోట్లు సబ్సిడీ ఇస్తున్నామన్నారు. హాస్టల్, మధ్యాహ్న భోజనం, సన్నబియ్యం పథకం కింద 333 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు ప్రతినెలా 11,78,024మెట్రిక్ టన్నులు, మధ్యాహ్న భోజనానికి 2,736 పాఠశాలలకు 543.748 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు. సంవత్సరానికి రూ.74 కోట్లు సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు. హరితహారం పథకం కింద 10 నియోజకవర్గాల్లో 3.81 కోట్ల మొక్కలు పెంచేందుకు ప్రతిరెండు గ్రామ పంచాయతీలకు ఒక నర్సరీని ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని గ్రామాలకు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. రూ.4,075 కోట్ల అంచనా వ్యయంతో గోదావరి, కిన్నెరసాని, పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, వైరా రిజర్వాయర్‌తో మూడు గ్రిడ్స్ చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని 41 మండలాల్లో 25.87 లక్షల మంది జనాభాకు తాగునీరు అందిస్తామన్నారు. రక్షిత మంచినీరు అందించేందుకు రూ.403 కోట్లతో చేపట్టిన 1476 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. కాకతీయ మిషన్ కింద 4,517 చెరువులకు గాను ఈ ఏడాది 903 చెరువులను అభివృద్ధి చేస్తామన్నారు. భూమి లేని నిరుపేద దళిత కుటుంబాల్లో ఏడుగురు లబ్ధిదారులకు 17.10 ఎకరాల భూమిని రూ.87.37లక్షలతో కొనుగోలు చేసి ఇచ్చామన్నారు. కల్యాణలక్ష్మి పథకం కోసం కోటి రూపాయలు మంజూరు కాగా 26 దరఖాస్తులు వచ్చాయన్నారు. షాదీముబారక్‌కు 24 దరఖాస్తులు వచ్చాయన్నారు. త్వరలో లబ్ధిదారులకు సొమ్ము అందుతుందన్నారు. వివిధ ప్రాజెక్టులకు భూసేకరణ వివిధ ప్రాజెక్టులకు భూములు సేకరిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. మణుగూరులో రూ.6వేల కోట్ల వ్యయంతో 1080 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. నిర్వాసితులకు రూ.50 కోట్ల పరిహారంతో పాటు పునరావాసం కల్పిస్తున్నామన్నారు. రూ. 4,800 కోట్ల వ్యయంతో కేటీపీఎస్ 7వ దశ నిర్మాణ పనులకు త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. తెలంగాణ సంస్కృతిని చాటేలా బతుకమ్మ సంబరాలు నిర్వహించామన్నారు. ఖమ్మం నగరాన్ని స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేసేందుకు రూ.1285 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు పంపించామన్నారు. భూముల క్రమబద్ధీకరణకు జిల్లాలో 7,319 దరఖాస్తులు అందాయన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన పథకం కింద 1951 మహిళా సంఘాలకు రూ.5,850 కోట్లు బ్యాంకు రుణాలు అందజేసినట్లు చెప్పారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా కేంద్రంతోపాటు రెవెన్యూ డివిజన్, మండల కేంద్రాల్లో ప్రతి సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గోదావరి పుష్కరాల కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన 85వేల ఎకరాల బీడు, సాగు భూములకు నీటి వసతి కల్పించేందుకు రూ.196 కోట్లు మంజూరు చేశామన్నారు. ఆర్అండ్బీ ద్వారా రూ.507.33 కోట్లతో 88 పనులు చేపట్టినట్లు తెలిపారు. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా 2,798 పనులకు రూ.740 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ ఏడాది రూ.34.76 కోట్ల పెట్టుబడితో 129 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు స్థాపించి 435 మందికి ఉపాధి కల్పించినట్లు చెప్పారు. 