ప్రగతే లక్ష్యం | Growth target | Sakshi
Sakshi News home page

ప్రగతే లక్ష్యం

Published Tue, Jan 27 2015 6:56 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 PM

Growth target

  • ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతే ధ్యేయం
  •  అభివృద్ధిలో అందరూపాలుపంచుకోండి
  •  బంగారు తెలంగాణ నిర్మించుకుందాం
  •  కోట్ల నిధులతో ప్రగతి పథంలో జిల్లా..
  •  గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ ఇలంబరితి
  • సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టపరిచేందుకు, జిల్లాను అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి పిలుపునిచ్చారు. ప్రగతి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో పాలుపంచుకోవాలన్నారు. నగరంలోని పోలీస్‌పరేడ్ గ్రౌండ్‌లో సోమవారం నిర్వహించిన 66వ గణతంత్ర దిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. అంతకుముందు పోలీస్ గౌరవవందనం స్వీకరించి, జాతీయజెండాను ఆవిష్కరించారు.

    జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు- వాటి అమలుతీరు- లక్ష్యాలను వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే భారతీయ సంస్కృతికి అనుగుణంగా నడుచుకోవాలన్నారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహనీయుల ఆశయాలు, త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని దేశ నిర్మాణం, జిల్లా సమగ్రాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
     
    పథకాల గురించి..

    రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని అమలు చేసిందన్నారు. జిల్లాలో తొలిదశలో రూ.427.84 కోట్లను విడుదల చేసి 2,88,453 మంది రైతుల ఖాతాల్లో రూ.341 కోట్లు జమచేశామని వివరించారు. రూ.1877 కోట్ల పంట రుణాలను అందించడం లక్ష్యం కాగా రూ.1108 కోట్లు అందించామన్నారు. ఆసరా పథకం కోసం 3,13,831 దరఖాస్తులు వచ్చాయన్నారు. 2,41,373 మందిని అర్హులుగా గుర్తించి రూ.25.50 కోట్లు పంపిణీ చేశామన్నారు.

    ఆహార భద్రత పథకంలో భాగంగా 7,04,119 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఆరు కేజీల చొప్పున 13,678 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేశామన్నారు. ఈ పథకం కింద నెలకు రూ.35.56 కోట్లు, సంవత్సరానికి రూ.426.72 కోట్లు సబ్సిడీ ఇస్తున్నామన్నారు. హాస్టల్, మధ్యాహ్న భోజనం, సన్నబియ్యం పథకం కింద 333 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు ప్రతినెలా 11,78,024మెట్రిక్ టన్నులు, మధ్యాహ్న భోజనానికి 2,736 పాఠశాలలకు 543.748 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు. సంవత్సరానికి రూ.74 కోట్లు సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు.

    హరితహారం పథకం కింద 10 నియోజకవర్గాల్లో 3.81 కోట్ల మొక్కలు పెంచేందుకు ప్రతిరెండు గ్రామ పంచాయతీలకు ఒక నర్సరీని ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని గ్రామాలకు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. రూ.4,075 కోట్ల అంచనా వ్యయంతో గోదావరి, కిన్నెరసాని, పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, వైరా రిజర్వాయర్‌తో మూడు గ్రిడ్స్ చేపడుతున్నట్లు తెలిపారు.

    జిల్లాలోని 41 మండలాల్లో 25.87 లక్షల మంది జనాభాకు తాగునీరు అందిస్తామన్నారు. రక్షిత మంచినీరు అందించేందుకు రూ.403 కోట్లతో చేపట్టిన 1476 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. కాకతీయ మిషన్ కింద 4,517 చెరువులకు గాను ఈ ఏడాది 903 చెరువులను అభివృద్ధి చేస్తామన్నారు. భూమి లేని నిరుపేద దళిత కుటుంబాల్లో ఏడుగురు లబ్ధిదారులకు 17.10 ఎకరాల భూమిని రూ.87.37లక్షలతో కొనుగోలు చేసి ఇచ్చామన్నారు. కల్యాణలక్ష్మి పథకం కోసం కోటి రూపాయలు మంజూరు కాగా 26 దరఖాస్తులు వచ్చాయన్నారు. షాదీముబారక్‌కు 24 దరఖాస్తులు వచ్చాయన్నారు. త్వరలో లబ్ధిదారులకు సొమ్ము అందుతుందన్నారు.
     