2014-15 సంవత్సరానికి 2,715 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. రాజీవ్‌గాంధీ ఖేల్ అభియాన్ పథకం కింద 11 మండలాలకు స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు మంజూరయ్యాయన్నారు. జిల్లాలో 2006-07 నుంచి ఇప్పటి వరకు 2,87,233 గృహాలు మంజూరు కాగా 2,22,818 గృహాలు పూర్తయ్యాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాజీవ్ యువశక్తి కింద రూ.3కోట్లతో 300 యూనిట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. నీటి పారుదల అభివృద్ధి సంస్థ ద్వారా 2014-15 సంవత్సరానికి గాను 16 ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి రూ.87.45 కోట్లతో 15,935 ఎకరాలకు సాగునీటి వసతి కల్పించే పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలను స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఖర్చుచేస్తున్నట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకోసం విద్యాభివృద్ధికి ఐటీడీఏ ద్వారా పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ద్వారా వివిధ రంగాల అభివృద్ధికి రూ.128.32 కోట్ల వ్యయంతో 804 పనులు పురోగతిలో ఉన్నట్లు వివరించారు. జిల్లాలో 3,402 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 2,47,239 మంది విద్యార్థులకు మధ్యాహ్నభోజనం అందిస్తున్నట్లు వివరించారు. సర్వశిక్ష అభియాన్ ద్వారా రూ.21.25 కోట్లతో 404 అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టి 386 తరగతి గదులను పూర్తి చేశామన్నారు. జిల్లాలో పేద ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రిలో కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. జిల్లాలో 1206 వైద్య శిబిరాలు నిర్వహించగా, 1,35,031 మంది చికిత్స పొందినట్లు చెప్పారు. వ్యాధులపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ షానవాజ్‌ఖాసీం, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, జిల్లా జడ్జి ఐ.రమేష్, మాజీ జెడ్పీ చైర్మన్ చేకూరి కాశయ్య పాల్గొన్నారు. -
కమలనాథా..నీవే దిక్కు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : పోలవరం ముంపు కింద ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన జిల్లాలోని ఏడు మండలాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల కథ కమలనాథన్ కమిటీ కోర్టుకు చేరింది. ఈ ఉద్యోగులను ఏ ప్రభుత్వానికి కేటాయించాలన్న అంశంపై రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తేలనందున, రాష్ట్ర కేడర్ ఉద్యోగుల పంపకాలు చేస్తున్న కమలనాథన్ కమిటీకే ఈ బాధ్యతలు కూడా అప్పగించనున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్.కె.ఇలంబరితి పంపిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కమలనాథన్ కమిటీకి పంపినట్టు తెలుస్తోంది. ఈ కమిటీ తీసుకునే నిర్ణయం మేరకు ఉద్యోగుల కేటాయింపు ఉంటుందని, అప్పటివరకు ఎక్కడ పనిచేస్తున్న వారు అక్కడే ఉంటారని జిల్లా యంత్రాంగం చెపుతోంది. అయితే, ఏడు మండలాలను విలీనం చేసుకుంటూ అంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం కింద నోటిఫికేషన్ ఇచ్చినందున సమస్య తేలి పంపకాలు జరిగేంతవరకు ముంపు ఉద్యోగుల జీతాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరించనుందని సమాచారం. ఆప్షన్లు ఇచ్చినా.... ఆ నిర్ణయం మేరకే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో విలీనం కానున్న ఏడు మండలాల్లో దాదాపు మూడు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారని అంచనా. వీరిలో జిల్లా కేడర్, జోనల్ కేడర్ వారున్నారు. గిరిజన సంక్షేమ పాఠశాలల టీచర్లు, ఎంపీ, జడ్పీ పాఠశాలల్లో పనిచేసే టీచర్లు కూడా 1300 పైగానే ఉన్నారు. వీరు పోను మరో 1700 మంది ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఉంటారని అంచనా. మండలాల విలీనం చర్చ ప్రారంభం అయినప్పటి తమను ఏ ప్రభుత్వానికి పంపుతారోనని ఇక్కడి ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. అయితే, విలీన ప్రక్రియ నేడో, రేపో పూర్తయ్యే వరకు వచ్చినా ఉద్యోగుల అంశం మాత్రం తేలలేదు. ఇటీవలే జిల్లా యంత్రాంగం అన్ని శాఖల ఉద్యోగుల నుంచి ఆప్షన్లు కూడా స్వీకరించింది. ఇందులో టీచర్లు 65:35, ఇతర ఉద్యోగులు 80:20 నిష్పత్తిలో తెలంగాణ, ఆంధ్ర ఆప్షన్లు ఇచ్చినట్టు సమాచారం. ఈ ఆప్షన్ల వివరాలన్నింటినీ జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కోసం జిల్లా యంత్రాంగం వేచిచూస్తుండగా, నిర్ణయం తీసుకునే బాధ్యతను కమలనాథన్ కమిటీకి అప్పగించారన్న సమాచారం రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి వచ్చింది. దీంతో కమలనాథన్ కమిటీ నిర్ణయం తీసుకునే వరకు ఎక్కడి వారు వారి అక్కడే కొనసాగనున్నారు. ఆప్షన్లు, ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యాలను దృష్టిలో ఉంచుకుని కమలనాథన్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెపుతున్నారు. అయితే, వీరికి వేతనాల అంశం కూడా సమస్యగా మారనుంది. కమలనాథన్ కమిటీ నిర్ణయం తీసుకుని పంపకాలు పూర్తయ్యేందుకు నెలకుపైగా సమయం పడితే జీతాలు ఎవరు ఇస్తారన్నది ప్రశ్నగా మారింది. అయితే, వేతనాల విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని, విలీనం నోటిఫికేషన్ రానంతవరకు తెలంగాణలోనే ఆ ఏడు మండలాలుంటాయి కనుక ఈ ప్రభుత్వం, ఒకవేళ నోటిఫికేషన్ వస్తే ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోతాయి కనుక అక్కడి ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుందని జిల్లా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సూపర్‌న్యూమరీ పోస్టులు సృష్టిస్తారా..? కమలనాథన్ కమిటీ నిర్ణయం ఎలా ఉన్నా ముంపు ప్రాంతంలో పనిచేస్తున్న ఉద్యోగులను తెలంగాణకు కేటాయించే అంశంలో ఆసక్తికర అంశాలు ఇమిడి ఉన్నాయనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఈ ఉద్యోగులంతా (ఓపెన్కేటగిరీ, డిప్యూటేషన్లపై వచ్చిన వారు కాకుండా) తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే. వీరు రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణలోనే ఉండాలని కోరుకుంటారు. అయితే, వీరంతా తెలంగాణలో ఉండాలని ఆప్షన్ ఇస్తే అనివార్యంగా అందరికీ ఖమ్మం జిల్లాలోనే పోస్టింగ్‌లు ఇవ్వాల్సిందే. అలా పోస్టింగ్లిస్తే ఇక జిల్లాలోని ఏ ప్రభుత్వ శాఖలోనూ మరో పదేళ్ల వరకు కనీసం పదోన్నతులు కూడా రావని ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి. ఒకేసారి 1300 మంది టీచర్లను సర్దుబాటు చేస్తే సమీప భవిష్యత్తులో డీఎస్సీ పడే అవకాశం లేదని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇక్కడకు ఎంతమంది ఉద్యోగులు వస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని పోస్టుల భర్తీకి అవకాశం ఉంటుంది. అంటే అక్కడి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగనున్నాయి. అంటే ఈ ఏడు మండలాల సిబ్బందిని తెలంగాణకే కేటాయిస్తే ఇక్కడి నిరుద్యోగులు నష్టపోతుండగా, ఆంధ్రలోని నిరుద్యోగులు లాభపడనున్నారు. అయితే జిల్లాలో ఇప్పటివరకు పనిచేస్తున్న వారు ఇక్కడే ఉండాలనుకుంటే వారిని ఉంచాలని, ఈ మేరకు సూపర్‌న్యూమరీ సృష్టించాలనే వాదన వినిపిస్తోంది. అలా సూపర్‌న్యూమరీ పోస్టులు సృష్టించడం ద్వారా ఇక్కడి ఉద్యోగులకు కూడా నష్టం ఉండదని, ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు లభించి ఉభయతారకంగా ఉంటుందన్నది ఉద్యోగుల వాదన. మరి, ఈ విషయం లో కమలనాథన్ కమిటీ ఏం చెపుతుందో, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడా ల్సిందే. -
సమన్వయంతో పనిచేయాలి
ఖమ్మం జడ్పీసెంటర్ : అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి అన్నారు. సర్వేపై ఆర్డీఓలు, తహశీల్దార్లు, గ్రామ ప్రత్యేకాధికారులతో కలెక్టరేట్ నుంచి కలెక్టర్ శనివారం వీడియోకాన్పరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ప్రసుత్తం సుమారు 8లక్షల 59 వేల కుటుంబాలు ఉన్నాయన్నారు. సర్వే పక డ్బందీగా జరిగేందుకు జిల్లాను 29,951 ఎన్యూమరేట్ బ్లాకులుగా విభజించినట్లు చెప్పారు. ఎన్యూమరేటర్లు ప్రతి కుటుంబంలో సరైన వివరాలు నమోదు చేసేలా గ్రామ, వార్డు ప్రత్యేకాధికారులు కృషిచేయాలన్నారు. గ్రామ ప్రత్యేకాధికారులు తమ పంచాయతీకి సంబంధించిన రేషన్‌కార్డులు, భూమి, గృహ సంబంధ వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. 19న ఉదయం 7గంటలకు సర్వే ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. ఎన్యూమరేటర్ల అవసరమైన సామగ్రి ఒక రోజు ముందుగానే చేరేలా చూడాలన్నారు. ఏ ఇళ్లు ఏ బ్లాక్‌లో ఉన్నాయో ప్రత్యేకాధికారులు గమనించాలన్నారు. మహిళా ఎన్యూమరేటర్లకు అవసరమైన సౌకర్యాలు, భద్రతా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఖమ్మం నగరం మినహామిగతా అన్ని చోట్ల స్టిక్కరింగ్ పూర్తి చేసినట్లు చెప్పారు. స్టిక్కరింగ్ లేని వారు సంబంధిత తహశీల్దార్లను సంప్రదించాలన్నారు. సర్వే సామగ్రి పంపిణీని ఈనెల 18లోగా పూర్తి చేయాలని సూచించారు. మున్సిపాలిటీలో సర్వే సజావుగా జరిగేందుకు ఆర్డీవోలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆస్పత్రిలో ఉన్న రోగులు, హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు, పుట్టింటికి వెళ్లిన గర్భిణులు సర్వే రోజు ఇంట్లో లేనిపక్షంలో వారికి సంబంధించిన వివరాలు, ధ్రువీకరణ పత్రాలు చూసి ఎన్యూమనేటర్లు వివరాలు నమోదు చేయాలన్నారు. ఉత్తమ ఎన్యూమరేటర్లకు నగదు ప్రోత్సాహకం, ప్రశంసాపత్రం అందిస్తామని ప్రకటించారు. వీడియోకాన్ఫరెన్సలో జేసీ సురేంద్రమోహన్, ఏజేసీ బాబూరావు, డీఆర్వో శివశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్కంఠగా ‘జడ్పీ’ ఎన్నిక
సాక్షి, ఖమ్మం: జడ్పీ చైర్పర్సన్ ఎన్నిక ఉత్కంఠగా సాగింది. టీడీపీకి మెజారిటీ ఉన్నా ఇందులో ఏ వర్గం సభ్యురాలిని చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటిస్తారోనని జడ్పీటీసీలంతా ఎదురుచూశారు. చివరకు తుమ్మల వర్గానికి చెందిన గడిపల్లి కవిత టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థి అని కలెక్టెర్ డాక్టర్ కె.ఇలంబరితి ప్రకటించడంతో ఉత్కంఠకు తెరతొలగింది. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. ఈ కార్యక్రమమంతా కలెక్టర్ అన్నీ తానైన డిపించారు. ఉదయం 8 గంటల నుంచి కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరించారు. అయితే నిర్ణీత సమయం 10 గంటలలోపు టీడీపీ మద్దతుతో సీపీఐ అభ్యర్థిగా మహ్మద్ మౌలానా, సీపీఎం అభ్యర్థిగా సయ్యద్ జియావుద్దీన్ నామినేషన్లు దాఖలు చేశారు. 9.30 గంటలకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పోట్ల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య జెడ్పీలోకి వచ్చి టీడీపీ చైర్పర్సన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల బీ ఫారాలు కలెక్టర్‌కు అందజేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కాంగ్రెస్ చైర్ పర్సన్ అభ్యర్థి, పినపాక జెడ్పీటీసీ జాడి జానమ్మ తరఫున కలెక్టర్‌కు బీ ఫామ్ అందజేశారు. ఉదయం ప్రారంభమైన కో ఆప్షన్ సభ్యుల నామినేషన్లు, జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత కో ఆప్షన్ సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక, చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తి అయింది. కలెక్టర్, జెడ్పీ సీఈఓ జయప్రకాశ్‌నారాయణ ఎన్నిక నిర్వహణ బాధ్యతను పూర్తి చేశారు. మధ్యాహ్నం 12.20 గంటలకు క్యాంపు నుంచి టీడీపీ సభ్యులను పార్టీ నేతలు జెడ్పీ హాల్లోకి తీసుకొచ్చారు. వారి వెంట ఎమ్మెల్యే సండ్ర, ఎమ్మెల్సీ బాలసాని ఉన్నారు. వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు సభ్యులతో కలిసి అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సమావేశానికి హాజరయ్యారు. తర్వాత ఎమ్మెల్యేలు రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, పువ్వాడ అజయ్‌కుమార్, కోరం కనకయ్యతో కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీలు వచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కలెక్టర్ ఎన్నిక సమావేశాన్ని ప్రారంభి మాట్లాడుతూ.. ‘డాక్టర్. కె. ఇలంబరితి అను నేను అంటూ..’ తనను తాను పరిచయం చేసుకున్నారు. కో ఆప్షన్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నియమావళిని సభ్యులకు వివరించారు. 1.15కు సభ్యులకు ప్రమాణ స్వీకార పత్రాలను అందజేయడంతో పాటు సమావేశానికి హాజరైన వారి సంతకాలు సేకరణ పూర్తి అయింది. 39 మంది సభ్యులుండడంతో కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు కోరం ఉన్నట్లు కలెక్టర్ ప్రకటించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు జడ్పీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత టీడీపీ సభ్యులు గ్రూపుగా, వారి తర్వాత సీపీఎం, ఎన్డీ, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, సీపీఐ సభ్యులు ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్డీ సభ్యులు ఆత్మ సాక్షిగా అంటూ ప్రమాణం చేశారు. మధ్యాహ్నం 1.45 నిమిషాలకు కో ఆప్షన్ సభ్యుల ఎన్నికను ప్రారంభించారు. సీపీఐకి చెందిన మహ్మద్ మౌలానాను మణుగూరు జెడ్పీటీసీ సభ్యురాలు పి.దుర్గ ప్రతిపాదించగా అశ్వారావుపేట జెడ్పీటీసీ మల్లికార్జునరావు బలపరిచారు. సీపీఎంకు చెందిన సయ్యద్ జియావుద్దీన్‌ను దుమ్ముగూడెం జెడ్పీటీసీ అన్నె సత్యనారాయణమూర్తి ప్రతిపాదించగా బోనకల్ జెడ్పీటీసీ బాణావత్ కొండ బలపరిచారు. పోటీలో ఎవరూ లేకపోవడంతో వీరిద్దరు కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటిచారు. ఆతర్వాత భోజన విరామం అనంతరం వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. మధ్యాహ్నం 3 గంటలకు చైర్ పర్సన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రారంభమైంది. ఈ ఎన్నికకు కోరం కోసం సభ్యుల సంతకాలు తీసుకుని, చైర్ పర్సన్ ఎన్నికను ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. టీడీపీ, కాంగ్రెస్ చైర్పర్సన్ అభ్యర్థులుగా వెంకటాపురం జెడ్పీటీసీ గడిపల్లి కవిత, పినపాక జెడ్పీటీసీ జాడి జానమ్మలకు ఆయా పార్టీ నేతలు బీఫారాలు ఇచ్చారని, వారే పోటిలో నిలిచే అభ్యర్థులుగా కలెక్టర్ వెల్లడించారు. గడిపల్లి కవితను కారేపల్లి జెడ్పీటీసీ ఉన్నం వీరేందర్ ప్రతిపాదించగా దుమ్మగూడెం జెడ్పీటీసీ అన్నె సత్యనారాయణమూర్తి బలపరిచారు. జాడి జానమ్మను టేకులపల్లి జెడ్పీటీసీ లక్కినేని సురేందర్ ప్రతిపాదించగా కామేపల్లి జెడ్పీటీసీ మేకల మల్లిబాబుయాదవ్ బలపరిచారు. 3.25 గంటలకు చైర్మన్ ఎన్నిక ప్రారంభమైంది. చైర్ పర్సన్ అభ్యర్థిగా గడిపల్లి కవితకు మద్దతు ఇచ్చే వారు చేతులు ఎత్తాలని కలెక్టర్ కోరగా, 19 మంది టీడీపీ, ఇద్దరు సీపీఎం, ఒక సీపీఐ సభ్యుడు ఆమెకు మద్దతు తెలిపారు. జాడి జానమ్మకు మద్దతు తెలిపేవారిని చేతులెత్తాలని కోరగా 10 మంది కాంగ్రెస్ సభ్యులు చేతులెత్తారు. 22 మంది సభ్యులు కవితకు మద్దతు పలకడంతో ఆమె చైర్ పర్సన్‌గా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఆ తర్వాత కాంగ్రెస్, వైఎస్సార్సీపీ సభ్యులు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. 3.32 గంటలకు కలెక్టర్ వైస్ చైర్మన్ ఎన్నికను ప్రారంభించారు. వైస్ చైర్మన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి బరపాటి వాసుదేవరావు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ టీడీపీ నేతలు బీ ఫాం ఇచ్చారని కలెక్టర్ సమావేశంలో తెలిపారు. పోటీకి ఇతర పార్టీల నుంచి ఎవరూ లేకపోవడంతో అతను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రకటించారు. సాయంత్రం 3.50 గంటలకు చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌గా గడిపల్లి కవిత, బరపాటి వాసుదేవరావు ఎన్నికైనట్లు ధ్రువీకరిస్తూ కలెక్టర్ వారికి డిక్లరేషన్ అందజేశారు. సాయంత్రం 3.55 గంటలకు ఈ ఎన్నిక సమావేశం ముగిసిందని, సహకరించిన వారందరికి ధన్యవాదాలు తెలుపుతూ కలెక్టర్ కార్యక్రమాన్ని ముగించారు.