    వివిధ ప్రాజెక్టులకు భూసేకరణ

    వివిధ ప్రాజెక్టులకు భూములు సేకరిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. మణుగూరులో రూ.6వేల కోట్ల వ్యయంతో 1080 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. నిర్వాసితులకు రూ.50 కోట్ల పరిహారంతో పాటు పునరావాసం కల్పిస్తున్నామన్నారు. రూ. 4,800 కోట్ల వ్యయంతో కేటీపీఎస్ 7వ దశ నిర్మాణ పనులకు త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. తెలంగాణ సంస్కృతిని చాటేలా బతుకమ్మ సంబరాలు నిర్వహించామన్నారు.

    ఖమ్మం నగరాన్ని స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేసేందుకు రూ.1285 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు పంపించామన్నారు. భూముల క్రమబద్ధీకరణకు జిల్లాలో 7,319 దరఖాస్తులు అందాయన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన పథకం కింద 1951 మహిళా సంఘాలకు రూ.5,850 కోట్లు బ్యాంకు రుణాలు అందజేసినట్లు చెప్పారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా కేంద్రంతోపాటు రెవెన్యూ డివిజన్, మండల కేంద్రాల్లో ప్రతి సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

    గోదావరి పుష్కరాల కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన 85వేల ఎకరాల బీడు, సాగు భూములకు నీటి వసతి కల్పించేందుకు రూ.196 కోట్లు మంజూరు చేశామన్నారు. ఆర్‌అండ్‌బీ ద్వారా రూ.507.33 కోట్లతో 88 పనులు చేపట్టినట్లు తెలిపారు. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా 2,798 పనులకు రూ.740 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ ఏడాది రూ.34.76 కోట్ల పెట్టుబడితో 129 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు స్థాపించి 435 మందికి ఉపాధి కల్పించినట్లు చెప్పారు.

    2014-15 సంవత్సరానికి 2,715 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లు ఇచ్చామన్నారు. రాజీవ్‌గాంధీ ఖేల్ అభియాన్ పథకం కింద 11 మండలాలకు స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు మంజూరయ్యాయన్నారు. జిల్లాలో 2006-07 నుంచి ఇప్పటి వరకు 2,87,233 గృహాలు మంజూరు కాగా 2,22,818 గృహాలు పూర్తయ్యాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాజీవ్ యువశక్తి కింద రూ.3కోట్లతో 300 యూనిట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. నీటి పారుదల అభివృద్ధి సంస్థ ద్వారా 2014-15 సంవత్సరానికి గాను 16 ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి రూ.87.45 కోట్లతో 15,935 ఎకరాలకు సాగునీటి వసతి కల్పించే పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.

    ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలను స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఖర్చుచేస్తున్నట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకోసం విద్యాభివృద్ధికి ఐటీడీఏ ద్వారా పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ద్వారా వివిధ రంగాల అభివృద్ధికి రూ.128.32 కోట్ల వ్యయంతో 804 పనులు పురోగతిలో ఉన్నట్లు వివరించారు. జిల్లాలో 3,402 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 2,47,239 మంది విద్యార్థులకు మధ్యాహ్నభోజనం అందిస్తున్నట్లు వివరించారు.

    సర్వశిక్ష అభియాన్ ద్వారా రూ.21.25 కోట్లతో 404 అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టి 386 తరగతి గదులను పూర్తి చేశామన్నారు. జిల్లాలో పేద ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రిలో కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. జిల్లాలో 1206 వైద్య శిబిరాలు నిర్వహించగా, 1,35,031 మంది చికిత్స పొందినట్లు చెప్పారు. వ్యాధులపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ షానవాజ్‌ఖాసీం, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, జిల్లా జడ్జి ఐ.రమేష్, మాజీ జెడ్పీ చైర్మన్ చేకూరి కాశయ్య పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement